టెడ్ గోయి: రెండు సార్లు... బికారి నుంచి బిలియనీర్‌గా ఎదిగిన డోనట్ కింగ్

ఫొటో సోర్స్, Greenwich Entertainment
- రచయిత, విబిక్ వినిమా
- హోదా, బీబీసీ ప్రతినిధి
టెడ్ గోయి హై స్కూలు విద్యార్థిగా ఉన్న వయసులో నోమ్ పెన్‌లో ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి కూతురు సుగంథిని కోయున్ని తొలిసారి చూశారు.
"ఆమె చాలా అందంగా ఉంటారు. అంత కన్నా అందమైన అమ్మాయిని మీరెక్కడా చూడలేరు" అని ఆయన ఆమెను తలచుకుంటూ అన్నారు.
"స్కూలులో అబ్బాయిలందరూ ఆమెను ప్రేమించేవారు. థాయ్ సరిహద్దుల నుంచి వచ్చి సగం చైనా జాతీయత ఉన్న ఒక పేద విద్యార్థిగా ఆమె ప్రేమను పొందడం నాకు పూర్తిగా అసాధ్యమైన పని. ఆమె రాచరికపు రాణిలా చాలా శక్తివంతంగా ఉండేవారు. ఆమె చుట్టూ ఎప్పుడూ చాలా మంది సంరక్షకులు ఉండేవారు" అని టెడ్ చెప్పారు.
కానీ, టెడ్ నివాసం ఉండే ప్రాంతం నుంచి సుగంథిని నివసించే భవంతి కనిపిస్తూ ఉండేది. ఆయనకు ఒక రోజు అవకాశం దొరికింది. ప్రతీ సాయంత్రం ఆయన కిటికీ దగ్గర కూర్చుని వేణువు ఊదడం మొదలు పెట్టారు. ఆ వేణువు ఎవరు ఊదుతున్నారో తెలియదు కానీ, వారు తప్పనిసరిగా ప్రేమలో మునిగిపోయి ఉంటారని సుగంధిని తల్లి అనేవారు.
ఒక రోజు రాత్రి సుగంథినిని వాళ్ళ బాల్కనీలో చూశారు. ఆయన అభిప్రాయం చెప్పడానికి ఇదే సరైన సమయమని ఆయనకు తోచింది. ఆయన వెంటనే ప్రతి రోజూ వేణువు ఊదే తాను ఎదురుగా ఉండే ఇంట్లో నివసిస్తానని చెబుతూ ఒక లేఖ రాశారు.
ఆ లేఖను ఒక రాయికి కట్టి దానిని ఆమె బాల్కనీలోకి విసిరేశారు. అటు నుంచి చాలా రోజుల వరకు ఎటువంటి సమాధానం రాలేదు. కానీ, ఒక రోజు సుగంధిని ఇంట్లో పని చేసే మనిషి సమాధానం పట్టుకుని టెడ్ ఇంటి ముంగిట నిల్చున్నారు.

ఫొటో సోర్స్, Ted Ngoy
సుగంధిని రాసిన లేఖలో "మీరు వేణువు ఊదడాన్ని నేను అభినందిస్తున్నా. మీ సంగీతం హృదయాన్ని తాకుతుంది" అని రాశారు. అప్పటి నుంచి నేనామెతో సంభాషించడం మొదలు పెట్టాను.
"నేనిప్పుడు నీ గది లోకి దూకి వస్తే ఏం జరుగుతుంది?’ అని ఒక రోజు సందేశం పంపాను. ‘జాగ్రత్త! ఒక వేళ నా గదిలోకి దూకలేకపోతే మీరు వెళ్లి మా అమ్మ గదిలో పడతారు’ అని సుగంధిని సమాధానం ఇచ్చారు" అని టెడ్ చెప్పారు.
టెడ్ హాస్యంగా ఈ మాటలు అంటున్నారని ఆమె అనుకున్నారు. కానీ, ఒక వర్షం కురుస్తున్న రాత్రి టెడ్ ఒక కొబ్బరి చెట్టు ఎక్కి బాత్రూం కిటికీ ద్వారా దారి చేసుకుని సుగంధిని గదిలోకి వెళ్లిపోయారు.
ఆమెను నిద్ర లేపగానే ఆమె సహాయం కోసం అరవబోయారు. అంతలో అది టెడ్ అని ఆమెకు అర్ధం అయింది.
ఇక్కడేమి చేస్తున్నావని ఆమె ప్రశ్నించారు?
"నేను నీతో ప్రేమలో పడ్డాను" అని టెడ్ సమాధానమిచ్చారు.
