రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది

ఫొటో సోర్స్, Facebook/ Upasana Konidela
- రచయిత, పెదగాడి రాజేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టినట్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి వెల్లడించింది.
పాప బొడ్డు తాడు రక్తాన్ని (అంబిలికల్ కార్డ్ బ్లడ్‌ను) ఓ ప్రైవేటు సంస్థ వద్ద భద్రపరుస్తున్నట్లు ఉపాసన ట్వీట్ చేశారు.
బాలీవుడ్ నటీమణులు కాజోల్, శిల్పా శెట్టిలతోపాటు నటుడు మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కూడా అప్పట్లో తమ పిల్లల అంబిలికల్ కార్డ్ బ్లడ్‌ను ఇలానే భద్రపరిచారు.
ఇంతకీ అంబిలికల్ కార్డ్ బ్లడ్ ప్రిజర్వేషన్ (బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరచడం) అంటే ఏమిటి, దీన్ని ఎందుకు భద్రపరుస్తారు? వివరాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1. బొడ్డు తాడు అంటే ఏమిటి?
తల్లి కడుపులోని బిడ్డ బొడ్డును ప్లసెంటా(మాయ)తో అంబిలికల్ కార్డు (బొడ్డు తాడు) అనుసంధానిస్తుంది. దీని ద్వారానే బిడ్డకు ఆక్సిజన్, గ్లూకోజ్ లాంటివి అందుతాయి.
బొడ్డు తాడులో రెండు రక్త నాళాలు (ఒక ధమని, ఒక సిర) ఉంటాయి. వీటిలోని ధమని బిడ్డ నుంచి యూరియా, కార్బన్ డైఆక్సైడ్‌లను తల్లి రక్తనాళాలకు చేరవేస్తుంది.
మరోవైపు సిర ద్వారా ఆక్సిజన్, ఇతర పోషకాలు బిడ్డకు చేరుతాయి.
ప్రసవం అనంతరం కడుపులో బిడ్డ బయటకు వచ్చినప్పటికీ.. బొడ్డు తాడు ద్వారా బిడ్డ ప్లసెంటాకు అనుసంధానమై ఉంటుంది.
బిడ్డను ప్లసెంటా నుంచి వేరుచేయడానికి బొడ్డు తాడును కత్తిరించి ముడివేస్తారు. దీన్నే అంబిలికల్ కార్డు క్లిపింగ్ అంటారు.
ముడి అనంతరం బిడ్డ బొడ్డుకు అనుసంధానమై ఉండే మిగిలిన చిన్న బొడ్డు తాడు ఐదు నుంచి 15 రోజుల్లో ఎండిపోయి నల్లగా మారుతుంది. ఇది దానికదే ఊడిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
2. ఇది ఎందుకంత ముఖ్యం?
అయితే, శిశువు పుట్టిన తర్వాత కూడా బొడ్డు తాడు, ప్లసెంటాలో కొంత రక్తం మిగిలి ఉంటుంది. దీన్నే కార్డ్ బ్లడ్ అంటారు.
ఒకప్పుడు ప్లసెంటాతోపాటు ఈ బొడ్డు తాడును వ్యర్థాలుగా పరిగణించేవారు. కానీ, వీటిలో హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ (హెచ్ఎస్‌సీ) లేదా హెమటోపోయిటిక్ ప్రొజెనిటర్ సెల్స్(హెచ్‌పీసీ) ఉంటాయని పరిశోధనల్లో రుజువైంది.
ఇలాంటి స్టెమ్ సెల్స్ (మూలకణాలు) బొడ్డు తాడుతోపాటు ఎముకల్లోనూ కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
3. ఈ స్టెమ్ సెల్స్‌ను ఏం చేస్తారు?
ప్రసవానంతరం బొడ్డు తాడు, ప్లసెంటాలలోని మూల కణాలను భద్రపరచడాన్నే ‘‘కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్’’గా పిలుస్తున్నారు.
కొన్ని రకాల వ్యాధుల చికిత్సల్లో ఈ కణాలు ఉపయోగపడే అవకాశం ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) చెబుతోంది.
లుకేమియా, తలసీమియా, సికెల్ సెల్ అనీమియా, మయలోమాస్, లింఫోమా లాంటి వ్యాధులపై కొన్ని చికిత్సలు దీనికి ఉదాహరణగా పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
4. ఎలా భద్రపరుస్తారు?
ఒకసారి బొడ్డుతాడు, ప్లసెంటాల నుంచి రక్తాన్ని సేకరించిన తర్వాత దాన్ని వీలైనంత వేగంగా ల్యాబొరేటరీలకు తరలిస్తారు.
అక్కడ దీనికి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులో కనిష్ఠ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేస్తారు.
ఈ రక్త కణాలను నిల్వ చేసేందుకు ప్లాస్మా డిప్లీషన్ (పీడీ) టెక్నాలజీని ఉపయోగిస్తారు. అంటే రక్తంలోని ప్లాస్మాని తొలగించి రక్త కణాలన్నింటినీ జాగ్రత్తగా భద్రపరుస్తారు.

