లంచగొండి అధికారులను ఏసీబీ పట్టుకున్నాక ఏం జరుగుతుంది

ఫొటో సోర్స్, Acb
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జీహెచ్ఎంసీలో పనిచేసే ఒక ఉన్నతాధికారి ఏసీబీ కేసులో దొరికారు. విచారణ సాగుతోంది. ఈలోపు సదరు అధికారి చట్టాల్లో లోపాలు వెతికారు. మళ్లీ ఉద్యోగంలో చేరడమే కాదు, ఏకంగా ప్రమోషనూ తెచ్చుకునేందుకు పావులు కదిపారు. వెంటనే గుర్తించిన తెలంగాణ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
సదరు అధికారి ఏసీబీ కేసు ఉండగానే, తనకు ప్రమోషన్ కోసమంటూ హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు పెండింగులో ఉంది.
ఏసీబీ ఎవరినైనా అవినీతి కేసులో పట్టుకున్న తరువాత ఏం జరుగుతుందనడానికి ఇదొక ఉదాహరణ.
ఈ ఉదాహరణలో ఏసీబీ వెంటనే స్పందించడంతో, కోర్టులో ఆ ఉద్యోగికి వ్యతిరేక తీర్పు వచ్చింది. కానీ చాలా కేసుల్లో దానికి రివర్సులో జరుగుతోంది. ఏసీబీ కేసులు తేలకుండానే ఉద్యోగులు విధుల్లో చేరతారు.
హైదరాబాద్ శివార్లలోని కీసర తహసిల్దారును రూ.1.1 కోట్లు సొమ్ము తీసుకుంటుండగా పట్టుకుంది ఏసీబీ. ఆ డబ్బు అంతా టేబుల్‌పై పరచి ఉన్న వీడియోలు చూసి జనం అమ్మో అనుకున్నారు.
నెల రోజులు తిరక్కుండానే మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్‌ను ఏసీబీ పట్టుకుంది. తహసిల్దారు కంటే తాను ఎక్కువ అనుకున్నారో ఏమో, ఈయన ఇంకో రెండు లక్షలు కలుపుకొని రూ.1.12 కోట్లు తీసుకుంటూ దొరికారు. ఆయనతో పాటూ ఆర్డీవో, తహసిల్దారు కూడా ఉన్నారు. మొత్తం నగదు రూపంలోనే కాకుండా, కొంత భూమి రూపంలోనూ లంచం తీసుకున్నారు.
మరి ఏసీబీ పట్టుకున్న తరువాత ఏమవుతుంది? అవినీతి అధికారుల ఆటకట్టేనా?

ఫొటో సోర్స్, Acb
ఏసీబీ కేసు అంటే
ఏసీబీ కేసులు రెండు రకాలు. ఒకటి లంచం తీసుకుంటుండగా అక్కడికక్కడే పట్టుకోవడం.
లంచం ఇచ్చే వ్యక్తి సరిగ్గా డబ్బు ఇస్తున్నప్పుడు, లేదా తీసుకున్న అధికారి చేతిలో డబ్బు ఉండగానే సినిమాల్లోలా సడెన్ ఎంట్రీ ఇచ్చి పట్టుకుంటారు. అది లంచం డబ్బే అని గుర్తించడానికి వీలుగా, ముందుగానే ఆ కరెన్సీపై ఒక రసాయనం చల్లుతారు. ఆ రసాయనం చల్లిన డబ్బు తరువాత రంగు మారుతుంది.
ఇలా పట్టుకునే వాటిని ట్రాప్ కేసులు అంటారు. అధికారుల అవినీతితో విసిగిపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు, వారి ద్వారా ఆ అధికారిని ట్రాప్ చేసి పట్టుకుంటారు కాబట్టి దీనికాపేరు.
ఇక రెండో రకం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.
అంటే అప్పటికప్పుడు లంచం తీసుకుంటూ దొరకకపోయినా, బాగా అవినీతి చేసి ఆస్తులు కూడబెట్టిన వారి కూపీలాగుతారు ఏసీబీ అధికారులు.
వాళ్ల గురించి ఆరాతీసి, అధ్యయనం చేసి, వారి ఇంటిపై, ఇంకా బంధువులు, స్నేహితులు, బినామీల ఇంటిపై ఒకేసారి తనిఖీలకు వెళ్తారు. వాళ్ల ఇళ్లల్లో దొరికిన పత్రాలు, బంగారం, డబ్బు అన్నీ స్వాధీనం చేసుకుంటారు. తరువాత వారి జీతం, ఇతర అధికారిక ఆదాయాలూ అన్నీ లెక్కవేసి, అంతకంటే ఎక్కువ ఉంటే అది ఎలా వచ్చిందో ఆరాతీసి, దానికి సరైన కారణం దొరక్కపోతే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో కేసు పెడతారు.

