హరియాణా: జునైద్, నాసిర్‌లను గోరక్షకులే సజీవంగా కాల్చేశారా... పోలీసుల నిర్లక్ష్యమే ఈ హత్యలకు కారణమా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి, భివానీ నుంచి
అగ్నికి ఆహుతైన బొలేరో కారులో ఇద్దరు ముస్లింల మృతదేహాలు కనిపించాయి. ఈ హత్యల వెనుక గోరక్షకుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
హరియాణాలోని భివానీ జిల్లాలో చోటుచేసుకున్న ఈ హత్యలకు సంబంధించిన వార్తలు కొన్ని రోజులుగా పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. ఆవుల అక్రమ రవాణా పేరుతో గోరక్షకులే జునైద్, నాసిర్‌లను హత్య చేసినట్లు ఆ వార్తల్లో చెబుతున్నారు.
అయితే, వీరి మృతదేహాల పరిసరాల్లో ఎలాంటి పశు మాంసం అవశేషాలు కనిపించలేదని రాజస్థాన్ పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)లోనూ ఆవుల అక్రమ రవాణా గురించి ప్రస్తావించలేదు.
హత్యలతోపాటు దీనికి ముందు, ఆ తర్వాత కొన్ని పరిణామాలు హరియాణా, రాజస్థాన్‌లలోని కొన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చోటుచేసుకున్నాయి. దీంతో అసలు ఎవరి పరధిలోకి ఏం వస్తుందనే గందరగోళం కూడా నెలకొంది.
మరోవైపు రాజస్థాన్ పోలీసుల మీద కూడా హరియాణా పోలీసులు కేసు నమోదుచేశారు. హరియాణాలో బీజేపీ ప్రభుత్వముంటే.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వముంది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న గోరక్షకులకు మద్దతుగా మహాపంచాయత్ కూడా నిర్వహించారు. ఈ పరిణామాల నడుమ తమకు న్యాయం చేయాలని జునైద్, నాసిర్‌ల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
‘‘మా తమ్ముడి ముఖాన్ని కూడా మేం చివరిసారిగా చూడలేకపోయాం. దాన్ని పాలిథీన్‌లో చుట్టి మాకు ఇచ్చారు. మృతదేహం పొడవు ఆధారంగా మా తమ్ముడిని గుర్తుపట్టాం’’అని చెబుతున్నప్పుడు నాసిర్ అక్క మమూరీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జునైద్ అత్తయ్య బీనా కూడా మాట్లాడేటప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. ‘‘అంత్యక్రియల అనంతర ప్రార్థనలు కూడా మేం నిర్వహించలేకపోయాం’’అని ఆమె అన్నారు.
‘‘అంత్యక్రియలు నిర్వహించనప్పుడు, అనంతర ప్రార్థనలు ఎలా చేపట్టగలం?’’అని జునైద్ బావ వారిస్ వ్యాఖ్యానించారు.

భరత్‌పుర్ నుంచి భివానీ వరకు చాలా ప్రశ్నలు..
ఈ కేసులో రాజస్థాన్‌లోని భరత్‌పుర్ నుంచి హరియాణాలోని భివానీ వరకు వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై సమాచారం మీడియాలో అందుబాటులో ఉన్నప్పటికీ, అంతుచిక్కని ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి.
జునైద్, నాసిర్‌ల హత్యల వెనుక పరిణామాలు తెలుసుకునేందుకు ఈ ప్రాంతాలకు బీబీసీ బృందం వెళ్లింది. దీంతో కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చాలా విషయాలను బీబీసీకి చెప్పారు.
పోలీసుల దర్యాప్తుతోపాటు నిందితుల వాంగ్మూలాలపైనా వీరు చాలా ప్రశ్నలు సంధించారు.
మొదటగా బీబీసీ బృందం హరియాణాలోని భివానీకి చేరుకుంది. ఇక్కడే ఫిబ్రవరి 16న కాలిపోయిన బొలేరోలో జునైద్, నాసిర్‌ల మృతదేహాలు కనిపించాయి.

