ఇరాన్ నుంచి కెనడాకు వలస వచ్చిన యువతి... ఆన్‌లైన్ వీడియో టెక్ సామ్రాజ్యాన్ని ఎలా జయించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆండ్రియాన్ విలియమ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలో ప్రముఖ వ్యాపారవేత్తల విజయాలను బీబీసీ వీక్లీ కార్యక్రమం 'ది బాస్' సిరీస్ ప్రచురిస్తుంది. అందులో భాగంగా ఇంటర్నెట్ వీడియో టెక్నాలజీ సంస్థ బ్రాడ్ బ్యాండ్ టీవీ (బీబీ టీవీ) అధినేత్రి షార్జాద్ రఫాతి తో మాట్లాడారు.
ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నప్పుడు షార్జాద్ రఫాతి వయస్సు కేవలం 13 ఏళ్లు.
ఆమె స్వదేశమైన ఇరాన్‌లో ఉంటే ఆమె కల నెరవేరదని కూడా ఆమెకి తెలుసు.
17 ఏళ్ల వయసులో వాంకోవర్ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఆమె తల్లితండ్రులను ఒప్పించి దేశాన్ని విడిచి వెళ్లారు.
కేవలం ఒక సూట్‌కేసుతో , అంతంత మాత్రమే మాట్లాడగలిగే ఇంగ్లీష్ పరిజ్ఞానంతో ఆమె 1996లో కెనడాలో అడుగు పెట్టారు.
"నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో కూడా సరిగ్గా చెప్పలేకపోయేదానిని. అదే నేను ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు. కానీ, నేను జీవితంలో విజయం సాధించాలనుకున్నాను” అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Shahrzad Rafati
40 సంవత్సరాల ఈ మహిళ నేడు బీబీటీవీ అధినేత. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వీడియోలు తయారు చేసే సంస్థలకు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇతర వెబ్ సైట్లు, యాప్స్ నుంచి ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు సహకరిస్తుంది.
2005 లో స్థాపించిన ఈ సంస్థకు నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్, సోనీ, వార్నర్ బ్రదర్స్, డిస్నీ లాంటి ప్రముఖ క్లయింట్లు ఉన్నారు. ఈ వ్యాపారం విలువ 6500 కోట్ల రూపాయలు (1 బిలియన్ డాలర్లు) ఉండవచ్చని కెనడా వార్తా పత్రికలు అంచనా వేశాయి.
వ్యాపారవేత్తలు ఎంత భారీగా వీలయితే అంత భారీగా ఆలోచించాలని ఆమె అన్నారు. షార్జాద్ వ్యాపారవేత్తల కుటుంబంలో 1979లో జన్మించారు. అప్పుడే ఇరాన్ విప్లవం మొదలైంది. ఆమె తల్లి వస్త్ర పరిశ్రమ నడిపేవారు. ఆమె తండ్రి రియాల్టీ వ్యాపారం చేస్తుండేవారు.
ఇరాన్ విప్లవం తర్వాత 1980 - 1988 వరకు చోటు చేసుకున్న ఇరాన్, ఇరాక్ యుద్ధం ఇరాన్ రాజధానిలో మనుగడ సాగించడం కష్టంగా మారింది. ఇరాకీ యుద్ధ విమానాల బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి ఆమె కుటుంబం ఒక చిన్న గ్రామానికి వెళ్లిపోయింది.
“ఇరాన్ 8 ఏళ్ల పాటు యుద్ధంతో అట్టుడికిపోయింది. దాంతో మా కుటుంబం ఎదుగుదల తగ్గిపోయింది. నాకు మరో కొత్త భవిష్యత్ అవసరమని నాకు తెలుసు, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండే జీవితాన్ని, అందరినీ సమానంగా చూసే జీవితాన్ని కోరుకున్నాను. టీనేజ్ వచ్చేసరికి నేను విదేశాలు వెళ్లాలని నిర్ణయించుకున్నాను.” అని ఆమె చెప్పారు.
