దళితులపై దాడులు: ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు? లోపం చట్టాలదా? వ్యక్తులదా?

గత పదిహేనేళ్లుగా దళితులపై దాడులు పెరుగుతున్నాయని నేర గణాంకాలు చెబుతున్నాయి

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గత పదిహేనేళ్లుగా దళితులపై దాడులు పెరుగుతున్నాయని నేర గణాంకాలు చెబుతున్నాయి
    • రచయిత, కమలేశ్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యువకులనైతే కర్రలతో కొట్టడం, మహిళలనైతే అత్యాచారం చేయడం, దళితులను ఎవరినీ ఆలయాల్లో ప్రవేశించకుండా నిషేధించడం ఇలాంటి వార్తలన్నీ మీడియాలో తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.

ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో 19ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య ఆరోపణల వ్యవహారం మీడియాలో ప్రధానంగా కనిపించింది.

ఈ ఘటన తర్వాత దళితులపై దాడులు, అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలైన తరువాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు.

దళితులపై హింసకు సంబంధించి అనేక సంఘటనలు ప్రతియేటా వినిపిస్తూనే ఉన్నాయి. 2015లో రాజస్థాన్‌ దంగవాస్‌ ఘటన, 2016లో రోహిత్ వేముల మరణం, తమిళనాడులో 17 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య, 2017లో సహారాన్‌పూర్ హింస, 2018లో భీమా కోరేగావ్ ఘటన ఇలా ప్రతి సంవత్సరం సంచలనాత్మక కేసులు వస్తూనే ఉన్నాయి.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దళితులపై దాడులు, అత్యాచారాలు తగ్గకపోగా ఇంకా పెరిగాయి. 2019 సంవత్సరంలో దళితులపై అత్యాచారాలు గతంకన్నా 7.3% ఎక్కువ కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్‌బీ తెలిపింది.

దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదు కాగా, 2019 సంవత్సరంలో 45,935 కేసులు రికార్డయ్యాయి. ఇందులో సాధారణ దాడుల కేసులు 13,273 కాగా, ఎస్సీ,ఎస్టీ (అత్యాచార నియంత్రణ) చట్టం కింద 4,129 కేసులు 3,486 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2378 కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో అత్యల్పంగా రికార్డయ్యాయి. జమ్మూ-కశ్మీర్‌, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలో ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఒక్క కేసు నమోదు కాలేదు.

2019 సంవత్సరంలో షెడ్యూల్డ్ తెగలవారిపై నేరాలు 26.5శాతం పెరిగాయి. 2018లో ఎస్టీలలపై దాడులకు సంబంధించిన 6,528 కేసులు, 2019లో 8,257 కేసులు నమోదయ్యాయి.

భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా దళితులపట్ల వివక్ష, దాడులకు సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్‌ 30న కాలిఫోర్నియాలోని సిస్కో సంస్థలో ఒక దళిత ఉద్యోగి కుల వివక్షను ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీని తర్వాత అమెరికా కేంద్రంగా పని చేస్తున్న అంబేద్కర్- కింగ్ స్టడీ సర్కిల్‌(ఏకేఎస్‌సీ) కులవివక్షను ఎదుర్కొన్న 60మంది భారతీయులకు సంబంధించిన ఘటనలను ప్రచురించింది.

దళితుల రక్షణకు అనేక చట్టాలున్నాయి. కానీ వాటిని అమలు చేసే వారిలో నిబద్ధత ముఖ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దళితుల రక్షణకు అనేక చట్టాలున్నాయి. కానీ వాటిని అమలు చేసే వారిలో నిబద్ధత ముఖ్యం

అండగా చట్టాలు

భారతదేశంలో దళితుల రక్షణ కోసం షెడ్యూల్డ్‌ కులాలు/తెగల (అత్యాచారాల నివారణ)చట్టం-1989 అమలులో ఉంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరిగే దాడులను ఈ చట్టం కింద విచారిస్తారు.

ఈ చట్టం ప్రకారం నేరం తీవ్రతనుబట్టి బాధితులకు సహాయం, పునరావాసం, నిందితులకు శిక్షలు నిర్ణయిస్తారు.

ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా అంటరానితనాన్ని అరికట్టడానికి అస్పృశ్యత నివారణ చట్టం-1955 కూడా ఉంది. దీనిని తర్వాత పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు.

ఈ చట్టం ప్రకారం అంటరానితనాన్ని పాటించడం, ప్రోత్సహించడం నేరం. అయితే చాలా కేసులు మీడియాకు, రాజకీయ నాయకులకు కనిపించకుండానే పోతాయని, ఫిర్యాదు దాకా కూడా రాని కేసులు చాలా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

మరి సమస్య ఎక్కడ ఉంది ? చట్టం బలహీనంగా ఉందా లేక దానిని అమలు చేసేవారికి సంకల్పం లేదా?

అవగాహన కల్పించకపోవడమే సమస్య

తమపై జరిగే హింసలో సామాజిక, రాజకీయ కారణాలే పెద్ద పాత్ర పోషిస్తున్నాయని దళితులు భావిస్తున్నారు. బాధిత వర్గంలో అవగాహన పెరగాలని దళిత మేధావి చంద్రభాన్‌ ప్రసాద్ అన్నారు.

