సింక్‌హోల్స్: ఈ ఊరి చుట్టూ పెద్ద పెద్ద గుంతలు ఎందుకు ఏర్పడుతున్నాయి

ఈశాన్య క్రొయేషియాలో ఇటీవల వందలాది భారీ గుంతలు ఏర్పడ్డాయి.

ఫొటో సోర్స్, Antonio Bronic/Reuters/Alamy

ఫొటో క్యాప్షన్, ఈశాన్య క్రొయేషియాలో ఇటీవల వందలాది భారీ గుంతలు ఏర్పడ్డాయి.
    • రచయిత, వెద్రాన సిమిసెవిక్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ఒకటి కాదు.. రెండు కాదు.. వంద సింక్‌హోల్స్‌ (భారీ గుంతలు) ఏర్పడ్డాయి. అది కూడా నెల రోజుల వ్యవధిలోనే. గ్రామం చుట్టూ, కొన్ని ఇళ్ల పక్కనే ఈ గుంతలే కనిపిస్తున్నాయి.

ఇది ఈశాన్య క్రొయేషియాలోని మెకెంకానీ గ్రామం పరిస్థితి.

సింక్‌హోల్స్ తమ ఇళ్లను ఎక్కడ మింగేస్తాయోనని అక్కడి ప్రజలు నిత్యం భయంతో వణికిపోతున్నారు.

ఆ ప్రాంతం సురక్షితమని ఏ సైంటిస్టు కూడా చెప్పలేకపోతున్నారు.

ఇటీవల క్రొయేషియాలోని ఈశాన్య ప్రాంతంలో మెకెంకానీ గ్రామంలో నికోలా బోరోజెవిక్ అనే రైతుకు చెందిన ఆలుగడ్డల తోటలో ఒక్కసారిగా పెద్ద గుంత ఏర్పడింది.

30 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల లోతులో ఈ సింక్‌హోల్ ఏర్పడింది. కాసేపటికే దాని నిండా నీళ్లు నిండిపోయాయి.

ఈ గుంత ఏర్పడటానికి ముందు అక్కడ ఎలాంటి సూచనలేవీ కనిపించలేదు.

అయితే, అది అక్కడితో ఆగలేదు. వారం గడిచేలోగా బోరోజెవిక్ ఇంటికి సమీపంలో ఇలాంటి సింక్‌హోల్స్‌ డజన్ల సంఖ్యలో ఏర్పడ్డాయి.

బోరోజెవిక్ ఇంటి ముందు మొదటి సింక్‌హోల్ జనవరి 5న ఏర్పడింది. అది జరగడానికి ఆరు రోజుల ముందు రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో క్రొయోషియాలో భూకంపం వచ్చింది.

ఈ భూకంపానికి అనేక ఇళ్లు కూలిపోగా, ఏడుగురు మరణించారు. క్రొయేషియాలో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వచ్చిన భారీ భూకంపం ఇది.

భూకంపాల కారణంగా సింక్‌హోల్స్, కొండచరియలు విరిగి పడటం లాంటి ఘటనలు జరగడం సహజం. వీటితోపాటు భూమి చిత్తడిగా మారిపోవడంలాంటి సంఘటనలు కూడా అరుదుగా జరుగుతుంటాయి.

ఈశాన్య క్రొయేషియాలో లెక్కకు మిక్కిలిగా ఏర్పడుతున్న ఈ సింక్‌హోల్స్ వ్యవహారం శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు. భూకంపం వచ్చిన నెల రోజుల్లో 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో 100కు పైగా సింక్‌హోల్స్ ఏర్పడ్డాయి.

మొదట ఏర్పడ్డదాని కంటే క్రమక్రమంగా గుంటల పరిమాణం పెరుగుతూ వచ్చింది

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, మొదట ఏర్పడ్డదాని కంటే క్రమక్రమంగా సింక్‌హోల్ పరిమాణం పెరుగుతూ వచ్చింది

ఎలా ఏర్పడింది?

