అవంతి: ‘నచ్చినవాడిని పెళ్లి చేసుకుంటే ఇంత పెద్ద శిక్షా?’

హేమంత్, అవంతి
ఫొటో క్యాప్షన్, హేమంత్, అవంతి
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సెప్టెంబర్ 2020: ‘‘ఎవరి మధ్య పెరిగానో… వారే ఇంత అన్యాయానికి పాల్పడ్డారు. మాకంటే తక్కువ ఆస్తి ఉన్న వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మా కుటుంబానికి నచ్చలేదు’’ అని 23 ఏళ్ల అవంతి బీబీసీతో అన్నారు.

సెప్టెంబర్ 2018: ‘‘ప్రణయ్ ఎస్‌సీ కావడంతో నేను అతడిని మర్చిపోవాలని చెప్పారు. వారిని కాదని పెళ్లి చేసుకున్నందుకు నా తండ్రే నా భర్తను చంపించారు” అని సెప్టెంబర్ 2018లో బీబీసీతో మాట్లాడూతూ చెప్పారు అమృత.

సెప్టెంబర్ 2018: ‘‘నేను షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వాడిని కాబట్టి, నాకు ఆయన కూతురిని పెళ్లి చేసుకునే అర్హత లేదు అన్నారు. వారి మాట కాదని పెళ్లి చేసుకోవడంతో సొంత కూతురునే కత్తితో నరికాడు” అని బీబీసీతో అన్నారు సందీప్.

మే 2017: ప్రేమించి పెళ్లి చేసుకున్నఅంబోజి నరేశ్‌ను కన్నతండ్రే హతమార్చినందుకు 20 ఏళ్ల తుమ్మల స్వాతి ఉరి వేసుకొని చనిపోయారు. నరేశ్ షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తి.

ఈ ఘటనలన్నిటిలోనూ కులాంతర వివాహం చేసుకున్న జంటలపై కుటుంబ సభ్యులు దాడులు చేశారు. ఆ దాడుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు.

అవంతి తల్లితండ్రులను ఎదిరించి ప్రేమించిన హేమంత్‌ను జూన్ 10న పెళ్లి చేసున్నారు. సెప్టెంబర్ 24న అవంతి బంధువులు దంపతులు ఇద్దరినీ కిడ్నాప్ చేశారు. మరుసటి రోజున చేతులు కాళ్లు కట్టేసి, గొంతుకు తాడుతో ఉన్న హేమంత్ మృతదేహం సంగారెడ్డి దగ్గర పొలాల మధ్యలో కనిపించింది.

“మా పెళ్లయినప్పటి నుంచీ మా జీవితాలను ఎలా డిజైన్ చేసుకోవాలి. మా తల్లిదండ్రులు నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అనుకోవాలి అని ఆలోచించేవాళ్లం. ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండే వాళ్లం. కానీ మా కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయని నేను అనుకోలేదు” అన్నారు అవంతి.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 12 మంది అవంతి కుటుంబసభ్యులే.

“మా ప్రేమ గురించి నాన్నకు తెలియడంతో ఆయన నన్ను ఉద్యోగం మాన్పించి ఏడు నెలలపాటు ఇంట్లోనే బంధించారు. జూన్‌లో ఒక రోజు అవకాశం దొరకడంతో ఇంట్లో నుంచి తప్పించుకున్నా” అని అవంతి చెప్పారు.

“జూన్‌లో మేం పెళ్ళి చేసుకున్నాక పోలీసులను ఆశ్రయించాం. వారి సమక్షంలోనే రాజీకి వచ్చాం. నా పేరు మీద ఉన్న ఆస్తులను తిరిగి వారికే రాసేశాను కూడా. వాళ్లకు దూరంగా ఒక ఇల్లు తీసుకుని ఉంటున్నాం” అన్నారామె.

“వారిని కాదని నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాని మా అమ్మనాన్నలకు కోపం. అందుకే మేం అంతా చట్ట పరంగానే చేసుకోవాలనుకున్నాం. కానీ వాళ్లు మా ఇద్దరినీ బెదిరిస్తూనే వచ్చారు. మా వాళ్లు బాధపడ్డంలో తప్పు లేదు. కానీ, నాకు నచ్చినవాడిని పెళ్లి చేసుకున్నందుకు ఇంత శిక్షా?” అని బాధపడ్డారు అవంతి.

“ఆ రోజు మమల్ని కార్లో బలవంతంగా ఎక్కించారు. దారిమళ్లించినపుడు ఇద్దరం కార్లోంచి దూకేశాం. కొంత దూరం పరిగెత్తాం. రోడ్డు మీద ఉన్నవారిని సాయం అడిగాం. ఎవరూ ముందుకు రాలేదు. మమల్ని చంపేస్తారు సాయం చేయండని ప్రాధేయపడ్డాం. చివరకు ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు. కానీ, ఆ లోపే మావాళ్లు అక్కడికి వచ్చేశారు. హేమంత్‌ను లాక్కెళ్లారు. హేమంత్‌ను చూడటం అదే చివరిసారి” అని అవంతి చెప్పారు.

