బిహార్ ఎన్నికలు: కుల సమీకరణలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి? బలం ఎటువైపుంది?

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సర్వప్రియ సంగ్వాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్‌లో ఒకప్పటి వెనుకబడిన సమాజంలో ముందుకు సాగాలంటే బలం, అధికారం ఉన్న వారితో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడం ఒక్కటే మార్గం. అలాంటి సంబంధాలు ఏర్పరుచుకోవడానికి కులం ఒక ఆధారమయ్యింది. 90వ దశకంలో ఈ ట్రెండ్ మరింత బలపడింది.

బిహార్ ఎన్నికల్లో కులం ప్రాధాన్యతను సంతరించుకోవడానికి ఈ నేపథ్యం ఒక కారణంగా పలువురు భావిస్తారు.

ప్రస్తుతం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో కుల ప్రాధాన్యత గురించి చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ చర్చల్లోకి వెళ్లబోయే ముందు చరిత్రలో కొన్ని పేజీలు వెనక్కి తిప్పి చూడాల్సిన అవసరం ఉంది.

స్వాతంత్ర్యానికి ముందు బిహార్‌లో జంధ్యం ఉద్యమం జరిగింది. యాదవులు, కొన్ని వెనుకబడిన బ్రాహ్మణేతర కులాల వారు జంధ్యం ధరించడం మొదలు పెట్టారు.

వీరే, స్వాతంత్ర్యానంతరం జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పిలుపు మేరకు సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో భాగంగా పట్నాలో గాంధీ మైదానంలో తాము ధరించిన జంధ్యాలను తెంపేసారు.

ఈ ఉద్యమంలోంచి నాయకులుగా ఎదిగిన లాలుప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లు బిహార్‌లో వచ్చిన సామాజిక, రాజకీయ పరిణామాల్లో ప్రధాన పాత్ర పోషించారు.

బిహార్‌లో రాజకీయ పరిణామాలు, సామాజిక పరిణామాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ రెండిట్లోనూ కులం కీలక పాత్ర పోషించింది.

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, XAVIER GALIANA

బిహార్ రాజకీయాల్లో కులం ప్రాధాన్యత ఎంత?

ఒకప్పుడు అగ్రకులాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న బిహార్ రాజకీయాల్లో ఇప్పుడు వెనుకబడిన కులాల ఆధిపత్యం పెరిగింది. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే వెనుకబడిన కులాలే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) అంచనాల ప్రకారం బిహార్‌లో సగం జనాభా ఓబీసీకి చెందినవారు. రాష్ట్రంలో దళితులు, ముస్లింల సంఖ్య కూడా ఎక్కువే.

ఈ వర్గాల్లో ఇంకా ఎన్నో ఉపకులాలు, వర్గాలు ఉన్నాయి. వీరి ఓట్లన్నీ కూడా ఒకేలా ఉండవు. వీరందరి ఓట్లు పొందడం అంత సులభమేమీ కాదు.

బిహార్ ఎన్నికల్లో కులం ఎప్పుడూ ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తోందని సీనియర్ జర్నలిస్ట్ అమరనాథ్ తివారీ అభిప్రాయపడ్డారు.

"బిహార్‌లో కుల ప్రస్తావన లేకుండా వృత్తిపరమైన రాజకీయల గురించి గానీ, సామాజిక రాజకీయాల గురించి గానీ మాట్లాడలేము. నా ఉద్దేశం ఏమిటంటే ఏ విభాగంలో ఎవరు నియమితులవుతారు అనేది కూడా కులం మీదే ఆధారపడి ఉంటుంది" అని ఆయన చెప్పారు.

లాలు ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

2015 వర్సెస్ 2020 ఎన్నికలు

2015లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ), జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ), కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశాయి.

ఆర్‌జేడీ సాంప్రదాయ ఓటర్లైన యాదవులు, జేడీయూకు మద్దతిచ్చే లవ-కుశల్లాంటి కుర్మీ-కోరీ, కుష్వాహ కులాలన్నీ ఒకవైపు నిలిచాయి. ఇతర వెనుకబడిన కులాల ఓట్లన్నీ చీలికలయ్యాయి. ముస్లిం ఓట్లన్నీ ఒకవైపు నిలిచాయి.