"రేపు పొద్దున్న నేను స్కూలుకు వెళ్ళాలి" అని ఆమె చెప్పగానే, ‘‘నువ్వు విచారించకు. నేను నీ మంచం కింద దాక్కుంటాను" అని ఆయన అలాగే చేశారు.
ఆ రాత్రి సుగంధిని గదిలోకి ఆహారం తీసుకుని వచ్చి టెడ్‌కి ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా టెడ్‌తో ప్రేమలో పడ్డారు. వారిద్దరూ ఒకరికొకరంగా ఉంటామని రక్త ప్రమాణాలు చేసుకున్నారు. అలా ఆమె టెడ్‌ని తన గదిలో 45 రోజుల పాటు దాచి ఉంచారు. కానీ, ఒక రోజు ఈ విషయం బయటపడింది.
సుగంధినిని ప్రేమించటం లేదని చెప్పమని ఆమె కుటుంబం టెడ్ పై ఒత్తిడి తెచ్చింది. ఆయన వాళ్ళు చెప్పినట్లే చేశారు. కానీ, ఒక కత్తి తీసుకుని తనను తాను పొడుచుకుని ఆమె లేకుండా బ్రతకడం కంటే చావడమే మేలు అని ఆయన ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, సుగంధిని కూడా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆమె పట్టుదల చూసి ఆమె కుటుంబం వారి ప్రేమకు అంగీకారం తెలిపారు.

ఫొటో సోర్స్, Ted Ngoy
"అదొక విచిత్రమైన కథ. కానీ, అది నిజం. నేనామెను నిజంగా ప్రేమించాను" అని ఇప్పుడు 78 సంవత్సరాల వయసున్న టెడ్ చెప్పారు.
సుగంధిని హృదయం గెలుచుకోవడం వలన ఆయనకు మంచి జీవితం లభించిందనే విషయాన్ని ఆయన అంగీకరించారు.
వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1970లో ప్రభుత్వానికి, పోల్ పాట్ సారథ్యం వహిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ మెర్ రోజ్ మధ్య అంతర్యుద్ధం మొదలయ్యే వరకు వారి జీవితం సాఫీగానే సాగింది.
నాలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్న టెడ్‌కి సుగంధిని బావగారు జనరల్ సక్ సుత్సకాన్ థాయిలాండ్‌లో లైజన్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పించారు. ఆయన వెంటనే మేజర్ హోదాలో బ్యాంకాక్ వెళ్లారు. ఆయన సైన్యానికి ఇవ్వవలసిన జీతాలు తీసుకునేందుకు ప్రతీ నెలా కంబోడియా వచ్చి వెళుతూ ఉండే వారు.
కానీ, ఆయన ఆఖరు సారి కంబోడియా వచ్చేటప్పటికి అక్కడి పరిస్థితి చాలా ప్రమాదకరంగా కనిపించింది. ఏప్రిల్ 1975లో రాజధాని కూలిపోయింది. టెడ్ ఎలాగో ఒకలా ఆఖరి విమానం పట్టుకుని నోమ్ పెన్ నుంచి బయటపడగలిగారు కానీ, సుగంధిని తల్లి తండ్రులు మాత్రం వెనకే ఉండిపోయారు. మెర్ రోజ్ ఉరి తీసిన వారిలో సుగంధిని తల్లి తండ్రులు కూడా ఉన్నారని ఆమెకు తర్వాత తెలిసింది.
సరిగ్గా ఇది జరిగిన ఒక నెల రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు జెరాల్డ్ ఫోర్డ్ వియత్నాం, కంబోడియా నుంచి వచ్చిన 1,30,000 మంది శరణార్ధులకు తమ దేశానికి ఆహ్వానం పలికారు.
"అమెరికా ప్రపంచ వ్యాప్తంగా వలస వచ్చిన రకరకాల వ్యక్తులతో తయారయిన దేశం. మేమెప్పుడూ మానవత్వం కలిగిన దేశంగానే వ్యవహరిస్తూ వచ్చాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Ted Ngoy
టెడ్, సుగంధిని తమ ఆస్తులన్నిటినీ అమ్ముకుని తమ ముగ్గురి పిల్లలు, పెంచుకున్న మేనల్లుడు, ఆమె సోదరి పిల్లలు ఇద్దరిని తీసుకుని.. తొలి శరణార్థులతో వచ్చిన విమానంలో కాలిఫోర్నియా చేరుకున్నారు. వీరంతా కలిసి క్యాంప్ పెండెల్టన్ లో త్వర త్వరగా నిర్మించిన ఒక శరణార్థ శిబిరంలో తల దాచుకున్నారు. ఆ శిబిరం వదిలి వీళ్ళు పని వెతుక్కోవాలంటే ఎవరైనా అమెరికా పౌరులు వాళ్లను స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది.