అవంతి, హేమంత్
ఫొటో క్యాప్షన్, అవంతి, హేమంత్

పోలీసుల జాప్యం?

పోలీసులు ఇంకొంత వేగంగా స్పదించి ఉంటే బాగుండేదని అవంతి అభిప్రాయపడ్డారు.

“అక్కడి నుంచే పోలీసులకు ఫోను చేశాను. వాళ్లు అక్కడికి రాగానే, మొదట గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయమన్నారు. తర్వాత దర్యాప్తు వేగవంతం చేశారు. వాళ్లు అక్కడకి వచ్చినప్పుడే అవుటర్ రింగ్ రోడ్ మీదున్న చెక్ పోస్టులకు సమాచారం అందించుంటే హేమంత్‌ను తీసుకెళ్తున్న కారును ముందే పట్టుకోడానికి అవకాశం ఉండేదేమో. పోలీసులు చేయగలిగింది చేశారు. కానీ ఇప్పుడు జాప్యం చేయకుండా నేరస్తులకు కఠినంగా శిక్ష పడేలా చూడాలని కోరుకుంటున్నా” అన్నారామె.

సైబరాబాద్ పోలీసులు అవంతి తండ్రి, మిగతా బంధువులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

“అవంతి, హేమంత్‌ల పెళ్ళి తర్వాత రెండు కుటుంబాలను కౌన్సెలింగ్ కోసం పిలిపించాం. సర్దుబాటు చేశాం. ఆ తర్వాత మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు” అని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ బీబీసీతో అన్నారు.

అయితే జూన్‌లోనే తన సొంత కుటుంబం నుంచి తమకు ప్రమాదం ఉందని అవంతి ఫిర్యాదు చేశారు. తండ్రి లక్ష్మా రెడ్డి, మిగతా బంధువుల నుంచి ప్రమాదం ఉందని. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయినా, తన ఫిర్యాదును పట్టించుకోలేదని కమిషనర్ సజ్జనార్‌కు ఇచ్చిన పిటిషన్‌లో అవంతి పేర్కొన్నారు.

ప్రణయ్, అమృత

ఫొటో సోర్స్, AMRUTHA.PRANAY.3/FACEBOOK

ఫొటో క్యాప్షన్, ప్రణయ్, అమృత

“అమృత విషయంలో జరిగిందే ఇప్పుడూ జరిగింది. కాకపోతే ఇక్కడ వాళ్ల ఈగో, హేమంత్ కుటుంబానికి పెద్దగా ఆస్తులు లేవనే అహంకారం ఉంది. అమృతతో మొదలైంది అవంతితో ముగిసిపోవాలని కోరుకుంటున్నా. కులాంతర వివాహం చేసుకునే వారికి రక్షణ కావాలి. న్యాయం జరగాలి” అన్నారు అవంతి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబర్ 2018లో 24 ఏళ్ళ పెరుమాళ్ల ప్రణయ్ కూడా ఇలాంటి కులాంతర వివాహం చేసుకున్నందుకు దారుణ హత్య గురయ్యాడు. గర్భంతో ఉన్న భార్య అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తుండగా ఓ దుండగుడు ప్రణయ్‌ను నరికి చంపాడు. దీన్ని కూడా కులహంకార హత్యగానే భావిస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ది షెడ్యూల్డ్‌ కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. అమ్మాయిది వైశ్య సామాజిక వర్గం. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి.

ప్రణయ్ హత్య సీసీటీవీ ఫుటేజ్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, ప్రణయ్ హత్య సీసీటీవీ ఫుటేజ్

తన మాట వినకుండా ప్రేమ పెళ్ళి చేసుకుందనే కక్షతో అమృత తండ్రి తిరునగరు మారుతిరావు కిరాయి హంతకులతో ప్రణయ్‌ని హత్య చేయించారన్న ఆరోపణలతో పోలీసులు ఆయన్ను ఏ1గా, అతడి తమ్ముడు శ్రవణ్‌ను ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది మార్చిలో మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రణయ్ హత్య కేసు విచారణ త్వరలో ప్రారంభం కాబోతోందని ప్రణయ్ కుటుంబం లాయర్ దర్శనం నరసింహ బీబీసీతో అన్నారు. కానీ, నిందితులకు శిక్ష పడటంలో ఇంత ఆలస్యం కూడా సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

తండ్రి మారుతిరావుతో అమృత

ఫొటో సోర్స్, AMRUTHA.PRANAY.3/FACEBOOK

ఫొటో క్యాప్షన్, తండ్రి మారుతిరావుతో అమృత

“ప్రణయ్ కేసులోనే చూడండి.... ఈ కేసు చూసే ఎస్సీ, ఎస్టీ కోర్టులో జడ్డి లేరు. ఫ్యామిలీ కోర్టులో వాదనలు జరిగాయి. కానీ ఆ కోర్టుకు ఉన్న కేసుల తాకిడి ఎక్కువ. ప్రణయ్ తండ్రి బాలాస్వామి హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత కేసులో పురోగతి వచ్చింది. ఈ లోపు మారుతీరావు చనిపోయారు. ఆ తర్వాత కోవిడ్ వల్ల కోర్టులో కేసు వాయిదా పడుతూనే వస్తోంది” అని చెప్పారు.

