కరోనావైరస్ 'మహిళల సమానత్వాన్ని' పాతికేళ్లు వెనక్కి నెట్టేస్తుందా?

టెనీ డైరీలోని చిత్రం
ఫొటో క్యాప్షన్, టెనీ డైరీలోని చిత్రం
    • రచయిత, శాండ్రిన్ లుంగుంబు, అమెలియా బటర్లీ
    • హోదా, బీబీసీ 100 వుమెన్

మహిళ సమానత్వం కోసం గత పాతికేళ్లుగా చేస్తూ వచ్చిన కృషి అంతా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని ‘యూఎన్ విమెన్’ కొత్తగా సేకరించిన సమాచారం సూచిస్తోంది.

కోవిడ్ మహమ్మారి మొదలైన దగ్గర నుంచీ మహిళలకు ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు గణనీయంగా పెరిగాయి.

"25 ఏళ్లుగా కష్టపడి సాధించిన సమానత్వం ఒక్క ఏడాదిలోనే కోల్పోయేలా ఉన్నాం" అని యూఎన్ విమెన్ డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనితా భాటియా అంటున్నారు.

విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోవడమే కాకుండా మహిళల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బ తినే అవకాశాలున్నాయి.

"మహిళలపై పడుతున్న కుటుంబ సంరక్షణ భారం మళ్లీ 1950ల నాటి మూస పద్ధతులకు ఆజ్యం పోసేలా ఉంది" అని భాటియా అభిప్రాయపడ్డారు.

అయితే, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకముందు కూడా ప్రపంచవ్యాప్తంగా జీతం భత్యం లేని రోజువారీ ఇంటిపనుల్లో మూడొంతుల పని మహిళలే చేస్తున్నారని అంచనా.

అంటే, ఒక పురుషుడు రోజులో ఒక గంటపాటూ ఇంటి పని చేస్తుంటే, ఒక స్త్రీ మూడు గంటలు ఇంటి పని చేస్తోంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పని చేస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.

"ఇంతకుముందు స్త్రీలు, పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ ఇంటిపని చేస్తుంటే, ఇప్పుడు ఆ సంఖ్య కనీసం రెట్టింపయి ఉంటుందని కచ్చితంగా చెప్పగలను" అని భాటియా తెలిపారు.

యూఎన్ విమెన్ చేసిన 38 సర్వేలూ దిగువ, మధ్య ఆదాయ దేశాలపై ఎక్కువగా దృష్టి పెట్టినా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోందని డాటా చెబుతోంది.

"చాలామంది మహిళలు తిరిగి ఉద్యోగాలకు వెళ్లట్లేదు. ఇది పెద్ద ప్రమాద సూచిక" అని భాటియా తెలిపారు.

"సెప్టెంబర్ నెలలో మాత్రమే యూఎస్‌లో సుమారు 8,65,000 మంది స్త్రీలు ఉద్యోగాలు మానేశారు. కానీ, పురుషులు 2,00,000 మంది మాత్రమే ఉద్యోగాలు వదిలి పెట్టారు. దీన్నిబట్టి మహిళలపై కుటుంబ భారం పెరుగుతున్నదని చెప్పవచ్చు" అని అమె అన్నారు.

స్త్రీలు ఉద్యోగాలు మానేసి, కెరీర్ విమెన్‌గా కాకుండా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటిపట్టునే ఉండాల్సి వస్తే మహిళల శ్రేయస్సు, ఆర్థికంగా సాధించిన పురోగతి, స్వాతంత్ర్యం కుంటుపడతాయని యూఎన్ వుమెన్ హెచ్చరిస్తోంది.

మహమ్మారి సమయంలో మహిళలపై పని భారం పెరగడం గురించి 'బీబీసీ 100 విమెన్' ఒక ముగ్గురు మహిళలతో మాట్లాడింది.

24 గంటల్లో వాళ్లు చేస్తున్న పనులన్నిటినీ ఒక డైరీలో రాసి పెట్టమని అడిగారు.