ఆమె వాంకోవర్ లో బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదవడానికి చేరారు. ఆమెకు కంప్యూటర్ల గురించి ఏమి తెలియదు. ఆమె దగ్గర అప్పటికి కంప్యూటర్ కూడా లేదు. కానీ, ఆమెకు మ్యాథ్స్, టెక్నాలజీ అంటే ఆసక్తి.
2000 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత పారిస్ సోర్బోన్ యూనివర్సిటీ లో ఫ్రెంచ్ కోర్స్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కి చెందిన సైద్ బిజినెస్ స్కూల్ లో లీడర్‌షిప్ కోర్సు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పటికే, ఆపిల్ సంస్థ మ్యూజిక్ పరిశ్రమలోకి రావడం, ప్రజలు ఐపోడ్‌లో, ఐ ట్యూన్స్‌లో మ్యూజిక్ వినడాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పుడే త్వరలో వీడియో కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వస్తుందని ఆమె ఊహించారు.
"మ్యూజిక్ వాడకంలో చోటు చేసుకున్న మార్పులు వీడియో కంటెంట్ ఎటు వైపు వెళుతోందనడానికి సూచికగా నిలిచాయి" అని ఆమె అన్నారు.
"ఆడియో అప్పుడే మార్కెట్ లో మొదలవుతుండటంతో తర్వాత దశ వీడియో దేనని నాకర్ధమైంద"న్నారు.
25 ఏళ్ల వయసులో 2005లో బీబీటీవీ ని స్థాపించారు. అదే సంవత్సరంలో యూట్యూబ్ కూడా పుట్టింది.
తొలుత ఈ సంస్థ టెలివిజన్లో ఇంటర్నెట్ వీడియోలు చూసేందుకు అవసరమైన సెట్ టాప్ బాక్సులు తయారు చేసే సంస్థగా మొదలయింది. కానీ, అంతగా ప్రాచుర్యం పొందలేదు. అప్పటికే ప్రజలు వీడియోలు కంప్యూటర్లలో చూసేందుకు ఇష్టపడుతున్నారు.
మూడు నెలల్లోనే ఆమె కంపెనీ లక్ష్యాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. "తొందరగా విఫలమవ్వాలి. ఆ తప్పుల నుంచి త్వరగా నేర్చుకోవాలి” అని ఆమె అన్నారు. ఇంటర్నెట్ యూజర్లు వీడియోలను పైరేట్ చేసి యూట్యూబ్ లాంటి ఆన్లయిన్ ఫ్లాట్‌ఫామ్స్ మీద అప్లోడ్ చేయటాన్ని ఆమె గమనించారు.
కాపీ రైట్ హక్కులు కలిగిన ఆయా మూవీ, టీవీ కంపెనీలు ఆ వీడియోలను తొలగించడానికి విజ్ఞప్తులు చేసేవారు.
అప్పుడే ఆమెకు ఆ వీడియోలను తొలగించడానికి బదులు వాటి మీద వచ్చే ప్రకటనల ద్వారా ఆదాయం సంపాదించేలా చేయడానికి ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది.
ఇంటర్నెట్లో అప్లోడ్ అయిన వీడియోలను, స్పోర్ట్స్, సినిమా క్లిప్స్ వంటి వాటిని బీబీటీవీ సాఫ్ట్‌వేర్ ట్రాక్ చేస్తుంది.
ఇది ఆడియో, వీడియో రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి ట్రాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోలపై ప్రకటనలను జత చేస్తుంది.
దానిపై వచ్చే ఆదాయం ఆయా సంస్థలకు వెళుతుంది. అందులో కొంత భాగం బీబీటీవీ తీసుకుంటుంది.
