వరల్డ్ మ్యూజిక్ డే: బొబ్బిలి వీణ.. బిల్‌క్లింటన్ మెచ్చిన ఈ వాద్య పరికరం ఎందుకంత ప్రత్యేకం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వి.
- హోదా, బీబీసీ కోసం
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ సామగ్రికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం 2020లో నిర్ణయించింది.
ఆ సందర్భంగా కొన్ని స్థానిక ఉత్పత్తులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. అందులో బొబ్బిలి వీణ కూడా ఒకటి.
సంగీత సాధనలో ప్రత్యేకమైన వీణల తయారీకి బొబ్బిలి గుర్తింపు పొందింది.
తమిళనాడులోని తంజావూరు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలికి ఆ కీర్తి దక్కింది.
ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు(జీఐ ట్యాగ్) కూడా దక్కింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లాలవారీ ప్రత్యేకతల్లోనూ విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణకు చోటు ఇచ్చారు.
ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
బొబ్బిలిలో వీణల తయారీ ఎలా ప్రారంభమైంది? ఇప్పుడు ఎలా సాగుతోందనే అంశాలపై బీబీసీ పరిశీలన చేసింది.

బిల్ క్లింటన్ ఆశ్చర్యం
బొబ్బిలి వీణలకు ఇప్పటికే అనేక జాతీయ అవార్డులు వచ్చాయి. 1980లోనే ఈ వాద్యానికి జాతీయ అవార్డు దక్కింది. అంతకుముందే, సర్వసిద్ధి వీరన్న అనే కళాకారుడి ప్రతిభను గుర్తించి, వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా అవార్డు ప్రకటించారు.
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు.
2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఆనాటి ప్రదర్శనలో ఉంచిన బొబ్బిలి వీణ చూసి ఆయన మురిసిపోయారు.
జ్ఞాపికగా అందించిన చిన్న వీణను చూసి తయారీదారుడు సర్వసిద్ధి వెంకట రమణను ప్రత్యేకంగా అభినందించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు రావలసిందిగా కూడా ఆహ్వానించారు.
సంగీత ప్రముఖులు కూడా బొబ్బిలి వీణలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. బొబ్బిలి వీణలపై ధ్వని, స్పష్టత ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఈమని శంకరశాస్త్రి, చల్లపల్లి చిట్టిబాబు వంటి ఎందరో వైణిక విద్వాంసులు బొబ్బిలి వీణల వినియోగానికి మొగ్గు చూపేవారు.
అనేక మంది సంగీత విద్వాంసులు నేటికీ బొబ్బిలి వీణలపై ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు.

మైసూరు రాజా సంస్థానంలో..
మూడు శతాబ్దాల క్రితం బొబ్బిలి పాలకులు మైసూరు పర్యటనకు వెళ్లిన సందర్భంలో వీణా కచేరీ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా బొబ్బిలి పాలకుడు పెదరాయుడు వాటివైపు మొగ్గు చూపారు.
వెంకటగిరి రాజు 15వ వారసుడైన బొబ్బిలి రాజ్య వ్యవస్థపాకుడు పెద్ద రాయుడికి కళలపై ఉన్న ప్రేమ మూలంగా బొబ్బిలిలో వీణల తయారీకి శ్రీకారం పడిందని చెబుతుంటారు.
తన సంస్థానంలో సిద్ధహస్తులైన ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించి, అక్కడి వీణల తయారీ నేర్చుకోవాలని పెద్దరాయుడు సూచించారు. ఆయన సూచనలతో అక్కడికి వెళ్లి వచ్చిన వారితో బొబ్బిలి వీణల తయారీ మొదలైంది.
నాటి మైసూరు సంస్థానంలోని తంజావూరులో ఈ వీణల తయారీ గురించి తెలుసుకున్న సర్వసిద్ధి అచ్చెన్న బొబ్బిలి తిరిగి వచ్చిన తర్వాత తయారుచేసిన వీణలు మంచి ఆదరణ పొందాయి. ఆ వీణల వాయిద్యం నేర్చుకుని తన ఆస్థానంలో సంగీత కచేరీ నిర్వహించిన బొబ్బిలి రాజులు ఎంతో మురిసిపోయినట్టు చెబుతారు.
ఆ తర్వాత విజయనగర ఆస్థానం సహా అనేక మంది రాజులు కూడా బొబ్బిలి వీణల కొనుగోలుకి సిద్ధం కావడంతో ఆదరణ పెరిగింది. క్రమంగా బొబ్బిలి వీణలకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది.