ప్రతి వారం కొత్త కొత్త సింక్‌హోల్స్‌ ఏర్పడుతూనే ఉన్నాయి.

బోరోజెవిక్ తోటలో ఏర్పడిన గుంత మొదట 10 మీటర్ల వెడల్పులో ఏర్పడింది. అది కూడా హఠాత్తుగా ఏర్పడింది.

''మా ఆవిడ మధ్యాహ్నం కిటికిలోంచి చూసినప్పుడు మా తోటలో ఒక వింత ఆకారం కనిపించింది. దగ్గరకెళ్లి చూస్తే అదో పెద్ద గుంత'' అని అన్నారు బోరోజెవిక్.

అదృష్టం ఏంటంటే కొన్ని గుంటలు ఆయన ఇంటి పక్కనే ఏర్పడినా, ఆ ఇంటికి మాత్రం ఎలాంటి ప్రమాదం కలగలేదు.

అయితే గ్రామంలోని ఓ ఇంటి కింద సింక్‌హోల్ ఏర్పడటంతో గ్రామ ప్రజలందరిని అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సి రావొచ్చేమోనని అధికారులు అంటున్నారు.

మరికొన్ని సింక్‌హోల్స్ చుట్టుపక్కల పొలాల్లో ఏర్పడ్డాయి. ఓ రైతుతోపాటు అతని ట్రాక్టర్ కూడా ఈ గుంతలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు.

ఒకే ప్రాంతంలో ఇన్ని గుంతలు ఏర్పడటంపై జియాలజిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వీటి ఆధారంగా భూకంపాల కారణంగా భూమికి జరిగే అనర్ధాల గురించి పరిశోధనలు ప్రారంభించారు.

''ఇన్ని సింక్‌హోల్స్‌ నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు'' అని జోసిప్ ‌స్టిప్‌సెవిక్ అనే జియాలజిస్ట్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?

భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో క్రొయేషియా ఉందని, ఇది యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్ మీద ఉండటం వల్ల ఇక్కడ ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని జోసిప్ ‌స్టిప్‌సెవిక్ అన్నారు.

2020 డిసెంబర్ 29న ఈ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. 20 శతాబ్ధం ఆరంభం నుంచి ఈ ప్రాంతంలో 9 పెద్ద భూకంపాలు వచ్చాయని, రిక్టర్ స్కేలు మీద వాటి తీవ్రత 6కు పైనే ఉందని ‌స్టిప్‌సెవిక్ చెప్పారు.

1909లో వచ్చిన భారీ భూకంపం తర్వాత 2020లో వచ్చిన భూకంపమే అతి పెద్దది.

1909నాటి భూకంప కేంద్రం, తాజాగా వచ్చిన భూకంప కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది భూకంప నిపుణుల దృష్టిని ఆకర్షించింది.

అప్పటి భూకంపం తీరును పరిశీలించిన శాస్త్రవేత్తలు, ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఏర్పడిన గుంతలను అధ్యయనం చేస్తున్నారు.

క్రొయోషియాలో ఇటీవల 6.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత సింక్ హోల్స్‌ ఏర్పడటం మొదలైంది.

ఫొటో సోర్స్, Anadolu Agency/Getty Images

ఫొటో క్యాప్షన్, క్రొయోషియాలో ఇటీవల 6.4 తీవ్రతతో భూకంపం వచ్చింది

భూకంపాలు వస్తే సింక్‌హోల్స్ ఏర్పడతాయా?

భూకంపాల సమయంలో సింక్‌హోల్స్ ఏర్పడటం కొత్త కాకపోయినా, అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. 2009లో ఇటలీలోని లాఅక్విలా పట్టణంలో భూకంపం తర్వాత రోడ్డు మీద రెండు భారీ గుంతలు ఏర్పడ్డాయి.