కొన్ని వారాల పాటు మిగిలిన కుటుంబాలు శరణార్థ శిబిరాన్ని వదిలి వెళ్లడం చూస్తూ ఉన్నారు. చివరకు వీరికి కూడా శిబిరం వదిలి వెళ్ళడానికి ఒక రోజు అవకాశం వచ్చింది.
టస్టిన్ లో ఉన్న ఒక చర్చి పాస్టర్ వీరికి స్పాన్సర్ చేయడానికి అంగీకారం తెలిపారు. అక్కడ టెడ్ చర్చిలో జానిటర్ గా చేరారు. కానీ, అక్కడ ఆయనకు వచ్చే 500 డాలర్ల సంపాదన కుటుంబ పోషణకు సరిపోదని టెడ్‌కి అర్ధమయింది. పాస్టర్ అంగీకారంతో సేల్స్ పర్సన్‌గా, పెట్రోల్ పంపులో పని చేసేందుకు ఆయన మరో రెండు ఉద్యోగాలు వెతుక్కున్నారు.
ఆ పెట్రోల్ పంపు పక్కనే డికె డోనట్ షాపు ఉండేది. అక్కడ తిన్న డోనట్ టెడ్‌కి ఇంటిని గుర్తు చేసింది. ‘‘నోమ్ కాంగ్ అనే ఫ్రైడ్ పేస్ట్రీ ఇంటి మీద బెంగను తెచ్చింది" అని టెడ్ చెప్పారు.
అక్కడ పని చేస్తున్నంత సేపు అక్కడకు వచ్చే వారు కాఫీ, డోనట్ కొనుక్కోవడాన్ని టెడ్ గమనించారు. అది మంచి వ్యాపారం అని ఆయన గుర్తించారు. ఒక 3,000 డాలర్లు ఉంటే డోనట్ షాపును కొనుక్కోగలమా అని ఆ షాపు యజమానిని ప్రశ్నించారు. ఆ డబ్బును విసిరేస్తానని ఆమె సమాధానమిచ్చారు. కానీ, ఆమె ఒక డోనట్ చెయిన్ నడుపుతున్న 'వించెల్' అనే సంస్థ నిర్వహిస్తున్న డో నట్ తయారీలో శిక్షణ గురించి టెడ్‌కి చెప్పారు. దాంతో టెడ్ వాళ్ళ తొలి తూర్పు ఆసియా దేశపు శిక్షకునిగా చేరారు.

ఫొటో సోర్స్, Ted Ngoy
"నేను డోనట్ తయారు చేయడం, జీతాల నిర్వహణ, శుభ్రం చేయడం, అమ్మకాలు అన్నీ నేర్చుకున్నాను" అని చెప్పారు. డో నట్స్ ని తక్కువ తక్కువగా చేయడం వలన అవి ఎప్పుడూ తాజాగా ఉంటాయనే కిటుకును నేర్చుకున్నారు. బేకింగ్ సువాసనే అత్యుత్తమమైన ప్రచారం" అని ఆయన అంటారు.
ఆయన మూడు నెలల పాటు శిక్షణ పూర్తి చేసిన తర్వాత వించెల్ ఆయనకు ఒక షాపును నిర్వహణకు ఇచ్చింది. ఆ షాపు న్యూ పోర్టు దగ్గరుండే బాల్బోవా పీర్ అనే ఒక పర్యటక ప్రాంతం దగ్గర ఉంది. ఆ కౌంటర్లో సుగంధిని కూర్చునే వారు. ఆమెకు ఇంగ్లీష్ రాదు. టెడ్ రాత్రి పూట బేకింగ్ చేసేవారు.
వారు ఎక్కడ వీలయితే అక్కడ డబ్బులు ఆదా చేసుకోవడం మొదలు పెట్టారు. కాఫీ తాగే కప్పులను కడిగి మళ్ళీ వాడటం లాంటివి చేసేవారు. దాంతో వించెల్ నుంచి వారికి తీవ్రంగా మందలింపులు లభించాయి. గులాబీ రంగులో ఉండే డోనట్ పెట్టెలు ఎక్కువైన వెంటనే ఆయన వాటిని తక్కువ ధరకు అమ్మడం ప్రారంభించారు. అవి ఆయన ట్రేడ్ మార్కుగా మారాయి.
కుటుంబం అంతా కలిసి రోజుకు 12 - 17 గంటలు పని చేసేవారు. వారాంతంలో పెద్ద పిల్లలు చెట్, సావి , కాఫీ అందించడం, డో నట్లు ప్యాక్ చేయడం లాంటి పనులు చేసేవారు. వారు మిగిలిన రోజుల్లో స్కూలుకు వెళ్లేవారు. ఒక్కోసారి ఆకలి తట్టుకోలేక వేరే పిల్లల లంచ్ బాక్సుల నుంచి ఆహారం దొంగలించేవారు.