టెనీ వాడా

ఫొటో సోర్స్, TENI WADA

ఫొటో క్యాప్షన్, టెనీ వాడా

"నా శక్తికి మించి పని చేస్తున్నాను"

జపాన్‌లో మహమ్మారికి ముందు కూడా మహిళలు, పురుషలకన్నా సగటున ఐదు రెట్లు ఎక్కువగా ఇంటి పని, కుటుంబ సంరక్షణ భాధ్యతలు నిర్వహిస్తున్నారు.

లాక్‌డౌన్‌కు ముందు టెనీ వాడా టోక్యోలో ఒక బ్రాండ్ కన్సల్టంట్‌గా ఉంటూ, నర్సరీ టీచర్‌గా పార్ట్-టైం జాబ్ చేస్తున్నారు.

"ఇప్పుడు తెల్లారి 5.00 అయ్యింది. ఈ ఆర్టికల్ పూర్తి చెయ్యాడానికి ప్రయత్నిస్తున్నాను. డెడ్‌లైన్‌కు ఇంకా టైం ఉందిగానీ నేను ముందే పూర్తి చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను. నేనొక తల్లిని. పిల్లలతో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అనుకోని విధంగా ఏదైనా జరిగి ఈ ఆర్టికల్ పూర్తి చెయ్యలేకపోతే నాకు అందవలసిన డబ్బు అందదు" అని టెనీ వాడా తన డైరీలో రాసుకున్నారు.

ఇంటి పనులు, మూడేళ్ల తన పాపకు ఇంట్లోంచే స్కూలు, వంట పని, బట్టలు ఉతికి, మడతలు పెట్టడం...వీటన్నిటి మధ్య తనకు టైమే దొరకట్లేదని టెనీ అంటున్నారు. కాస్త సమయం చేజిక్కుంచుకోవడం గగనమైపోయిందని అంటున్నారు.

డెలీనా

ఫొటో సోర్స్, ESPERANZA BOLIVIA

ఫొటో క్యాప్షన్, డెలీనా

లాక్‌డౌన్‌లో టెనీ, తన భర్త..ఇద్దరూ కూడా ఇంటినుంచే పని చేస్తున్నారు కానీ, వారిద్దరి పనితీరు, బాధ్యతలు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.

"తాను ఉదయం 9.30 నుంచీ సాయంత్రం 5 లేదా 6.30 గంటల వరకూ ఆఫీసు పని చేస్తారు. ఆ సమయంలో ఒక గదిలోకి వెళిపోయి, తలుపులేసుకుని కూర్చుని తన పని మీద దృష్టి పెట్టగలుగుతారు. కానీ, నాకు ఆ అదృష్టం లేదు. నేను ఇంటి పనులు చేసుకుంటూ ఆఫీస్ వర్క్ చేసుకోవాల్సి వస్తోంది. ఇది అన్యాయమని నాకు అనిపిస్తూ ఉంటుంది" అని టెనీ తెలిపారు.

80% ఇంటి పని తనే చేస్తున్నానని, పిల్ల స్కూలు బాధ్యత కూడా తనే తీసుకుంటున్నానని టెనీ తెలిపారు.

"మొదటి రెండు మూడు నెలలూ పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. రోజూ నా శక్తికి మించి పని చేసేదాన్ని. నా కూతురు ఏడుపు మొదలెట్టేది. నేను కూడా ఏడుస్తూ కూర్చునేదాన్ని" అని ఆమె గుర్తు చేసుకున్నారు.

"పని భారం పెరిగి మహిళల్లో తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండడం గమనిస్తున్నామని" యూఎన్ వుమెన్‌లో చీఫ్ స్టాటిస్టీషియన్‌గా పని చేస్తున్న పాపా సెక్ అంటున్నారు.

" అంతకుముందు మొత్తం పనంతా నేను ఒక్కర్తినే చెయ్యాల్సి వచ్చింది"

డెలీనా వెలాస్క్వెజ్ బొలీవియాలోని టరిజా నగరానికి చెందిన ఒక రైతు.