రెండేళ్లు దాటినా హత్య కేసులో నిందితులకు శిక్ష పడలేదు. ఏ2 శ్రవణ్ బెయిలుపై బయటికి వచ్చారు.

ప్రణయ్ హత్య జరిగిన కొన్ని రోజులకే హైదరాబాద్‌లో మరో తండ్రి ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురిని పట్టపగలే వేట కొడవలితో నరికాడు.

బీసీ కులానికి చెందిన మాధవి షెడ్యూల్డ్‌ కులానికి చెందిన సందీప్ ప్రేమించుకున్నారు. సెప్టెంబర్ 2018లో పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

కానీ, కొద్ది రోజులకే మాధవి తండ్రి మనోహరాచారి తన కూతురు షెడ్యూల్డ్‌ కులానికి చెందిన సందీప్‌ను పెళ్లి చేసుకుందనే కోపంతో కూతురినే నరికాడని ఎస్ఆర్ నగర్ పోలీసు తెలిపారు.

వెంటనే ఆస్పత్రిలో చేర్పించడంతో మాధవి ప్రాణాలతో బయటపడ్డారు. మనోహరాచారిని అరెస్టు చేశారు. కోర్టులో కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ ప్రాంతం
ఫొటో క్యాప్షన్, దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ ప్రాంతం

“దిశ తరహాలో చట్టం రూపొందించాలి”

సరైన చట్టాలు లేకపోవడం, కోర్టు విచారణలో ఆలస్యం వల్ల, ఇలాంటి కేసుల్లో శిక్ష పడిన దాఖలాలు అరుదుగా ఉండడం ఇలాంటి నేరాలకు కారణమని అమృత లాయర్ నరసింహ అంటున్నారు.

“కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ అందించడానికి దిశ తరహా చట్టం అవసరం. ఏళ్ల తరబడి కేసు కోర్టులో కొనసాగడం వల్ల ఉపయోగం ఏముంది? దిశ చట్టంలో ఉన్నట్లు 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలి. కులాంతర వివాహం చేసుకుని బెదిరింపులు ఎదుర్కుంటున్న వారికి రక్షణ కల్పించేలా చట్టం రూపొందించాలి. ఇలాంటి నేరాలు జరగకూడదు అంటే కేసు విచారణ వేగంగా జరిగేలా చూడాలి” అంటారు నరసింహ.

పోలీసులు విచారణ సరిగా చేస్తున్నారా. లేక పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా పర్యవేక్షించేందుకు అవకాశం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కులాంతర వివాహం చేసుకున్న వారు సాధారణంగా పోలీసులను ఆశ్రయించినప్పుడు కుటుంబసభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తాం అంటున్నారు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్.

“మైనర్లు అయితే తల్లి తండ్రులకు అప్పగిస్తాం. మేజర్లు అయితే కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి సర్దుబాటు చేస్తాం. మేజర్లు కాబట్టి వారి నిర్ణయానికి అడ్డు చెప్పలేరని తల్లి తండ్రులకు వివరిస్తాం. కానీ, బెదిరించడం లేదా వారికి హాని తలపెట్టే అవకాశం ఉన్నప్పుడు కేసు నమోదు చేస్తామ”ని ఆయన వివరించారు.

కానీ, అవంతి తమకు ప్రమాదం ఉందని ఫిర్యాదులో రాశారు. తనకు, హేమంత్ అమ్మనాన్నలకు రక్షణ కల్పించాలని కోరారు. కానీ, లాభం లేకపోయింది. అమృత, ప్రణయ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. మాధవి-సందీప్ పోలీసులను ఆశ్రయించినా జరిగింది అదే.

అందుకే మహిళా కమిషన్ లాంటి, చట్టబద్దమైన సంస్థలు పటిష్టంగా పని చేయడం అవసరం. ఈ సంస్థలు ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా చట్టాల కోసం ప్రాతినిథ్యం వహించాల్సిన అవసరం ఉందంటున్నారు కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు సీఎల్ఎన్ గాంధీ.

“భారత దేశంలో శిక్షా విధానంలో నిందితుడి నేరం నిరూపించే బాధ్యత ప్రాసిక్యూషన్ పై ఉంటుంది. అలా కాకుండా నేరం చేయలేదని నిరూపించే బాధ్యత నిందితులపై ఉండాలి. అలాగే నిర్ణీత గడువులో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలి. ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కులాంతర వివాహం చేసుకొని కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న వారి రక్షణ కోసం ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్లతో ఎన్నో సార్లు తెలంగాణ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ఎలాంటి స్పందన రాలేద”ని ఆయన అన్నారు.

కులాంతర వివాహం కానీ, మతాంతర వివాహం కానీ చేసుకున్న వారికి రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని భరోసా కల్పించాలని గాంధీ అంటున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)