ఒక సంవత్సర కాలంలో టెడ్ రెండవ డో నాట్ షాపులో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన ధనాన్ని సంపాదించారు. దానిని సుగంధిని నిర్వహించడం మొదలు పెట్టారు. ఆమెకు అమెరికా పౌరసత్వం లభించగానే ఆమె క్రిస్టీ అనే పేరును సొంతం చేసుకున్నారు.
రెండు షాపులను ఒక సంవత్సర కాలం పాటు నడిపేసరికి వారు 40000 డాలర్లను ఆదా చేయగలిగారు. దీంతో టెడ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని అనుకున్నారు. ఆయన ఒక పెద్ద డోనట్ షాపును కొన్నారు.
క్రిస్టీ షాపును మరో కంబోడియా శరణార్థ కుటుంబం నడిపేందుకు ఇచ్చారు. వారికి శిక్షణ ఇచ్చి షాపును అప్పగించారు.
టెడ్ అలా మరిన్ని డోనట్ దుకాణాలను కొని మిగిలిన శరణార్ధులకు ఇవ్వడానికి ప్రయత్నించారు. "డబ్బును ఇతరులకు సహాయం చేయడంలో వచ్చే అనుభూతి మాదకద్రవ్యం కంటే చాలా శక్తివంతమైనది అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరంతరం పనిలో మునిగి తేలే వీరికి కంబోడియాలో ఏమి జరుగుతుందో తెలియలేదు. కానీ, అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అయితే విన్నారు. వారు వదిలేసి వచ్చిన కుటుంబం కోసం కన్నీటితో ప్రార్ధించారు.
మెర్ రోజ్ నాయకత్వంలో ప్రజలు సామాజిక పొలాల్లో పని చేయాలని ఒత్తిడి చేశారు. ఎవరికైనా డబ్బు, చదువు ఉంటే వారిని హింసించి చంపేశారు.
నాలుగు సంవత్సరాల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది కంబోడియన్లు ఉరి శిక్షకు గురి కావడం కానీ, లేదా ఆకలితో, రోగాలతో, లేదా అధిక పని ఒత్తిడితో కానీ మరణించారు.
1978లో వియత్నాం సేనలు కంబోడియా పై దాడి చేసి 1979లో పోల్ పాట్ ని ఓడించారు. దాంతో మరో సారి కంబోడియా శరణార్థులు తయారయ్యారు. టెడ్ తల్లి తండ్రులు, చెల్లెల్లు థాయిలాండ్ కి వెళ్లిపోయారు. వారిని టెడ్ స్పాన్సర్ చేయగలరేమో కనుక్కుంటూ ఒక రోజు టెడ్ కి అమెరికా ఎంబసీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన వెంటనే అతని కుటుంబాన్ని అమెరికా తీసుకుని వచ్చి ఆయన సోదరి లతో డోనట్ షాపులను తెరిపించారు.
స్పాన్సర్ షిప్ చేయడం కోసం బంధువులు, గ్రామస్థులు, పరిచయస్తులు నుంచి చాలా అభ్యర్ధనలు రావడం మొదలు పెట్టాయి. నేనెంత మందికి వీలయితే అంత మందికి సహాయం చేసాను.
అలా టెడ్, క్రిస్టీ కలిసి 100 కి పైగా కుటుంబాలను స్పాన్సర్ చేశారు. "అదొక దావానలంలా వ్యాపించింది" అని టెడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కంబోడియా ప్రజలు తమ కుటుంబ సభ్యులందరితో కలిసి కష్టపడి పని చేసారు. ఇదొక దారిని చూపించింది. ఒక లాభదాయకమైన వ్యాపారంగా అవతరించింది.
దాంతో, కాలిఫోర్నియాలో చాలా డోనట్ షాపులకు కంబోడియా వలసదారులు యజమానులుగా మారారు. దాంతో మొదటి స్థానంలో ఉండే వించెల్ రెండవ స్థానంలోకి వెళ్ళిపోయింది.
టెడ్ ఈ విషయం పట్ల బాధపడతారు. "వాళ్ళు చాలా మంచి వ్యాపార సంస్థ". అని టెడ్ అంటారు.
కంబోడియా ప్రజలు వారికి రుణపడి ఉంటారు. అని టెడ్ అన్నారు.
1985 నాటికి టెడ్, క్రిస్టీ కోటీశ్వరులుగా మారారు. అప్పటికే వారి అధీనంలో 60 డోనట్ షాపులు ఉన్నాయి. టెడ్ డోనట్ కింగ్ గా పేరు గడించారు. ఆయనను అంకుల్ టెడ్ అని పిలిచే వారు. ఈ దంపతులకు విలాసవంతమైన కార్లు, బంగళాలు సొంతమయ్యాయి. సెలవులకు విదేశీ ప్రయాణాలు చేసే స్థాయికి ఎదిగారు.
