సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులతో సంబంధం ఏమిటి?

రియా చక్రవర్తి

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసు విచారణలో అసలు ఏం జరుగుతోంది..? సినీ నటుల విచారణ నడుమ ముంబయిలోని మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలు ప్రస్తుతం తమ కార్యకలాపాలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టాయా..?

బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు ఆంధ్రా - ఒడిశా సరిహద్దులతో సంబంధం ఏమైనా ఉందా? ఇంతకీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై జరుగుతున్న దర్యాప్తు డ్రగ్స్‌ వైపు ఎలా మళ్లింది? ఈ అంశాలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నతాధికారితో బీబీసీ మాట్లాడింది. ఆయన తన వివరాలు ప్రచురించడానికి ఇష్టపడలేదు.

"ఈ విచారణ ప్రారంభం అయిన తరవాత ముంబయిలోని మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా సినీ తారలు నివసించే ప్రాంతాల్లో ఇది గమనించాం. సినీ నటులను ఇబ్బంది పెట్టాలని ఈ విచారణ జరపడం లేదు. అందరూ విచారణకు సహకరించి.. తమకు తెలిసిన వివరాలు స్వచ్ఛందంగా తెలపాలని కోరుతున్నాం" అని ఆయన వివరించారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై విచారణలో భాగంగా కొందరు సినీ నటులు విచారణకు హాజరుకావాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆదేశాలు జారీ చేసింది. హీరోయిన్లు దీపికా పదుకొణె, రకుల్ ప్రీత్‌సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి వివిధ ప్రముఖుల మధ్య జరిగిన సంభాషణల ఆధారంగానే విచారణలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారి బీబీసీకి ధ్రువీకరించారు.

సుశాంత్‌తో రియా చక్రవర్తి

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY INSTA

ఫొటో క్యాప్షన్, సుశాంత్‌తో రియా చక్రవర్తి

మెసేజ్‌ల ఆధారంగా

"నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ఈ కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి వచ్చింది. సుశాంత్ సింగ్ మృతి కేసుపై విచారణలో భాగంగా.. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఫోన్‌లో మెసేజ్‌లను దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. మాదక ద్రవ్యాల విక్రయం, సేవించడానికి సంబంధించి కొన్ని మెసేజ్‌లు ఈ ఫోన్‌లో బయట పడ్డాయి. ఆ మెసేజ్‌ల ఆధారంగా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించాం. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని విచారించి అదుపులోకి తీసుకున్నాం. ఆ తరవాత రియాను మూడు రోజులు పాటు విచారించాం" అని ఆయన వివరించారు.

విచారణ అనంతరం రియాను నార్కోటిక్స్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు.

నిజానికి సుశాంత్ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఈడీ చేపట్టిన విచారణల్లో రియా ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే, ఆమె ఫోన్‌లో మాదకద్రవ్యాలను తీసుకోవడం, వాటి విక్రయాలకు సంబంధించి కొన్ని మెసేజ్‌లు లభించాయి. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది.

రియా ఫోన్‌లో మెసేజ్‌ల ఆధారంగా సుశాంత్ మేనేజర్ జయ సాహాను కూడా విచారించారు. "ప్రస్తుతం క్వాన్ టాలెంట్ ఏజెన్సీలో పని చేస్తున్న జయతో పాటు పలువురిని విచారిస్తున్నాం" అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నతాధికారి తెలిపారు.

సారా అలీఖాన్, దీపికా పడుకోన్, శ్రద్ధా కపూర్

ఫొటో సోర్స్, Getty Images

దీపికా అలా..

ఇప్పటికే జయను రెండు సార్లు అధికారులు విచారించారు. క్వాన్ ఏజెన్సీలో పని చేస్తున్న కరిష్మా అనే మరో మేనేజర్‌ ఫోన్ చాట్స్‌పై కూడా విచారణ నిర్వహిస్తున్నారు. దీపికా పదుకొణె మేనేజర్‌గా కరిష్మా పని చేశారు. జయ, కరిష్మా ఫోన్లలో లభించిన ఆధారాలను పరిశీలించడంతో.. చాలా మంది సినీ నటులు మాదక ద్రవ్యాల కోసం చేసిన మెసేజ్‌లు ఫోకస్‌లోకి వచ్చాయి.

కరిష్మాతో జరిపిన చాట్స్ ఆధారంగా దీపికను విచారణకు హాజరు కావల్సిందిగా పిలిచినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నతాధికారి ధ్రువీకరించారు.

అయితే, ఇంతకీ సినీ నటులు సేవించిన మాదక ద్రవ్యాలు ఏమిటి? ఎప్పుడు? ఎంత? అన్న కోణంలో విచారణ సాగుతోంది. ఇంకా పలువురు సినీ నటుల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

"ప్రముఖుల పేర్లు బయట పడుతుండటంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. కానీ ఈ కేసు సినీ నటుల విచారణతో ముగియదు. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నా వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం" అని ఆయన బీబీసీకి తెలిపారు.

"వాస్తవానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కొంత కాలంగా దేశీయంగా జరుగుతున్న డ్రగ్స్ సరఫరాపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల నుంచి సరఫరా అవుతున్న గంజాయిపై దృష్టి సారించాం. ఇటీవల అక్కడి నుంచి దిల్లీకి సరఫరా అవుతున్న గంజాయిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నాం. జార్ఖండ్‌లో నల్లమందు వ్యాపారాన్ని గుర్తించి.. ఇప్పటికే దాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేశాం" అని ఆయన అన్నారు.

