బిహార్ ఎన్నికలు: వ్యవసాయ బిల్లులతో ఓట్లు ఎటువైపు వెళ్తాయి? ఏ పార్టీ లాభపడుతుంది?

ఫొటో సోర్స్, FB TEJ PRATAP
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నీలం రంగు ట్రాక్టర్‌పై డ్రైవర్ సీటులో కూర్చుంది ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్. పైన కూర్చుంది ఆయన అన్నయ్య తేజ్ ప్రతాప్ యాదవ్. ఆయన చేతిలో కనిపిస్తున్నది నాగలి.
ఈ ఫోటో చూడటానికి కొంచెం సినిమా స్టిల్‌లా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ కథనం మాత్రం రాజకీయమే.
వ్యవసాయ బిల్లులపై నిసనల నడుమ దేశం నలు మూలల నుంచి వస్తున్న చిత్రాలతో పోలిస్తే.. ఇది కొంచెం ప్రత్యేకమైనది. ఎందుకంటే అదే రోజు బిహార్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది.
బిహార్‌లో రైతులు కొత్త వ్యవసాయ బిల్లులపై ప్రభావితం అవ్వొచ్చు.. అవ్వకపోనూవచ్చు. అయితే, విపక్షాలు త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో దీన్నొక అస్త్రంగా మార్చుకోబోతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ ఈ అంశంపై ప్రచారం మొదలుపెట్టింది. గురువారం పార్టీ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా అయితే.. ప్రస్తుత బిహార్ ముఖ్యమంత్రి, ఎన్‌డీఏలో భాగస్వామి అయిన నీతీశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు.
''తాజా వ్యవసాయ బిల్లులతో కనీస మద్దతు ధర వ్యవస్థను ప్రభుత్వం తుడిచివేయాలని భావిస్తోంది. ప్రభుత్వ కొనుగోళ్లు, మండీల వ్యవస్థనూ రద్దు చేస్తున్నారు. అందుకే రైతుల నిరసనలకు కాంగ్రెస్ మద్దతు పలుకుతోంది''అని రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు.
నిరసనల నడుమ ఈ బిల్లులకు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మద్దతు తెలిపారు. గురువారం ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
''బిహార్‌లో పరిస్థితులు వేరు. మేం 2006లోనే ఏపీఎంసీకి ముగింపు పలికాం. రైతులు నేరుగా తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇక్కడ ఎలాంటి సమస్యాలేదు. ఇదివరకు ధాన్యాలను ప్రభుత్వం కొనుగోలు చేసేది కాదు. మేమే దాన్ని మొదలుపెట్టాం. తాజా బిల్లులపై ప్రజల్లో అనవసరమైన అపోహలు కలిగిస్తున్నారు. రైతులకు అనుకూలంగానే ఈ బిల్లులు ఉన్నాయి.''
దీనికి ఒక రోజు ముందు జేడీయూ రాజ్యసభ నాయకుడు కేసీ త్యాగి.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికతో మాట్లాడారు. తమ పార్టీ వ్యవసాయ బిల్లులకు మద్దతు పలుకుతోందని ఆయన చెప్పారు. అలాగే.. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించాలని వస్తున్న డిమాండ్లకు ఆయన మద్దతు పలికారు.
త్యాగి మాట్లాడిన మరుసటి రోజే ఈ అంశంపై నీతీశ్ కుమార్ ప్రకటన చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బిహార్‌లో పరిస్థితి ఏమిటి?
ఏపీఎంసీ చట్టాన్ని బిహార్ 2006లోనే రద్దు చేసింది. అయితే, కొత్త వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో వచ్చే మార్పులు ఏమిటి?
బిహార్‌లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకత రావడంలేదని వాదన ప్రాచుర్యంలో ఉంది. కానీ ఇందులో ఏ మాత్రమూ నిజం లేదు.
ఏపీఎంసీ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. ఏపీఎంసీ మండీల్లో.. రైతుల తమ ఉత్పత్తులను విక్రయిస్తుంటారు.
నిజమే 2006 నుంచి బిహార్ రైతులు మండీల చెర నుంచి బయటపడిన మాట వాస్తవమే. తాజా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలు మండీల విషయంపై కాదు. ఇవి కనీస మద్దతు ధరపై జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. ఏపీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి.
