ఈ బోర్డర్‌లో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం ఎందుకంత కష్టం?

గంజాయి రవాణ మార్గం

ఫొటో సోర్స్, ALEXANDROS AVRAMIDIS

ఫొటో క్యాప్షన్, గంజాయి రవాణ మార్గం
    • రచయిత, కోస్టాస్ కౌకౌమకాస్
    • హోదా, ఏథెన్స్

‘‘మనం ఇప్పుడు వాళ్ల ఇలాకాలో అడుగుపెట్టాం’’ అని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగంలో పనిచేసే ఆ ముగ్గురు గ్రీక్ అధికారుల్లో ఒకరు చెప్పారు.

వెంటనే ముగ్గురూ చేతుల్లో తుపాకులను సిద్ధం చేసుకోవడంతో పాటు బులెట్ ప్రూఫ్ జాకెట్లూ వేసుకున్నారు.

అక్కడి నుంచి కొంచెం దూరం ముందుకెళ్తే అల్బేనియాతో సరిహద్దు వస్తుంది.

అక్కడంతా కొండలు, గుట్టలు, అడవి. సరిహద్దు ఏమాత్రం పటిష్టమైనది కాదు.

ఐరోపా ఖండంలోనే అత్యంత భారీ స్థాయిలో గంజాయి రవాణా జరిగే భూమార్గమూ అదే.

అక్కడే గ్రీస్‌కి చెందిన సరిహద్దు గ్రామం హరావ్‌గీ లొయానియానా ఉంటుంది.

కానీ, సరిహద్దును గుర్తించేలా కనీసం ముళ్ల కంచె కూడా లేదక్కడ.

‘‘సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న గ్రామాలకు చెందిన అల్బేనియన్లు సరిహద్దు దాటి గ్రీస్‌లోకి కాలి నడకనే గంజాయి రవాణా చేస్తారు’’ అని గ్రీకు అధికారి లాంబ్రోస్ సౌమానిస్ చెప్పారు.

లాంబ్రోస్ ఎక్కువగా ఈ పర్వత ప్రాంతాలలో గస్తీ తిరుగుతుంటారు.

‘‘వాళ్లు గట్టిపిండాలు. ఇక్కడి దొంగదారులన్నీ వారికి తెలుసు. అంతేకాదు.. ఈ అడవిలో రోజుల తరబడి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండిపోగలరు’’ అని లాంబ్రోస్ చెప్పారు.

గ్రీకు పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు 1.5 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అంతకుముందు రెండేళ్లలో వారు 9 టన్నుల గంజాయిని పట్టుకున్నారు.

గంజాయి బస్తాలు
ఫొటో క్యాప్షన్, గంజాయి బస్తాలు

రహస్య ప్రాంతాల్లో దాచి..

ఈ మార్గంలో అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు చేతుల్లో కలష్నికోవ్ రైఫిళ్లు పట్టుకుని భుజాన 40-50 కేజీల గంజాయి మోసుకుంటూ సరిహద్దుల్లోకి వస్తారు.

అక్కడ అడవిలో ఆనవాళ్లు గుర్తించడానికి వీలుగా కొన్ని పెద్దపెద్ద చెట్ల వద్ద రహస్యంగా ఈ మూటలు దాస్తారు.

వీరికి అనుబంధంగా పనిచేసే గ్రీసులోని ముఠా సభ్యులు అక్కడి నుంచి ఆ మూటలను తమ దేశంలోకి తరలిస్తారు.

అల్బేనియాలో కేజీ గంజాయి టోకు ధర సుమారు రూ. 60 వేలకుపైనే ఉంటుంది.

గ్రీస్, ఇటలీలో అంతకు రెట్టింపు ధర చెల్లించి కొనుగోలు చేస్తారు.

పోలీసుల గస్తీ

ఫొటో సోర్స్, gettyimages

ఫొటో క్యాప్షన్, పోలీసుల గస్తీ

పోలీసులతో యుద్ధం

సరిహద్దులకు రెండు వైపులా పోలీసులు నిత్యం దాడులు చేస్తుంటారు కానీ ఈ అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు.

2014 వేసవిలో గ్రీస్ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో అల్బేనియాలోని లాజరత్ అనే గ్రామంలో అల్బేనియా ప్రత్యేక దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి.

గంజాయి అక్రమ రవాణాదారులతో అనేక రోజుల పాటు పోరు సాగింది.

ఈ ప్రత్యేక దళాలపై గంజాయి అక్రమ రవాణా ముఠాలు రాకెట్ లాంచర్లు, గ్రనేడ్లు, మోర్టార్ షెల్స్ కాల్చాయి.చివరకు దళాలు 10 టన్నులకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు భారీ విస్తీర్ణంలో గంజాయి పంటనూ నాశనం చేశారు.

ముఠాల నుంచి ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నారు.

అయినప్పటికీ పరిస్థితులు ఏమీ మారలేదు. 2016 నాటికి అల్బేనియాలో గంజాయి ఆధారిత ఆర్థిక వ్యవస్థ దేశమంతా విస్తరించేసిందని ‘గ్లోబల్ ఇనిషియేటివ్ ఎగినెస్ట్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైం’ తెలిపింది.

‘బాల్కన్స్’ ప్రాంతం ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత వ్యవస్థీకృత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మార్గాలకు పేరుగాంచింది.

ఇప్పుడు అల్బేనియాలోని గ్రామీణులకు సాగు వల్ల, వ్యవస్థీకృత నేర ముఠాలకు యూరోపియన్ యూనియన్ అంతటా విక్రయాల వల్ల గంజాయి లాభదాయకంగా మారిపోయింది.