దీపికా పదుకొణె

ఫొటో సోర్స్, AMIR KHAN

ఫొటో క్యాప్షన్, విచారణకు హాజరైన దీపికా పదుకొణె

అదే లక్ష్యం

ప్రస్తుతం సినీ నటుల మెసేజ్‌ల ఆధారంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిని గుర్తించడమే తమ విచారణ ఉద్దేశం అని అధికారులు చెబుతున్నారు. "అవసరాన్ని బట్టి మరింత మంది సినీ నటులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది" అని ఆయన బీబీసీతో అన్నారు.

ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరిశీలిస్తున్న మెసేజ్‌లు ఇప్పటివి కావు. అవి 2015-17 సంవత్సరాల మధ్య పంపిన మెసేజ్‌లుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని సినీ నటులను విచారిస్తున్నారు. సరిగ్గా ఇదే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం మెసేజ్‌లు ఇప్పుడు ఎలా లభ్యమవుతున్నాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

నేడు సామాన్యులే రెండు, మూడేళ్లకు ఒక ఫోన్ మార్చేస్తున్నారు. అలాంటిది ప్రముఖులైతే ఎప్పటికప్పుడు ఫోన్లు మారుస్తుంటారు. అలా మార్చేటప్పుడు సాధారణంగా పాత మెసేజ్‌లు ఎప్పటికప్పుడు డిలీట్ అవుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు ఆ పాత మెసేజ్‌లు ఎలా లభ్యమయ్యాయన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

"విచారణ కోసం కోర్టు అనుమతితో ఫోన్ డేటాను దర్యాప్తు సంస్థలు రిట్రీవ్ చేస్తుంటాయి. డిలీట్ చేసిన డేటా కూడా ఇలా రిట్రీవ్ చేయొచ్చు. కేవలం చాట్స్‌లో ఉన్న మేసేజ్‌ల ఆధారంగా వారు మాదక ద్రవ్యాలు తీసుకున్నారని అనలేం. వారి దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు దొరకనంత వరకు వారు నేరం చేసినట్టు కాదు.. దర్యాప్తులో భాగంగా ఆ కేసుతో సంబంధం ఉన్న వారిని విచారణకు పిలవవచ్చు.

ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం సాధ్యం కాదు. కేవలం చాట్స్‌లో మాదక ద్రవ్యాల ప్రస్తావన ఉందని అరెస్టు చేయలేం. విచారణ మాత్రమే చేయగలం" అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నతాధికారి వివరించారు.

సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, Getty Images

‘‘దర్యాప్తు సంస్థలకు చిత్తశుద్ధి లేదు’’

నిజానికి సినీ నటులపై మాదక ద్రవ్యాలకు సంబంధించి కేసు నమోదు అవ్వడం ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ అబ్కారీ శాఖ అధికారులు 2017లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొంత మందిని డ్రగ్స్ పేరిట విచారించారు. ఈ విచారణలు చాలా హడావుడిగా జరిగాయి. సిట్ ఏర్పాటు చేసి 62 మందిని ప్రశ్నించారు. 12 కేసులు నమోదు చేశారు. మూడు సంవత్సరాల తరువాత కేసు పురోగతి ఏంటి అంటే.. ఎనిమిది చార్జిషీట్లు నమోదు చేయటం మినహా కేసులు ముందుకు సాగలేదు. పూరీ జగన్నాథ్, ముమైత్ ఖాన్, చార్మీ, నవదీప్ ఇలా అనేక మందిని అప్పట్లో విచారించారు. వారి నుంచి జుట్టు, గోర్ల నమూనాలు సేకరించారు.

"ఇంత హడావిడి చేసి.. 62 మందిని ప్రశ్నించి.. అన్ని రకాల శాంపిల్స్ సేకరించి కూడా కేసుల్ని పోలీసులు ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారు" అని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ ఎం పద్మనాభ రెడ్డి వ్యాఖ్యానించారు. దర్యాప్తు పురోగతిపై సమాచార హక్కు చట్టం కింద ఆయన సమాచారం సేకరించారు.

''నిజంగానే మాదక ద్రవ్యాలు అరికట్టాలన్నదే దర్యాప్తు సంస్థల ఫోకస్ అయితే... ఇప్పటికే సేకరించిన సమాచారంతో సరఫరా మార్గాలను అరికట్టి ఉండాలి. కానీ దర్యాప్తు సంస్థలకు చిత్తశుద్ధి లేదు. సినీ నటులను విచారించారు.. ఆ కేసు ఇంకా ముగింపు లేకుండా కొనసాగుతూనే ఉంది.. మూడేళ్లు గడిచినా ఒక్క సినీ ప్రముఖుడిపైనా కేసు నమోదు చేయలేదు. ఇదంతా ఒక బూటకపు విచారణ'' అని ఆయన విమర్శించారు.

''డ్రగ్స్ సరఫరాకు మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే.. నివారణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. పైగా ఇప్పుడు మాదక ద్రవ్యాల సరఫరా ఇంకా పెరిగింది" అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)