ఫొటో సోర్స్, BBC/SANDEEP_YADAV
అస్థి పంజరాలు
ఈ కాలిపోయిన కారును మొదట చూసిన వారిలో బరవాస్ గ్రామానికి చెందిన అమిత్ కూడా ఒకరు. ‘‘మొదట ఆ కారులో మృతదేహాలు ఉంటాయని నేను అనుకోలేదు’’అని ఆయన చెప్పారు.
‘‘అయితే, జాగ్రత్తగా లోపల ఏముందోనని పరిశీలించినప్పుడు.. దంతాలు, దవడ ఎముకలు కనిపించాయి’’అని ఆయన వివరించారు.
‘‘డ్రైవర్‌కు పక్క సీటులో ఒక అస్థి పంజరం, మధ్య సీటులో మరొకటి మాకు కనిపించాయి’’అని ఆయన అన్నారు.
భివానీలో ఫిబ్రవరి 16న జునైద్, నాసిర్‌లు హత్యకు గురయ్యారు. అయితే, వీరి కోసం వీరి కుటుంబ సభ్యులు రాజస్థాన్ భరత్‌పుర్‌లోని ఘాట్‌మీకా గ్రామంలో వెతుకుతున్నారు.

ఫొటో సోర్స్, BBC_SANDEEP_YADAV
పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారా?
కొందరు గోరక్షకులు నాసిర్, జునైద్‌లను అపహరించుకొని వెళ్లారని వారి కుటుంబం ఆరోపిస్తోంది. ‘‘వీరిద్దరినీ మొదట హరియాణాలోని ఫిరోజ్‌పుర్ ఝిర్‌కా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు’’అని వారు చెబుతున్నారు.
‘‘కానీ, నాసిర్, జునైద్‌లు చెప్పేదాన్ని అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. వీరిని తమ రక్షణలోకి తీసుకోకుండా గోరక్షకులకే వదిలిపెట్టేశారు. ఆ తర్వాత వారిద్దరూ కనిపించకుండాపోయారు’’అని వీరు వివరిస్తున్నారు.
ఈ ఆరోపణలపై ఎస్పీ వరుణ్ సింగ్లా మాట్లాడుతూ, ‘‘కొందరు పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు కోసం ఏఎస్పీ ఉషా కుండూ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేశాం’’అని చెప్పారు.
అయితే, తమపై వచ్చిన ఆరోపణలపై హరియాణా పోలీసులే ఎలా విచారణ చేపట్టగలరు? ఈ ప్రశ్నకు ఉషా కుండూ ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు.
‘‘ముందు దర్యాప్తు జరగనివ్వండి. ఆ తర్వాత మీతో మేం మాట్లాడతాం’’అని ఉష చెప్పారు.

మోను మానేసర్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా?
జునైద్, నాసిర్‌లకు బతికుండగానే నిప్పు పెట్టారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీరు నమోదు చేయించిన ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)లో మోను మానేసర్ పేరు ఉంది.
హరియాణాలోని బజ్‌రంగ్ దళ్ గోరక్షకుల విభాగం అధిపతిగా కొనసాగుతున్న మోను.. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సోషల్ మీడియా వేదికగా ఖండించారు.
వీడియో కాల్‌లో ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. అయితే, మోనును ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. దీనిపై డీఎస్పీ మన్‌బీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘నిబంధనల ప్రకారం మేం ముందుకు వెళ్తున్నాం’’అని చెప్పారు.
ఇక్కడ గోరక్షకులతోపాటు హరియాణా, రాజస్థాన్ పోలీసులపైనా జునైద్, నాసిర్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అసలు హరియాణా పోలీసులు కూడా సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న గోరక్షకులకు హరియాణా ప్రభుత్వం అండగా నిలుస్తోందని బాధితుల కుటుంబం ఆరోపణలు చేస్తోంది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే జునైద్, నాసిర్‌ల ప్రాణాలు పోయేవికాదని అంటోంది.