ఆమె రోజూ తెల్లవారి 5.00 గంటలకు లేచి పని ప్రారంభిస్తారు. వ్యవసాయం, ఇంటి పనుల మధ్య తన సమయం గడిచిపోతుంది. రెండు నెలలకోకసారి నగరంలో ఉన్న రైతుబజారుకు వెళ్లి తను పండించిన కూరగాయలన్నీ అమ్ముకుని వస్తారు.

"ఇంటి పని కూడా తోడవ్వడంతో, నర్సరీలో పని చేసి త్వరగా అలిసిపోతున్నాను. ప్రస్తుతం మా అమ్మాయి నాకు సహాయం చేస్తోంది. తను నాకు కుడి భుజంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇంటి పనిలోనూ, పొలం పనుల్లో కూడా మా అమ్మాయి నాకు చాలా సహాయం చేస్తోంది" అని డెలీనా తెలిపారు.

మగవాడు సంపాదించేవాడని, ఆడది ఇంటి పనులు చెయ్యాలని, కూతుళ్లు ఇంటి పనులు నేర్చుకుంటూ తల్లులకు సహాయం చెయ్యాలనే సంప్రదాయబద్దమైన నియమాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.

అయితే, లాక్‌డౌన్‌లో తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నందుకు డెలీనా సంతోషంగానే ఉన్నారు.

"అంతకుముందు నా గ్రీన్‌హౌస్‌లో అన్ని పనులూ నేనొక్కర్తినే చేసుకుంటూ ఉండేదాన్ని. విత్తనాలు కొనడం దగ్గరనుంచీ, పంట పండించేవరకూ మొత్తం పని నేనే చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా కూతురు నాకు సహయం చేస్తోంది. స్కూలు లేకపోవడం వలన తను ఇంటిపట్టునే ఉంటూ ఇంటిపనుల్లో పాలుపంచుకుంటోంది. మా అబ్బాయి కూడా నర్సరీ పనుల్లో నాకు సహాయం చేస్తున్నాడు. నా భర్త కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ, తను చెయ్యగలిగిన సహాయం చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఎక్కువ మనశ్శాంతిగా ఉంటోంది" అని డెలీనా అంటున్నారు.

“మొత్తం భారం మహిళలమీదే పడుతోంది”

డా. ఇజెమా కోలా కెన్యాలోని నైరోబీకి చెందిన నైజీరియన్-అమెరికన్ మహిళ

ఇజెమా కొత్తగా తల్లయ్యారు. ఇంటి పనులు, బిడ్డ పనులతో పాటూ ఉద్యోగం కూడా తొట్రుపాటు లేకుండా నిర్వహించగలగడానికి కారణం తన భర్త తనకు అన్ని రకాలుగా సహాయంగా చేస్తుండడమే అని ఆమె అంటున్నారు. అంతేకాకుండా, ఇంట్లో పనికి సహాయంగా ఉండడానికి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసుకోగలిగే స్తోమత ఉంది కాబట్టి నెట్టుకురాగలుగుతున్నాం అని ఆమె తెలిపారు.

"అయితే, అందరు మహిళలకు ఇంత అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికంగా స్తోమత ఉండకపోవచ్చు" అని ఇజెమా అన్నారు.

"సంఘం స్త్రీలకే ఎక్కువ నియమాలు విధిస్తుంది. ఇంటి పనులు, కుటుంబ బాధ్యత స్త్రీల నెత్తిమీదే మోపుతారు. సగటు మహిళ ఏదైనా భరిస్తుంది, ఎంతైనా మోయగలుగుతుంది అనే ఉద్దేశంతోనే సంఘ నియమాలు ఉంటాయని" ఇజెమా అభిప్రాయపడ్డారు.

"మహిళలు భారం మొయ్యగలరు కానీ అంతా ఒకేసారి కాదు, పెద్ద పెద్ద త్యాగాలు చెయ్యకుండా కాదు" అని ఇజెమా వివరించారు.