అల్బేనియాలో ఈ తరానికి గంజాయి అక్రమ రవాణా అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది.

అల్బేనియా యువత పెద్ద ఎత్తున గంజాయిని అక్రమంగా గ్రీస్‌లోకి రవాణా చేస్తున్నారు

ఫొటో సోర్స్, Greek police

ఫొటో క్యాప్షన్, అల్బేనియా యువత పెద్ద ఎత్తున గంజాయిని అక్రమంగా గ్రీస్‌లోకి రవాణా చేస్తున్నారు

ఇదీ సాగు కథ..

ఒక ఉత్పత్తిదారు కథ39 ఏళ్ల అర్తాన్ అల్బేనియాలోని గంజాయి ఉత్పత్తిదారుల్లో ఒకరు.

తీర ప్రాంత నగరం వ్లోర్‌లోని బార్‌లో కూర్చుని మాట్లాడుతూ ఆయన... మీరు పోలీసులకు దొరికిపోయేవరకు ఎంతలా సంపాదించవచ్చో వివరిస్తాడు.

‘మీరు లోకల్ పోలీస్ చీఫ్‌కో, డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీకో లంచం ఇవ్వొచ్చు. కానీ, ఎవరైనా మిమ్మల్ని వెంటాడితే ఏమీ చేయలేరు’’ అంటాడు.

అర్తాన్ అనేది ఆయన అసలు పేరు కాదు. రెండేళ్ల పాటు ఇటలీలో ఉన్న ఆయన ఆ తరువాత అల్బేనియా వచ్చి ఇంటి నుంచే ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు.

‘‘ఈ ఏడాది టెపెలీనా ప్రాంతంలో మంచి భూమి దొరికింది. అక్కడ 50 వేలకు పైగా గంజాయి మొక్కలు వేశాను. కొండల్లో 3 గంటల ప్రయాణం అక్కడికి’’ అని అర్తాన్ చెబుతున్నాడు.

50 వేల మొక్కలంటే చాలా ఎక్కువే. ‘నీటి లభ్యత, పోలీసుల కంటపడకపోవడం, ఓపిక పట్టడం గంజాయి సాగులో మూడు కీలకాంశాలు’పొలానికి 2 కిలోమీటర్ల దూరంలోని నీటి వనరు నుంచి నీటిని పారిస్తాడు అర్తాన్.

ఆయన తండ్రి ఎరువులు తీసుకొస్తాడు. దాంతో అర్తాన్ ఎక్కడా సీసీ టీవీలకు దొరికే అవకాశం లేదు. గంజాయి పంట చేతికందాక అక్కడి నుంచి గ్రీస్ సరిహద్దులకు రహస్యంగా తరలిస్తారు.

అక్కడి నుంచి స్మగ్లర్లు కాలినడకనర కానీ కంచరగాడిదలపై కానీ గ్రీసులోకి అక్రమంగా రవాణా చేస్తారు.

అల్బేనియా సరిహద్దు వద్ద గస్తీ

ఫొటో సోర్స్, ALEXANDROS AVRAMIDIS

ఫొటో క్యాప్షన్, అల్బేనియా సరిహద్దు వద్ద గస్తీ

చట్టబద్ధం చేసే ప్రయత్నాలు

మాదక ద్రవ్యాలపై పోరు ఆపేది లేదని అల్బేనియా ప్రధాని ఈడీ రమా చెప్పుకొస్తున్నారు.

కానీ, ఆ తరువాత ఆయన వైఖరి కాస్త మారడంతో గంజాయి ఉత్పత్తిదారులు కొత్త మార్కెట్లపై దృష్టి పెట్టారు.

గ్రీస్, ఇటలీయే కాకుండా టర్కీ, జర్మనీ, నెదర్లాండ్స్, బ్రిటన్‌లో వ్యాపారాన్నీ కోరుకుంటున్నారు.

ఈ అక్రమ వ్యాపారాన్ని చట్టబద్ధం చేసి ఆదాయ వనరుగా మార్చేందుకు అల్బేనియా ప్రధాని ప్రయత్నిస్తున్నారు.

వైద్య అవసరాలకు గంజాయిని చట్టబద్ధం చేస్తూ అక్రమ సాగును నియంత్రించేలా బిల్లు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మే నెలలో అల్బేనియా ప్రధాని ప్రకటించారు.

అల్బేనియా ఇప్పుడు వ్యవస్థీకృత నేరాలు, అవినీతిని కట్టడి చేయడమే కాదు అలా చేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్‌ను ఒప్పించాలి కూడా.

మరోవైపు అల్బేనియా పొరుగు దేశాలలో మాదక ద్రవ్యాల విషయంలో తీసుకొచ్చిన మార్పులు ఏమంత ఫలితం ఇవ్వలేదు.

పారిశ్రామిక, వైద్య అవసరాలకు గంజాయి వినియోగాన్ని గ్రీసులో చట్టబద్ధం చేశారు.

కానీ ఆర్థికంగా ఆ ప్రభావం నామమాత్రమే. ఉత్తర మాసిడోనియాలోనూ వైద్య అవసరాలకు గంజాయి వినియోగం చట్టబద్ధం చేసినా గంజాయి మొగ్గలు, నూనె నిల్వలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి.

ఇది అక్రమ వ్యాపారానికి దారి తీస్తుంది.గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించడానికి అల్బేనియా పోలీసులు డ్రోన్లు కూడా వాడుతున్నప్పటికీ సరిహద్దు ప్రాంతమంతా దట్టమైన అడవి కావడంతో వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)