హాథ్‌రస్ కేసు: బాధితురాలి జననావయవంలో వీర్యం ఆనవాళ్లు ఉంటేనే అత్యాచారం జరిగినట్టా - ఫ్యాక్ట్ చెక్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ
‘హాథ్‌రస్’ కేసులో దళిత యువతిపై అత్యాచారం జరగలేదని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్టును ఉటంకిస్తూ చెప్పారు.
“ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ప్రకారం బాధితురాలి శరీరం లోపలి అవయవాలలో వీర్యం ఆనవాళ్లు లేవు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం దాడి తరువాత గాయాల వల్లే ఆమె చనిపోయారు. అధికారుల దీనిని ప్రకటించిన తర్వాత కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు” అని ఉత్తరప్రదేశ్ శాంతిభద్రతల ఏడీజీ ప్రశాంత్ కుమార్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు.
“తప్పుడు వార్తలతో కులాల మధ్య గొడవలు సృష్టించేందుకు ఇలా చేస్తున్నారని స్పష్టమవుతోంది. మొదటి నుంచీ ఈ కేసును వేగంగా దర్యాప్తు చేశాం. ఇకపై కూడా చట్టప్రకారమే దర్యాప్తు జరుగుతుంది” అన్నారు.
ఈ ప్రకటన తర్వాత యూపీ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితురాలి ఫోరెన్సిక్ రిపోర్టును ఇప్పటికీ బయటపెట్టలేదు. అయితే, యూపీ పోలీసులు మాత్రం బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ప్రకటించారు.
మహిళ శరీరంలో వీర్యం ఆనవాళ్లు గుర్తించనపుడు మాత్రమే భారత శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం కేసు నమోదు చేస్తారా?

అత్యాచారం గురించి భారత చట్టాలు ఏం చెబుతున్నాయి
1860లో అత్యాచారాన్ని నేరంగా చెబుతూ భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లో దానికి సంబంధించిన సెక్షన్లను చేర్చారు.
ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం, ఒక వ్యక్తి ఎవరైనా మహిళతో ఈ కింద ఇచ్చిన పరిస్థితుల్లో సంభోగానికి పాల్పడ్డట్టయితే దాన్ని రేప్‌గా వ్యవహరిస్తారు.
1) మహిళ ఇష్టానికి విరుద్ధంగా
2) మహిళ అనుమతి లేకుండా
3) మహిళను చంపేస్తామని లేదా హాని చేస్తామని లేదా ఆమె దగ్గరివారికి ఎవరికైనా ఏమైనా చేస్తామని భయపెట్టి ఆమెను సంభోగానికి ఒప్పిస్తే.
4) మహిళ సెక్స్‌కు అంగీకరించిన సమయంలో ఆమె మానసిక స్థితి సరిగా లేనట్టయితే, లేదా ఆమెపై మత్తు పదార్థాల ప్రభావం ఉంటే, జరుగుతున్నదేంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో సదరు మహిళ ఉంటే.
అయితే.. మహిళ ఏదైనా కోరికతోగానీ, చంపేస్తారని లేదా గాయపరుస్తారనే భయంతో కానీ సంభోగానికి సమ్మతి తెలిపితే, అలాంటి పరిస్థితిలో జరిగిన సంభోగం కూడా అత్యాచారం కిందికే వస్తుంది.
ఏ వయసు మహిళనైనా సరే పైన చెప్పకొన్న పరిస్థితుల్లో ఆమె శరీరంలో (యోని లేదా మలద్వారం) ఎవరైనా వ్యక్తి తన శరీరంలోని ఏ భాగాన్ని జొప్పించినా అది రేప్ అవుతుంది.
పైన చెప్పిన పరిస్థితుల్లో ఓరల్ సెక్స్ చేసినా కూడా రేప్ అవుతుంది.
సెక్షన్ 376 ప్రకారం అత్యాచారం కేసుల్లో 10 ఏళ్ల నుంచి జీవితఖైదు వరకూ శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి.
2012లో నిర్భయ గ్యాంగ్‌రేప్ ఘటన తర్వాత భారత్‌లో అత్యాచారం, లైంగిక హింసకు సంబంధించిన చట్టాల్లో భారీ మార్పులు జరిగాయి. వాటిలో అత్యాచారం, లైంగిక హింస నిర్వచనం పరిధిని పెంచారు.
జస్టిస్ జె.ఎస్.వర్మ సిఫారసుల తర్వాత పార్లమెంట్ 2013లో క్రిమినల్ లా(సవరణ) చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం అత్యాచారం కేసుల్లో మరణ శిక్ష విధించే నిబంధనను కూడా చేర్చారు.
అత్యాచారం కేసులో బాధితురాలు చనిపోతే, లేదా అచేతనావస్థకు చేరుకుంటే దానికి గరిష్ఠంగా మరణశిక్ష విధించే నిబంధన ఉంది.
దీనితోపాటూ ఈ చట్టం తర్వాత ఒక మహిళను వెంటాడడం, ఆమెను అదేపనిగా చూస్తుండడం లాంటి వాటిని కూడా నేరాల శ్రేణిలోకి చేర్చారు.