"నా అమెరికా కలను నేను సాధించాను" అని టెడ్ అన్నారు.
"జూదం నా జీవితాన్ని మార్చేవరకు ఆనందంగానే ఉన్నాం. జూదం నా జీవితంలో ఒక విచారకర ఘట్టం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లాస్ వెగాస్ లో టెడ్ పతనం మొదలయింది. మొదట్లో క్రిస్టీతో కలిసి కసినోలకు వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు బాగానే ఉంది. నెమ్మదిగా అక్కడ ఉండే గ్లామర్ ప్రపంచం మత్తులో పడ్డారు.
"ముందెప్పుడూ నేను జూదం ఆడలేదు. మొదట్లో తక్కువ డబ్బుతోనే మొదలు పెడతాం. క్రమంగా అది రక్తంలోకి వచ్చి చేరేసరికి ఇక వెనక్కి తిరగలేం" అని ఆయన అంటారు.
ఆయనకున్న ఉన్నత స్థాయికి అనుగుణంగా కసినోలు కూడా ఆయనను విలాసవంతమైన సూట్లలో పెట్టి విఐపి టికెట్లను ఇచ్చేవి.
కొన్ని రోజుల పాటు లాస్ వేగాస్ కి వెళ్లి మాయమైపోతూ, జూదంలో డబ్బు కోల్పోతూ ఉండేవారు. వ్యాపారం నెమ్మదిగా క్షీణించడం మొదలయింది.
పిల్లలను పట్టుకుని క్రిస్టీ ఆయనను కసినోలలో వెతికే స్థాయికి వచ్చింది పరిస్థితి. ఆమెకు కనిపించకుండా దాక్కునేవాడినని టెడ్ గుర్తు చేసుకున్నారు.
టెడ్ గెలిచిన ప్రతి సారీ కుటుంబం అంతా కలిసి ఆనందించే వారు. ఆయన ఓడిన ప్రతి సారీ , ఇంట్లో తలుపులు బాదిన శబ్దాలు, సామాన్లు విరగడం లాంటివి జరగడంతో పిల్లలు భయపడిపోయేవారు.

ఫొటో సోర్స్, Getty Images
పోయిన డబ్బును గెలుచుకునేందుకు ఆయన మళ్ళీ వెగాస్ వెళ్లేవారు. ఎంత వెంట పెడతామో, అంత కోల్పోతాం అని ఆయన పై తీస్తున్న డాక్యుమెంటరీ "ది డోనట్ కింగ్" లో ఆయన అన్నారు. "అదొక దెయ్యం. అదొక రాకాసి. అది నాలో ఉన్న ఒక రాకాసి" అని ఆయన అన్నారు.
క్రిస్టీ ఆయనను క్షమిస్తూ ఉండేవారు. కానీ, టెడ్ నమ్మకస్థుడు కాదనే పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది.
"నేను అందరి దగ్గర అప్పులు చేయడం మొదలు పెట్టాను" అని ఆయన చెప్పారు.
ఆయన లీజుకి ఇచ్చిన డోనట్ షాపుల వాళ్ళ దగ్గరే అప్పులు చేయడం మొదలు పెట్టారు. డబ్బులు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ షాపును వారికి ఇచ్చేసేవారు. ఇదంతా క్రిస్టీకి తెలియదు. ఆమె సంతకాన్ని కూడా ఆయన దొంగతనంగా పెట్టేసేవారు.
ఆయన ఈ జూదం అలవాటును వదిలించుకోలేకపోయారు.

ఫొటో సోర్స్, Greenwich Entertainment
ఆయన రెండు సార్లు ఒక బౌద్ధ ఆశ్రమంలో చేరారు. ఆయన తల గుండు చేసుకుని కాళ్లకు చెప్పులు లేకుండా మూడు నెలల పాటు థాయిలాండ్ లో తిరిగారు. ఆయన అమెరికాకు తిరిగి వచ్చి మారిపోయానని అనుకున్నారు. కానీ, మళ్ళీ కొన్ని వారాల లోనే వెగాస్ విమానం ఎక్కారు.