బీబీటీవీ స్థాపించిన రెండేళ్లలోనే నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్‌ను క్లయింట్‌గా సంపాదించింది. "నేను 20 లలో ఉన్నాను. చాలా భయంగా ఉండేది. కానీ, నేనిచ్చే పరిష్కారాల మీద నాకు బాగా నమ్మకం ఉండేది” అని షార్జాద్ అన్నారు.
ఆమె వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఆమె చాలా మంది పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూరగొన్నారు. కెనడాలో టెక్నాలజీ వ్యాపారవేత్త హమీద్ షాబాజి ఆమె సంస్థలో పెట్టుబడిదారు. 2013లో ఆమె సంస్థలో 51 శాతం వాటాని యూరోపియన్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ ఆర్ టి ఎల్ కొనుక్కుంది. ప్రస్తుతం ఆర్ టి ఎల్ వాటా 57. 3 శాతానికి చేరింది.
ఆన్‌లైన్ వీడియోలు తయారు చేసేందుకు బీబీటీవీ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తుంది. ఆ సంస్థ సేవలు, కంపెనీలు, వ్యక్తులకు కూడా అందిస్తుంది. 2019లో వివిధ టెక్నాలజీలకు సంబంధించిన వీడియోలను 42,900 కోట్ల సార్లు చూసారని ఆ సంస్థ చెబుతోంది.

ఫొటో సోర్స్, BroadbandTV
"పరిశ్రమతో పాటు తనను తాను మార్చుకోవడం, మలుపు తిరగడమే షార్జాద్ వ్యాపార రహస్యం” అని మహిళా వ్యాపారవేత్తలకు సహకారం అందించే కెనడా సంస్థ విమెన్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్ ప్రధాన అధికారి స్టెఫానియా వరాలి అన్నారు.
"ఈ వ్యాపారంలో ముందుండడానికి ఆమె నిరంతరం తనని తాను మలచుకుంటూనే ఉన్నారు” అని ఆమె అన్నారు.
పురుషాధిక్యత ఉన్న పరిశ్రమలో ఒక మహిళా వ్యాపారవేత్తగా మిగిలిన వారి కంటే తాను ఎక్కువగా కష్టపడాల్సి వచ్చిందని షార్జాద్ అన్నారు. "తప్పు చేయడానికి నాకుండే అవకాశాలు తక్కువ" అని ఆమె అంటారు.
బీబీటీవీ స్థాపన ద్వారా ఆమె ఒక అంతర్జాతీయ వ్యాపారాన్ని నెలకొల్పాలనే ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. సంస్థలో పని చేసే 400 మంది ఉద్యోగులు వాంకోవర్, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ , ముంబయిలో ఉండే ఆఫీసులలో ఉంటారు.
తమ సంస్థలో పురుషులకు, స్త్రీలకు మధ్య వేతన వ్యత్యాసాలు లేవని , తమ సిబ్బందిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారని అందులో 46 శాతం మంది మేనేజర్లు గా ఉన్నారని చెప్పారు.
"ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది, మా విజయానికి ఇదే కారణం" అని ఆమె అంటారు.
ఇవికూడా చదవండి
- తెలంగాణలో జోగిని వ్యవస్థ: 'తండ్రి పేరు చెప్పలేక స్కూల్ మానేస్తున్నారు'
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- ఈ బిహార్ అమ్మాయి జీతం కోటి రూపాయలు
- హైపర్సోనిక్ ప్యాసింజర్ విమానాన్ని తయారు చేస్తున్న చైనా. ఎందుకు?
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
- #గమ్యం: పైలట్ కావాలని అనుకుంటున్నారా..
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- వండర్ గర్ల్ హిమాదాస్ పోలీసు స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది
- క్రికెట్ 'ఉక్కు మనిషి' సీకే నాయుడు
- భారత్: ‘ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశం‘
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- మొట్టమొదటి కేంద్ర బడ్జెట్: 'ఆకలి తీర్చుకునేందుకు విదేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








