భూకంపాల నుంచి హైద‌రాబాద్ ఎంత వరకూ సుర‌క్షితం?

చార్మినార్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తుర్కియే, సిరియాల్లో భూకంపం కారణంగా చనిపోయినవారి సంఖ్య 25 వేలకు చేరినట్లు అక్క‌డి ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించాయి.

ఈ భూకంప వార్తల నేపథ్యంలో, భారతదేశంలో భూకంపాలు ఎక్క‌డెక్క‌డ సంభ‌వించే అవ‌కాశం ఉంది, ఏ ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువ తీవ్రతతో రావొచ్చు లాంటి అంశాలపై చాలా మందిలో ప్రశ్నలు మెదులుతున్నాయి.

భారతదేశానికి భూకంపాలు కొత్త‌కాదు. దేశ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ప్రాణ న‌ష్టం మిగిల్చిన భూకంపంగా 2001లో గుజ‌రాత్‌లోని భుజ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం రికార్డుల కెక్కింది.

నాటి ఈ ప్ర‌కృతి విప‌త్తు ఏకంగా 20,005 మంది బ‌లిగొంది. వేల మందిని నిరాశ్ర‌యుల్ని చేసింది.

భూకంపం

1950 నుంచి 2021 మధ్య కాలంలో..

భార‌త్ దేశంలోనూ త‌ర‌చూ చోటు చేసుకుంటున్న భూకంపాలతో ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌విస్తోంది. వ‌ర‌ల్డ్ డాటా స‌ర్వీస్ లెక్క‌ల ప్ర‌కారం 1950 నుంచి 2021 మధ్య కాలంలో 71 సార్లు రిక్టరు స్కేలుపై 3.8, ఆ పైస్థాయి తీవ్రతతో భూకంపాలు వచ్చాయి.

ఇవి కాకుండా త‌క్కువ మ్యాగ్నిట్యూడ్‌తో వ‌చ్చిన‌వి వంద‌ల సంఖ్య‌లో ఉంటాయ‌ని భూగ‌ర్భ ప‌రిశోధ‌న శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు.

ముఖ్యంగా హిమాల‌య సానువుల్లో భూమిలోప‌ల పొర‌ల్లో క‌ద‌లికల కార‌ణంగా భూకంపాలు వ‌స్తుంటాయ‌ని చెబుతున్నారు.

1950 భూకంపంలో దెబ్బతిన్న వంతెన

ఫొటో సోర్స్, Getty Images

ఇప్ప‌టివ‌ర‌కు అదే అతిపెద్ద‌ది

ఇప్ప‌టివ‌ర‌కు భారతదేశంలో 1950 ఆగస్టు 15న భారత్-చైనా స‌రిహ‌ద్దులో 8.6 మ్యాగ్నిట్యూడ్‌తో వ‌చ్చిన భూకంప‌మే అతిపెద్ద‌దని రికార్డులు చెబుతున్నాయి. దీని భూకంప కేంద్రం భూమిలోప‌ల 30 కిలోమీట‌ర్ల లోతులో ఉన్న‌ట్లు శాస్త్రవేత్త‌లు గుర్తించారు.

వ‌ర‌ల్డ్ బ్యాంకు, ఐక్య‌రాజ్య స‌మితి అంచ‌నా ప్ర‌కారం 2050 నాటికి భారత దేశంలో 20 కోట్ల మంది భూకంపాల ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తుంటార‌ని అంచ‌నా. వాస్త‌వ లెక్క‌ల ప్ర‌కారం ఈ సంఖ్య 25-30 కోట్ల‌కు చేర‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్న‌మాట‌.

``హిమాల‌య ప‌ర్వ‌తాల్లో అతిపెద్ద భూకంపం సంభ‌విస్తే, దానికి త‌గ్గ‌ట్టుగా ప్రాథ‌మిక న‌ష్టాన్ని అంచ‌నా వేసుకుని ఏం చేయాల‌నే విష‌యమై జాతీయ విప‌త్తుల యాజ‌మాన్య సంస్థ నిర్దిష్ట ప్ర‌ణాళిక రూపొందించుకుంది. భూకంపాల ప్రభావ తీవ్రత‌ను త‌గ్గించడంపై అన్ని రాష్ర్టాల‌లోని జాతీయ విప‌త్తుల యాజ‌మాన్య సంస్థల‌తో చ‌ర్చించుకుని ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నారు. భార‌త‌దేశంలో జోన్‌-1 అనేది లేదు. అందువ‌ల్ల అన్ని ప్రాంతాల్లో భూకంపం సంభ‌వించే ముప్పు అయితే ఉంది`` అని మద్రాస్ ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెస‌ర్ ఆఫ్ ప్రాక్టీస్, నేషనల్ జియోఫిజికల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్(‌ఎన్‌జీఆర్‌ఐ) మాజీ శాస్త్రవేత్త శ్రీ‌న‌గేశ్ బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, గుజరాత్‌లో భూకంపం: ‘2001 విధ్వంసం గుర్తొచ్చింది’

