నెల్సన్ మండేలా సహా ఎందరో రాజకీయ ఖైదీల విడుదలకు కృషి చేసిన తెలుగు వ్యక్తి

ఫొటో సోర్స్, Prasad G
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
నెల్లూరు జిల్లా పల్లిపాడు గ్రామంలో ప్రశాంతంగా ప్రవహించే పెన్నా నది ఒడ్డున కనిపించే పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని1921లో మహాత్మా గాంధీ ప్రారంభించారు.
అయితే, కాలక్రమేణా మరుగున పడిపోయిన ఆ ఆశ్రమ పునరుద్ధరణకు బీజం వేసినది మాత్రం ఐక్య రాజ్య సమితిలో అపార్థీడ్ నిర్మూలన కేంద్రం స్పెషల్ కమిటీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, డైరెక్టర్ గా సేవలు నిర్వహించిన తెలుగు వ్యక్తి ఏనుగ శ్రీనివాసులు రెడ్డి. ఆయన ఇఎస్ రెడ్డిగా గాంధేయవాదులకు చిర పరిచితం.
ఒక్క గాంధీ ఆశ్రమమే కాదు, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షను రూపు మాపేందుకు, నెల్సన్ మండేలాతో సహా మరెంతో మంది రాజకీయ ఖైదీల విడుదలకు కృషి చేసిన వ్యక్తి నెల్లూరు జిల్లా పాలపల్లి గ్రామంలో జన్మించిన ఇఎస్ రెడ్డి. ఆయన 2020 నవంబరు 01న అమెరికాలో మరణించారు.
“భారతదేశానికి స్వాతంత్య్రం సంపాదించడమే కాదు, ఈ స్వాతంత్య్రంతో వలస పాలనలకు పూర్తిగా అంతం పలికించాల్సిన బాధ్యత మా పై ఉంది” అని నినదించిన ఏనుగ శ్రీనివాసులు రెడ్డి ఎవరు?

ఫొటో సోర్స్, Prasad G
ఏనుగ శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా పార్లపల్లిలో 1924లో జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబమైనప్పటికీ తండ్రి ఇవి నరసా రెడ్డి మైకా ఎగుమతుల వ్యాపారంలో స్థిరపడ్డారు. ఆయన తల్లి గృహిణి.
ఆమె తన నగలను హరిజనుల ఉద్ధరణ నిధుల కోసం 1933లో మహాత్మ గాంధీ గూడూరు వచ్చినప్పుడు దానం చేసారని రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆయనకు నలుగురు సోదరులు, ఒక చెల్లెలు. శ్రీనివాసులు రెడ్డి బాల్యం నుంచే గాంధేయవాదానికి, నెహ్రు ఆశయాలకు ప్రభావితమయ్యారు. ఆయన తండ్రి గూడూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా పని చేసారు.
కుటుంబ నేపధ్యం, స్కూలులో చదువుకునేటప్పుడు హిందీ టీచరు వలన గాంధీ సిద్ధాంతాలకు కాలేజీలో చదువుతున్నప్పుడు జవహర్ లాల్ నెహ్రు, సోషలిస్టు, మార్క్సిస్టు విధానాలకు ప్రభావితమయ్యారు.
చెన్నైలో మద్రాస్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తుండగా దక్షిణ ఆఫ్రికాలో ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్నారు. కాలేజీలో చదువుతున్నప్పుడు జనవరి 26 న కాలేజీలో భారతీయ జెండాను ఎగుర వేసినందుకు గాను ఆయనను కాలేజి నుంచి సస్పెండ్ చేసినట్లు రామచంద్ర గుహ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో రాసిన నివాళిలో పేర్కొన్నారు.
