‘‘బైరి నరేశ్‌ను బట్టలూడదీసి కొట్టమని నేనే చెప్పినా...’’ బండి సంజయ్ పబ్లిక్‌గా వెల్లడి... పోలీసుల రియాక్షన్ ఏంటి?

బండి సంజయ్ కుమార్

ఫొటో సోర్స్, Bandi Sanjay Kumar/Facebook

    • రచయిత, యార్లగడ్డ అమరేంద్ర
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వరంగల్‌లో హేతువాది బైరి నరేశ్‌పై దాడి తానే చేయించానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించుకున్నారు. పోలీసులకు కూడా ఫోన్ చేసి కొట్టమని చెప్పానని చెప్పారు.

మార్చి 3వ తేదీన కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బండి సంజయ్

ఫొటో సోర్స్, BANDI SANJAY/FACEBOOK

బండి సంజయ్ ఏం మాట్లాడారు?

"అయ్యప్పను తిట్టినోడ్ని, సరస్వతి అమ్మవారిని తిట్టినోడ్ని(బైరి నరేశ్‌ను) యాడ దొరికితే అక్కడ బట్టలూడదీసి, ఉరికించి ఉరికించి కొట్టమని నేనే చెప్పినా. పోలీసోళ్లకు కూడా చెప్పినా. పోలీసోళ్లకు ఫోన్ చేసి నేనే కొట్టమన్నానయ్యా.. ఇంకా కొట్టిపిస్త అని చెప్పినా. కొట్టుడా కాదా..? ఎన్ని రోజులు భరిస్తాం చెప్పు. అయ్యప్పను తిడితే భరిస్తామా చెప్పు ’’ అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బైరి నరేశ్‌

ఫొటో సోర్స్, BITCELL/TWITTER

ఇంతకీ ఏం జరిగింది?

అయ్యప్ప స్వామిపై వివాదాస్పదంగా మాట్లాడారంటూ బైరి నరేశ్‌పై గత నెలలో వరంగల్‌లో కొందరు దాడి చేశారు.

పోలీసు వాహనంలో ఉండగానే, పోలీసులు చూస్తుండగానే.. పిడిగుద్దులు కురిపించారు . ఆ తర్వాత, ఇందులో ప్రమేయం ఉన్న ఆరుగురిని అరెస్టు చేశామని వరంగల్ సుబేదారీ పోలీసులు తెలిపారు.

గత నెలలో వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో శివస్వాములు చేసిన దాడి వెనుక బీజేపీ మండల అధ్యక్షుడి హస్తం ఉందని పోలీసులు అరెస్టు చేశారు.

వరుస ఘటనలు, రెచ్చగొట్టే ధోరణిపై ప్రముఖ హేతువాది జి. సీతామహాలక్ష్మి బీబీసీతో మాట్లాడారు. ఈ తరహా ఘటనలు సమాజానికి మంచిది కాదని అన్నారు.

"సమానత్వాన్ని, స్వేచ్ఛను అందరికీ సమానంగా అందించిన రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ బైరి నరేశ్ లాంటి ఒక హేతువాదిపై భౌతిక దాడులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నాం.

కొందరు రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చి మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారు. వాళ్లు ఏ మతాన్ని అనుసరించడానికైనా స్వేచ్ఛ ఉన్నప్పుడు, హేతువాదులు శాస్త్రీయ ద్రుక్పథంతో జీవించే స్వేచ్ఛ కూడా ఉంది కదా? ఆ స్వేచ్ఛను ఎందుకు కించపరుస్తున్నారు.

ఎన్టీ రామారావు సమయంలోనే అశ్వమేధ యాగం, జ్యోతిష విశ్వవిద్యాయలయం విషయంలో మా నిరసనలు తెలిపాం. అప్పట్లో ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు భౌతికదాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసం. ఇలాంటి దాడులను ప్రజాస్వామ్య వాదులు, హేతువాదులు ఖండించాలి" అని సీతామహాలక్ష్మి అన్నారు.

 బండి సంజయ్

ఫొటో సోర్స్, BANDI SANJAY/TWITTER

దీనిపై బండి సంజయ్ ఏమంటున్నారంటే...

బైరి నరేశ్ పై దాడి చేయమని చెప్పిన వ్యాఖ్యలను ఎంపీ బండి సంజయ్ సమర్థించుకున్నారు. ప్రభుత్వం స్పందించకుండా తూతూమంత్రంగా చేసినందునే మేం స్పందించాల్సి వచ్చిందని చెప్పారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఆయనతో బీబీసీ మాట్లాడింది. అలా మాట్లాడే వారిని ప్రభుత్వం కంట్రోల్ చేయకపోతే, తామే కంట్రోల్ చేయాల్సి వస్తుందన్నారు.

"నిన్న కూడా అమ్మ వారి గురించి ఘోరంగా మాట్లాడాడు. చాలా బాధగా అనిపించింది. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే సమాజం స్పందించాల్సి ఉంటుంది. తూతూమంత్రంగా కేసులు పెట్టి ఈ రకమైన వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ఎవరో ఒకరు సమాధానం చెప్పాల్సిందే. దేవుళ్లను బూతులు తిడితే ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. మేం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా మాట్లాడేవారిని ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ప్రభుత్వం స్పందించకుండా తూతూమంత్రంగా చేసింది కాబట్టే మేము స్పందించాల్సి వచ్చింది.

పాత వీడియోలైనా, కొత్త వీడియోలైనా హిందూ దేవతలను కించపరిస్తే తప్పకుండా అడ్డుకుంటాం. దాడి చేస్తాం. దానికి భయపడే ప్రసక్తే లేదు" అని బండి సంజయ్ బీబీసీతో అన్నారు.

బైరి నరేశ్

ఫొటో సోర్స్, BITCELL/TWITTER

పోలీసులు ఏమంటున్నారు?

కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల విషయం మాకు తెలియదని చెబుతున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్గా మారినా, తమ దృష్టికి రాలేదంటున్నారు.

ఈ విషయంపై కరీంనగర్ పోలీసు కమిషనర్ సుబ్బారాయుడుతో బీబీసీ మాట్లాడింది.

"బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాకు తెలియదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ప్రసంగం వినాల్సి ఉంది. వీడియో ప్రసంగం చూశాక తదుపరి చర్యలు తీసుకుంటాం" అని సుబ్బారాయుడు చెప్పారు.

పోలీసులు నిజంగా ఆ వీడియో చూడలేదా లేక చూడదల్చుకోలేదా అన్నది సందేహమే.

ఇదే విషయంపై మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ట్విటర్లో స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా బీబీసీతో మాట్లాడారు.

"బైరి నరేశ్ చేసింది తప్పే. అందుకు ఆయన 30-40 రోజులు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత కూడా ఆయనపై దాడి చేస్తున్నారు. 'నేనే తన్నమని చెప్పినా' అని బండి సంజయ్ క్లియర్‌గా చెబుతున్నారు. అయినా పోలీసులు ఎందుకు కళ్లు మూసుకున్నారు?

బండి సంజయ్‌పై ఐపీసీ సెక్షన్ 109 కింద కేసు పెట్టి అరెస్టు చేయాలి. ఆయనకో న్యాయం.. మరొకరికి ఒక న్యాయమా?’’ అని ప్రవీణ్ కుమార్ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)