స్టడీ నోట్స్ ఆన్‌లైన్‌లో అమ్ముతూ, లక్షలు సంపాదిస్తున్నాడు

యుజీన్ చోవ్

ఫొటో సోర్స్, Eugene Cheow

ఫొటో క్యాప్షన్, యుజీన్ చోవ్
    • రచయిత, పాబ్లో ఉచోవా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సింగపూర్‌లో యుజీన్ చోవ్ అనే 24 ఏళ్ల కుర్రాడు తన స్టడీ నోట్స్ అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే, ఇవి మామూలు నోట్స్ కాదు, మైండ్ మ్యాప్స్.

ఏవైనా పాఠాలు, అంశాలను సులభంగా అర్థమయ్యేలా గ్రాఫికల్ పద్ధతిలో వివరిస్తూ రూపొందించే పటాలను మైండ్ మ్యాప్స్ అంటారు.

సింగపూర్‌లో రియల్టర్ (స్థిరాస్తి వ్యాపారి) అవ్వాలంటే రెండు పరీక్షలు పాస్ అవ్వాల్సి ఉంటుంది. యూజీన్ చోవ్ వీటిలో పాస్ అయ్యారు.

ఈ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేందుకు తాను రూపొందించుకున్న మైండ్ మ్యాప్స్‌ను అతడు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాడు.

వీటికి మంచి ఆదరణ లభిస్తోంది.

ఇప్పటివరకూ తన మైండ్ మ్యాప్స్ 1,500కుపైగా అమ్ముడుపోయాయని చోవ్ చెప్పాడు. ఈ అమ్మకాలతో ఒకానొక సమయంలో వారానికి వెయ్యి అమెరికన్ డాలర్ల (73వేల రూపాయల) దాకా ఆదాయం వచ్చిందని అన్నాడు.

యుజీన్ చోవ్, సింగపూర్

ఫొటో సోర్స్, Getty Images

సింగపూర్‌లో స్థిరాస్తి వ్యాపారిగా మారాలంటే, దాదాపు 60 గంటల కోర్సును పూర్తి చేయాలి. రెండు విడతలుగా జరిగే పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.

''సింగపూర్‌లో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇది సులభమైన ప్రక్రియ కాదు. త్వరగా నేర్పించే విధానానికి బాగా డిమాండ్ ఉందని నేను గుర్తించా'' అని యూజీన్ చోవ్ అన్నాడు.

మైండ్ మ్యాప్

ఫొటో సోర్స్, Eugene Cheow

స్థిరాస్తి రంగానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, మార్కెటింగ్ పద్ధతులు, గణిత సూత్రాలు, పట్టికలు... ఇలా పాఠ్యాంశాల్లో ఉండే వివరాలన్నీ చోవ్ తన మైండ్ మ్యాప్‌ల్లో కవర్ చేశాడు.

‘‘పాఠ్యాంశాల్లో ఉండే అంశాలన్నింటినీ ఈ మ్యాప్ స్థూలంగా చూపిస్తుంది. కావాల్సిన అంశంపై జూమ్ చేసుకుని, మరిన్ని వివరాలు చూడొచ్చు. ఏదైనా సందేహం ఉంటే, ఆ అంశానికి సంబంధించిన మొత్తం పాఠం చదివే పని లేకుండా, మైండ్ మ్యాప్‌లో దాన్ని సులభంగా పట్టుకోవచ్చు’’ అని చో అన్నాడు.

మైండ్ మ్యాప్‌ల ద్వారా చదవడం ఆసక్తికరంగా కూడా ఉంటుందని అతడు వివరించాడు.

స్కూబా డైవింగ్

ఫొటో సోర్స్, Eugene Cheow

‘భాష అవసరం లేదు’

స్కూబా డైవింగ్ చేయడం అంటే చోవ్‌కు చాలా ఇష్టం.

సులభంగా అర్థమయ్యేలా పాఠాలు రూపొందించడంలో తన నైపుణ్యానికి స్కూబా డైవింగ్ కూడా తోడ్పడిందని చోవ్ అంటున్నాడు.

14 ఏళ్ల వయసు నుంచి అతడు స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే మాస్టర్ స్కూబా డ్రైవర్‌గా మారాడు. ఇప్పుడు శిక్షకుడిగానూ పనిచేస్తున్నాడు. ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, మలేసియా లాంటి దేశాల్లోనూ డైవింగ్‌కు వెళ్లాడు.

‘‘భాష తెలియడం సానుకూలాంశమే, కానీ తప్పనిసరి కాదని డైవింగ్ శిక్షకుడిగా నేను తెలుసుకున్నా. ఎందుకంటే, నీటి లోపల మాట్లాడటం కుదరదుగా. ఏం చెప్పాలన్నా ముఖ కవలికలతోనో, చేతి సైగలతోనో చెప్పాలి’’ అని చోవ్ అన్నాడు.

భిన్న ప్రాంతాలు, సంస్కృతుల వారితో కలిసి డైవింగ్ చేయడం వల్ల అందరితో కలిసిపోవడం తనకు బాగా తెలిసిందని అతడు వివరించాడు.

యుజీన్ చోవ్

ఫొటో సోర్స్, Eugene Cheow

తాను రూపొందించిన మైండ్ మ్యాప్స్‌ను అమ్మేందుకు ఆర్‌ఈఎస్ ట్యూటర్ పేరుతో చోవ్ సంస్థను ఏర్పాటు చేశాడు.

స్థిరాస్తి రంగానికి సంబంధించిన కోర్సులాగే ఐటీ కోర్సుల కోసం కూడా మైండ్ మ్యాప్‌లను అందించేలా తమ సేవలను విస్తరించాలని అతడు ప్రణాళికలు వేసుకున్నాడు.

అయితే, తాను ఈ విషయంలో మరీ తొందరపడనని కూడా అతడు చెప్పాడు.

‘‘ఆన్‌లైన్‌లో నేను ఇచ్చే ఆ 16 పేజీల సమాచారం కోసం వినియోగదారులు రూ.4,300కుపైగా చెల్లిస్తారు. అది అంత విలువైందిగా ఉండేలా చూడటం నా బాధ్యత’’ అని చోవ్ అన్నాడు.

అయితే, స్థిరాస్తి రంగంలో పాఠాలు అందిస్తున్నప్పటికీ చోవ్‌కు మాత్రం ఆ రంగంలో పనిచేయాలన్న ఆసక్తి లేదు. అతడి తల్లి మాత్రం 30 ఏళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్నారు. ఎప్పుడైనా అవసరమైనప్పడు ఆమెకు సాయంగా ఉంటానని అతడు చెబుతున్నాడు.

‘‘నాకు ఉన్నది వట్టి వినియోగదారులు కాదు. వాళ్లకు, నాకు మధ్య ఓ లావాదేవీ మాత్రమే ఉండాలని నేను అనుకోవడం లేదు. బంధం ఉండాలనుకుంటున్నా’’ అని చోవ్ అన్నాడు.

‘‘పరీక్ష రాసి ఫలితం వచ్చిన తర్వాత, నేను రూపొందించిన మైండ్ మ్యాప్స్ విల్ల విజయంతమయ్యాయమని వారు చెబుతుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది’’ అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)