ఆర్‌జేడీకి 80 సీట్లు, జేడీయూకు 71, కాంగ్రెస్‌కు 27 సీట్లు వచ్చాయి. ఈ కూటమికి దాదాపు 42 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 53 సీట్లు వచ్చాయి. ఎన్‌డీఏకు మొత్తం 29-30 శాతం ఓట్లు వచ్చాయి.

బీహార్‌ జనాభాలో 15 శాతం మంది యాదవులు ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 61 మంది యాదవ అభ్యర్థులు మాత్రమే గెలిచారు. జనాభాలో ఎనిమిది శాతం కోరీ కులానికి చెందినవారు ఉన్నప్పటికీ ఆ కులం నుంచి 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలయ్యారు. అలాగే నాలుగు శాతం కుర్మీ జనాభా ఉంటే వారి నుంచి 16 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు.

కానీ జనాభాలో 16 శాతంగా ఉన్న ముస్లింల నుంచి 24 మంది మాత్రమే సీట్లు గెలుచుకున్నారు.

నితీశ్ కుమార్, నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ కుల సమీకరణాలు ఎటు మొగ్గు చూపుస్తున్నాయి?

సీనియర్ జర్నలిస్ట్ అమరనాథ్ తివారి మాట్లాడుతూ.. "ప్రస్తుతం బిహార్‌లో రాజకీయాలు త్రిభుజాకారంలో ఉన్నాయి. ఇందులో బిజేపీ, ఆర్‌జేడీ, జేడీయూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిల్లో ఏ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా రాజ్యాధికారం దక్కుతుందనేదని ఇప్పటికే నిరూపించబడిన విషయం. దీన్నిబట్టి ఎన్‌డీఏకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తోస్తోంది" అని విశ్లేషించారు.

కులసమీకరణాలు ఎన్‌డీఏవైపే మొగ్గు చూపుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని ది సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) డైరెక్టర్ సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఆర్‌జేడీ, ముఖేష్ సాహ్నీకి చెందిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ, ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్టీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్‌పీ)తో కలిసి కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా మల్లా, కుష్వాహ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ప్రస్తుతం అగ్రవర్ణాలవారు కూడా కాంగ్రెస్ పక్షాన లేరని అమరనాథ్ తెలిపారు.

కానీ సంజయ్ కుమార్ దృష్టిలో కాంగ్రెస్‌కు ఇంధ్రధనస్సును పోలినట్లు అన్ని వర్గాల నుంచీ ఓట్లు వస్తే అవకాశం ఇప్పటికీ ఉంది. కాకపోతే ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం చాలా తక్కువగా ఉండొచ్చు.

"అయితే ఆర్‌జేడీ, కాంగ్రెస్ కలిస్తే ముస్లింల ఓట్లన్నీ ఒకే చోటికి వస్తాయి. అలాగే అగ్రవర్ణాల ఓట్లు కాంగ్రెస్‌కు వస్తాయి. అక్కడా అక్కడా మిలిగిపోయిన కొన్ని కులాల ఓట్లు కూడా కాంగ్రెస్‌కు రావొచ్చు" అని సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP

లోక్ జన్‌శక్తి పార్టీ ఎన్‌డీఏతో కలవకపోతే?

"లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ), ఎన్‌డీఏ నుంచి విడిపోయే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఎన్‌డీఏకి కలిసివుండటం ఆ పార్టీకి ఒక రాజకీయ అవసరం. ప్రస్తుతం జేడీయూ, ఎల్‌జేపీలో వినిపిస్తున్న అసమ్మతులు ఒక రకమైన కుస్తీ పోటీల్లాంటివి. అవి కూడా నితీశ్ కుమార్‌ కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు కూడగట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు. అలా అయితే బీజేపీకి ఎన్నికల తరువాత తమ పార్టీ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా ప్రతిపాదించే అవకాశాలు ఉంటాయి" అని అమరనాథ్ తివారీ అన్నారు.

2015 ఎన్నికల ఫలితాలు గమనిస్తే ఎల్‌జేపీ పోటీ చేసిన 42 స్థానాల్లో రెండే రెండు సీట్లు గెలుచుకోగలిగింది.