ఫొటో సోర్స్, IMAGEDB/GETTY IMAGES
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చాలా జాగ్రత్తగా పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ వ్యక్తికి శిక్ష పడేలా చూడడం మరో ఎత్తు.
సరిగ్గా ఈ రెండో ఎత్తు దగ్గర చిత్తవుతోంది ఏసీబీ.
మనం టీవీల్లో చూసే నోట్ల కట్టల దగ్గర టెన్షన్ గానో, కాస్త ధైర్యం ఉన్న వారు అయితే చిరునవ్వుతోనే, గంభీరంగానో, అవమానంతో ముఖానికి ముసుగు అడ్డం పెట్టుకునో కనిపించే అధికారులందరకీ తరువాత శిక్ష పడదు.
అంతేకాదు, సరిగ్గా రెండేళ్లు తిరక్కుండా వాళ్లంతా మళ్లీ డ్యూటీలోకి వస్తారు. ఏదో ఒకరిద్దరు అనుకోకకండి. సగానికి సగం మంది దర్జాగా ఏ శిక్షా లేకుండా డ్యూటీకి వస్తారు. మిగతా వారిలో చాలా మంది చిన్న శిక్షలతో తప్పించుకుంటారు.
ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా, ఇంటిపై తనిఖీలు చేసి గుట్టల కొద్దీ పత్రాలు, కట్టల కొద్దీ నోట్లు స్వాధీనం చేసుకున్నా, చివరకు కోర్టుల్లో వారు నేరం నిరూపించగలిగేది సగమే.
ఆంధ్రప్రదేశ్‌లో వంద మందిలో 52 మందిపై కేసులు రుజువు అవుతుండగా, తెలంగాణలో వందలో 63 మందిపై కేసులు రుజువు అవుతున్నాయి. మొత్తం కేసుల్లో 90 శాతం పెండింగులోనే ఉంటున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలపి ప్రస్తుతం సుమారు 1,500 పైగా ఏసీబీ కేసులు పెండింగులో ఉన్నాయి. ఏటా సుమారు 200 కేసులు వస్తున్నాయి. కోర్టుల్లో తేలే కేసులు మాత్రం సుమారు 150 వరకే ఉంటున్నాయి. దీంతో పెండింగులు పెరిగిపోతున్నాయి.

ఫొటో సోర్స్, ugc
కేసులు ఎందుకు వీగిపోతున్నాయి?
నిబంధనల ప్రకారం ట్రాప్ కేసులో పట్టుబడ్డ వారిపై మూడు నెలల్లో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆరు నెలల్లో ఏసీబీ నివేదికపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో నెలల తరబడి విచారణ సాగుతూనే ఉంటుంది.
కోర్టుల్లో విచారణ సంగతి ఇక చెప్పక్కర్లేదు. ఈలోపు సర్వీసు నిబంధనల వంకతో ఏసీబీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరుతున్నారు.
‘‘విచారణ ఆలస్యం అయ్యే కొద్దీ కేసు ఓడిపోయే అవకాశం పెరుగుతుంది. ఆర్నెళ్లలోనో, ఏడాదిలోనే తేలితే సరి. లేకపోతే నీరుగారిపోతుంది. కాలంతో పాటూ సాక్ష్యాలూ చచ్చిపోతాయి. సాక్షులు ఎటో పోతారు. ట్రాప్ కేసుల విషయంలో మొదట్లో ఉన్నంత ఉత్సాహం తరువాత ఉండదు. క్రమంగా ఆసక్తి తగ్గుతుంది. కేసును బలహీనం చేస్తారు. కొన్ని సందర్భాల్లో పట్టుకున్న అధికారీ, దొరికిన అధికారీ మధ్య ఒప్పందం వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పట్టుకున్న అధికారి రిటైర్ అయిపోతారు. వారి ఉత్సాహం తగ్గిపోతుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి విచారణను ప్రభావితం చేసే స్థాయికి వెళతాడు. విచారణకు కావల్సిన సమాచారం రాకుండా చేస్తాడు. ఇలా రకరకాల కారణాలతో కేసులు నీరుగారిపోతాయి’’ అని తెలంగాణ ప్రభుత్వ హోంశాఖకు స్పెషల్ గవర్నమెంటు ప్లీడరుగా పనిచేసిన శరత్ కుమార్ వివరించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కేసు నమోదు, విచారణలో శాస్త్రీయత లేకపోవడం, ఏసీబీ కోర్టుల్లో తగినంత మంది జడ్జీలు లేకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయని అంటున్నారాయన.
