తెలంగాణ: ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల వివరాలు అప్‌డేట్ చేసేటప్పుడు వస్తున్న సమస్యలివీ...

కేసీఆర్, తెలంగాణ సీఎం, KCR

ఫొటో సోర్స్, twitter/TelanganaCMO

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో జరుగుతున్న ఆస్తుల సర్వే కొత్త కొత్త సమస్యలకు దారి తీస్తోంది. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న వారి వివరాలు అప్డేట్ చేయడం ఒక సమస్య అయింది. ఇక ఆస్తి పంపకాలు జరగని ఉమ్మడి కుటుంబాల్లో మరో సమస్యను సృష్టిస్తోంది ఆ సర్వే. చివరకు ప్రభుత్వం నిర్ణయించిన డెడ్‌లైన్ ముగియడంతో మరో పది రోజులు గడువు పొడిగించారు. అత్యంత కీలకమైన ఆస్తుల విషయంలో ఈ హడావిడి, ఎటు దారితీయబోతోంది?

తెలంగాణలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా, ఆస్తులు (భవనాలు, ఇళ్లు) సర్వే చేపట్టారు. అంటే ప్రతీ భవనం దగ్గరకు వెళ్లి ఆ భవనం కొలతలు, యజమాని పేరు.. ఇలా ఓ 50కి పైగా రకాల వివరాలు నమోదు చేసుకోవాలి. వాటిని తరువాత ధరణి వెబ్‌సైట్లో పెడతారు. ఈ బాధ్యత మొత్తం స్థానిక సంస్థలకు అప్పగించారు. అంటే పంచాయతీ, మున్సిపాలిటీల వారు ఈ వివరాలు రాసుకుంటారు. వారికి అదనంగా వివిధ శాఖల సిబ్బందిని కేటాయించారు.

కానీ సమాచార సేకరణను చాలా వేగంగా చేయాలని తలపెట్టిన ప్రభుత్వం కేవలం పది రోజుల గడువు ఇచ్చింది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది.

ధరణి, Dharani website

ఫొటో సోర్స్, twitter/TS_DHARANI

బయటి ప్రాంతాల వారి సమస్య

చాలా మంది కుటుంబంతో సహా వలస వెళ్లిన వారు ఉన్నారు. ముంబయి, సూరత్ నగరాలకు వెళ్లిన వారు, గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు, ఉన్నత ఉద్యోగులూ, వ్యాపారులుగా అమెరికా, యూరోప్ దేశాల్లో స్థిరపడ్డ వారు… ఇలా చాలా మంది తెలంగాణ నుంచి బయట ఉన్నారు. వారందరికీ ఇప్పుడీ ప్రక్రియ భయాన్ని కలిగిస్తోంది. ఇంటి వివరాలు ఫోన్లో చెప్పే అవకాశం లేదు. ఇంటి ముందు యజమానిని నుంచోబెట్టి ఫోటో తీయాలన్న నిబంధనతో ఈ వివరాలు నమోదు కావడం లేదు.

ఇదే అంశంపై తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఒక లేఖ కూడా రాసింది. భూ రికార్డుల ప్రక్షాళనను ప్రశంసిస్తూనే తమ సమస్యలు పొందు పర్చారు ఆ లేఖలో. ధరణిలో ఎన్ఆర్ఐల భూముల వివరాలు పొందు పరిచే అవకాశం లేకపోయిందని వాపోయారు. ఎన్ఆర్ఐలలో చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. ఇప్పుడు అప్లై చేద్దామన్నా, కోవిడ్-19 కారణంగా రాలేని పరిస్థితి అంటూ తమ పరిస్థితి చెప్పుకొచ్చారు.

ఎన్ఆర్ఐల భూ వివరాలు అప్‌డేట్ చేయడానికి ప్రత్యేక ప్రక్రియను నిర్ణయించాలని వారు కోరుతున్నారు. ''భూ వివరాల నమోదుకు పాస్‌పోర్ట్ లేదా ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఐడెంటిటీ) కార్డులను ఆధార్ బదులుగా వాడాలి. పాస్‌పోర్టులో ఉన్న చిరునామా ఉపయోగించుకుని, విదేశీ ఫోన్ నంబర్లను కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలకు తమ ప్రతినిధులను పంపుకునే అవకాశం ఉండాలి''అని ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ అధ్యక్షులు డా.చాలిగంటి రఘు. తమ ఆస్తులు డిజిటలైజ్ చేసుకోవడానికి కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరుతున్నారు వారు.

దేశాల సంగతి పక్కన పెడితే, పక్క రాష్ట్రాల్లో ఉన్న వారికీ ఇబ్బంది ఉంది. కరోనావైరస్ వ్యాప్తి నడుమ రైళ్లు లేకపోవడంతో, ఇతర రాష్ట్రాల నుంచి రాలేని వారు ఇబ్బంది పడుతున్నారు.

ధరణి, Dharani website

ఫొటో సోర్స్, Dharani

సాంకేతిక సమస్యలు

ఈ వివరాల నమోదుకు ప్రభుత్వం ఒక యాప్ రూపొందించి సిబ్బందికి ఇచ్చింది. కానీ చాలా మంది సిబ్బంది ఫోన్లలో రకరకాల వెర్షన్లు ఉంటాయి. దాంతో అవి పనిచేయడం చాలా ఇబ్బంది అవుతోంది. చాలా సందర్భాల్లో గ్రామాల్లో నెట్ స్పీడ్ లేక వివరాలు అప్‌డేట్ అవడం ఆలస్యం అవుతోంది. అలాగని సిగ్నల్ కోసం దూరం వెళ్తే జియో లొకేషన్ తేడా వచ్చేస్తోంది.