1946లోఇల్లినోయిలో కెమికల్ ఇంజనీరింగ్ చదవాలని బయలుదేరినప్పటికీ ఆయన ప్రయాణం చేస్తున్న బోటు ఆలస్యంగా గమ్యం చేరడంతో న్యూ యార్క్ లోనే ఉండిపోయి అక్కడే రాజకీయ శాస్త్రం కోర్సులో చేరారు.
అదే సమయంలో ఆఫ్రికాలో గనుల కార్మికుల సమ్మె , భారతదేశంలో బ్రిటిష్ పాలన పట్ల నిరాకరణ చోటు చేసుకుంటున్నాయి.
న్యూ యార్క్ యూనివర్సిటీలో రాజకీయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నారు. కొలంబియా యూనివర్సిటీలో కూడా విద్యను అభ్యసించారు. వలస రాజ్యంగా బ్రిటన్ పట్ల వ్యతిరేకత ఉండటం వలన ఆయన ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వచ్చినట్లు 2004లో "నో ఈజీ విక్టరీస్" అనే పుస్తకం కోసం లీసా బ్రోక్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
1948 మార్చిలో ఆయన ఐక్య రాజ్య సమితిలో అడుగుపెట్టారు.

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ 'గాంధీ బిఫోర్ ఇండియా' అనే పుస్తకాన్ని శ్రీనివాసులు రెడ్డికి అంకితం ఇచ్చినట్లు గాంధీ సెంటర్ విశాఖపట్నం అధ్యక్షుడు, మాజీ నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాల మోహన్ దాస్ చెప్పారు.
ఆ పుస్తకం ద్వారానే ఏనుగ శ్రీనివాసులు రెడ్డి గురించి తెలుసుకున్నానని ఆయన బీబీసీకి వివరించారు.
దక్షిణ ఆఫ్రికాలో గాంధీ ప్రభావం గురించి ఏనుగ కంటే ఎక్కువగా మరెవ్వరూ చెప్పలేరని గుహ తన పుస్తకంలో రాసారని చెబుతూ రెడ్డి విద్యార్థి దశ నుంచే విప్లవాత్మక భావాలు కలిగి ఉండేవారని, జాతి వివక్షను అంతం చేసేందుకు ఆయన జీవితాంతం పోరాడారని చెప్పారు. దక్షిణ ఆఫ్రికాలో స్వాతంత్రోద్యమాలన్నిటికీ మద్దతు పలికి వ్యక్తి స్వాతంత్రానికి, సామాజిక న్యాయానికి ప్రాముఖ్యం ఇచ్చి అందుకోసం కృషి చేశారని చెప్పారు.
“గాంధీ బిఫోర్ ఇండియా” పుస్తక రచనకు కావల్సిన సమాచారాన్ని చాలా వరకు శ్రీనివాసులు రెడ్డే ఇచ్చారని గుహ తన నివాళిలో పేర్కొన్నారు.
“జాతి వివక్షను రూపుమాపడానికి సమ సమాజం నిర్మించడానికి ఇఎస్ రెడ్డి ఎంతగానో కృషి చేశారని చెబుతూ గాంధీని అర్ధం చేసుకోవాలనుకుంటే ఇఎస్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాల్సిందే” అని ఇఎస్ రెడ్డితో 20 ఏళ్లుగా వ్యక్తిగత అనుబంధం ఉన్న హైదరాబాద్ కి చెందిన గాంధీ కింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
ఇఎస్ రెడ్డి "పినాకిని తీరంలో మహాత్మ గాంధీ" అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఇది తెలుగులోకి కూడా అనువాదం అయింది.
ఇఎస్ రెడ్డి బాల్యం ఎలా గడిచింది?
“శ్రీనివాసులు రెడ్డి నాన్న బిడ్డ అయితే నేను మా అమ్మ బిడ్డను” అని ఆయన సోదరుడు సీతారామ రెడ్డి చెప్పారు. ఆయన తన సోదరునితో జ్ఞాపకాలను బీబీసీతో పంచుకున్నారు.