ఏసీబీ తరపు న్యాయవాదులు కూడా అవతలి పార్టీకి సహకరించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే అవినీతి ఆరోపణలతో తెలంగాణలో ఒక ఏసీబీ తరపు న్యాయవాదిని తొలగించారు.
నిజానికి ఏసీబీలో పనిచేసేది కూడా పోలీసులే. ఒకప్పుడు ఏసీబీకి బదిలీ చేయాలంటే... డిపార్టుమెంటులో చాలా ఎంక్వైరీ చేసి, నిజాయితీపరులనే తీసుకునేవారని వివరించారు మాజీ ఐపీఎస్ అధికారి రావులపాటి సీతారామారావు.
విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందన్న విషయానికి రకరకాల కారణాలు ఉంటాయని ఆయన అంటున్నారు.
‘‘ఆదాయానికి మించిన ఆస్తుల్లో, ఈ డబ్బు ఎక్కడిది అంటే ఫలానా చోటు నుంచి వచ్చింది అంటాడు. ఆ ఫలానా చోటు నుంచే వచ్చిందా అనేది ఎంక్వైరీ చేయడానికి టైం పడుతుంది. ఈలోపు అతను అక్కడ మేనేజ్ చేయవచ్చు. లేదా అతని వాదన తప్పు అని నిరూపించే అవకాశం అక్కడ ఉండకపోవచ్చు. దీంతో విచారణ ఆలస్యం అవుతుంది’’ అని అన్నారు సీతారామారావు.
మూడు దఫాలుగా సుదీర్ఘ కాలం ఏసీబీలో పనిచేసిన సీతారామారావు, తన ట్రాప్ కేసుల్లో ఏదీ వీగిపోలేదనీ, నూటికి నూరు శాతం కేసుల్లో శిక్ష పడ్డాయని చెప్పారు.
ట్రాప్ కేసుల్లో శిక్ష పడాలంటే కేసు చాలా పకడ్బందీగా ఉండాలి. సంఘటనా స్థలంలో మాట్లాడిన మాటలు, అక్కడి వాతావరణం వర్ణిస్తూ చార్జిషీటులో ఉండే వివరాల్లోని చిన్న చిన్న తప్పులు కూడా కేసు వీగిపోయేలా చేయవచ్చంటూ తన అనుభవాలు వివరించారు సీతారామారావు.
‘‘కోర్టులో ఒక ట్రాప్ కేసు విచారణ జరుగుతోంది. నేను సాక్షిని. ఆ ట్రాప్ జరిగి ఏళ్లు గడచిపోయాయి. విచారణ సందర్భంగా నిందితుడి తరపు లాయర్ నన్ను ప్రశ్నించారు. ఆ ఘటన జరిగిన ప్రాంతంలో ఒక గోడ ఉందా అని అడిగారు. ఎందుకంటే చార్జిషీటులో గోడ ప్రస్తావన ఉంది. ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన ఘటనలో తాను గోడ ఉందో లేదోనని చెప్పినదాన్ని బట్టి కేసు తలకిందలయ్యేది’’ అని అప్పటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారాయన.
కేసును ఎంత చిన్న అంశాలు ప్రభావితం చేస్తాయనడానికి ఇదో ఉదాహరణ. మొత్తానికి ఆ కేసు ఏసీబీయే గెలిచింది.
‘‘ఫిర్యాదు చేసే వారు చాలా కోపంతో కసితో వస్తారు. ఒక్కసారి ఆ అధికారిని ట్రాప్ చేశాక, ఫిర్యాదు చేసిన వ్యక్తి కోపం చల్లారిపోతుంది. దీంతో ఆ తరువాత కేసు విషయంలో ఫిర్యాదుదారు చురుగ్గా ఉండరు. ఏసీబీ సిబ్బందే ఫాలో అప్ చేయాలి. ఇదే పెద్ద సమస్య. అప్పట్లో ఈ సమస్య చూసి మా ఉన్నతాధికారులు ఒక మాట చెప్పేవారు. ఉద్యోగి దొరికిన తరవాత కూడా కేసు విషయంలో గట్టిగే ఉండేవారిని ఎంపిక చేసి అలాంటి వాటిపై దృష్టి పెట్టమనేవారు’’ అని సీతారామారావు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమాయకులు ఇబ్బంది పడుతున్నారా?