సెప్టెంబరు 25న దేశ వ్యాప్తంగా రైతులు తమ నిరసన వ్యక్తంచేశారు. వారి ప్రధాన డిమాండ్లు రెండే. ఒకటి కనీస మద్దతు ధర. రెండోది కనీస మద్దతు ధర కంటే తక్కువకు ఉత్పత్తులు కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించాలి.
ఈ విషయాలను బీబీసీతో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ (ఏఐకేఎస్‌సీసీ) తెలిపారు. దేశ వ్యాప్తంగా నిరసనలకు నేతృత్వం వహించిన సంస్థ ఇదే.

ఫొటో సోర్స్, Sameeatmaj Mishra
కనీస మద్దతు ధర అంటే ఏమిటి?
రైతుల ప్రయోజనాలను కాపాడటానికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వ్యవస్థను దేశ వ్యాప్తంగా అమలుచేశారు. అంటే పంట ధర మార్కెట్ ధర కంటే తక్కువగా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి ఎంఎస్‌పీకి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. ఫలితంగా రైతులను కొంతవరకూ ఆదుకోవచ్చు.
ఈ కనీస మద్దతు ధరను కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయిస్తుంది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజస్ (సీఏసీపీ) సూచనల ఆధారంగా వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంటుంది.
దేశ మంతటా ఒక పంటకు ఒకే ఎంఎస్‌పీ ఉంటుంది. ఈ వ్యవస్థ కింద ప్రస్తుతం 23 పంటలను కొనుగోలు చేస్తున్నారు.
ఈ 23 పంటల్లో వరి, గోధుమ, జొన్న, కొర్రలు, మొక్కజొన్న, పెసర, వేరుసెనగ, సోయా, నువ్వులు, పత్తి తదితర పంటలు ఉన్నాయి. వీటిలో వరి, గోధుమ, మొక్కజొన్న పంటలను బిహార్‌లో ఎక్కువగా పండిస్తుంటారు. అందుకే బిహార్‌లో రైతులు కోపంగా లేరని అనుకోవడం నిజం కాదు.

ఫొటో సోర్స్, SEETU / BBC
రైతుల ఓటు బ్యాంకు ఎటువైపు?
''కరోనావైరస్ వ్యాప్తి నడుమ తాజా బిల్లులు తీసుకురావడంతో.. మొదట్లో ఇటు రాజకీయ నాయకులకు, అటు విలేకరులకు వీటి ప్రభావం సరిగా అర్థంకాలేదు. అందరూ వారి ఇళ్లలోనే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే జనాలు బయటకు వస్తున్నారు. టీ-షాపులు, లోకల్ ట్రైన్లు, మార్కెట్లలో సంభాషణలు వింటుంటే.. రైతులు ఎంత కోపంగా ఉన్నారో అర్థమవుతోంది''అని బిహార్ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్టు సురూర్ అహ్మద్ వ్యాఖ్యానించారు.
బిహార్‌లో ఈ బిల్లులపై స్పందన మారుతూ వస్తోంది. క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది.
బిహార్ ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అయితే, ఇక్కడ నిరుద్యోగమే అతిపెద్ద సమస్య.
అందుకే బహుశా, తాజా వ్యవసాయ బిల్లులకు వలసలు, నిరుద్యోగంతో లంకెపెట్టి ప్రజలకు అర్థమయ్యేలా ఆర్జేడీ వివరిస్తోంది. శుక్రవారం రైతుల నిరసనల సమయంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడారు.
''2006లో ఏపీఎంసీని రద్దు చేశారు. దీంతో రైతులకు సరైన ధర దొరకలేదు. అందుకే రైతులు వలస వెళ్లాల్సి వచ్చింది''అని తేజస్వి యాదవ్ అన్నారు.
2006లో ముఖ్యమంత్రి నీతీశ్ కుమారే.

ఫొటో సోర్స్, SEETU/BBC
ఎన్నికల్లో కులం పాత్ర
బిహార్ రాజకీయాల్లో కులానికి ప్రత్యేక స్థానముంది. కులం చూపే ప్రభావంపై సురూర్ అహ్మద్ మాట్లాడుతూ..''ఐదేళ్ల క్రితం వరకూ బీజేపీ నగరాల పార్టీగా భావించేవారు. పార్టీకి ఎక్కువగా అగ్ర వర్ణాల వారే మద్దతు పలికేవారు. ఆ ఆలోచనా విధానం ఇప్పుడు మారుతూ వస్తోంది. జేడీయూకు కొన్ని కూర్మీ వర్గాల ఓట్లు, కొన్ని పట్టణ ప్రాంత ఓట్లు, కొన్ని బీసీ కులాల ఓట్లు ఉన్నాయి. ఆర్జేడీని యాదవులు, ముస్లింల పార్టీగా భావిస్తారు. అలాగే కొందరు కోయిరీలు, కూర్మీల మద్దతు కూడా పార్టీకి ఉంది''.
