మధ్యప్రదేశ్ దళిత రైతు: 'పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు.. ఏడు నెలల బిడ్డను కూడా వదల్లేదు'

కన్న బిడ్డలతో రాజ్ కుమార్

ఫొటో సోర్స్, Shuraih Niyazi/BBC

ఫొటో క్యాప్షన్, కన్న బిడ్డలతో దళితర రైతు రాజ్ కుమార్
    • రచయిత, సురేహ్ నియాజీ
    • హోదా, బీబీసీ హిందీ కోసం, భోపాల్ నుంచి

భూమిని స్వాధీనం చేసుకునే విషయంలో పోలీసులు అన్ని హద్దులు దాటారని మధ్యప్రదేశ్‌కు చెందిన దళిత రైతు రాజ్‌కుమార్ అహిర్వార్‌ ఆరోపించారు. తన పిల్లలను, భార్య, తల్లి, సోదరుడిని కూడా హింసించారని రాజ్‌కుమార్‌ ఆరోపించారు.

ప్రస్తుతం రాజ్‌కుమార్,ఆయన భార్య సావిత్రి గుణాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. "పొలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన అధికారులకు మేం పరిస్థితిని వివరించాం. కానీ, వారు మా మాట వినడానికి సిద్ధంగా లేరు. మమ్మల్ని దుర్భాషలాడారు. ఇక్కడి నుంచి కదులుతారా లేదా అని బెదిరించారు. ఆ తర్వాత మా కుటుంబంపై దాడి చేశారు'' అని రాజ్‌కుమార్‌ వెల్లడించారు.

తన భార్య, తల్లి, సోదరుడే కాకుండా తన ఏడు నెలల చిన్నారి కూడా పోలీసుల వేధింపులకు గురయ్యాడని ఆసుపత్రి నుండి ఫోన్‌లో బీబీసీకి వివరించారు రాజ్‌కుమార్‌. ఆయన భార్య సావిత్రి ఆరోగ్యం విషమంగా ఉంది. ఆమె మాట్లాడే స్థితిలో లేరు.

పంట చేతికొచ్చే వరకు ఆగాలని, రెండు నెలల గడువు ఇవ్వాలని తాము కోరినట్లు రాజ్‌కుమార్‌ తల్లి గీతాబాయి తెలిపారు. తమకు ఈ భూమిని ఇచ్చిన గబ్బూపార్దీ అనే వ్యక్తి ఈ భూమిని 35 ఏళ్లుగా సాగు చేస్తున్నారని గీతాబాయి చెప్పారు. "అన్ని సంవత్సరాలు ఆ భూమిని సాగు చేసుకుంటుంటే, దాని యజమాని ఆయన కాదని మేము ఎలా అనుకుంటాం ? రెండేళ్లుగా మేం ఈ భూమిలో పంటలు వేసుకుంటున్నాం'' అని గీతాబాయి వెల్లడించారు. ఈ భూమి సుమారు 13 ఎకరాలు ఉంటుందని, ఇది మాది అని తాము ఎప్పుడూ చెప్పలేదని గీతాబాయి అన్నారు.

ఆసుపత్రిలో రాజ్‌కుమార్‌

ఫొటో సోర్స్, Shuraih Niyazi/BBC

ఫొటో క్యాప్షన్, ఆసుపత్రిలో రాజ్‌కుమార్‌

రాజ్‌కుమార్ అహిర్వార్ తన భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి ఈ భూమిని సాగు చేసుకుంటూ పొలంలోనే నివసిస్తున్నారు. ఆయనతోపాటు, తల్లిదండ్రులు, తమ్ముడు కూడా అక్కడే ఉంటున్నారు. రాజ్‌కుమార్‌కు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

తాము ఏ పోలీసు అధికారిని దూషించలేదని అహిర్వార్‌ కుటుంబం చెబుతోంది. మా కుటుంబమంతా పోలీసుల చర్యలను అడ్డుకోడానికి ప్రయత్నించిందని, పెద్ద కొడుకు, కోడలు పురుగుల మందు తాగి ఆత్మహత్యు ప్రయత్నించారని గీతాబాయి వెల్లడించారు.

పోలీసులు రైతు కుటుంబాన్ని కొడుతున్న వీడియోలు వైరల్ కావడంతో, ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ గుణ జిల్లా కలెక్టర్‌, పోలీసు సూపరింటెండెంట్లను సస్పెండ్‌ చేశారు. మరుసటిరోజు మరో ఆరుగురు పోలీసులను కూడా విధుల నుంచి తప్పించారు.

వైరల్ అయిన ఈ వీడియోలో పోలీసులు బాధితులపై దాడి చేస్తున్నట్లు, వాటిని చూసి భయపడి పిల్లలు ఏడుస్తున్నట్లు స్పష్టంగా ఉంది. పిల్లల అరుపులు, ఏడుపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

వైరల్ వీడియో నుంచి తీసిన చిత్రం

ఫొటో సోర్స్, Shuraih Niyazi/BBC

ఫొటో క్యాప్షన్, వైరల్ వీడియో నుంచి తీసిన చిత్రం

అసలు ఆ రోజు ఏం జరిగింది?

ఈ సంఘటన గుణా నగరంలోని కాంట్ పోలీస్‌ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. ఆక్రమణను తొలగించడానికి నగరంలోని సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుంది. ఆ పొలాన్ని రాజ్‌కుమార్‌ అహిర్వార్‌ అనే వ్యక్తి సాగు చేసుకుంటున్నాడు. పోలీసు బృందం జేసీబీ మెషిన్‌ ద్వారా పంటను తొలగించడం ప్రారంభించింది.

రాజ్‌కుమార్, అతని భార్య దీనిని వ్యతిరేకించారు. కానీ పోలీసులు వారిని తీవ్రంగా కొట్టి పంటలను తొలగించారు. దీంతో భార్యాభర్తలిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.

ఈ భూమిని ఓ కాలేజీకి కేటాయించారు. మాజీ కౌన్సిలర్ గబ్బు పార్దీ అనే వ్యక్తి ఆక్రమణలో ఉందని, డబ్బు కోసం అతను రాజ్‌కుమార్‌కు కౌలుకు ఇచ్చారని అధికారులు వెల్లడించారు.

ఈ భూమిని సాగు చేసుకోడానికి రాజ్‌కుమార్‌ భారీగా అప్పు చేశారని స్థానికులు చెబుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోడానికి రాజ్‌కుమార్‌కు ఈ భూమే ఆధారమని, కానీ అధికారులు అతని విజ్జప్తులు వినకుండా తీవ్రంగా కొట్టారని స్థానిక రైతులు అన్నారు.

పోలీసుల దాడితో మనస్తాపం చెందిన రాజ్‌కుమార్‌, అతని భార్య పురుగుల మందు తాగారు. వారిద్దరు పడిపోయినా అధికారులు పట్టించుకోలేదు. ఓవైపు పిల్లలు ఏడుస్తున్నారు. చాలాసేపటి తర్వాత అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు.

రాజ్‌కుమార్ కుటుంబం ఈ విషయాన్ని పెద్దది చేసిందని అధికారులు అంటుంటే, అక్కడికి వచ్చిన రాజ్‌కుమార్‌ సోదరుడిని కూడా తీవ్రంగా కొట్టారని అతని కుటుంబం ఆరోపించింది.

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత మాయావతితో సహా పలువురు నాయకులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా పోలీసుల తీరును విమర్శించారు. రైతులపై దాడిని పలు ప్రజా సంఘాలు కూడా తప్పుబట్టాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)