''ఇదంతా గందరగోళం వ్యవహారంలా ఉంది. ఈ యాప్ గురించి మా పైఆఫీసర్లకు కూడా అంత క్లారిటీగా తెలవదు. పోనీ మెల్లగా చేద్దామంటే రోజుకు 50 ఇళ్లు చేయాలి, 70 ఇళ్లు చేయాలి అంటూ తరుముతున్నారు''అని తన సమస్య వివరించారు జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి. ఆయన ఇతర శాఖలకు చెందిన సిబ్బందితో కలసి తమ గ్రామంలో సర్వే పనులు చేస్తున్నారు.

కొలతలది మరో సమస్య. ''ఇంటి కొలతలు కావాలన్నారు ముందు, సరే అని టేపులతో కొలిస్తే, అలా వద్దు, అందాజా (అంచనా) రాయమంటున్నారు. అంతా అయోమయంగా ఉంది.'' అన్నారాయన.

నిజానికి ఈ సర్వే విషయంలో స్పష్టమైన లిఖిత పూర్వక మార్గదర్శకాలు కానీ, శిక్షణ కానీ, లేదా ప్రజలకు ప్రకటనల ద్వారా సమాచారం కానీ లేదు. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు విస్తృత ప్రచారం చేసింది. కానీ ఈసారి అలాంటిది ఏమీ లేదు.

మంత్రులు, నాయకులు మీడియాలో మాట్లాడడం వంటివి కనిపిస్తున్నా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లాగా ప్రకటనలు ఇవ్వడం లేదు. ''ఈ నెల మొదటి నుంచీ సర్వే జరుగుతున్నా అధికారిక ఉత్తర్వులు లేవు. అంతర్గత ఆదేశాలతో పనిచేస్తున్నారు. ప్రజలను స్వచ్ఛందంగా వివరాలు ఇచ్చేట్టుగా నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఆస్తుల వివరాలు చెప్పడం, చెప్పకపోవడం ప్రాథమిక హక్కు. ఆ విషయంలో చట్టపరమైన సమస్యలు లేకుండా ఇలా చేస్తున్నట్టు కనిపిస్తోంది'' అని బీబీసీతో చెప్పారు హైదరాబాద్‌కి చెందిన సీనియర్ జర్నలిస్టు ఒకరు.

చట్టపరమైన సమస్యలు

తల్లీ తండ్రీ ఇద్దరూ లేకుండా కేవలం పిల్లలు మాత్రం ఒకే ఇంట్లో కలసి ఉంటున్నచోట యాజమాన్య హక్కుల సమస్య వస్తోంది. ఉమ్మడి ఆస్తి లేదా పంపకాలు పూర్తి కాని ఆస్తి విషయంలో సమాచారం ఎక్కించడానికి స్పష్టమైన కాలమ్ లేదు.

ఆస్తి యజమాని, ఉమ్మడి హక్కు దారు అనే రెండు వేర్వే గడులు ఉన్నాయి. దీంతో చాలా సందర్భాల్లో ఆస్తి యజమాని గడిలో ఎవరి పేరు రాయాలి? హక్కుదారు గడిలో ఎవరి పేరు రాయాలన్నది సమస్యగా ఉంటోంది. కొందరు సిబ్బంది.. చనిపోయిన తల్లితండ్రులు పేర్లు రాసి, ఆ ఆస్తి వివాదంలో ఉంది అని రాసి సరిపెడుతున్నారు. ఇది సమస్యను మరింత జటిలం చేస్తుంది.

కేసీఆర్

ఫొటో సోర్స్, KALVAKUNTLACHANDRASHEKARRAO/FB

వేగమా? కచ్చితత్వమా?

తెలంగాణలోని 12,761 పంచాయితీలు, 13 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. పంచాయతీలకు పదో తారీఖు టార్గెట్. కానీ ఎక్కడా పక్కాగా నూరు శాతం జరిగిన దాఖలు లేవు. దీంతో తాజాగా అక్టోబరు 20 వరకూ గడువు పెంచారు. ఈ డేటాను పంచాయతీల దగ్గర ప్రదర్శిస్తే జనం వెళ్లి తప్పొప్పులు చూసుకుని అభ్యంతరాలు పెట్టాలి. ఆ ప్రక్రియ 15లోపు పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీల పొడిగింపు గురించి ప్రభుత్వం ఏం చెప్పలేదు.

ఇంత గందరగోళం మధ్య టీఆర్ఎస్ నాయకుల మాటలు సామాన్యుల్లో భయాన్ని పెంచాయి. ''ధరణిలోకి ఎక్కకపోతే ఆస్తులు ప్రభుత్వానికి చెందినట్టు లెక్క'' అన్నారు గంగుల కమలాకర్.

ఇటు మొత్తం వ్యవహారంపై ఇంటి యజమానుల్లో కొంత అసహనం కనిపిస్తోంది. ''గాళ్లొచ్చి చరిత్రంతా అడుగుతున్నారు. ఏవేవో అడుగుతున్నారు (ప్రభుత్వం 53 పైగా కాలమ్స్‌లో సమాచారం సేకరిస్తోంది.) గవన్నీ యాద్ చేసుకునే చెప్దమంటే, అంత టైం ఈయట్లేదు.. ఒకటే తరుముతున్నారు'' అని తన సమస్య చెప్పుకున్నారు పెద్దపల్లి ప్రాంతానికి చెందిన మోహన్ అనే రైతు.

''ఈ కొత్త చట్టం చాలా లాభదాయకం. రైతులకు ఉపయోగం. అయితే క్షేత్ర స్థాయిలో కొన్ని చిన్న సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. డేటా ఎంట్రీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆస్తుల వివరాల నమోదు అంత తేలిక కాదు.'' అన్నారు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ నాయకులు రవీందర్ రెడ్డి.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరూ స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)