భూమిలో గతంలో ఏర్పాటు చేసిన మురుగు కాల్వలు బలహీనపడటంతో భూకంపం వచ్చి, ఆ ప్రాంతంలో భూమి కుంగిపోయిందని నిపుణులు అంచనాకు వచ్చారు.

''క్రొయేషియాలో ఒకే ఆకారంలో పెద్ద సంఖ్యలో ఏర్పడుతున్న సింక్‌హోల్స్ మిగతా వాటికన్నా భిన్నంగా కనిపిస్తున్నాయి'' అని జియాలజిస్ట్ ఆంటోనియో శాంటో అన్నారు.

రెండు క్రొయేషియన్ గ్రామాల్లో ప్రమాదకరంగా మారిన ఈ సింక్‌హోల్స్‌ను 'కవర్‌ కొలాప్స్ సింక్‌హోల్స్‌' అని పిలుస్తున్నారు.

సాధారణంగా భూగర్భంలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లు కుంగిపోయినప్పుడు అక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడి, ఆ తర్వాత అక్కడి భూమి కుంగిపోవడం వల్ల ఈ భారీ గుంతలు ఏర్పడతాయి.

లోపల బోలులాంటి ప్రదేశం ఉన్నా, పైనున్న బంకమట్టి బలంగా ఉండటంతో ఆ బోలు బైటపడదు. కొన్నాళ్లకు నీటి ప్రవాహం కారణంగా పైనున్న ఇసుక, బంకమట్టి కొట్టుకుపోవడంతో పొర పలుచగా మారి హఠాత్తుగా కుంగిపోతుంది.

ఇలాంటివి ఏర్పడటానికి చాలా సమయం పడుతుంది. కానీ భూకంపాలు, భారీ వర్షాలు, వరదలు, మైనింగ్, భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడంలాంటివి ఈ చర్యలను వేగవంతం చేసే అవకాశం కూడా ఉంటుంది.

క్రొయేషియాలో వందలకు పైగా ఏర్పడ్డ గుంటలకు కారణాలు వెతికేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Antonio Šebalj

ఫొటో క్యాప్షన్, క్రొయేషియాలో వందకు పైగా ఏర్పడ్డ గుంతలకు కారణాలు తెలుసుకునేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

కారణాలు అనేకం

ప్రస్తుతం ఏర్పడ్డ సింక్‌హోల్స్‌కు అనేక కారణాలున్నాయని జియాలజిస్టులు అంటున్నారు.

క్రొయేషియా భూగర్భంలో అనేక సున్నపు రాతి ఖనిజాలు ఉన్నాయని, వాటి కారణంగానే అడుగున బోలు ఏర్పడి ఇలా గుంతలు ఏర్పడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

11 మిలియన్ సంవత్సరాల కిందట ఇక్కడ సరస్సు ఉండేదని, కాలక్రమంలో అది కనుమరుగై అక్కడ బంకమట్టి గట్టి పొరగా మారిందని భూగర్భవేత్తలు ఊహిస్తున్నారు.

ప్రస్తుతం సింక్‌హోల్స్ ఏర్పడిన గ్రామాలు 10 నుంచి 15 మీటర్ల ఎత్తులో ఉన్న బంకమట్టి, ఇసుక, రాళ్ల మీద ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో ఏర్పడిన భూకంపాలు ఈ సింక్‌హోల్ పరిణామాలను వేగవంతం చేశాయని నిపుణులు వెల్లడించారు. తక్కువ స్థాయి భూకంపాలు వచ్చినప్పుడు సింక్‌హోల్స్ ఏర్పడటం ప్రారంభించాయని, పెద్ద భూకంపంతో అవి బయటపడ్డాయని భూగర్భ నిపుణులు చెప్పారు.

భూకంపాల కారణంగా భూగర్భ నీట ప్రవాహాల్లో మార్పులు వచ్చి ఈ సింక్‌హోల్స్ ఏర్పడే అవకాశం కూడా ఉందని, నీరు అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ప్రవహించినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని జాగ్రెబ్ యూనివర్సిటీలో జియో ఫిజిస్ట్‌గా పని చేస్తున్న టోమెల్జెనోవిక్ అభిప్రాయపడ్డారు.