ఓ వైపు అవినీతి పరులు తప్పించుకుంటుంటే, మరోవైపు అమాయకులు కూడా ఏసీబీ కేసులతో ఇబ్బంది పడుతున్నారన్న వాదన కూడా ఉంది.
ఏసీబీ కూడా ప్రభుత్వం కిందే ఉంటుంది. దీంతో రాజకీయ ఉద్దేశాలతో కూడా ఏసీబీ దాడులు జరుగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి.
అధికారులు తమ మాట వినికపోయినా, వ్యతిరేకంగా ఉన్నా నాయకులు దాడులు చేయించిన ఉదంతాలూ ఉన్నాయి.
ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయనేది ఏసీబీ లెక్కించే పద్ధతిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు వంశపారంపర్యంగానో, పెళ్లి ద్వారానో వచ్చిన ఆస్తి, బంగారం విలువ భారీగా పెరుగవచ్చు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆస్తుల విషయంలో కూడా ఈ ఇబ్బంది ఉంటుంది. అటువంటి సమయాల్లో అది అవినీతి ద్వారా వచ్చింది కాదు అని నిరూపించుకోవడానికి చాలా సమస్య అవుతుంది.
రాజకీయ కుట్రలతో ఏసీబీ వలలో చిక్కుకుని, చివరకు లంచం ఇచ్చి బయట పడ్డ నిజాయితీ పరుల కేసులు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి.
‘‘ఏసీబీలోకి వచ్చే ఉన్నతాధికారులు బాగా పనిచేసినా, వారికి ఫ్రీ హ్యాండ్ ఉందా అన్నది మరో ప్రశ్న. అవినీతి బయటపెట్టిన వారికి ఎంత సేఫ్టీ ఉంటుంది?’’ అన్నారు శరత్ కుమార్.
ఉన్నతాధికారులకు కొందరని టార్గెట్ చేయాలన్న ఒత్తిళ్లు కూడా వస్తాయి.
నిజాయితీ పరులను టార్గెట్ చేసే పరిస్థితి రాకూడదంటే రాజకీయ జోక్యం తగ్గడంతో పాటూ, ఏసీబీకి స్వయం ప్రతిప్రత్తి ఉండాలంటారు సుదీర్ఘ కాలం లోక్ సత్తాలో పనిచేసిన కటారి శ్రీనివాస్.
‘‘ఏసీబీలో కూడా కొన్ని లోపాలున్నాయి. ఇటువంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థలాగా ఏసీబీని కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా చేయాలి’’ అని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏటేటా తమ ఆస్తిపాస్తులను రిటర్న్స్ రూపంలో చూపించాలి. కానీ అది జరగడం లేదు. నిజాయితీ పరులైన ఉద్యోగులు ఈ పనిచేస్తే వారికి ట్రాప్ కేసుల్లో కాకపోయినా, ఆదాయానికి మించిన ఆస్తుల కొంత ఊరట కలిగే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Acb
ఏసీబీతోనే అవినీతి అంతం అవుతుందా?
‘చట్టాల్లో ఉన్న లొసుగులు అవినీతి పెరగడానికి కారణమని అవినీతిపై పోరాటం చేస్తున్న కార్యకర్తలు అంటున్నారు.
భూముల చుట్టూ ఎక్కువ అవినీతి జరుగుతోంది. ఏసీబీ కేసుల్లో దొరికే వారిలో రెవెన్యూ సిబ్బందే ఎక్కువ.
‘‘భూముల ధరలు పెరిగే కొద్దీ ఇది పెరిగింది. భూమి పరిపాలనను క్రమబద్ధీకరించాలి. ఇక మిగిలిన సేవల విషయంలో సిటిజన్ చార్టర్ రావాలి. దాన్ని పక్కాగా అమలు చేయాలి. అవినీతి నిరోధక పోరాటంలో వచ్చిన బలమైన చట్టం ఆర్టీఐ. ఇక అనేక పశ్చిమ దేశాల్లో ఉన్నట్టుగా విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్, రివార్డులకు చట్టాలు రావాలి. అవినీతిని గురించి ఎవరైనా బయట పెడితే, వారికి రక్షణ కల్పించడం, వారికి నజరానా ప్రకటించడం ఉండాలి. లోక్‌పాల్ పూర్తిగా రాలేదు. లోకాయుక్త సమగ్రంగా లేదు. బ్యాకింగ్ తరహాలో అన్ని శాఖల్లో అంబుడ్స్‌మన్ వ్యవస్థ రావాలి. అధికార వికేంద్రీకరణ జరగాలి. టెక్నాలజీ వాడుకుని కంప్యూటరీకరణ జరగాలి. శిక్ష కచ్చితంగా పడుతుందన్న భయం రావాలి. ‘మీరు ఎటువంటి కేసు అయినా, ఎంత రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కేసు అయినా తీసుకురండి. నేను వారికి శిక్ష పడకుండా చూడగలను’ అని నాకు ఒక టీవీ చర్చలో సవాల్ విసిరారు ఒకాయన’’ అని అన్నారు శ్రీనివాస్.