2005 నుంచీ ఎన్నికల్లో ఎల్‌జేపీ సత్తా తగ్గుతూ వస్తోంది. 2005లో పోటీ చేసిన 178 సీట్లలో 29 సీట్లు గెలుచుకుంది. అంటే దాదాపు 12 శాతం ఓట్లు ఎల్‌జేపీకి వచ్చాయి. కానీ ఆరు నెలల తరువాత మళ్లీ జరిగిన ఎన్నికల్లో 203 సీట్లలో 10 మాత్రమే గెలుచుకుంది. తరువాత 2010లో ఆర్‌జేడీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన ఎల్‌జేపీ 75 సీట్లలో 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. గెలుగుకున్న ఓట్ల శాతం 6.74కి పడిపోయింది. 2015లో ఓట్లు 4.83 శాతానికి పడిపోయాయి.

బిహార్ ఎన్నికలు

బిహార్ రాజకీయాల్లో అగ్రకులాల పాత్ర ఎలా మారుతూ వచ్చింది?

బిహార్ కుల రాజకీయాలు రాట్నంలా తిరుగుతున్నాయని చెప్పొచ్చు. స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్‌కు చెందిన శ్రీకృష్ణ సింగ్ (భూమిహార్) ముఖ్యమంత్రి అయిన తరువాత భూమిహార్, రాజపుత్‌ల మధ్య అధికార ఘర్షణ ప్రారంభమయ్యింది.

1980 చివరి వరకూ కాంగ్రెస్‌లో బ్రాహ్మణుల ఆధిపత్యం కొనసాగింది. తరువాత మెల్లగా భూమిహార్లు కూడా కాంగ్రెస్‌ను విడిచిపెడుతూ వచ్చారు.

రాంమనోహర్ లోహియా ఇచ్చిన ‘'100లో 60 వెనుకబడిన కులాలకు'’ అనే నినాదంతో బిహార్ రాజకీయాల్లో సామాజిక సంస్కరణలు మొదలయ్యాయి. జేపీ ఇచ్చిన 'కులం వీడండి, జంధ్యం తెంపండి' నినాదం కూడా బీహార్ రాజకీయ పరిణామాల్లో ముఖ్య పాత్ర పోషించింది.

అప్పటికే రాజపుత్ కులం వారు కాంగ్రెస్‌ నుంచి చెల్లాచెదురయ్యారు. 70లలో వచ్చిన జనతా పార్టీలో అధికశాతం రాజపుత్‌లు చేరారు.

"అయితే 1990లలో జనతా పార్టీకి చెందిన రాజపుత్‌లు లాలుప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపారు. తరువాత చాలా కాలం వరకూ వెనుకబడిన కులాల వారితో పాటుగా రాజపుత్‌ల రాజకీయాల్లో కూడా లాలు ప్రధాన పాత్ర పోషించారు" అని రాజనీతి శాస్త్రజ్ఞుడు ఆశిష్ రంజన్ తెలిపారు.

అయితే ఓబీసీల్లోనే అత్యంత వెనుకబడిన కులం ఒకటి ఉంది. వారి జనాభా సుమారు 22 శాతం ఉంటుంది కానీ వారి రాజకీయ ప్రాతినిధ్యం ఒక్క శాతం మాత్రమే ఉంది. లాలు హయాంలో మొత్తంగా వెనుకబడిన కులాలు రాజకీయ సాధికారత సాధించగలిగాయి గానీ వాటిల్లోని ఉపకులాల్లో సాధికారత సాధించలేకపోయారు" అని ఆశిష్ అభిప్రాయపడ్డారు.

తరువాత 1994లో నితీశ్ కుమార్ కులం ప్రాతిపదికన జనతా పార్టీ నుంచి విడిపోయి జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీ పెట్టారు. అయితే 2003లో ఈ పార్టీని జనతా దళ్ యునైటెడ్‌లో విలీనం చేసారు.

నితీశ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

నితీశ్ కుమార్ - బిహార్ సోషల్ ఇంజనీర్

ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత 15 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్నారు. నితీశ్ కుమార్‌ను బిహార్ సోషల్ ఇంజనీర్ అని పిలుస్తారు.

మొదటిసారి ప్రభుత్వం ఏర్పరచినప్పుడే దళితులలో మహాదళితులనే కొత్త వర్గాన్ని సృష్టించారు. ఓబీసీ అంటే వెనుకబడినవారు, ఈబీసీ అంటే అత్యంత వెనుకబడినవారుగా గుర్తించారు.