కొన్ని ప్రాంతాలలో ఇళ్లకు సమీపంలో కూడా సింక్ హోల్స్ ఏర్పడ్డాయి.

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంటి పక్కనే ఏర్పడిన సింక్‌హోల్

గుర్తించవచ్చా?

''ఒక సింక్‌హోల్ కారణంగా నీటి ప్రవాహంలో మార్పులు మరికొన్ని సింక్‌హోల్స్‌ ఏర్పడటానికి కారణం కావచ్చు'' అని జియో ఫిజిస్ట్‌ టోమెల్జెనోవిక్ అన్నారు.

సరైనా డేటా అందుబాటులో లేకపోవడం వల్ల భూకంపాలకు, సింక్‌హోల్స్‌ మధ్య ఉన్న సంబంధాన్ని నిపుణులు పూర్తి స్థాయిలో నిర్ధరణ చేయలేకపోతున్నారు.

సింక్‌హోల్స్ ఎప్పుడు, ఎక్కడ ఏర్పడతాయో చెప్పడం కష్టమని కూడా వారు చెబుతున్నారు.

''క్రొయేషియా అనుభవాలను బట్టి, భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో సింక్‌హోల్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది'' అని న్యూమెక్సికోలోని 'ది నేషనల్ కేవ్ అండ్ క్రాస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌'కు చెందిన జియాలజిస్ట్ జార్జ్ వేని అన్నారు.

''అయితే సింక్‌హోల్స్‌ను ముందుగానే గుర్తించే టెక్నాలజీ విషయంలో ఇంకా చాలా పరిశోధన జరగాల్సి ఉంది'' అని అన్నారు వేని.

రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సింక్‌హోల్స్ ఏర్పడే ప్రమాదం ఉండొచ్చని ఈశాన్య క్రొయేషియా ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

''భూగర్భ జల ప్రవాహాల్లో మార్పులు వస్తున్నంత కాలం, భూ ప్రకంపనలు వచ్చినంత కాలం ఇలాంటి గుంతలు ఏర్పడుతూనే ఉంటాయి'' అని స్టిపెవిక్ అన్నారు.

వీడియో క్యాప్షన్, భూమి మీదున్న నరక ద్వారాన్ని చూశారా

ఎలా పూడ్చాలి?

ప్రస్తుతం బోరోజెవిక్ తోటలో ఉన్న సింక్‌హోల్ టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారింది. అయితే ఈ సింక్‌హోల్‌ను పూడ్చివేయాల్సి ఉంది.

''ఇదొక ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్ని పూడ్చటానికి ఎంచుకునే పదార్ధాలను కూడా జాగ్రత్త పరిశీలించాలి. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన మంచినీటి సరఫరా వనరులు ఉన్నాయి. అవి కలుషితం కాకుండా చూసుకోవాలి'' అని సివిల్ ప్రొటెక్షన్ క్రైసిస్ యూనిట్‌కు చెందిన దావోర్ జుబిసిస్ అన్నారు.

పూడ్చివేతకు సిమెంట్‌లాంటివి ఉపయోగించడం మంచిది కాదని, పెద్దపెద్ద బండరాళ్లను, తర్వాత కంకరను నింపాలని జాగ్రెబ్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీర్ మారియో బాసిక్ వెల్లడించారు.

కాకపోతే ఇది చాలా ఖరీదైన వ్యవహారం. దీన్ని నింపాలంటే దాదాపు 2లక్షల యూరోలు (భారతీయ కరెన్సీలో దాదాపు రెండు కోట్ల రూపాయలు) ఖర్చవుతుంది.

''నేను దీన్ని చేపల చెరువుగా మారుస్తా'' అని సరదాగా అన్నారు బోరోజెవిక్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)