ఏ జోన్‌లో ఏ ప్రాంతాలు?

నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ ప్ర‌కారం.. భూకంప ముప్పు తీవ్రత అంచనాల ఆధారంగా భారతదేశాన్ని మొదట్లో ఐదు జోన్లుగా విభ‌జించారు. 1993లో వ‌చ్చిన కిల్లారి భూకంపం త‌ర్వాత జోన్‌-1ను జాబితా నుంచి శాస్త్రవేత్త‌లు తొల‌గించారు.

ప్ర‌స్తుతం నాలుగు జోన్లు మాత్రమే ఉన్నాయి. దీని ప్ర‌కారం భార‌తదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక సందర్భంలో భూకంపం వచ్చే ముప్పుంది.

మ్యాగ్నిట్యూడ్ స్కేల్‌పై 1-4 తీవ్రతతో భూకంపం వ‌చ్చే అవ‌కాశం ఉంటే జోన్-2 ప‌రిధిలో ఉన్న‌ట్లు ప‌రిగ‌ణిస్తారు. మ్యాగ్నిట్యూడ్ స్కేల్‌పై 5తో భూకంపం వ‌స్తే జోన్‌-3 కేట‌గిరీలో ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ 6,7తో వ‌స్తే జోన్‌-4 ప‌రిధిలో ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ 7కంటే ఎక్కువ తీవ్ర‌త‌తో వ‌స్తే జోన్‌-5లో ఉన్న‌ట్లు శాస్త్రవేత్త‌లు విభ‌జ‌న చేసిన‌ట్లు శ్రీ‌న‌గేశ్ చెప్పారు. దీని ప్ర‌కారం జోన్‌-5లోని ప్రాంతాల‌లో ఎక్కువ మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపాలు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

hyderabad

ఫొటో సోర్స్, Getty Images

హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌ ఏ జోన్ల‌లో?

జోన్-5 ప‌రిధిలోని ప్రాంతాలు(తీవ్ర భూకంపాలు వ‌చ్చేవి)

భుజ్‌, మండి(శ్రీ‌న‌గ‌ర్‌), డెహ్ర‌డూన్‌, ద‌ర్బంగా, షిల్లాంగ్‌, గువహ‌టి, ఇంఫాల్‌, అగ‌ర్త‌లా,

జోన్‌-4 ప‌రిధిలోని ప్రాంతాలు(మ‌ధ్య‌స్థ భూకంపాలు వ‌చ్చేవి)

దిల్లీ, గాంధీన‌గ‌ర్‌, శ్రీ‌న‌గ‌ర్‌, జ‌మ్మూ, అమృత్‌స‌ర్‌, లుధియానా, చండీఘ‌డ్‌, సిమ్లా, అంబాల, మొర‌దాబాద్‌, పిలిబిత్‌, నైనిటాల్‌, ప‌ట్నా, గ్యాంగ్‌ట‌క్‌

జోన్‌-3 ప‌రిధిలోని ప్రాంతాలు(త‌క్కువ స్థాయి భూకంపాలు వ‌చ్చేవి)

విజయ‌వాడ‌, మ‌చిలీప‌ట్నం, నెల్లూరు, చెన్నై, కోయంబ‌త్తూరు, కోజికుడ్‌, ల‌క్ష్య‌ద్వీప్‌, మంగ‌ళూరు, ప‌నాజీ, ముంబ‌యి, పుణె, నాసిక్‌, అహ్మ‌దాబాద్‌, రాజ్‌కోట్‌, వ‌డోద‌ర, క‌ట‌క్‌, భువ‌నేశ్వ‌ర్‌, బిక‌నేర్‌, కాన్పుర్‌, అగ్రా, కోల్‌క‌త్తా, గ‌య‌, వార‌ణాశి, ల‌ఖ్‌న‌వూ,

జోన్‌-2 ప‌రిధిలోని ప్రాంతాలు(అతి త‌క్కువ భూకంపాలు వ‌చ్చేవి)

హైద‌రాబాద్‌, క‌ర్నూలు, బెంగ‌ళూరు, మైసూరు, చిత్ర‌దుర్గ్‌, తంజావూర్‌, మధురై, జోద్‌పుర్‌, ఉద‌య్‌పుర్‌, భోపాల్‌, ఝాన్సీ, అల‌హాబాద్‌, జంషెడ్‌పుర్‌, రాంచీ, ఔరంగాబాద్‌, నాగ్‌పుర్, రాయ్‌పుర్‌.

