చల్లని నీటిలో స్నానం చేస్తే మైండ్, బాడీ ఫ్రెష్ అయిపోతాయా... సైన్స్ ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ మైకేల్ మోస్లీ
- హోదా, బీబీసీ సిరీస్ జస్ట్ వన్ థింగ్
మీరు అప్పటివరకూ అనుభవించిన ఒత్తిడిని మాయం చేసి, మిమ్మల్ని హుషారుగా మార్చేయడమే కాకుండా మీలో రోగ నిరోధక శక్తిని పెంచే పని ఏదైనా చేయాలనుకుంటున్నారా?
అయితే, మీరు కాస్త ధైర్యంగా ఉండాలి. దృఢ చిత్తంతో ఉండగలం అనుకుంటే చలి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక సరస్సు, నది, లేదా సముద్రపు ఒడ్డున నిలబడండి.
అంత అదృష్టం కనుక మీకు లేకపోతే, మీ ఇంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్, షవర్ లేదంటే కొళాయి అయినా ఫర్వాలేదు.
దీర్ఘమైన శ్వాస తీసుకుని, మీ మానసిక శక్తినంతా కూడదీసుకుని, మిమ్మల్ని మీరు ఆ నీటికి సమర్పించుకోండి. మీ శరీరానికి చల్లని నీటి స్పర్శను అందించండి.
ఇప్పుడొక సందేహం. వేడి నీటితో స్నానం చేస్తే హాయిగా ఉన్నప్పుడు చన్నీటి స్నానంతో శరీరాన్ని కష్టపెట్టడమేందుకు ? దీనికీ ఒక కారణంఉంది.
చన్నీటి స్నానం శరీరాన్నీ, మనసునీ ఉత్తేజితం చేస్తుందనే వాదనకు ఇటీవల ప్రాముఖ్యం పెరుగుతోంది. శాస్త్రవేత్తలు చన్నీటి స్నానం వల్ల శారీరకంగా కలిగే మార్పుల గురించి అధ్యయనం చేస్తున్నారు.
చల్లటి నీటి వల్ల ఆశ్చర్యం కలిగించే ప్రయోజనాలు ఉంటాయని వీరి అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది నిజంగా ఆసక్తి కలిగించే అధ్యయనం. ఈ పరిశోధన ద్వారా బీపీ, మధుమేహం, మానసిక ఒత్తిడి, తీవ్రమైన శ్లేష్మరోగాల లాంటి రకరకాల సమస్యలకు కొత్త రకమైన చికిత్సలను కనుగొనే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా ?
చన్నీటి స్నానం వెనుక ఉన్న శాస్త్రీయత గురించి కాస్త లోతుగా అర్ధం చేసుకుందాం. చల్లటి నీరు మీ మానసిక స్థితిని మెరుగుపరిచి మీ మెదడు, రోగ నిరోధక వ్యవస్థ, గుండెకు ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం.
చల్లటి నీరు శరీరానికి ఒత్తిడిని కలుగచేస్తుంది. అయితే, తనకు హాని జరిగేటప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి స్పందించే స్వభావం శరీరానికి సహజంగానే ఉంటుందట.
కొన్ని సందర్భాలలో మెదడు నుంచీ కాలి బొటన వేళ్ల వరకూ కూడా శరీరం ఒకేసారి స్పందిస్తుంది.
శరీరం చన్నీటిని ఒక పెద్ద ముప్పులా చూడటంతో, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అది సన్నద్ధమవుతుంది. మీ గుండె దడ రాకెట్ వేగంలో పెరిగి, మీలో అడ్రినలిన్ ఉత్తేజితమవుతుంది.
మీ శరీరంలోని కొన్ని భాగాల్లో రక్త నాళాలు సెకండ్ల వ్యవధిలోనే కుంచించుకు పోయి, విచిత్రంగా ఆకారాన్ని మార్చుకునేందుకు అనేక రకాల ట్రిక్స్‌ను అవలంబించడం మొదలుపెడతాయి. కొంత మందిలో ఇవి రెట్టింపు పరిమాణంలో వ్యాకోచిస్తాయి.
ఇదంతా శరీరం తనను తాను కాపాడుకోవడానికి వివిధ రకాలుగా స్పందించే తీరు.