ఆఖరుకు వారి చేతిలో ఒకే ఒక్క డోనట్ షాపు మిగిలింది. ఇక అది కూడా అమ్మేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ డబ్బు తీసుకోవడానికి వారి చిన్న కొడుకు క్రిస్ కారులో తీసుకుని వెళ్లారు. షాపు అమ్మగా వచ్చిన 85,000 డాలర్లు కారులో పెట్టుకుని వెనక్కి తిరిగి వస్తుండగా పోలీసులు వారిని ఆపారు. వారు చెల్లించాల్సిన చాలా చెల్లింపులు చేయకపోవడంతో ఆ కారు దొంగలించిన కారుగా కనిపించింది. వాళ్ళ ముగ్గురినీ పోలీసు స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. భయంతో కారులో డబ్బు ఉందని పోలీసులకు చెప్పలేదు. దాంతో బయటకు వచ్చేసరికి ఆ డబ్బు కూడా పోయింది.
ఇది చాలా విచారకరమైన కథ అని టెడ్ అంటారు.
1993 లో టెడ్ క్రిస్టీ కంబోడియాకు తిరిగి వచ్చారు. వాళ్ళ ఇల్లు, షాపులు అన్నీ కోల్పోయారు. కానీ, వారు జీవితం సౌకర్యవంతంగా గడపడానికి తగినంత డబ్బు ఉంది. ఇప్పుడు టెడ్ కి రాజకీయాల పై కొత్త ఆసక్తి కలిగింది. కంబోడియాలో అప్పుడే తొలి ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతున్నాయి. దేశాన్ని పునర్నిర్మించడం కోసం ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
"ఒక రాజకీయ నాయకునిగా జూదం ఆడనని ఆయన అనుకున్నారు. నాకు ప్రజలు ఓట్లు వేయాలంటే నేను జూదం ఆడలేను. నా గురించి తెలిస్తే నాకు ప్రజలు ఓటు వేయరేమో. అందుకు నేను మారాలని అనుకున్నాను" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Greenwich Entertainment
ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఆయన రిపబ్లిక్ పార్టీకి మద్దతు ఇచ్చేవారు. ఆ పార్టీకి నిధులను కూడా సమకూర్చేవారు. కొంత మంది అమెరికా అధ్యక్షులను కూడా కలిశారు. అందుకే ఆయన తన పార్టీకి ఫ్రీ డెవలప్మెంట్ రిపబ్లికన్ పార్టీ అని పేరు పెట్టారు.
కానీ, ఆ పేరు తప్పు దారి పట్టించేదిగా ఉంది. చాలా మంది ఓటర్లు ఆయన కంబోడియా రాజ కుటుంబానికి వ్యతిరేకులని ఊహించారు. దాంతో ఆయనకు ఒక్క స్థానం కూడా లభించలేదు. కానీ, ఆయనకు ప్రభుత్వ వాణిజ్య, వ్యవసాయ సలహాదారునిగా ఉండేందుకు ఆహ్వానం లభించింది.
కంబోడియా పేద దేశం. కొన్ని సంవత్సరాల పాటు యుద్ధంలో ఉండటం వలన అభివృద్ధి జరగలేదు. తైవాన్ ఆర్ధికాభివృద్ధితో స్ఫూర్తి పొందిన టెడ్ కంబోడియాకు 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' స్థాయి సంపాదించేందుకు అమెరికాతో లాబీ చేయాలని నిర్ణయించుకున్నారు.
దీంతో అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయని భావించారు. నా సొంత డబ్బులే ఒక లక్ష డాలర్లు ఖర్చు పెట్టాను. నా సమయం, అన్నీ వెచ్చించాను" అని ఆయన చెప్పారు. ఆయన రిపబ్లికన్లతో ఉన్న పరిచయాలతో లాబీ కొనసాగించారు. చివరకు 1996లో కంబోడియాకు "మోస్ట్ ఫేవర్డ్ నేషన్" స్థాయి లభించింది.
టెడ్ రాజకీయాలలో మునిగి తేలుతుండగా క్రిస్టీ తన పిల్లల కాన్పుల కోసం అమెరికా వెళ్లిపోయారు. ఆమె వెళ్ళగానే టెడ్ మరొకరితో సంబంధం పెట్టుకున్నారు. ఇది తెలిసిన క్రిస్టీ విడాకులకు దరకాస్తు చేశారు.
2002 నాటికి టెడ్ తన డబ్బునంతా ఎన్నికల ప్రచారాలకు ఖర్చు పెట్టేసారు. ఒక కొత్త రకం హైబ్రిడ్ బియ్యం రకాన్ని ప్రవేశ పెట్టి విఫలమయ్యారు.
దీంతో ఆయన మళ్ళీ అమెరికా చేరుకున్నారు.
ఆయన మళ్ళీ లాస్ ఏంజెల్స్ లో అడుగు పెట్టేసరికి ఆయన చేతిలో కేవలం 100 డాలర్లు ఉన్నాయి. ఆయన కుటుంబం ఆయనను చూడాలని అనుకోలేదు. ఆయనకు ఎవరూ పని ఇవ్వలేదు. కనీసం డోనట్లు తయారు చేసే పని కూడా దొరకలేదు.