"అంతకు ముందు దళితులపై ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరగలేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని మూక దాడులు చేయడం, చంపడం వంటివి ఉండేవి కాదు. గత 10-15 సంవత్సరాలలో ఇవి బాగా పెరిగాయి. దళితులు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వారిపై దాడులు పెరుగుతున్నాయి. ఇది చట్ట సమస్య కాదు, సామాజిక సమస్య" అన్నారు చంద్రభాన్‌ ప్రసాద్‌.

ఒక దశలో అమెరికాలో నల్లజాతీయులపై రోడ్ల మీదనే దాడులు జరిగేవని చంద్రభాన్‌ ప్రసాద్‌ చెప్పారు.“ జనవరి 1, 1863న అబ్రహంలింకన్ బానిసత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి నల్లజాతీయులపై మూక హింసాత్మక దాడులు మొదలయ్యాయి. అంటే, నల్లజాతీయులు బానిసలుగా ఉన్నంత కాలం వారిని చంపాల్సిన అవసరం యజమానులకు రాలేదు. భారతదేశంలో గత 73 ఏళ్లుగా దళితులు కూడా అందుకు మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు’’ అని చంద్రభాన్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

“కుల వివక్ష ఇంకా కొనసాగుతుందన్న విషయాన్ని అందరూ ఒప్పుకోవాలి. విద్యావంతులు కూడా దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు’’ అన్నారు దళిత నేత ఉదిత్ రాజ్‌. ప్రైవేటీకరణ, రిజర్వేషన్‌లను తొలగించే చర్యల ద్వారా బీజేపీ ప్రభుత్వం ఈ అసమానతలను పెంచుతోందని ఉదిత్‌ రాజ్ ఆరోపించారు.

"ప్రస్తుత ప్రభుత్వంలోని బ్యూరోక్రాట్లలో చట్టంపట్ల భయం పోయింది. నాయకులే దళితుల గురించి ఆందోళన చెందనప్పుడు, బ్యూరోక్రసీపై ఒత్తిడి తీసుకురావడం ఎలా సాధ్యమవుతుంది ?" అని ఆయన ప్రశ్నించారు.

బాధితులు ముందు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి. కానీ వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోతోంది

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బాధితులు ముందు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి. కానీ వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోతోంది

ఖాళీగా పదవులు

టైమ్స్‌ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్, నేషనల్‌ సఫాయి కర్మచారి కమిషన్‌ ఛైర్మన్ పదవులు చాలాకాలంగా ఖాళీగా ఉన్నాయి.

వీటిని భర్తీ చేయడంపై ప్రభుత్వం ఎలాంటి చొరవా చూపలేదు. ఈ సంస్థలు షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకుంటాయి.

షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌ల వెబ్‌సైట్‌లను గమనిస్తే, ఛైర్మన్‌ పోస్ట్‌ తప్ప అన్ని పదవులు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తుంది.

“ ప్రస్తుతం ఆ సంస్థలున్న తీరును చూస్తే ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో అర్ధమవుతుంది. ప్రభుత్వానికి నిజంగా దళితులపట్ల శ్రద్ధ ఉంటే పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదు? ఈ సంస్థలను ఎందుకు బలహీనపరుస్తోంది?” అని ఉదిత్‌ రాజ్‌ ప్రశ్నించారు.

" ఈ సంస్థలకు పెద్దగా అధికారాలు లేవు. ఆర్ధిక నిర్ణయాలు, నియామకాలు చేపట్టే అధికారం లేదు. ఈ పనిని సామాజిక న్యాయం-సాధికార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. అయినా ఈ సంస్థలు దళితులపై జరిగే దాడుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. వారికి పోలీసులు, అధికారుల నుంచి వివరణ కోరే అధికారం కూడా ఉంది ’’ అన్నారు ఉదిత్‌రాజ్.

దళితుల పోరాటం

ఫొటో సోర్స్, Getty Images

అన్ని స్థాయిల్లో వివక్ష

చట్టంలోనే కాదు, వాటి అమలులో కూడా లోపం ఉందని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ డైరెక్టర్‌ జనరల్ వీఎన్‌ రాయ్ అభిప్రాయపడ్డారు."దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. కానీ సామాజిక విలువలు లేవు. ఈ రోజుల్లో కూడా ఉన్నత కులాల వారు దళితులకు తమతో సమానమైన హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. పరిస్థితులు మారుతున్నాయి. కానీ చాలా నెమ్మదిగా మారుతున్నాయి’’ అన్నారు రాయ్‌.

“మీడియా, పోలీసులు, న్యాయ వ్యవస్థ ప్రతిచోటా ప్రజల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చలేవు. బాధితుడు మొదటగా వెళ్లాల్సింది పోలీస్‌ స్టేషన్‌కు. కానీ చాలామంది అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. పేదలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వారిలో పోయింది’’ అని రాయ్‌ వ్యాఖ్యానించారు. ఈ విధానం మారాలంటే దళితులు ఆర్ధికంగా బలపడాలంటారు వీఎన్‌ రాయ్‌.

గ్రామాలలో భూమి, ఆస్తి పంపిణీ జరగాలని, తద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని రాయ్‌ అన్నారు. కులం సంకెళ్లను తెంచడానికి కులాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారాయన.

పోలీసు వ్యవస్థలో కూడా మార్పు రావాలంటారు రాయ్‌. నేరాలను రికార్డు చేయడంతోనే సరిపోదని, దానిపై చర్యలు తీసుకోవడంలో సున్నితంగా కాకుండా కఠినంగా వ్యవహరించడం వల్ల పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని దళిత మేధావులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)