2014లో బ్రాహ్మణులలో ఒక శాఖను ఓబీసీ వర్గంలో చేర్చారు. ముస్లింలలో ఒక వర్గమైన కులహైయాను అత్యంత వెనుకబడిన కులాల్లో చేర్చారు. అలాగే రాజబన్షీ వర్గాన్ని, రవిదాస్ కులాన్ని కూడా అత్యంత వెనుకబడిన వర్గాల్లో చేర్చారు. ఇలా చిన్నచిన్న వర్గాలు, ఉప కులాలు జేడీయూ పాలనలోకి వెళ్లాయి.

ఈ ‘న్యూ కాస్ట్ అలైన్మెంట్’ కారణంగానే గత 15 సంవత్సరాలుగా బిహార్‌లో నితీశ్ కుమార్, బీజేపీల హవా కొనసాగుతోందని ఆశిష్ రంజన్ అభిప్రాయపడ్డారు. ఈబీసీ, మహాదళితుల ఓట్లతో పాటు బీజేపీ వల్ల అగ్రకులాల ఓట్లు కూడా నితీశ్ కుమార్‌ వైపే ఉన్నాయి. ఈ ఓట్ల బలం ఇంకా ఇంకా పెరుగుతుండడంతో లాలు ప్రసాద్ ఎన్నికల బరికి వెలుపలే ఉండే అవకాశం ఉంది.

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

గత కొన్నేళ్లల్లో బిహార్‌లో కులాల ఉనికి తగ్గిందా?

"90లలో పుట్టిన ఒక తరం అంతా ఇప్పుడు యవ్వనంలోకి వచ్చారు. విద్యావకాశాలు పెరగడం, వలసలు ఎక్కువవ్వడం, నగరీకరణ పెరగడంతో వీరి మధ్య కులాల ఉనికి తగ్గిందనే చెప్పొచ్చు. ప్రజల దృష్టి అభివృద్ధి మీదకు మళ్లింది" అన్నారు ఆశీష్ రంజన్.

కానీ ఇన్నేళ్లుగా నితీశ్ కుమారే అధికారంలో ఉండడంవలన ప్రజలు ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారని అమరనాథ్ తివారీ అభిప్రాయపడ్డారు.

అయితే తేజస్వికి ఎక్కువ ఓట్లు వచ్చేఅవకాశం ఉందా అనే ప్రశ్నకు జవాబిస్తూ "ఆర్‌జేడీకి ఓట్లు వెయ్యడానికి కూడా ఇష్టపడకపోవచ్చు" అని వ్యాఖ్యానించారు.

నితీశ్ కుమార్‌పై మొట్టమొదటిసారిగా ప్రభుత్వ వ్యతిరేకత వస్తోందన్న విషయాన్ని ఆశిష్ రంజన్ కూడా అంగీకరించారు.

అయితే మహారాష్ట్ర, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత కూటమి విషయంలో బీజేపీ రిస్క్ తీసుకోదు అని అమరనాథ్ అంచనా.

"ప్రజలు రెండు లక్ష్యాలతో ఓట్లు వేస్తారు. ఒకటి, వాళ్లకి మేలు చేసే పార్టీ అధికారంలోకి రావాలని. రెండోది, ఏది ఏమైనా చాలా కాలంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసేయలనే ఆలోచన. బిహార్‌లో ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ నెగటివ్ ఓటింగ్ ప్రధాన పాత్ర వహించింది" అని ఆశీష్ రంజన్ పేర్కొన్నారు.

అంతే కాకుండా గత 3-4 ఏళ్లల్లో నితీశ్ కుమార్‌పై వ్యతిరేకత పెరిగిందని, సృజన్ కుంభకోణం, ముజాఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో జరిగిన కుంభకోణం, ప్రస్తుతం కరోనావైరస్‌పై పోరాటం.. ఇవన్నీ నితీశ్ కుమార్ ఇమేజ్‌ను దెబ్బతీశాయని ఆశీష్ రంజన్ విశ్లేషిస్తున్నారు.

కుల సమీకరణాలు ఎలా ఉన్నప్పటికీ ఈసారి నితీశ్ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందనీ ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)