ఫొటో సోర్స్, Greenwich Entertainment
ఆయన సమాజంలో కుటుంబంలో తన గౌరవాన్ని కోల్పోయారు. ఇది ఆయన జీవితంలో అత్యంత హేయమైన స్థితి.
"నేను చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. నన్ను నేను ద్వేషిస్తాను. నేనప్పుడు జూదాన్ని ద్వేషించడం మొదలు పెట్టాను. నేను క్రిస్టీని ఎంత బాధ పెట్టానో అర్ధమయింది. అందుకే నన్ను నేను ద్వేషించుకున్నాను" అని ఆయన అన్నారు.
ఆయన చాలా చర్చీలకు తిరగ్గా తిరగ్గా, చివరకు ఒక కంబోడియా వృద్ధురాలు ఆమె ఇంటి బాల్కనీలో ఉండేందుకు చోటిచ్చారు.
"నేను స్నానం చేయాలంటే తలుపు కొట్టి అడగాలి. అప్పుడామె నన్ను లోపలికి రానిచ్చే వారు. భోజనం సిద్ధంగా ఉన్నప్పుడు ఆమె తలుపు కొట్టి భోజనం చేయమని పిలిచే వారు" అని ఆయన చెప్పారు.
టెడ్ కొడుకు పాస్టర్ గా ఉన్న ఒక చర్చికి ఆయన ఆదివారాలు వెళుతూ ఉండేవారు. టెడ్ ఆధ్యాత్మికంగా మారిపోయారు.
నాలుగు సంవత్సరాల పాటు నిర్వాసంలో ఉన్నాక టెడ్ తిరిగి కంబోడియా వెళ్లారు. అప్పటికి ఆయన చేతిలో చిల్లి గవ్వ లేదు.
థాయ్ సరిహద్దుల్లో ఒక పేద గ్రామీణ ప్రాంతానికి వెళ్లారు. జీవనోపాధికి ఎటువంటి మార్గం లేదు. ఒక రోజు ఆయన బాగా బ్రతికిన రోజుల్లో పరిచయం ఉన్న ఒక చైనా వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో సహాయం చేయమని అడిగారు. టెడ్ దీనిని చాకచక్యంగా నిర్వహించి మంచి కమిషన్ పొందారు.
దాంతో ఈ రంగంలో ఆయన అదృష్టం కలిసి వచ్చి మళ్ళీ కోటీశ్వరునిగా మారారు. ఆయన తిరిగి వివాహం చేసుకున్నారు. ఈ వివాహంలో ఆయనకు మరో నలుగురు పిల్లలు పుట్టారు.
ఒక రెండేళ్ల క్రితం లాస్ ఏంజెల్స్ చిత్ర నిర్మాత అలైస్ గు ఆయనను కలిసే వరకు టెడ్ పేరు బయటకు వినిపించలేదు.
శరణార్ధుల కుటుంబంలో పుట్టిన ఆమెకు కాలిఫోర్నియాలో డోనట్ షాపులను ఎక్కువగా కంబోడియా దేశస్థులు ఎందుకు నడుపుతారనే సందేహం వచ్చింది.

ఫొటో సోర్స్, Greenwich Entertainment
అమెరికాలో చాలా చోట్ల ప్రతీ 30,000 జనాభాకు సగటున ఒక డోనట్ షాపు ఉంటుంది. లాస్ ఏంజెల్స్లో ప్రతీ 7000 జనాభాకు ఒక్క షాపు ఉంటుంది. "కాలిఫోర్నియాలో ఉన్న 5000 స్వతంత్ర డోనట్ షాపులలో 80 శాతం కంబోడియా దేశస్థులవే" అని ఆమె చెప్పారు.
"ఈ కథ శరణార్ధుల జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. వాళ్లకి అవకాశం దొరికితే ఏమి జరుగుతుందో చూపిస్తుంది" అని ఆమె చెప్పారు.
"ఈ దేశానికి ఏమి లేకుండా వచ్చి, కొంత హడావిడి, కొన్ని కలలు, కొంత అదృష్టం కలిసి వచ్చిన తర్వాత, తన కోసం తాను ఒక ఆకర్షణీయమైన జీవితాన్ని మలుచుకున్నారు".
కానీ, దానిని ఆయన నిలబెట్టుకోలేదు.
ఈ చిత్రాన్ని నిర్మించడం కోసం టెడ్ ని కాలిఫోర్నియాకు రావడానికి ఒప్పించడం అలైస్ కి చాలా కష్టమైంది. ఆయన పిల్లలెవరూ ఆయనతో మాట్లాడరు.