అసలు ఈ కేసులో ఏం జరిగిందో తెలియాలంటే, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న కేసు వరుస క్రమాన్ని ముందుగా తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, BBC/SANDEEP_YADAV
అసలేం జరిగింది?
ఫిబ్రవరి 14, రాత్రి 8-10: జునైద్ సోదరుడు జాఫర్ పెద్ద కుమార్తె వివాహం కోసం పెళ్లి కొడుకును తీసుకువచ్చేందుకు బొలేరో కారు తీసుకుని నాసిర్, జునైద్ ఇంటి నుంచి బయల్దేరినట్లు నాసిర్ అన్నయ్య చెప్పారు. భరత్‌పుర్‌లోని ఘాట్‌మీకా నుంచి వీరు బయలుదేరారు. ఈ బొలేరో నాసిర్ స్నేహితుడు హసీన్‌కు చెందినది. హరియాణాలోని నూహ్ ప్రాంతం హసీన్ సొంత ఊరు.
ఫిబ్రవరి 15, ఉదయం 4 గంటలు: రాజస్థాన్‌లోని పీరుకా గ్రామం పరిసరాల్లో జునైద్, నాసిర్‌లను కొందరు అదుపులోకి తీసుకున్నట్లు ఆ పరిసరాల్లోని తన దుకాణంలో నిద్రపోతున్న ప్రత్యక్ష సాక్షి ఖాసిమ్ చెప్పారు. ‘‘ఉదయం నాలుగు గంటల సమయంలో ఒక కారు ప్రమాదం చోటుచేసుకున్న శబ్దం వచ్చింది. వెంటనే నేను బయటకు వచ్చాను. అప్పుడే అరుపులు వినిపించాయి. అక్కడ మూడు వాహనాలు కనిపించాయి’’అని ఖాసిం చెప్పారు.
‘‘అక్కడ దాదాపు పది నుంచి 15 మంది కనిపించారు. వారు కర్రలతో కొడుతున్నారు. వెంటనే నా స్నేహితులను నిద్రలేపాను. దీంతో అందరూ హరియాణా రోడ్డు నౌగావ్ వైపుగా వెళ్లిపోయారు’’అని ఆయన వివరించారు.
మేం ఘటన స్థలానికి వెళ్లినప్పుడు అక్కడ కారు అద్దాలు కనిపించాయి. కొన్ని అద్దాలను రాజస్థాన్ పోలీసులు కూడా పరీక్షల కోసం తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, BBC_SANDEEP_YADAV
ఫిబ్రవరి 15, ఉదయం 5 గంటలు: పీరుకా గ్రామానికి 30 కి.మీ. దూరంలోని హరియాణాలోని ఫిరోజ్‌పుర్ ఝిర్‌కా పోలీస్ స్టేషన్ బయట పనిచేస్తున్న ఓ ప్రత్యక్ష సాక్షి అప్పుడు ఏం జరిగిందో బీబీసీతో మాట్లాడారు. అయితే, ఆయన తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.
‘‘పోలీస్ స్టేషన్ బయట మూడు కార్లు ఆగి అవున్నాయి. వీటిలో బొలేరో అద్దాలు పగిలిపోయాయి. మరో బొలేరో, స్కార్పియోలు కూడా అక్కడ ఆగివున్నాయి’’అని ఆయన చెప్పారు.
ఆయన చెబుతున్న ఆ తెల్లని స్కార్పియోను హరియాణాలోని జింద్ నుంచి రాజస్థాన్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
‘‘దాదాపు 20 నిమిషాల తర్వాత కార్లన్నీ ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి’’అని ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఆ కారుల్లో నాసిర్ లేదా జునైద్ కనిపించారా? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘నేను చాలా దూరం నుంచి చూశాను. కారులో ఎవరున్నారో గుర్తుపట్టడం కష్టం’’అని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 15, ఉదయం 8 గంటలు: నాసిర్, జునైద్‌లపై కొందరు గోరక్షకులు దాడిచేసినట్లు నాసిర్ సోదరుడు హామిద్‌కు సమాచారం అందింది. ‘‘వీరిద్దరినీ ఫిరోజ్‌పుర్ ఝిర్‌కా పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు నాకు సమాచారం వచ్చింది. వెంటనే నేను అక్కడకు చేరుకున్నాను. వీరిద్దరినీ తమ దగ్గరకు తీసుకువచ్చారని, కానీ, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. వీరిని ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని వివరించారు’’అని హామిద్ అన్నారు.