వీర్యం లేకపోతే అత్యాచారం కాదా?
అత్యాచారం కేసును నిరూపించడానికి మహిళ శరీరంలో వీర్యం ఉండాల్సిన అవసరం లేదని దిల్లీ హైకోర్టులో క్రిమినల్ లాయర్ జయంత్ భట్ చెబుతున్నారు.
“బాధితురాలి శరీరంలో వీర్యం గుర్తించడం గురించి హైకోర్టులు, సుప్రీంకోర్టు చాలా తీర్పులు కూడా ఇచ్చాయి. వీటిలో వీర్యం ఉండడం, లేకపోవడం అనేది ముఖ్యమని న్యాయస్థానాలు భావించలేదు. నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసు తర్వాత చట్ట సవరణల వల్ల అత్యాచారం నిర్వచనాన్ని చాలా విస్తృతపరిచారు.
ఇప్పుడు వజైనల్ పెనిట్రేషన్ మాత్రమే అత్యాచారంగా భావించరు. ఎలాంటి పెనిట్రేషన్ అయినా సెక్షన్ 375, 376 కిందికే వస్తుంది. వాటిలో వేలును చొప్పించడం కూడా ఉంది” అన్నారు.
పర్మిందర్ అలియాస్ లడకా పోలా వర్సెస్ దిల్లీ ప్రభుత్వం(2014) కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో అత్యాచారం జరిగిందని నిరూపించడానిక వీర్యం ఆనవాళ్లు ఉండాల్సిన అవసరం లేదని దిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

బాధితురాలు సెప్టెంబర్ 22న స్పృహలోకి వచ్చిన తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిందని, తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పిందని హాథ్‌రస్ ఎస్పీ విక్రాంత్ వీర్ చెప్పారని ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక రాసింది.
హాథ్‌రస్ కేసులో అత్యాచారం జరిగిందా, లేదా అనేదానిపై పోస్టుమార్టం, ఎఫ్ఎస్ఎల్ లేదా విసరా రిపోర్టులను పక్కన పెడితే, బాధితురాలి వాంగ్మూలం విషయానికే వస్తే, దానికి ఎంత విలువ ఇచ్చారు?
సమాధానంగా “ఎవరైనా ఒక బాధితురాలు చనిపోవడానికి ముందు మేజిస్ట్రేట్ ముందు ఇచ్చే చివరి వాంగ్మూలాన్ని మరణ వాంగ్మూలంగా భావిస్తారు. నేను వాదించిన అలాంటి కేసుల్లో ఎక్కువగా కోర్టు బాధితురాలి చివరి వాంగ్మూలాన్నినిజమైన వాంగ్మూలంగా కోర్టు భావించింది. మనిషి తన చివరి సమయంలో అబద్ధం చెప్పడని భావిస్తారు. ఈ వాంగ్మూలం కూడా ఈ కేసులో చాలా కీలకం అని నిరూపితం కాబోతోంది” అని జయంత్ భట్ చెప్పారు..
“ఈ కేసును గ్యాంగ్‌రేప్‌గానే చూడకూడదు. ఎందుకంటే ఇందులో హత్య కేసు కూడా ఉంది. ఈ కేసులో మరణశిక్ష విధించే నిబంధన కూడా ఉంది” అంటారు జయంత్ భట్.
యూపీ పోలీసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును బట్టి ఈ ప్రకటన చేసుండవచ్చు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా బయటపెట్టలేదు. అందులో దీనిని అత్యాచారంగా ధ్రువీకరించారా, లేదా అనేది తెలుస్తుంది.
అయితే, బీబీసీ ఫ్యాక్ట్ చెక్ పరిశీలన ప్రకారం అత్యాచారం కేసులో శరీరంలో వీర్యం ఆనవాళ్లు ఉండాల్సిన అవసరం లేదని తేలింది.
ఇవి కూడా చదవండి:
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