"ఆయన ఒంటరిగా మారతానేమో అని భయపడ్డారు. కానీ నేనాయనను ఒప్పించాను" అని చెప్పారు.
చివరకు ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ ఆయనకు ఒక గాయాన్ని నయం చేసిన అనుభూతిని ఇచ్చింది.
కంబోడియా ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ చాలా మందికి ఆయన పట్ల గౌరవం కూడా ఉంది.
డోనట్ల వ్యాపారంలో ఉన్న యువతరాన్ని కలవడం ఆయనకు చాలా సంతోషాన్నిచ్చింది.
ఆయన గాయపరిచిన వారందిరికీ ఆయన క్షమాపణలు చెప్పారు.

ఫొటో సోర్స్, Ted Ngoy
ముఖ్యంగా ఈ పర్యటన క్రిస్టీతో ఆయన బంధాన్ని చక్కదిద్దుకునేందుకు కూడా పనికొచ్చింది. ఆమె కూడా తిరిగి వివాహం చేసుకుని పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.
"వాళ్లిప్పుడు నన్ను క్షమించరు. నేనొక 1000 సార్లు వాళ్లకి క్షమాపణ చెప్పాను.
"నేను గతాన్ని మార్చలేను. కానీ, నేను చాలా కష్టంగా జీవిత పాఠాన్ని నేర్చుకున్నాను".
ఆయన వారితో ప్రతి రోజూ మాట్లాడతారు. "వారంతా నన్ను చూసి సంతోషించారు. నేనొక చెడ్డ వ్యక్తి నుంచి మంచి వ్యక్తిగా మారాను" అని ఆయన చెప్పారు.
ఆయనలో ఉన్న ఏ లక్షణాలైతే సవాళ్ళను ఎదుర్కోవడానికి ఉపయోగపడ్డాయో అవే లక్షణాలు జూదానికి సులభంగా వశం కావడానికి దారి తీశాయి అని ఆయన అంటారు.
"స్వచ్ఛంగా సవాళ్ళను స్వీకరించడం, ప్రతీ వ్యాపార నిర్ణయం వెనుక దాగిన ఆందోళన, ఉత్సాహం, ప్రేమను ధైర్యంగా ప్రకటించే లక్షణం" అని ఆయన తన స్వీయ చరిత్రలో రాసుకున్నారు.
ఆయనకు క్రైస్తవ మతం పై ఉన్న నమ్మకమే జూదం వ్యసనాన్ని కూడా మాన్పించగల్గింది అని ఆయన అంటారు. గత సంవత్సరం వరకు ఫుట్ బాల్ క్రీడల్లో బెట్టింగ్ చేసినట్లు అంగీకరించారు.
"అందుకే నేను ప్రపంచానికి చెప్పాలని అనుకుంటున్నాను. జూదం ఆడకండి. మీరు జూదంలో తల మునకలై ఉంటే మీ జీవితం ముగిసినట్లే. మీరు మీ కుటుంబాన్ని నాశనం చేస్తారు. ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. జూదం ఒక రాక్షసి" అని ఆయన అన్నారు.
"కానీ, చివరకు, నేను దానిని ఓడించాను. ఎప్పుడూ వదిలేయకండి. అలా అని జూదంలో కూడా ఎప్పుడూ లొంగిపోకండి. నాకు 40 సంవత్సరాలు పైనే పట్టింది. కానీ, నేను గెలిచాను. చివరకు నేను గెలిచాను" అని ఆయన అన్నారు.
టెడ్ గోయి 'ది డోనట్ కింగ్: ది రాగ్స్ టు రిచెస్" అనే పేరుతో ఆత్మకథ రాశారు.
ఇవి కూడా చదవండి:
- బైడెన్-హ్యారిస్ విజయం వెనుక ఉన్న ఆ నల్ల జాతి మహిళలు ఎవరు
- అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక డోనల్డ్ ట్రంప్ ఏం చేస్తారు? రాజకీయాల్లో కొనసాగుతారా? మళ్లీ వ్యాపారం చేస్తారా?
- మనీశ్ మిశ్రా: బిచ్చగాడు అనుకుని సాయం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సాల్యూట్ చేశారు
- గుండె తరుక్కుపోయే కష్టం.. కళ్ల ముందే భార్య, ముగ్గురు పిల్లల శవాలు నీళ్లలో తేలుతుంటే చూడలేక ఆత్మార్పణం
- కరోనావైరస్: వచ్చే చలికాలానికి అంతా నార్మల్ అవుతుందంటున్న వ్యాక్సీన్ రూపకర్తలు
- నెల్సన్ మండేలా సహా ఎందరో రాజకీయ ఖైదీల విడుదలకు కృషి చేసిన తెలుగు వ్యక్తి
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