ఏడు తరాల ప్రస్థానంలో ఎన్నో మార్పులు
తంజావూరు ప్రాంతంలో తయారు చేసిన వీణలు మూడు కొయ్యలతో కలిపి చేసేవారు. కానీ వాటిని భిన్నంగా ఏకాండముక్కతో వీణలు రూపొందించిన బొబ్బిలి కళాకారులు ఆదరణ పొందారు.
ఇతర ప్రాంతాల్లో వీణలకు వాడే తీగలను ఇత్తడితో తయారుచేస్తుంటారు. కానీ బొబ్బిలి వీణలకు మాత్రం కంచు వాడుతున్నట్టు తయారీదారులు చెబుతున్నారు.
సర్వసిద్ధి కుటుంబ వారసులు ఏడు తరాలుగా వీణలో తయారీలోనే తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం ఎనిమిదో తరంలో కూడా కొందరు వీణల తయారీలో సాగుతున్నారు.
తరతరాలుగా ఒకే కుటుంబం నుంచి వీణలు తయారుచేస్తుండడం విశేషంగానే చెప్పవచ్చు. అది తమకు గర్వకారణం కూడా అంటారు సర్వసిద్ధి అచ్యుత నారాయణ.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''మా ముందు తరాలు ఎంతో శ్రమించి వీణల తయారీ నేర్చుకున్నారు. మా తరంలో వీణల ద్వారానే బొబ్బిలికి గుర్తింపు వచ్చింది. తెలుగు నాట వీణ అంటే బొబ్బిలి వైపు అందరూ చూసేలా చేశాం. వీణల తయారీలోనే ప్రత్యేకత ఉంటుంది. వీణ ధ్వని, బేస్ ఎక్కువగా ఉండేలా తీగల నిర్మాణం ఉంటుంది. వీణల తయారీ కళాకారులకు ఎప్పుడూ లాభదాయకంగా లేదు. అయినప్పటికీ కుటుంబ పోషణకు లోటు లేకుండా గడిపేశాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొత్త తరం అభిరుచులు మారడంతో వీణా వాయిద్యానికి ఎక్కువ మంది మొగ్గుచూపడం లేదు. దాంతో తయారీదారులకు సమస్యలు పెరుగుతున్నాయి''అని ఆయన వివరించారు.
వాటికే ప్రాధాన్యం
సంగీత కళాకారులకు తగ్గట్టుగా బొబ్బిలిలో 9 అంగుళాలు, 13 అంగుళాలు, 18 అంగుళాల సైజులలో వీణలు తయారు చేస్తారు. కొన్ని సార్లు 24 అంగుళాల పొడవు ఉన్న వీణలు కూడా తయారు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఇలాంటి పెద్ద వీణలకు ఆదరణ కనిపించడం లేదు. దాంతో చిన్న వీణల వైపు మొగ్గుచూపుతున్నారు.
నమూన వీణల తయారీకే ఇప్పుడు ఆదరణ ఉందని కళాకారుడు సర్వసిద్ధి చైతన్య తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ''చిన్న వీణలను చాలామంది కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. వాటిని జ్ఞాపికలుగా అందించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నెలకు 300 వరకూ చిన్న వీణలను తయారుచేస్తున్నాం.
వాటిని లేపాక్షి ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మాకు ఒక్కో చిన్న వీణకు రూ. 630 ఇస్తారు. వాటికి అద్దాలతో బాక్స్ కూడా తయారుచేసి రూ.900కు లేపాక్షి ద్వారా మార్కెట్లో అమ్ముతున్నారు.
అయితే కరోనా సమయంలో లేపాక్షి వ్యాపారం ఆగిపోయింది. దీంతో మాకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. తయారుచేసిన వీణలు కూడా అమ్ముడుపోకపోవడంతో నిల్వ చేసుకోవాల్సి వచ్చింది'' అంటూ వివరించారు.

ప్రభుత్వ సహకారం లేదు..
బొబ్బిలి వీణలకు అనేక రకాల గుర్తింపు లభించినప్పటికీ తయారీదారుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రభుత్వాల నుంచి తమకు తగిన సహకారం లభించడం లేదని వారు వాపోతున్నారు. హస్తకళలకు ప్రాధాన్యమిస్తున్నట్టు మాటల్లో చెప్పడమే తప్ప ఆదరణ లేదని అంటున్నారు.
వీణల తయారీదారులంతా కలిసి 1959 లోనే శారదా వీణా సొసైటీని ప్రారంభించారు. సొసైటీ ద్వారా కొంత ప్రయోజనం దక్కినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. చివరకు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1994లో క్రాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ (సిడిసి) ఏర్పాటు చేశారు. తొలుత అది బొబ్బిలి కోట వద్ద నిర్వహించారు. తరువాత దానిని బొబ్బిలి పట్టణ శివారు గొల్లపల్లిలో ఉన్న శాశ్వత భవనానికి మార్చారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల కళాకారులను, వృత్తిదారులను ఆదుకుంటున్నప్పటికీ వీణల తయారీదారులకు సహకారం అందించడం లేదని సర్వసిద్ధి రామకృష్ణ అంటున్నారు. దీంతో కొత్తతరం వీణల తయారీకి సిద్ధపడడం లేదని చెబుతున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''మా జీవితాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. అది గమనించిన కొత్తతరం ఏదో వృత్తి చేసుకుంటాం గానీ వీణల తయారీతో జీవితాలు ఎదురీదలేం అంటున్నారు.
కళాకారుడిగా తృప్తిలేని జీవితాలు మావి. ఒకనాటితో పోలిస్తే రాబడి బాగా తగ్గిపోయింది. ప్రభుత్వం దృష్టిలో వీణల కళాకారులున్నట్టు కనిపించడం లేదు. అందుకే ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఒకనాడు 80 మంది వరకూ ఉన్న కళాకారులు ఇప్పుడు 40 మందికి పడిపోయాం. అంతర్జాతీయ స్థాయిలో మాకు గుర్తింపు ఉంది. కానీ మాకు కడుపులు నిండడం లేదు. అందుకే యువతరం మొగ్గుచూపడం లేదు. భవిష్యత్తులో ఈ వృత్తి నిలబడాలంటే ప్రభుత్వాలు చేయూతనివ్వాలి''అని ఆయన అన్నారు.
బొబ్బిలి పట్టణంతో పాటుగా బాడంగి మండలంలోని వాడాడలో కూడా కొన్ని కుటుంబాలు తరతరాలుగా ఇదే వృత్తిలో సాగుతున్నాయి.