''బిహార్‌లో కుర్మీ, యాదవ్, భూమిహార్, రాజ్‌పుత్‌లకు భూమి ఎక్కువగా ఉంటుంది. ఈ అగ్రవర్ణాల భూముల్లో దళిత రైతులు పనిచేస్తుంటారు. ఒకవేళ ఈ భూముల యజమానులు.. తాజా వ్యవసాయ బిల్లులకు మద్దతు పలికితే.. ఆర్జేడీ కంటే బీజేపీకి ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశముంది''.
''కానీ భూమి కలిగిన వారు తటస్థంగా ఉంటే.. ఎన్‌డీఏకు చాలా కష్టమే. దీని కోసం ఓటింగ్ శైలిని చూడాల్సి ఉంటుంది. మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి నడుమ.. అసలు ప్రజలు ఓటింగ్‌కు వస్తారా? అనేది కూడా ప్రశ్నే''
''బిహార్‌లోని 96.5 శాతం మంది రైతులు చిన్న, మధ్య స్థాయి రైతులు. చాలావరకూ ఎంఎస్‌పీ బయట ఉండే పంటలనే వారు పండిస్తుంటారు. వారిలో చాలా మందికి ఎంఎస్‌పీ వర్తించదు. వారిపై ఎంఎస్‌పీ ఎలా ప్రభావం చూపుతుందో విపక్షాలు చెప్పగలిగితే ఎన్‌డీఏకు ప్రమాదమే''అని పట్నాలోని ఏఎన్ సిన్హా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ మాజీ డైరెక్టర్ డా.డీఎం దివాకర్ వ్యాఖ్యానించారు.
''గత 14ఏళ్ల నుంచి ఏపీఎంసీ చట్టం బిహార్‌లో వర్తించడంలేదు. కానీ బిహార్ రైతులకు దీనితో ఎలాంటి ప్రయోజనమూ జరగలేదు. తాజా బిల్లులతో రైతులకు వచ్చే ప్రయోజనాలను ఎన్‌డీఏ వివరించడం కొంచెం కష్టమే. ఆర్జేడీ, కాంగ్రెస్ ఈ విషయంలో కొంచెం లాభపడొచ్చు''
''చిన్న, మధ్య స్థాయి రైతులు మహాకూటమి, ఆర్జేడీలకు ఓటు బ్యాంకులు. పెద్ద రైతులు ఎన్‌డీఏ, బీజేపీలకు ఓటు బ్యాంకులు. కానీ కూర్మీ, భూమిహార్, రాజ్‌పుత్‌లు మొత్తంగా ఎన్‌డీఏకు ఓటువేయరు. వారి ఓట్లు చీలిపోతాయి''.
''మరోవైపు యాదవ్, ముస్లిం ఓట్లు తటస్థంగానే ఉంటాయి. దళిత ఓటు బ్యాంకులో కొన్ని మార్పులు కనిపించొచ్చు. మరోవైపు బీసీలు కూడా ఆర్జేడీ వైపే మొగ్గు చూపిస్తుంటారు''.
''నీతీశ్ ప్రభుత్వం ఇప్పటికే 15ఏళ్లపాటు అధికారంలో ఉండటంతో కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. మరోవైపు టీచర్ల అందరికీ సమాన వేతనం లేమిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కరోనావైరస్ వ్యాప్తి నడుమ వలస కూలీలపై ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరి మూడో అంశం. వ్యవసాయ బిల్లులపై రైతుల వ్యతిరేకత వీటికి అదనం. ఈ అంశాలను మహాకూటమి ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి''అని డా. దివాకర్ అన్నారు.
ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు ఎన్‌డీఏతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. రైతులకు వీలైనంత మేర చేరువయ్యేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటి ప్రభావం నవంబరు 10(ఎన్నికల ఫలితాల రోజు)న తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (1946-2020): నాలుగు దశాబ్దాల్ని అలరించిన సుమధుర గాత్రం
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