మరోవైపు నాసిర్, జునైద్‌లను తమ దగ్గరకు తీసుకొచ్చిన కొందరు గోరక్షకుల పేర్లను కూడా పోలీసులు తమకు చెప్పారని బాధితుల కుటుంబం వివరిస్తోంది. ఆ పేర్ల ఆధారంగానే మొదటగా ప్రాథమిక విచారణ నివేదికను నమోదుచేశారు.
ఆ తర్వాత నాసిర్, జునైద్‌ల కోసం పరిసరాల్లోని చాలా ఆసుపత్రుల్లో బాధితుల కుటుంబాలు వెతికాయి. అయితే, హరియాణా పోలీసులపై వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని, ఈ కేసుపై రాజస్థాన్ పోలీసులతో కలిసి పనిచేస్తున్నమని హరియాణా నూహ్ ఎస్పీ వివరించారు.

ఫొటో సోర్స్, BBC_SANDEEP_YADAV
ఫిబ్రవరి 15-16 అర్ధరాత్రి 12.30 గంటలు: ఫిరోజ్‌పుర్ ఝిర్‌కాకు 200 కి.మీ. దూరంలోని హరియాణాలోని భివానీ జిల్లాలో బరవాస్‌లో జునైద్, నాసిర్‌లకు తమ కారుతోపాటు నిప్పు పెట్టారు.
‘‘ఇక్కడ 300 మీటర్ల దూరంలోనే మా ఇల్లు ఉంది. రాత్రి 12.30 గంటలకు ఒక వాహనం టైర్ పేలిన శబ్దం వినిపించింది. అయితే, అప్పుడు దగ్గర్లోనే ఒక పెళ్లి జరుగుతోంది. దీంతో ఎవరూ ఆ శబ్దాన్ని పెద్దగా పట్టించుకోలేదు’’అని స్థానికుడు అమిత్ చెప్పారు.
‘‘రాత్రి 12 గంటలకు ముందు ఇక్కడ కారేమీ లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అటూఇటూ తిరుగుతున్నారు. కానీ, ఉదయం నాలుగు గంటలకు మా నాన్న వాకింగ్‌కు వెళ్తారు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఓ కారు కాలిపోయి ఉందని చెప్పారు’’అని అమిత్ వివరించారు.
బరవాస్‌లో జీవించే అమర్‌జీత్ మొదటగా ఈ కారుపై పోలీసులకు సమాచారం అందించారు. ‘‘ఉదయం ఎనిమిది గంటలకు వచ్చినప్పుడు, ఆ కారు పూర్తిగా కాలిపోయి కనిపించింది. లోపల రెండు మృతదేహాలు ఉన్నట్లుగా మాకు అనిపించింది’’అని ఆయన చెప్పారు.
‘‘మాకు బయట నుంచి రెండు పుర్రెలు కనిపించాయి. వెంటనే నేను 112కు ఫోన్ చేశాను. 15 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు’’అని ఆయన వివరించారు.
ఫిబ్రవరి 16, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12: ఘటన స్థలానికి హరియాణా పోలీసులు చేరుకున్నారు. బండి నంబరు ఆధారంగా పోలీసులు దాని యజమానిని గుర్తించారు. అప్పుడే ఆ కారులో జునైద్, నాసిర్ వెళ్లినట్లు పోలీసులకు తెలిసింది.
‘‘పోలీసుల నుంచి సమాచారం అందిన వెంటనే మేం హరియాణాకు బయల్దేరాం’’అని నాసిర్ సోదరుడు చెప్పారు.
ఫిబ్రవరి 16, సాయంత్ర 5 గంటలు: బాధితుల కుటుంబ సభ్యులతోపాటు రాజస్థాన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, BBC_SANDEEP_YADAV
రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్తత
పోలీసుల దగ్గరకు మొదట తీసుకొచ్చినప్పుడు స్పందించుంటే నాసిర్, జునైద్‌లు ఇప్పటికీ బతికే ఉండేవారని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
దాదాపు 20 గంటలు పాటు రాజస్థాన్, హరియాణాలలోని భిన్న పోలీస్ స్టేషన్‌ల చుట్టూ నాసిర్, జునైద్‌లను తిప్పారని వారు ఆరోపిస్తున్నారు.
వీరి ఫిర్యాదుపై ఫిబ్రవరి 16న రాజస్థాన్‌లోని గోపాల్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఐదుగురిపై ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదుచేశారు.
నిందితులు అనిల్, శ్రీకాంత్, రింకూ సైనీ, లోకేశ్ సింగ్లా, మోనులపై కిడ్నాప్, దాడి లాంటి ఆరోపణలతో కేసు నమోదుచేశారు. ఆ తర్వాత మరో నలుగురు నిందితుల పేర్లనూ చేర్చారు.
అయితే, రాజస్థాన్ పోలీసులు బుధవారం ఎనిమిది మంది నిందితుల పేర్లతోనే ప్రకటన జారీచేశారు. దీనిలో మోను మానేసర్ పేరు లేదు.
ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)లో పేరు ఉన్నప్పటికీ, మోను ఫోటోను ఎందుకు మీడియాకు విడుదల చేయలేదని బీబీసీ అడిగిన ప్రశ్నకు పోలీసు అధికారి దినేశ్ ఎంఎన్ స్పందించారు. ‘‘ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించిన పేర్లపై విచారణలో ఏదైనా ఆధారాలు కనిపిస్తే, చర్యలు తీసుకుంటాం’’అని అన్నారు.
నిందితుల్లో ఒకరైన రింకూ సైనీని రాజస్థాన్ పోలీసులు.. హరియాణాలోని ఫిరోజ్‌పుర్ ఝిర్‌కాలో అరెస్టు చేశారు. మరోవైపు నూహ్‌లో మరో నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లారు. కానీ, అక్కడ గర్భంతోనున్న శ్రీకాంత్ భార్యను పోలీసులు తోసేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
శ్రీకాంత్ భార్య ఆరోగ్యం విషమిమింది. ఆమెకు గర్భస్రావమైంది. దీంతో రాజస్థాన్ పోలీసులపై హరియాణాలోని నూహ్ పోలీసులు కేసు నమోదుచేసినట్లు నూహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా చెప్పారు.
‘‘రాజస్థాన్ పోలీసులు తోసేయడం వల్లే ఆమెకు గర్భస్రావమైనట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకే దాదాపు 30 మందిపై కేసు నమోదుచేశాం’’అని ఆయన అన్నారు.
కానీ, ‘‘మేం అసలు శ్రీకాంత్ ఇంటిలోకే వెళ్లలేదు. ఆమెను తోయలేదు’’అని రాజస్థాన్ పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, BBC/SANDEEP_YADAV
నాసిర్, జునైద్ కుటుంబం ఏం చెబుతోంది?
కొన్ని రోజులుగా నాసిర్, జునైద్‌ల ఇంటికి మీడియా ప్రతినిధులు వెళ్తున్నారు. కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా వస్తున్నారు.
ఇటీవల ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద మొదట విడతగా రూ.15,000ను నాసిర్ అందుకున్నారు. ఈ డబ్బులతో ఇటుకలు కొనుగోలు చేశారు. వీటిని తన ఇంటిని నిర్మించుకోవాలని ఆయన భావించారు.
15 ఏళ్ల క్రితం నాసిర్.. ఫర్మీనాను పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరికి పిల్లలు లేరు. దీంతో తన తమ్ముడు హామిద్‌కు జన్మించిన ఇద్దరు పిల్లలను వీరు దత్తత తీసుకున్నారు.
తన పిల్లల కోసం నాసిర్ ఇల్లు నిర్మించాలని భావించారు. అయితే, ఆ కల పూర్తికాకుండానే ఆయన కన్నుమూశారు.
నాసిర్ ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే జునైద్ ఇల్లు ఉంది. దగ్గర్లోనే జునైద్ ఒక దుకాణం నడిపించేవారు.
జునైద్ ఇంట్లో భార్యతోపాటు 13 మంది పిల్లలు ఉంటారు. వీరిలో ఆరుగురు వీరి సొంత పిల్లలు. మరో ఏడుగురు పిల్లలు తన సోదరుడు జాఫర్‌కు జన్మించారు. జాఫర్ మానసిక ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో ఆయన పిల్లలు కూడా జునైద్ ఇంట్లోనే ఉంటారు.
జునైద్ తల్లిదండ్రులు చనిపోయారు. ‘‘ఇప్పుడు ఈ పిల్లలను ఎవరు చూసుకుంటారో తెలియడం లేదు’’అని జునైద్ బావ వారిస్ చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/SANDEEP_YADAV
హిందూ సర్పంచ్
నాసిర్, జునైద్‌ల మృతిపై గ్రామంలోని ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. ‘‘ఘాట్‌మీకా పంచాయతీలో ఐదు గ్రామాలు ఉంటాయి. వీటిలో రావ్‌లకా, కన్‌వారీ, ఫతేపుర్, ఝండీపుర్, ఘాట్‌మీకా ఉంటాయి’’అని స్థానికుడు ఇస్మాయిల్ చెప్పారు.
‘‘ఈ గ్రామ పంచాయతీలో ముస్లింల జనాభా 98 శాతం వరకు ఉంటుంది. అయితే, సర్పించ్ మాత్రం హిందువు. ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం ఇది మూడోసారి’’అని ఆయన వివరించారు.
‘‘ఇక్కడ హిందూ-ముస్లిం లాంటి విభేదాలేమీ లేవు. కానీ, ఇక్కడి వాతావరణాన్ని బజ్‌రంగ్ దళ్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది’’అని ఆయన చెప్పారు.
‘‘ఆయన అమాయకుడు’’
ఈ కేసులో అరెస్టు అయిన రింకూ సైనీ భార్య, తల్లి కూడా బీబీసీతో మాట్లాడారు. రింకూ అమాయకుడని వారు అన్నారు.
‘‘ఆయన రోజుకు రూ.400-500కు డ్రైవర్‌గా పనిచేయడానికి వెళ్తుంటారు. ఘటన జరిగిన రోజు ఆయన అక్కడ లేరు. ఆయనపై తప్పుడు కేసు పెట్టారు. మాకు న్యాయం జరగాలి’’అని రింకూ భార్య గీత అన్నారు.
‘‘ఫిబ్రవరి 15 ఉదయం ఎనిమిది గంటలకు నా భర్త అల్వర్‌కు వెళ్లారు. సాయంత్రం ఆయన ఇంటికి వచ్చారు. ఆ తర్వాత టీ తాగి, మళ్లీ బుకింగ్‌పై వెళ్లి, రాత్రి ఇంటికి వచ్చేశారు’’అని ఆమె చెప్పారు.
‘‘ఫిబ్రవరి 16న అర్ధరాత్రి 12 గంటలకు ఆయన కోసం నేనే తలుపుతీశాను. ఆ తర్వాత ఆయన భివానీకి బుకింగ్‌పై వెళ్లారు. అక్కడే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు’’అని ఆమె వివరించారు.
అయితే, గత మూడునాలుగేళ్లుగా ‘‘గో సేవ’’ కోసం రింకూ పనిచేస్తున్నారని, బజ్‌రంగ్ దళ్‌లో ఆయనకు సభ్యత్వముందని ఆయన తల్లి చెప్పారు. కానీ, ఆయనేమీ చెడ్డపనులు చేసేవాడుకాదని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఫెయిలయ్యారా... అసలు ఆయన టార్గెట్ ఏంటి?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