కలప సమస్యతో కలవరం
ప్రస్తుతం వీణల తయారీకి ఎక్కువగా పనస చెట్టు కలప వాడుతున్నారు. తంజావూరు ప్రాంతంలో తయారయ్యే వీణలకు భిన్నంగా బొబ్బిలి వీణలుండడానికి పనస చెట్టు కలప కూడా ఓ కారణంగా చెబుతున్నారు. అయితే పనస కలప సేకరణ తయారీదారులకు పెద్ద సమస్య అవుతోంది. వీణల తయారీలో అతి పెద్ద పెట్టుబడి కలప కోసమే.
ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని గ్రామాల నుంచి బొబ్బలికి వచ్చే వ్యాపారుల నుంచి పనస కలపను తయారీదారులు కొనుగోలు చేస్తున్నారు. సుమారు 20 ఏళ్ల పైబడిన పనస చెట్టు కలప అయితే నాణ్యమైన వీణలు తయారు చేయవచ్చని చెబుతున్నారు.
ప్రస్తుతం తగినంత నాణ్యమైన కలప లేకపోవడంతో ఏకాండ వీణల తయారీ తగ్గిపోయిందని అచ్యుత నారాయణ అంటున్నారు. కలప వల్ల చాలా సమస్యను ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం రాయితీపై పనస కలప అందిస్తే మాకు ఉపయోగం ఉంటుంది. కలప సేకరణ కోసమే ఎక్కువ శ్రమించాల్సి వస్తోంది. ఇలాంటి అనేక సమస్యల మధ్య వీణల తయారు సాగుతోంది. కొత్తతరం ఇతర వ్యాపకాల వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో అరుదైన కళను కాపాడుకోవడానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.

శాస్త్రీయ సంగీతాభిలాష తగ్గుతోంది
బొబ్బిలి వీణలకు ఆదరణ తగ్గడం, తయారీదారుల వారసులు ఇతర రంగాల వైపు మళ్లుతుండడానికి అనేక కారణాలున్నాయని సంగీత కళాకారుడు సురేష్ నిఖిలం అంటున్నారు. సంగీత కళాశాల నిర్వహణలో వీణా వాయిద్యం వైపు ఎక్కువ మంది రావడం లేదని ఆయన అనుభవపూర్వంగా చెబుతున్నారు. తెలుగు వారి కీర్తిని పెంచడంలో బొబ్బిలి వీణలకు ప్రాధాన్యం ఉందని, సంగీత ప్రపంచంలో వాటి కీర్తిని కాపాడుకోవాలని ఆయన అంటున్నారు.
''బొబ్బిలి వీణలకు చాలా ప్రాధాన్యం ఉంది. పరిమాణం చిన్నదిగా ఉంటుంది. కేసింగ్ చాలా సన్నగా ఉంటుంది. నాణ్యమైన ధ్వని వినిపిస్తుంది. కానీ ప్రస్తుతతరం శాస్త్రీయ సంగీతానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మారిన సామాజిక నేపథ్యం దానికి కారణం. విద్యాపరమైన ఒత్తిడి పెరగడంతో ఇలాంటి వాటికి చోటు లేకుండా పోతోంది. అందులోనూ వీణ వాయిద్యంలో ప్రావీణ్యం రావాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే యువత ఇతర వాద్యాల వైపు మొగ్గుచూపుతున్నారు'' అని ఆయన అన్నారు.

లేపాక్షి ద్వారా ప్రచారం చేయాలి..
బొబ్బిలి వీణలపై ప్రచారంలో లేపాక్షి సంస్థ మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బొబ్బిలికి చెందిన సంగీత కళాకారాడు పైడి నరసింహనాయుడు అంటున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''లేపాక్షి నుంచి కళాకారుల బిల్లుల విడుదలలో జాప్యం నివారించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. లేపాక్షి ద్వారా రాష్ట్రమంతా ప్రచారం చేయాలి. స్థానిక కళాకారులు చేస్తున్న హస్తకళలకు ఆదరణ పెంచేందుకు దోహదపడితే మేలు జరుగుతుంది. అరుదైన కళను కాపాడుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చేదోడుగా నిలిస్తే కళాకారులు మరింత ఉత్సాహంగా మెరుగైన వీణలు తయారీ చేస్తారు''అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