జోన్‌-2 ప‌రిధిలో హైద‌రాబాద్ ఉండ‌టంతో భూకంపాలు వ‌చ్చే ముప్పు చాలా త‌క్కువ అని ట్రిపుల్ ఐటీ భూకంపాల ఇంజినీరింగ్ ఆచార్యుడు పి.ప్ర‌వీణ్‌కుమార్ వెంక‌ట‌రావు బీబీసీకి చెప్పారు.

జోన్‌-3 ప‌రిధిలో విజ‌య‌వాడ ఉన్నందున భూకంపాల ముప్పు ఉండ‌వ‌చ్చ‌ని ట్రిపుల్ ఐటీ త‌ర‌ఫున చేప‌ట్టిన అధ్య‌య‌నంలో తేలిన‌ట్లు వివ‌రించారు.

టేబుల్
భవనాలు

ఫొటో సోర్స్, Getty Images

మ‌న భ‌వ‌నాలు సుర‌క్షిత‌మేనా?

2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన గ‌ణాంకాలు ప‌రిశీలిస్తే.. దేశంలో ప‌ట్ట‌ణాలు, గ్రామాల‌లో అధిక శాతం ఇళ్ల గోడ‌లు ఇటుక‌లు, రాళ్ల‌తో నిర్మించిన‌వి. కాంక్రీట్‌, స్టీల్ నిర్మాణాల‌తో పోలిస్తే ఈ త‌ర‌హా ఇళ్లు భూకంపాలు వస్తే ప్రాణ‌, ఆస్తి న‌ష్టం ఎక్కువ‌గా సంభ‌వించే అవ‌కాశం ఉంటుందని హైద‌రాబాద్‌ ట్రిపుల్ ఐటీలో భూకంపాల ఇంజినీరింగ్ ప్రొఫెసర్ పి.ప్ర‌వీణ్ కుమార్ వెంక‌ట రావు బీబీసీతో చెప్పారు.

టేబుల్

ఇలా క‌ట్టుకుంటే సుర‌క్షితం

తుర్కియేలో జ‌రిగిన భూకంపం కార‌ణంగా భ‌వ‌నాలు పేక‌మేడ‌ల్లా కూలిపోయాయి. భ‌వ‌న నిర్మాణాలో స‌రైన నైపుణ్యాలు పాటించ‌క‌పోవ‌డంతోనే జ‌రిగిన‌ట్లు నిపుణులు చెప్పే మాట‌.

భార‌తదేశంలో 60-70శాతం భూభాగం భూకంపాల జోన్ 3, 4, 5 ప‌రిధిలోకి వ‌స్తుంది. ముఖ్యంగా జోన్ 4, 5లోని ప్రాంతాల ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఇక్క‌డ అధిక మ్యాగ్నిట్యూడ్‌తో కంప‌న‌లు సంభ‌వించే అవ‌కాశం ఉంది.

ఇళ్ల నిర్మాణాల్లో మార్పులు చేసుకుంటే 8, ఆపైన తీవ్రతతో వ‌చ్చినా, కూలిపోవ‌డం ఉండ‌ద‌ని ప్ర‌వీణ్‌కుమార్ వెంక‌ట‌రావు చెప్పారు.

ఇళ్ల నిర్మాణాలు చేసే స‌మ‌యంలో భార‌త నాణ్య‌త ప్ర‌మాణాల సంస్థ‌(బిఐఎస్‌) నిర్దిష్ట విధి విధానాలు జారీ చేసింది. ఐఎస్‌1893 కోడ్ ప్ర‌కారం ఇళ్ల నిర్మాణాలు చేయాల‌ని సూచించింది.

