IWD2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఊదా రంగును ఎందుకు ధరిస్తారు...

పర్పుల్, ఊదారంగు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ వేడుక ప్రారంభించి శతాబ్దం దాటింది. దీనికి పునాది 1908లోనే పడినా, 1975 నుంచి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది.

నేడు అధికంగా ఊదారంగును ధరిస్తారు.

ఊదారంగు (పర్పుల్), ఆకుపచ్చ, తెలుపు మహిళా దినోత్సవం రంగులని ఇంటర్నేషనల్ వుమెన్స్ డే (IWD) వెబ్‌సైట్ చెబుతోంది.

"ఊదారంగు న్యాయానికి, గౌరవానికి ప్రతీక. ఆకుపచ్చ ఆశాదృక్పథాన్ని సూచిస్తుంది. తెలుపు స్వచ్ఛతకు ప్రతిరూపం (ఇది వివాదాస్పద భావన అయినప్పటికీ). ఈ రంగులు 1908లో బ్రిటన్‌లోని వుమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ (WSPU)లో పుట్టుకొచ్చాయని" చెబుతున్నారు.

పర్పుల్, ఊదారంగు

ఫొటో సోర్స్, Getty Images

2023 IWD థీమ్ ఏంటి?

2023 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి నినాదం "డిజిట్ఆల్: జెండర్ సమానత్వం కోసం ఆవిష్కరణలు, సాంకేతికత".

టెక్నాలజీ, ఆన్‌లైన్ విద్యకు మహిళలు అందిస్తున్న సహకారాన్ని గుర్తించడం, సెలబ్రేట్ చేసుకోవడం ఈ థీమ్ లక్ష్యం.

అలాగే, ఈ ఏడాది డిజిటల్ రంగంలో మహిళల పట్ల అసమానతను గుర్తించే ప్రయత్నం చేస్తుంది ఐడబ్ల్యూడీ.

మహిళలు ఆన్‌లైన్ ప్రపంచానికి దూరంగా ఉండడం వలన 2025 నాటికి దిగువ, మధ్య ఆదాయ దేశాల స్థూల జాతీయోత్పత్తికి 1.5 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఐరాస అంచనా వేసింది. దీనికి గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇదే కాకుండా, మరికొన్ని థీమ్స్ కూడా ఉన్నాయి.

#EmbraceEquity అనేది కూడా 2023లో మహిళా దినోత్సవ నినాదం. అంటే సమానత్వం, సమదృష్టితో అందరినీ కలుపుకోవడం.

"మహిళల విషయంలో మూస పద్ధతులు, వివక్ష, పక్షపాత ధోరణిని గుర్తించి, దాన్ని అధిగమిమించి అందరినీ కలుపుకుంటూ ముందుకు పోవడం" లక్ష్యంగా ఉండాలని ఐడబ్ల్యూడీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

పర్పుల్, ఊదారంగు

ఫొటో సోర్స్, Getty Images

ఇది ఎందుకు అవసరం?

గత ఏడాది కాలంగా అఫ్గానిస్తాన్, ఇరాన్, యుక్రెయిన్, అమెరికా వంటి అనేక దేశాలలో మహిళలు తమ దేశాలలో జరుగుతున్న యుద్ధం, హింస, ప్రభుత్వ విధానాలలో మార్పుల మధ్య హక్కుల కోసం పోరాడుతున్నారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత మహిళలు తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోంది. ఆడపిల్లలకు ఉన్నత విద్య, ఉద్యోగాలు దూరమయ్యాయి. మగ తోడు లేకుండా ప్రయాణాలు చేయకూడదని, తప్పనిసరిగా బుర్ఖా వేసుకోవాలన్న ఆంక్షలు కఠినమయ్యాయి.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌లో 22 ఏళ్ల మహసా అమీని మృతితో నిరసనలు వెల్లువెత్తాయి. 2022 సెప్టెంబర్ 13న తలపై బుర్ఖా వేసుకోలేదని మహసా అమీని అనే మహిళను ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల తరువాత ఆమె చనిపోయారు. అప్పటి నుంచి ఇరాన్‌లో నిరసన జ్వాలలు రగులుకున్నాయి.

ఆ దేశంలో ఆడ, మగ కూడా మహిళల హక్కుల కోసం, సమానత్వం కోసం పోరాడుతున్నారు. రాజకీయ మార్పు రావాలని డిమాండ్ చేస్తున్నారు. "మహిళలు, జీవితం, స్వేచ్ఛ".. ఇదీ ఇరానీయుల నినాదం. నిరసనలను ప్రభుత్వం "అల్లర్లు" అని చెబుతోంది. ఈ గొడవల్లో కనీసం 500 మంది పౌరులు చనిపోయారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలై ఏడాది దాటింది. 2022 ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైంది. ఈ సమయంలో జెండర్ అసమానతలు, ఆహార అభద్రత, పోషకాహారలోపం, పేదరికం, లింగ వివక్ష, మహిళలపై హింస పెరిగిపోయాయని ఐరాసా చెబుతోంది. ఈ యుద్ధం కారణంగా ధరలు పెరిగిపోవడం, కొరత వల్ల ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా జెండర్ అసమానతలు, వివక్ష, పేదరికం వంటివి పెరిగిపోయాయని పేర్కొంది.

అమెరికాలో 2022 జూన్ 4న అబార్షన్ హక్కుల చట్టాన్ని రద్దు చేశారు. ఆ దేశంలోనూ, ఇతర దేశాలలోనూ నిరసనలు ఎగిశాయి. అబార్షన్ల కోసం అమెరికన్ మహిళలు పక్క దేశాల బాట పట్టారు.

మహసా అమీని

ఫొటో సోర్స్, Mahsa Amini family

ఫొటో క్యాప్షన్, మహసా అమీని

అయితే, గత కొన్నేళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా మహిళల విషయంలో కొంత ముందడుగు కనిపిస్తోంది.

2022 నవంబర్‌లో యూరోపియన్ పార్లమెంటు ఒక ముఖ్యమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది. జూలై 2026 నాటికి పబ్లిక్‌గా వ్యాపారం చేసే కంపెనీల బోర్డులలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికోసం గత పదేళ్లుగా అక్కడ పోరాటం జరుగుతోంది.

మరోవైపు, అర్మేనియా, కొలంబియా దేశాలలో పేరెంటల్ లీవ్ చట్టాలు మెరుగుపడ్డాయి. స్పెయిన్‌లో మహిళలకు పీరియడ్ లీవ్ మంజూరు అయింది.

మహిళా క్రీడాకారులు

ఫొటో సోర్స్, Getty Images

2022 బీజింగ్ ఒలింపిక్స్‌లో మహిళా ప్రాతినిధ్యం విశేషంగా పెరిగిందని, 45 శాతం మహిళా అథ్లెట్లు పాల్గొన్నారని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. అయితే, ఇంకా కొన్ని అసమానతలు తొలగిపోలేదు. ఆ దిశగా మార్పులు తీసుకొచ్చేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించారు.

2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్‌ను విస్తరిచారు. ఇందులో 36 జట్లు పాల్గొననున్నాయి. అమెరికా సోకార్ ఫెడరేషన్ పురుషులకు, మహిళా క్రీడాకారులకు సమానంగా వేతనాలు చెల్లించాలని తీర్మానించింది.

వీడియో క్యాప్షన్, సెక్స్ సామర్థ్యం సున్తీ చేసుకుంటే పెరుగుతుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)