‘‘ఏసీబీ కేసుల తీరు ఎలా ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆస్తులు జప్తు చేస్తారు. ఏమీ మిగలదు. జైలు శిక్షలు వేస్తారు. అనే భయం రావాలి. ఇప్పుడెలా ఉందంటే, ఓ పది కోట్లు తింటే ఉద్యోగం పోయినా ఫర్లేదనే పరిస్థితి వచ్చింది. ఆస్తి పోయి కుటుంబం రోడ్డున పడుతుంది అన్న భయం లేదు. జైలు శిక్ష చాలా వరకూ పడదు. పడినా వేగంగా ఉండదు’’ అని చెప్పారు శ్రీనివాస్.
‘‘ఎవరూ పుట్టుకతో అవినీతి పరులు కాదు. కానీ అవినీతి చేయని వాడిని చేతకాని వాడిగా చూస్తున్నారు. తోటి వారు అవినీతి చేసి సంపాదించడం చూసి మంచి వ్యక్తి కూడా మారిపోతాడు. నిజాయితీగా ఉండే వాడిని ఎగతాళి చేస్తున్నారు. ఆఖరికి కుటుంబం నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది’’ అన్నారు శరత్.
ఏసీబీ చిన్న వారిని వదిలేసి, పెద్ద లావాదేవీలపై ఫోకస్ పెట్టాలని ఆయన అంటారు.
రాజకీయ నాయకుల అవినీతి, ఉద్యోగ నియామకాల్లో, ఉద్యోగస్థుల రోజూవారీ పనుల్లో రాజకీయ జోక్యం తగ్గనంత కాలం అవినీతి తగ్గదని అందరూ అభిప్రాయపడ్డారు.
ఏసీబీ ఎలా మొదలైంది? ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతం ఏసీబీ 1988 నాటి అవినీతి నిరోధక చట్టం ప్రకారం పనిచేస్తుంది. దానికి 2008లో కొన్ని సవరణలు చేశారు.
నడిపించేది పోలీసులే అయినప్పటికీ, హోం శాఖ కింద కాకుండా సాధారణ పరిపాలన (సీఎం) విభాగం పరిధిలో ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1960 డిసెంబరులో ఉత్తర్వులు రాగా, 1961 జనవరి నుంచి ఏసీబీ ప్రారంభం అయింది.
ఇందులో పోలీసులే కాకుండా, అటవీ శాఖ, ఇంజినీరింగ్, రెవెన్యూ, టాక్సులు, అకౌంట్స్ నిపుణులూ ఉంటారు. ఆయా సబ్జెక్టుల వారీగా కేసులు అధ్యయనం చేయడానికి వీరు ఉంటారు.
సాధారణంగా ఏసీబీకి ఎవరిపైన అయినా ఫిర్యాదు వస్తే నేరుగా రంగంలోకి దిగకుండా ముందు కొంచెం ఆరా తీస్తారు.
రహస్య విచారణ తరువాత, ఉన్నతాధికారులు ఒక నిర్ణయం తీసుకుంటారు. అవినీతి తీవ్రత, ఉద్యోగ స్థాయి, కొన్ని చట్టపరమైన అంశాల ఆధారంగా వివిధ స్థాయిల్లోని ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
ఉదాహరణకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి స్థాయి అధికారులపై ఏసీబీ ముందుకు వెళ్లాలంటే ఛీఫ్ సెక్రటరీ అనుమతి తప్పనిసరి. స్థానిక సంస్థల అధిపతుల విషయంలో కూడా ప్రభుత్వ అనుమతి కావాలి.


ఇవి కూడాచదవండి:
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- వంట నూనెల్లో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఆలివ్ నూనె గుండెకు మేలు చేస్తుందా
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