ఫొటో సోర్స్, Alamy
5. ఎంత ఖర్చు అవుతుంది?
బొడ్డు తాడులోని రక్తాన్ని భద్రపరిచేందుకు ఒక్కో సంస్థ ఒక్కోలా ధర నిర్ణయిస్తున్నాయి. ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలు భద్రపరచుకోవాలని అనుకుంటున్నాం? అనే అంశం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఉదాహరణకు 25 ఏళ్లు భద్రపరిచేందుకు స్టెమ్ సైట్ సంస్థ రూ. 55 వేలు తీసుకుంటోంది. అదే 75 ఏళ్లకు అయితే, ఇది రూ.70 వేల వరకూ ఉంది.
దీనికి అదనంగా చికిత్సల కోసం కావాలంటే ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
6. దానం చేయొచ్చా?
అయితే, ఈ కార్డ్ బ్లడ్‌ను భవిష్యత్‌లో పిల్లలకు వచ్చే వ్యాధుల కోసం దాచిపెట్టుకునేకంటే దానంచేస్తే మంచిదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) సూచిస్తోంది.
‘‘ఈ కార్డ్ బ్లడ్ సెల్స్‌కు ఇతర రక్తకణాలుగా మారే శక్తి ఉంటుంది. కాబట్టి రక్తం ద్వారా వచ్చే కొన్ని రుగ్మతలు, ఇమ్యునో డిఫీషియన్సీలు, మెటబాలిక్ డిసీజెస్, కొన్ని రకాల క్యాన్సర్‌లపై చికిత్సలో ట్రాన్స్‌ప్లాంట్లకు ఇవి ఉపయోగపడతాయి’’ అని ఏఏపీ చెబుతోంది.

ఫొటో సోర్స్, Facebook/ Upasana Konidela
7. ఏమైనా దుష్ప్రభావాలు ఉండొచ్చా?
అయితే, ఇలా బోడ్డు తాడు నుంచి రక్తాన్ని సేకరించడంతో పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండకపోవచ్చని డాక్టర్ ప్రతిభా లక్ష్మి చెప్పారు.
‘‘దుష్ప్రభావాలైతే ఉండవు. ఎందుకంటే ప్లసెంటా, బొడ్డు తాడుల నుంచి ఆ రక్తాన్ని సేకరిస్తారు’’అని ప్రతిభా లక్ష్మి అన్నారు. ఆమె మాటలతో డాక్టర్ పి. శిరీష కూడా ఏకీభవించారు.
కానీ, ‘‘ఆ రక్తం నుంచి సేకరించిన కణాల సాయంతో చికిత్సలు చేయడంతో ఓ వ్యక్తికి ఏదైనా వ్యాధి నయమైనట్లు ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించలేదు. బహుశా ఎక్కడో ఒకరిద్దరికి దీనితో మేలు జరిగి ఉండొచ్చు. కానీ, చాలా మంది విషయంలో ఇది ఒక బిజినెస్‌లా మారిపోయింది’’ అని శిరీష అన్నారు.
8. ఎంతవరకు ఉపయోగం ఉంటుంది?
ఇలా కార్డ్ బ్లడ్‌ను భద్ర పరచుకోవడంతో మనకు ఎంతవరకు ప్రయోజనం ఉంటుందనే అంశంపై డాక్టర్ ప్రతిభా లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘తోబుట్టువులు లేని వారికి ఇది ఉపయోగపడొచ్చు.
ఎందుకంటే తోబుట్టువులు ఎవరైనా ఉంటే మనం వారి దగ్గర నుంచి బ్లడ్ సెల్స్‌ను తీసుకోవచ్చు. మిగతవారి విషయానికి వస్తే, ప్రస్తుతం ఇక్కడ పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చనే చెప్పాలి.
ఎందుకంటే రక్తకణాలకు సంబంధించిన రుగ్మతలు అరుదుగా వస్తుంటాయి. మీరు దీని కోసం వెచ్చించే డబ్బుతో పోల్చినప్పుడు దీని నుంచి వచ్చే ప్రయోజనాలు అంత ఎక్కువగా ఉండకపోవచ్చు’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఫ్రాన్స్: తప్పుడు ప్రకటనలతో ఫాలోయర్లను నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు, ఎలా అడ్డుకట్ట వేశారంటే....
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