"నాలాగ అన్నీ ఉండి, సౌకర్యవంతమైన జీవితం గడపగలిగేవారు చాలా తక్కువ. లాక్‌డౌన్‌లో ఒక నెల పాటూ మాకు పనిమనిషి లేదు. నేను నానా అవస్థలు పడ్డాను. ఇంటి పని ఎంత పెరిగిపోయిందంటే నా ప్రొఫెషనల్ వర్క్ మీద అస్సలు దృష్టి పెట్టలేకపోయాను" అని ఇజెమా తెలిపారు.

ఇజెమా

ఫొటో సోర్స్, IJEOMA KOLA

ఫొటో క్యాప్షన్, ఇజెమా

తన భర్త తనకు అన్ని విధాలా సహాయం చేస్తున్నప్పటికీ ఇంటిని నిర్వహించే బాధ్యత తనమీదే పడుతుందని ఆమె అంటున్నారు.

"ఇంటికి కావలసిన సరుకుల లిస్ట్, మా అబ్బాయి మొదటి పుట్టినరోజు వేడుకలు, కుటుంబంతో కలిసి ఫొటోషూట్ పెట్టుకోవాలా వద్దా...ఇలాంటివన్నీ నా బుర్రలో తిరుగుతూ ఉంటాయి. కానీ నా భర్తకు ఈ ఆలోచనలు ఏమీ ఉండవు" అని ఇజెమా అంటున్నారు.

కుటుంబ బాధ్యత, హెల్త్‌కేర్, వంట పని, ఇంటికి రిపేర్లు చేయించడం...వీటన్నిటివల్లా కలిగే ఒత్తిడి మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించొచ్చు.

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ కారణంగా.. పాతికేళ్లు తిరోగమించిన మహిళల సమానత్వం

పనికి విలువ లేదు, జీతం ఉండదు

మహిళలు చేసే ఇంటి పని, సేవలు, నిర్వహించే కుటుంబ బాధ్యత మొదలైనవన్నీ ఇంటి ఆర్థిక పరిస్థితికి వెన్నుదన్నుగా ఉంటూ కుటుంబాలను నిలబెడతాయి. కానీ ఇవేవీ కూడా అధికారికంగా "పని" అని గుర్తింపు పొందవు.

"మహిళలు చేసే పనికి ఎప్పుడూ విలువ ఉండదు. జీతం భత్యం లేని పని, పరిహారం చెల్లించక్కర్లేదు కాబట్టి బెంగ పడవలసిన అవసరం లేదు. అంతే కాకుండా, ఎల్లవేళలా అందుబాటులో ఉండే విషయంగా పరిగణిస్తారు" అని భాటియా అభిప్రాయపడ్డారు.

"మహమ్మారి వలన ప్రపంచానికి ఒక విషయం బాగా తెలిసి వచ్చింది...మహిళలు నిర్వహించే కుటుంబ బాధ్యతలు, ఇంటి పని సామాజిక భద్రతకు కారణమని, మిగతావారు బయటికెళ్లి సంపాదించుకు రావడానికి తోడ్పడున్నాయని అర్థమైంది. కానీ దీనికి చెల్లిస్తున్న మూల్యం చాలా విలువైనది...కుటుంబ సంరక్షణ భారాన్ని మోస్తున్న మహిళల అభివృద్ధి కుంటుపడింది. విద్య, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి.

"ఇది ఎంత పెద్ద సమస్యో ఇప్పుడప్పుడే తెలీదు. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రాకపోతే భవిష్యత్తులో భారీగా నష్టం చెల్లించాల్సి వస్తుంది" అని భాటియా అంటున్నారు.

ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు మహిళలు చేస్తున్న జీతం భత్యం లేని పనిని గుర్తించి, వారికి అదనపు సౌకర్యాలు కల్పించాలని...అదనపు సెలవులు కేటాయిస్తూ, పిల్లలకోసం చైల్డ్‌కేర్ సెంటర్లు తెరిచి ఉంచాలని యూఎన్ పిలుపునిస్తోంది.

"ఇది హక్కుల సమస్య మాత్రమే కాదు. ఆర్థికంగా ఏది సరైనదో కూడా చూడాలి. ఆర్థికపరంగా కూడా మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉండడమే మేలు చేస్తుంది" అని భాటియా అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)