కానీ, ఆగండి!
ఒత్తిడి శరీరానికి మంచిది కాదు అన్నది కూడా గమనించాలి. ప్రశాంతమైన ఉదయాన్ని వేడి వేడి టీ తాగుతూ ఆస్వాదించకుండా శరీరానికి ఒత్తిడి, ఇబ్బంది చేకూర్చే స్థితిలోకి నెట్టాల్సిన అవసరం ఏంటి?
నిజానికి, తీవ్రమైన ఒత్తిడి మంచిది కానప్పటికీ, సరైన మోతాదులో కలిగే తేలికపాటి ఒత్తిడి శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చాలా తక్కువ మోతాదులో...
శరీరానికి తేలికపాటి ఒత్తిడి మంచిదేనని ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు నలుగురిలో ప్రసంగించడం నుంచి మనసులోనే లెక్కలు చేయడం లాంటి వివిధ పరిస్థితులను శాస్త్రవేత్తలు విశ్లేషించినప్పుడు ఇది నిజమేనని తేలింది.
చన్నీటి స్నానం వల్ల శరీరం కొంత సేపు ఒత్తిడికి గురైనప్పటికీ, శరీరం స్పందించే తీరు వల్ల లాభాలు కూడా ఉంటాయని అధ్యయనం చెబుతోంది.
శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ నుంచీ, ఒత్తిడి కలిగించే హార్మోన్లు, గుండె నాళాలను బ్లాక్ చేసే కొవ్వు నిల్వల వరకూ చన్నీటి స్నానం ప్రభావితం చేసే తీరును ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
ఇది పూర్తిగా కొత్త తరహా అధ్యయనం. కానీ, ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలయితే ఆశావహంగా ఉన్నాయి.
శీతాకాలంలో ఈత కొట్టేవాళ్ళు కొన్ని రకాల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఇన్ఫెక్షన్లకు లోను కాకుండా ఉంటారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ కూడా అది చాలా తేలికపాటి స్థాయిలో ఉంటుంది.
ఈ లాభాలకు, ఈత కొట్టడం కంటే కూడా చన్నీరే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మెదడుపై ప్రభావం
60 రోజుల పాటు ప్రతీ రోజూ పొద్దునే 30 సెకండ్ల పాటు చన్నీటి స్నానం చేయమని ఈ ప్రయోగాలలో పాల్గొంటున్న కొందరు వలంటీర్లకు సూచించారు. అయితే, వీరు సాధారణ స్నానం చేసిన కంట్రోల్ గ్రూప్ సభ్యుల కంటే 30 శాతం తక్కువ జబ్బు పడినట్లు శీతాకాలంలో నెదర్‌లాండ్స్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తెలిసింది.
చన్నీటి స్నానం చేయడం వల్ల అది శరీరం, మెదడు పై సానుకూల ప్రభావాన్ని చూపించి ఆ ప్రభావం ఎంత కాలం ఉంటుందనే విషయంపై పోర్ట్స్ మౌత్ యూనివర్సిటీలో హ్యూమన్ అండ్ అప్లైడ్ సైకాలజీ ప్రొఫెసర్ మైక్ టిప్‌టన్ పరిశోధిస్తున్నారు.
చన్నీటితో స్నానం చేసే వారికి రోగ నిరోధక వ్యవస్థ మెరుగయిందని, అది కేవలం బయట చెరువుల్లో, నదుల్లో స్నానం చేసేవారికి మాత్రమే పరిమితం కాదని ఈ అధ్యయనం సూచిస్తోందని తెలిపారు.
అలాగే, చన్నీటితో తక్కువ సమయం గడపడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని కూడా ఆయన చెప్పారు. "ఈ అనుభవం ఇష్టం లేని వారికి ఇదొక శుభవార్త" అన్నారాయన.
"శరీరం చల్లబడటం వల్ల ఈ లాభాలు చేకూరుతూ ఉండవచ్చు కానీ, చన్నీటిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల హైపోథెర్మియాకు దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చన్నీటిలో ఉండటం వల్ల ఇబ్బందులు పడే వారిలో మీరూ ఒకరైతే మాత్రం చన్నీళ్లలో 120 సెకండ్ల పాటు ఉంటే చాలని టిప్‌టన్ చెప్పారు.
