మాతృత్వం: ‘మా అమ్మ వయసు 50 ఏళ్లయితే మాత్రం.. రెండవ బిడ్డను కనడానికి ఎందుకు సిగ్గుపడాలి?’

ఆర్య పార్వతి

ఫొటో సోర్స్, ARYA PARVATHY

ఫొటో క్యాప్షన్, తల్లి దీప్తితో ఆర్య.. ఆమె తనకు 23 ఏళ్ల తరువాత తోబుట్టువు రాబోతున్నారని చాలా సంతోషంగా ఉన్నారు
    • రచయిత, కె. శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఒక రోజు అమ్మ, నాన్న నాకు ఫోన్ చేసి ఏడ్చారు. కొన్ని నెలలలుగా నీ దగ్గర ఒక రహస్యం దాచిపెట్టాం. అది నీకు చెప్పాలి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. కానీ, ఆ నిజం తెలిశాక చాలా సంతోషించాను" అన్నారు ఆర్య పార్వతి.

కేరళకు చెందిన 23 ఏళ్ల ఆర్య మోహినీయాట్టం కళాకారిణి. ఆమె తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె.

కానీ, ఇప్పుడు ఆర్య అక్క కాబోతున్నారు. ఆమె తల్లి దీప్తి 48 సంవత్సరాల వయసులో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

"23 ఏళ్ల తరువాత నాకు తోబుట్టువు రాబోతోంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఓ అక్కగా, ఓ తల్లిగా వాళ్లకు ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్లకు తోడుగా నిలబడతాను" అని ఆర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తల్లిదండ్రులతో ఆర్య పార్వతి

ఫొటో సోర్స్, ARYA PARVATHY

ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రులతో ఆర్య పార్వతి

'మేమెందుకు సిగ్గుపడాలి?'

ఆర్య పోస్ట్ వైరల్ కావడంతో, 24 ఏళ్ల తరువాత మళ్లీ తల్లి కాబోతున్న దీప్తి గురించి కేరళ మీడియాలో చాలా చర్చ జరిగింది.

చాలామంది ఆర్య కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ, వయసు 50 కి చేరువ అవుతుంటే, మళ్లీ పిల్లని కనడం ఏమిటంటూ పలువురు విమర్శించారు.

"మనమెందుకు సిగ్గుపడాలి? ఎవరేమనుకున్నా, ఈ ప్రేమ కానుకను సాదరంగా ఆహ్వానిస్తున్నాం" అన్నారు ఆర్య.

ఈ విషయమై ఆర్య తల్లి దీప్తి మాట్లాడుతూ, "నేను గర్భవతినని తెలియకుండానే చాలా ప్రయాణాలు చేశాను. నా కూతురికి బిరుదు ఇచ్చారు. అది చూడ్డానికి చెన్నై వెళ్లాను. తర్వాత గురువాయూర్‌ గుడికి వెళ్లాను. మొదట్లో నాకు ఏ లక్షణాలు కనిపించలేదు. అందుకే నాకు తెలియలేదు" అని చెప్పారు.

ఆర్య పార్వతి ప్రస్తుతం బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో చదువుతున్నారు. అంతకుముందు మలయాళంలో కొన్ని సీరియల్స్‌లో నటించారు.

మోహినీయాట్టం ప్రదర్శన కోసం పలు ఊర్లు తిరగాల్సి రావడంతో సొంతూరు వెళ్లి, తల్లిదండ్రులను కలిసి అయిదు నెలలు పైనే అయిందని ఆమె చెప్పారు.

చాలా రోజుల తరువాత సెలవులు లభించడంతో ఇంటికి బయలుదేరారు. ఆ మాట చెప్పడానికి తల్లిదండ్రులకు ఫోన్ చేసినప్పుడే తాను అక్క కాబోతున్న సంగతి తెలిసింది.

"కొన్ని నెలలుగా ఒక నిజాన్ని నీ దగ్గర దాచాం. మమ్మల్ని అపార్థం చేసుకోకు. మీ అమ్మ మళ్లీ తల్లి కాబోతోంది.. దీప్తి 8 నెలల గర్భవతి" అని ఆర్య తండ్రి శంకర్ ఫోన్‌లో చెప్పారు.

కూతురితో మాట్లాడుతూ దీప్తి ఫోన్‌లోనే కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

"ఆ వార్త విని ఆశ్చర్యపోయాను. కానీ అది ఆనందంతో కూడిన ఆశ్చర్యం" అన్నారు ఆర్య.

"చిన్నతనంలో తోబుట్టువులు లేరని చాలా బాధపడేదాన్ని. నాకు తమ్ముడో, చెల్లో ఉంటే బావుంటుందని అనుకునేదాన్ని. ఇన్నేళ్ల తరువాత ఆ కోరిక తీరుతుందని ఊహించలేదు. ఇది నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది" అన్నారామె.

"నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే ఇంటికి వస్తున్నా" అని తల్లిదండ్రులకు చెప్పి, సొంతూరు ఎర్నాకుళానికి బయలుదేరారు ఆర్య.

తల్లిదండ్రులతో ఆర్య పార్వతి

ఫొటో సోర్స్, ARYA PARVATHY

తల్లి మానసిక పోరాటం

ఆర్య ఇంటికివెళ్లి గర్భవతి అయిన తన తల్లిని కౌగలించుకుని, ముద్దుపెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ వైరల్ అయింది.

ఈ విషయం తెలిస్తే ఆర్య ఏమనుకుంటోందని భయపడ్డాం అన్నారు దీప్తి.

"అయిదు నెలల వరకు నాకు గర్భం సంగతి తెలియలేదు. తరచూ కడుపునొప్పి లాగ వచ్చేది. పీరియడ్స్ ఆగిపోతే మెనోపాజ్ అనుకున్నా. అదే మాట నా కూతురు ఆర్యతో చెప్పాను.

ఒకసారి నేను, నాభర్త గురువాయూర్ గుడికి వెళ్లాం. అప్పుడు నాకు ఆరోగ్యం పాడవ్వడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాం.

అప్పటికే నేను 24 వారాల గర్భవతినని తెలిసింది. కొన్ని నెలల ముందు మాకు అనుమానం వచ్చింది కానీ, అది అసంభవం అని కొట్టిపారేశాం.

నా కూతురు నా గురించి ఏమనుకుంటుందోనని చాలా ఆందోళన పడ్డాం. కానీ, ఆర్య దాన్ని పాజిటివ్‌గా తీసుకుంది. ఎంతో సంతోషించింది. అది నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది" అని చెప్పారు దీప్తి.

ఆర్య

ఫొటో సోర్స్, ARYA PARVATHY

“నా మొదటి డెలివరీ చాలా కష్టమైంది. కాన్పు తరువాత 10 నెలలు మంచాన పడాల్సి వచ్చింది. అందుకే అప్పుడు మరో బిడ్డ వద్దనుకున్నాం.

కానీ, ఈ వయసులో మళ్లీ గర్భం దాల్చడం, వయసు, సామాజిక సమస్యల కారణంగా ఈ విషయాన్ని బయటకుచెప్పవద్దని డాక్టర్లు గట్టిగా చెప్పారు.

ఇంట్లో పని కోసం మనిషిని పెట్టుకుందాం అనుకున్నాం. కానీ, ఆమెకు తెలిసిపోతుంది అని ఆ ఆలోచన విరమించుకున్నాం" అని దీప్తి తాను పడిన మానసిక వేదనను వివరించారు.

అయితే, ఆర్య దీన్ని చాలా పాజిటివ్‌గా తీసుకోవడంతో వారి భయాలు తొలగిపోయాయి. తమకు రెండో బిడ్డ పుట్టబోతోందని హాయిగా బయటకు చెప్పుకున్నారు.

"ఆర్య నా ప్రపంచం. ఆమెను చూసుకోవడం కోసం నేను నా ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆమె కోసమే జీవించాను. బట్టలు కొనుక్కోవాలనుకున్నా, బెంగళూరు నుంచి కేరళ వచ్చి, నన్ను తీసుకుని షాపింగ్‌కు వెళుతుంది. నాతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా తీసుకుంటుందోనని భయపడ్డాను. అదే మాకు అతిపెద్ద ఒత్తిడిగా మారింది.

మా ఆయన రోజూ ఉద్యోగానికి బయటికెళ్లే సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒత్తిడి మరింత ఎక్కువగా ఉండేది. ఆర్యకు చెప్పాల్సి వచ్చినప్పుడు పెద్ద మానసిక పోరాటమే జరిగింది. కానీ, ఆర్య ఈ విషయాన్ని చాలా మామూలుగా తీసుకున్నప్పుడు నా మనసులోంచి పెద్ద బరువు తొలగిపోయినట్లు అనిపించింది" అన్నారు దీప్తి.

ఇప్పుడు దీప్తి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తనకు చెల్లెలు పుట్టినందుకు పెద్ద పార్టీ చేసుకోవాలని ఆర్య నిర్ణయించుకున్నారు.

కానీ, కొందరు ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తున్నారు. అన్నిటికీ ఆర్య ఒకటే సమాధానం ఇస్తున్నారు.

"నా తల్లి మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఆమె జీవితం. ఆమె ఇష్టం. ఇన్నేళ్ల తరువాత నాకు చెల్లెల్లు పుట్టింది. ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. ఎవరేమనుకున్నా మేం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాం" అంటున్నారామె.

ఇవి కూడా చదవండి: