మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం ఉందా? లేదా? సుప్రీంకోర్టులో కేసు ఏమిటి?

మసీదు

ఫొటో సోర్స్, evrim ertik/GettyImages

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మసీదుల్లో మహిళలు ప్రార్ధన చేసేందుకు అనుమతించడంపై తమకు ఎలాంటి అభ్యంతరమూలేదని, అయితే.. మహిళలు, పురుషులు కలిసి కూర్చోకూడదని సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక ప్రమాణపత్రంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తాజాగా వెల్లడించింది.

అన్ని మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటూ పుణెకు చెందిన ఫరా అన్వర్ హుస్సేన్ షేక్ దాఖలుచేసిన పిటిషన్‌పై స్పందించాలని ఏఐఎంపీఎల్‌బీకి సుప్రీం కోర్టు సూచించింది. దీనిపై స్పందిస్తూ ఏఐఎంపీఎల్‌బీ తాజా ప్రమాణ పత్రాన్ని దాఖలుచేసింది.

మహిళలను మసీదుల్లోకి అనుమతించకపోవడాన్ని అన్యాయమని పిటిషన్‌లో ఫరా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21, 25, 29ల ద్వారా తమకు ఇచ్చిన హక్కులను ఇది ఉల్లంఘించడమేనని వివరించారు.

‘‘మేం రంజాన్ సమయంలో షాపింగ్‌కు వెళ్లాం. అయితే, అప్పుడు ప్రార్థనల సమయమైంది. సమీపంలోని మసీదులో ప్రార్థనలు చేసేందుకు నా భర్తను అనుమతించారు. కానీ, నన్ను లోపలకు రానివ్వలేదు’’ అని ఆమె బీబీసీతో చెప్పారు.

మసీదుల్లో మహిళలు ప్రార్థనలు చేయకూడదని ఇస్లాంలో ఎక్కడా రాసిలేదని ఆమె వివరించారు.

ఈ పిటిషన్‌ను ఆమె 2020లో దాఖలుచేశారు. పిటిషన్ దాఖలుచేసే ముందుగా పుణె మసీదులో ప్రార్థనలు చేసేందుకు తనను అనుమతించాలని మసీదు సెక్రటరీ, ఇతర మతాధికారులకు ఆమె లేఖలు రాశారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మసీదు

ఫొటో సోర్స్, Michael Siward/GettyImages

పిటిషన్‌లో ఏముంది?

మసీదుల్లోకి మహిళలను అనుమతించడంతోపాటు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి విడిగా సదుపాయాలు, మరుగుదొడ్లు లాంటివి ఏర్పాటుచేయాలని కోరినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది ఓం నారాయణ్ పాండే వివరించారు.

‘‘ఈ విషయంలో మార్గదర్శకాలను విడుదల చేయాలని మేం సుప్రీం కోర్టును కోరాం’’ అని పాండే చెప్పారు.

మరోవైపు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖ, మహిళా కమిషన్, మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, జమియాత్ ఉలేమా హింద్, దారుల్ ఉలూమ్ దేవబంద్, ఏఐఎంపీఎల్‌బీలను కూడా ఈ కేసులో రెస్పాండెంట్‌లుగా చేర్చినట్లు పాండే వివరించారు.

మొత్తం అందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసిందని, వారు స్పందించాలని సూచించిందని ఆయన తెలిపారు.

దీనిపై ఏఐఎంపీఎల్‌బీకి చెందిన కమల్ ఫరూఖీ మాట్లాడుతూ.. ‘‘మసీదుల్లోకి మహిళలు ప్రవేశించకుండా ఎలాంటి నిషేధం లేదు. మక్కాలో పవిత్రమైన ఖానా కాబా చుట్టూ తిరిగేటప్పుడు కూడా పురుషులు, మహిళలు కలిసే వెళ్తారు. అదే సరైనది. అక్కడకు భర్త లేదా సోదరుడు (మహరమ్)తో కలిసి వెళ్లొచ్చు’’ అని ఆయన చెప్పారు.

‘‘మసీదుల్లో మహిళలకు ప్రత్యేక సదుపాయాలు ఉంటే అక్కడ వారు ప్రార్థనలు చేసుకోవచ్చు. ఒకవేళ సదుపాయాలు లేకపోతే, మహరమ్ ద్వారా ఆమె ప్రార్థనలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, అక్కడ మహిళలు, పురుషులు కలిసి ప్రార్థన చేయకూడదు’’ అని ఆయన వివరించారు.

‘‘మసీదుల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. వారు ఒకవైపు, పురుషులు మరోవైపు కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ, కలిసి కూర్చొని ప్రార్థన చేయకూడదు’’ అని ఆయన చెప్పారు.

మసీదు

ఫొటో సోర్స్, Sorin Rechitan / EyeEm

నిషేధమేమీ లేదు..

ఇటీవల దిల్లీలోని జామా మసీదులోకి మహిళలు, అమ్మాయిలు ఒంటరిగా ప్రవేశించకుండా ఆదేశాలు జారీచేశారు. అయితే, ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.

‘‘దిల్లీలోని జామా మసీదు కేవలం ప్రార్థనల కోసమే నిర్మించారు. ఈ కట్టడం పవిత్రతను కాపాడటం మన బాధ్యత. దీని పవిత్రను దెబ్బతీసే ఎవరినీ లోపలకు అనుమతించబోం’’ అని ఆ ఆదేశాల్లో మసీదు యాజమాన్యం పేర్కొంది.

ఆ ఆదేశాలను ఎందుకు జారీచేయాల్సి వచ్చిందో కమల్ ఫరూఖీ మాట్లాడారు. ‘‘కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఫోటోలు తీసుకోవడానికే ఇక్కడకు వస్తున్నారు. ఇవి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ మసీదు ప్రార్థనలు చేసుకోవడానికి నిర్మించారు. నచ్చినట్లు తిరగడానికి కాదు’’ అని ఆయన అన్నారు.

సుప్రీం కోర్టు నోటీసులపై జమియాత్ ఉలేమా హింద్ స్పందించలేదు. అయితే, బీబీసీతో సంస్థకు చెందిన నియాజ్ ఫరూఖీ మాట్లాడారు.

‘‘మసీదుల్లోకి మహిళలు ప్రవేశించకుండా ఎలాంటి ఆంక్షలూ లేవు. కొన్నిచోట్ల మహిళలను అనుమతించకపోవడం అనేది తప్పు. మేం ఏఐఎంపీఎల్‌బీ వైఖరితో ఏకీభవిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

‘‘మహిళలపై నిషేధం విధిస్తున్నారని చెప్పే వార్తలను ఇస్లాంను అపఖ్యాతి పాలు చేయడానికే వ్యాపింపజేస్తున్నారు. ఇక్కడ ఆంక్షలు ఉన్న మాట వాస్తవమే. నమాజ్ చేసేటప్పుడు, మహిళలు, పురుషులు కలిసి కూర్చోకూడదని మాత్రమే నిబంధనలు ఉన్నాయి. కావాలంటే విడివిడిగా కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.

మసీదు

ఫొటో సోర్స్, Todd Brown/GettyImages

‘‘మసీదుల్లో ప్రార్థనలకు రావడం పురుషులకు తప్పనిసరి. అయితే, మహిళల విషయంలో అలా కాదు. మహిళలు మసీదుల్లో ప్రార్థనలు చేయకపోవడంతో అక్కడ వారికి సదుపాయాలు ఏర్పాటుచేయలేదు. ఒకవేళ వారు వస్తే, కచ్చితంగా సదుపాయాలు ఏర్పాటుచేస్తారు.. చేయాలి కూడా. మహిళల భద్రతకూ ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రార్థనలు భిన్నవేళలో నిర్వహిస్తుంటారు’’ అని ఆయన అన్నారు.

ఇస్లాంలో మహిళల హక్కులపై సీనియర్ జర్నలిస్టు, రచయిత జియా-ఉస్-సలామ్ పుస్తకాలు రాశారు. ఆయన మాట్లాడుతూ.. ఖురాన్‌లో హక్కులను స్థానిక ఉలేమా గుర్తించినట్లు అయితే, ఫరా కేసు సుప్రీం కోర్టు వరకు రావాల్సిన అవసరం ఉండేదికాదని అన్నారు.

‘‘మహిళలు మసీదుల్లోకి వెళ్లకూడదని ఖురాన్‌లో ఎక్కడా లేదు. నిజానికి సమూహంలో కలిసి ప్రార్థన చేయడాన్ని ఖురాన్ ప్రోత్సహిస్తుంది’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, కన్నయ్యలాల్:ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను ఎందుకు హత్య చేశారు, రాజస్థాన్ పోలీసులు ఏం చెప్పారు?

ఇస్లాంలో ఏముంది?

‘‘మసీదుల్లోకి పురుషులు, మహిళలు ఇద్దరూ వెళ్లొచ్చని ఇస్లాం చెబుతోంది. ఇక్కడ ఒక తప్పనిసరి నిబంధన ఏమిటంటే.. పురుషులు తప్పనిసరిగా మసీదుకు రావాలి. కానీ, మహిళలు మాత్రం ఇంట్లో కూడా నమాజ్ చేసుకోవచ్చు. రావాలి అనుకుంటే వారు కూడా రావచ్చు’’ అని సలామ్ వివరించారు.

అయితే, లఖ్‌నవూకు చెందిన శాయిస్తా అబమ్ర్ మాట్లాడుతూ.. ‘‘చాలా మసీదుల్లోకి మహిళలను అనుమతించడం లేదు. అసలు శుక్రవారం ప్రత్యేక ప్రార్థన ఖుతబా వినేందుకు ఎంతమందికి అనుమతిస్తున్నారు? మీరు చెప్పండి’’ అని ప్రశ్నించారు.

‘‘ఈద్‌ నాడు నేను మా అబ్బాయిని తీసుకొని నమాజ్ చేయడానికి మసీదుకు వెళ్లాను. కానీ, అక్కడ నన్ను అడ్డుకున్నారు. అక్కడుండే వారు మా అబ్బాయిని మాత్రమే లోపలకు పంపించారు. తను మాతో కలిసి ప్రార్థన చేస్తాడని నన్ను అక్కడే ఉండమన్నారు’’ అని ఆమె వివరించారు.

‘‘మక్కాలో మహిళలకు అంత ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఎవరైనా తోడుంటేనే లోపలకు అనుమతిస్తామని మహిళలకు చెప్పడం సరికాదు. ఒకవేళ ఆ మహిళ వితంతువు లేదా అనాథ అయితే, తను ప్రార్థన చేసుకోవడానికి వీలులేదా?’’ అని ఆమె ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, శ్రీకాకుళంలో గోల్కొండ నవాబులు పాలించిన షేర్ మహమ్మద్ పురం కథ తెలుసా

‘‘ఇప్పుడు కొత్తగా ఎక్కడలేని ఆంక్షలు నిబంధనలు కొన్నిచోట్ల పెడుతున్నారు. ఇది సరికాదు. కేవలం మన మహమ్మద్ ప్రవక్త వాక్యాలనే నమ్మాలి. ఖురాన్‌లో ఉన్న విషయాలను మనం పాటించాలి’’ అని ఆమె చెప్పారు.

మరోవైపు సలామ్ మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో భార్య లేదా కుమార్తెలు మసీదుకు వెళ్తామని అడిగినప్పుడు, వారిని అడ్డుకోకూడదని ఖురాన్ చెబుతోంది’’ అని వివరించారు.

‘‘అయితే, కొన్నిచోట్ల ప్రార్థనల తర్వాత ఇంటికి వచ్చే మహిళలపై నేరాలు జరిగినట్లు కొన్ని హదీస్‌లలో రాసుంది. ఇక్కడ తప్పు చేసిన వారికి శిక్షించాలని చెప్పారు కానీ, మహిళలపై ఆంక్షలు విధించాలని ఎక్కడా లేదు. అయితే, కొంతమంది భద్రతా కారణాల దృష్ట్యా మహిళలు ఇంటిలోనే ప్రార్థనలు చేయాలని సూచించొచ్చు’’ అని ఆయన అన్నారు.

నిజానికి అమెరికా, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి చాలా దేశాల్లో మసీదుల్లోకి మహిళలను అనుమతించడంపై ఎలాంటి ఆంక్షలూ కనిపించవు. కేవలం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లోనూ ఇలాంటి ఆంక్షలు విధిస్తుంటారు.

ఈ కేసులో తదుపరి విచారణ మార్చిలో జరుగనుంది.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)