"అయితే, ఇది వ్యక్తికీ వ్యక్తికీ మధ్య భిన్నంగా ఉంటుంది. సాధారణంగా చన్నీటి నుంచి దూరంగా ఉండాలనుకునే వారు కనీసం ఒక్క నిమిషం నుంచీ 90 సెకండ్ల వరకూ చన్నీళ్లలో ఉండమని సూచిస్తాం" అని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మనసును ఉత్తేజితం చేసేందుకు..
చన్నీటిలో మునిగి తేలిన తర్వాత డోపమైన్, సెరోటైనిన్, బి ఎండార్ఫిన్‌ల స్థాయిలు పెరిగినట్లు తేలింది. అలాగే, చన్నీటి స్నానం చేసిన తర్వాత మానసిక ఒత్తిడి తగ్గడానికి తీసుకునే యాంటీ డిప్రెసంట్ ల అవసరం తగ్గిపోయిందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
చన్నీటికి అలవాటు పడటం వల్ల శరీరంలో కలిగే ఇన్‌ఫ్లమేషన్స్ (మంటలు) లాంటి వాటిని ఎంత వరకు తగ్గిస్తుందనే అంశాలను కూడా కొన్ని అధ్యయనాలు పరిశీలిస్తున్నాయి.
ఆధునిక కాలంలో చోటు చేసుకుంటున్న బీపీ, మానసిక ఒత్తిడి, అల్జెమీర్స్ , టైప్ 2 డయాబెటిస్ లాంటి వాటికి ఇదే కీలకం.

ఫొటో సోర్స్, Getty Images
చన్నీటి స్నానం ప్రభావం ఎంత సేపుంటుంది?
చన్నీటితో చేసే చికిత్స ప్రభావం శక్తివంతంగా ఉండి, దీర్ఘకాల ప్రభావాలు చూపిస్తున్నప్పటికీ కూడా ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలు మరింత ముందుకు సాగాల్సి ఉంది.
కేవలం ఆరు సార్లు చన్నీటిలో మునిగి తేలిన తర్వాత శరీరం మీద చూపించిన ప్రభావం ఒక సంవత్సరం తర్వాత కూడా కనిపించినట్లు ఒక అధ్యయనం తేల్చింది.
"దీనిలో శాస్త్రీయత ఇంకా ఆరంభ దశలోనే ఉంది"
"ఇప్పటి వరకు చలి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించి అధ్యయనాలు నిర్వహించారు. కానీ, రెండు వైపులా పదునున్న ఈ కత్తికి అవతల వైపు ప్రభావవంతమైన లాభాలు కూడా ఉన్నాయి".
కానీ, చన్నీటిలో అతిగా గడప కూడదని టిప్‌టన్ హెచ్చరిస్తున్నారు.
‘‘మనం 28 డిగ్రీల ఉష్ణోగ్రతలో బతకాల్సిన ఉష్ణమండల జీవులమని గుర్తు పెట్టుకోవాలి. 9 లేదా 10 డిగ్రీలు ఉన్న నీరు శరీరం మీద పడితే, అది మనల్ని చాలా ఒత్తిడికి లోను చేస్తుంది’’ అని టిప్‌టన్ అన్నారు.
"అంత చల్లటి నీటిలో గడపాలనుకుంటే ఒక్కొక్క చుక్కా నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ ఒక్కొక్క అడుగూ ముందుకు వేయాలి" అని ఆయన అన్నారు.
జాగింగ్ చేయాలని అనుకుంటే, మొదటి రోజే కిలోమీటర్ల దూరం పరుగుపెట్టరు. ముందు వార్మ్‌అప్ అయి, నెమ్మదిగా దూరం పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా అలాంటిదే.
చల్లటి నీటి వల్ల వచ్చే ప్రయోజనాల కోసం గడ్డ కట్టిన నదిలో మునగమని ఎవరూ చెప్పరు. కానీ, పొద్దుటి పూట 30-40 సెకండ్ల పాటు చన్నీటిలో గబుక్కున మునిగి తేలడం సాధ్యమే!
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








