చైనా మిస్టరీ టాయ్స్ యజమాని రాత్రికి రాత్రే 50 వేల కోట్లకు అధిపతి అయ్యాడు... ఎలా?

పాప్ మార్ట్ ఆట బొమ్మలు

ఫొటో సోర్స్, Pop Mart

ఫొటో క్యాప్షన్, పాప్ మార్ట్ ఆట బొమ్మలు
    • రచయిత, జస్టిన్‌ హార్పర్‌
    • హోదా, బీబీసీ బిజినెస్‌ రిపోర్టర్‌

చైనాకు చెందిన ఓ ఆట వస్తువుల కంపెనీ అధిపతి తన సంస్థను స్టాక్‌ మార్కెట్‌లో నమోదు చేశాక ఆయన సంపద అమాంతం పెరిగిపోయింది. ఆ కంపెనీ షేర్ల ధర స్టాక్ మార్కెట్లో అనూహ్యంగా పెరిగింది.

పాప్‌ మార్ట్‌ అనే ఈ బొమ్మల తయారీ కంపెనీని వాంగ్‌నింగ్‌ అనే వ్యాపారి ప్రారంభించారు. ఇప్పుడాయన ఆస్తి 700 కోట్ల డాలర్లు. అంటే, 50 వేల కోట్ల రూపాయలకు పైమాటే.

ఈ కంపెనీ ఒక్కో బొమ్మల పాకెట్‌ను 8 డాలర్లకు అమ్ముతుంది. అయితే, కస్టమర్లు ఆ పాకెట్‌లో ఏముందో ముందే చూసి కొనుక్కోడానికి అవకాశం లేదు. అందుకే దీనికి మిస్టరీ టాయ్‌ అన్న పేరు వచ్చింది.

శుక్రవారం నాడు తన కంపెనీని హాంకాంగ్‌ స్టాక్‌మార్కెట్‌లో పెట్టే సమయానికి ఆ కంపెనీలో వాంగ్‌ వాట 50 శాతం ఉంది. ఇప్పుడు కంపెనీ విలువ 3.2 బిలియన్‌ డాలర్లకు చేరిందని ఫోర్బ్స్‌ ప్రకటించింది.

బీజింగ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ బొమ్మల కంపెనీ షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన 674 మిలియన్‌ డాలర్ల ఆదాయంతో ప్రపంచవ్యాప్తంగా స్టోర్లను తెరవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్టాక్‌మార్కెట్‌లో ప్రవేశించిన వెంటనే వాటి షేర్‌ విలువ వందశాతం పెరిగింది.

పాప్‌మార్ట్ మిస్టరీ బొమ్మలను కొనేవారిలో 75%మంది మహిళలే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాప్‌మార్ట్ మిస్టరీ బొమ్మలను కొనేవారిలో 75%మంది మహిళలే

పాప్‌ మార్ట్‌ ఎందుకంత పాపులర్‌?

“చైనీయులు విపరీతమైన పని ఒత్తిడికి గురవుతుంటారు. వారికి సొంత ఇల్లు కొనుక్కునే తాహతు కూడా ఉండదు. అందుకే వాళ్లు ఖాళీ సమయాలలో చిన్నచిన్న బొమ్మలతో ఆడుకుంటూ వినోదం పొందుతుంటారు’’ అని చైనా మార్కెట్ రీసెర్చ్‌ గ్రూప్‌కు చెందిన షౌన్‌ రీన్‌ అన్నారు.

పాప్‌ మార్ట్ కంపెనీ చైనాకు ఆవల దాదాపు 21 దేశాలలో తన బొమ్మల ఉత్పత్తులను అమ్ముతోంది. ఈ బొమ్మలను కొనేవారిలో 18-35 సంవత్సరాల వయసున్న వాళ్లు ఎక్కువగా ఉంటారు. అందులోనూ 75%మంది మహిళలే.

“చైనాలోని యువతీ యువకులు ఇంట్లో అలంకరణకు వాడే బొమ్మలను బాగా ఇష్టపడతారు. పైగా బాక్స్‌ లోపల ఏముంటుందో అన్న సస్పెన్స్‌ ఎక్కువమంది ఈ బొమ్మలను కొనేలా చేస్తోంది” అన్నారు రీన్‌.

చైనాలో ఈ తరహా బొమ్మలు కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారని, డిజైనర్‌ షూలు, ఈ-స్పోర్ట్స్‌లాంటి హాబీలను కూడా పక్కనబెట్టి వీటిని కొనడాన్ని హాబీగా మార్చుకుంటున్నారని ఆలీబాబా సంస్థకు చెందిన టిమాల్‌ అనే ఈ-కామర్స్‌ సంస్థ వెల్లడించింది.

మార్కెట్‌ లీడర్‌

బొమ్మల మార్కెట్‌లో పాప్‌మార్ట్‌ గత ఏడాది తన ఆదాయాన్ని మూడింతలు పెంచుకుని నంబర్‌ వన్‌ సంస్థగా మారింది. ప్రస్తుతం అది యూనివర్సల్‌ స్టూడియోస్‌, వాల్ట్‌ డిస్నీలాంటి సంస్థలతో లైసెన్సింగ్‌ ఒప్పందాలు, థర్డ్‌ పార్టీ సప్లయర్స్‌తో చర్చలు జరుపుతోంది.

ఈ మిస్టరీ టాయ్‌ సంస్కృతికి జపాన్‌ మూలాలున్నాయి. పాప్‌ కల్చర్‌తోపాటు, ట్రెండీ కంటెంట్‌తో మార్కెట్‌ను పెంచుకున్నపాప్‌మార్ట్‌ కంపెనీ గత ఏడాది 20.7 బిలియన్‌ యువాన్‌ల విలువైన సంస్థగా ఆవిర్భవించిందని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఫ్రాస్ట్ అండ్‌ సలివాన్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)