ఇందులో భ‌వ‌న నిర్మాణ మెటీరియ‌ల్‌, ఆకృతి వంటి విష‌యాల‌లో ప్ర‌త్యేక నిబంధ‌న‌లు రూపొందించిందని ప్ర‌వీణ్‌కుమార్ వివ‌రించారు. ఈ కోడ్‌ను ఉపయోగించి నాణ్య‌త ప్రమాణాలు పాటించే భ‌వ‌నాలకు భూకంపాలు వ‌స్తే దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌ని, కూలిపోయే అవ‌కాశం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

  • భ‌వన పునాదిలో వేసే పిల్ల‌ర్ల ఎత్తు మిగిలిన భ‌వ‌నంలోనే అదే ఎత్తులో ఉండాలి.
  • బేస్‌మెంట్ ఎత్తుకు తగ్గ‌ట్టుగా మిగిలిన అంత‌స్తుల ఎత్తు ఉండాలి.
  • భ‌వ‌నాల ఆకృతి ఒకే వ‌రుస క్ర‌మంలో సాగాలి. అడుగు భాగంలో చిన్న‌గా ఉండి పైకి వెళ్లే కొద్దీ పెద్ద‌గా మార‌డం, పైభాగంలో చిన్న‌గా ఉండి అడుగు భాగంలో పునాదుల వెడ‌ల్పుగా ఉండ‌టం చేయ‌రాదు.
  • భ‌వ‌నాల పిల్ల‌ర్లు పునాది నుంచి పై అంత‌స్తు వ‌ర‌కు ఉండాలి. మ‌ధ్య‌లో వంపు(బెండ్‌) రాకూడ‌దు.
భవనం

ఫొటో సోర్స్, Getty Images

ఇప్ప‌టికే క‌ట్టిన భ‌వ‌నాల‌కు ఎలా?

ఇప్ప‌టికే నిర్మించిన భ‌వ‌నాల‌కు రెట్రోఫిట్టింగ్ సాయంతో ఆకృతుల‌తో స్వ‌ల్ప మార్పులు చేసి భూకంపాలు త‌ట్టుకునేలా చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌వీణ్‌కుమార్‌వెంక‌ట‌రావు వివ‌రించారు. దీనికి సంబంధించి ప్ర‌త్యేక టెక్నాలజీని ట్రిపుల్ ఐటీ త‌ర‌ఫున అభివృద్ధి చేశామన్నారు. అయితే ఇలా మూడు అంత‌స్తుల భ‌వ‌నాల స్థాయికే చేసే అవ‌కాశం ఉంటుందని ఆయన తెలిపారు.

ప్ర‌వీణ్‌కుమార్‌ వెంక‌ట‌రావు చెప్పిన వివరాల ప్రకారం...

రెట్రోఫిట్టింగ్‌లో భాగంగా ఇప్ప‌టికే ఉన్న భ‌వ‌నాల‌కు మ‌ర‌మ్మ‌తులు చేసి ప‌టిష్ట‌త‌, జీవిత‌కాలాన్ని పెంచుతారు.

ఈ విధానంలో భ‌వ‌నం లేదా ఇంటి గోడ‌ల‌కు పైభాగంలోని గోడ‌ల‌కు లోప‌ల‌, బ‌య‌ట చుట్టూ సిమెంట్ తొల‌గిస్తారు.

దాని స్థానంలో మెష్‌ను అమ‌ర్చి మ‌ళ్లీ ప్లాస్ట‌రింగ్ చేస్తారు. త‌లుపులు, కిటీకీల‌కు ప‌క్క‌న ఇదే విధానం అనుస‌రిస్తారు.

ఇలా మెష్ ప్లాస్ట‌రింగ్ కార‌ణంగా ప్ర‌త్యేకంగా భూకంపాలు వ‌చ్చిన‌ప్పుడు భ‌వ‌న గోడ‌ల్లో క‌ద‌లిక‌లు త‌గ్గి భ‌వ‌నం కూలిపోకుండా ఉంటుంది.

ఇప్ప‌టికే రెట్రో ఫిట్టింగ్ విధానంలో ఐఐటీ రూర్కీతో క‌లిసి కోల్‌క‌త్తా టౌన్ హాలు, ఉత్త‌రాఖండ్ డెహ్రాడూన్‌లోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు బాగు చేశారు.

సాధార‌ణ ఇళ్ల‌కు రెట్రోఫిట్టింగ్ చేయాలంటే నిర్మాణ వ్య‌యంలో 30శాతం వెచ్చిస్తే స‌రిపోతుంద‌ని వివ‌రించారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)