శ్రీనివాసులు రెడ్డే తనకు ఇంగ్లీష్ నేర్పించి స్కూలులో చేర్పించారని చిన్నప్పుడు ఆయన చాలా కోపంగా ఉండేవారని కానీ, ఆయన చేసిన పనులకు గాను వరల్డ్ పీస్ కౌన్సిల్ ఆయనకు పీస్ అవార్డును ప్రధానం చేయడం పట్ల సోదరునిగా గర్వంగా భావిస్తానని అన్నారు.
ఇఎస్ రెడ్డి చాలా నిగర్వంగా ఉంటారని, ఎవరు వెళ్లినా అత్యంత ప్రేమతో ఆప్యాయతతో మాట్లాడతారని తనతో ఎప్పుడూ ఒక సొంత బిడ్డతో వ్యవహరించినట్లే వ్యవహరించి తనకు కావల్సిన సమాచారాన్ని, వివిధ రంగాలలో వ్యక్తులతో పరిచయాలను కల్పించారని జి ప్రసాద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Prasad G
ఐక్యరాజ్య సమితిలో తెలుగు జెండా
శ్రీనివాసులు రెడ్డి 1948 లో ఐక్య రాజ్య సమితిలో ఇంటర్న్ షిప్ చేసి 1949 లో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ అఫైర్స్ విభాగంలో పరిశోధకునిగా ఉద్యోగం సంపాదించారు.
ఐక్య రాజ్య సమితిలో వివిధ విభాగాలలో 35 సంవత్సరాల పాటు పని చేసారు.
ఆయన 1963 - 1984 వరకు అపార్థీడ్ నిర్మూలన స్పెషల్ కమిటీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, అపార్థీడ్ నిర్మూలన కేంద్రంలో డైరెక్టర్ గా పని చేసారు.
1983 - 1985 వరకు ఐక్య రాజ్య సమితి అదనపు కార్యదర్శిగా కూడా పని చేశారు.
ఆయన దక్షిణ ఆఫ్రికాలో జాతి వివక్ష నిర్మూలనకు అనేక విధాలుగా కృషి చేశారు.
జాతి వివక్షకు వ్యతిరేకంగా పని చేసినందుకు గాను ఆయనకు 1982లో వరల్డ్ పీస్ కౌన్సిల్ జోలియట్ క్యూరీ మెడల్ ప్రధానం చేసింది.
1985 లో ఆయన ఐక్య రాజ్య సమితి ఉద్యోగం నుంచి పదవీ విరమణ తీసుకున్నారు. కానీ, 1985 - 1993 వరకు యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ లో సీనియర్ ఫెలోగా పని చేసారు.
1986 - 1992 వరకు దక్షిణ ఆఫ్రికా ఇంటర్నేషనల్ డిఫెన్స్ అండ్ ఎయిడ్ ఫండ్ కౌన్సిల్ ఆఫ్ ట్రస్టీస్ కి సభ్యుడిగా పని చేశారు.

ఫొటో సోర్స్, Prasad G
శ్రీనివాసులు రెడ్డి జాతి వివక్ష నిర్మూలన ఉద్యమానికి తీవ్రంగా కృషి చేశారని దానికి సంబందించిన పుంఖాను పుంఖాలు సమాచారం ఆయన దగ్గర చాలా ఉందని అంటూ, ఆయన జ్ఞాపకాలను రాత రూపంలో పొందుపర్చాలని అడిగినప్పుడల్లా చేయడానికి చాలా పనులున్నాయంటూ చెప్పేవారని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ గోపాల్ కృష్ణ గాంధీ శ్రీనివాసులు రెడ్డి గురించి ది హిందూ పత్రికలో రాసిన నివాళిలో తెలిపారు.
ఇదే విషయాన్ని ప్రసాద్ వక్కాణిస్తూ గాంధీ గురించి ఇఎస్ రెడ్డి చేసినంత కృషి మరెవ్వరూ చేసి ఉండరని దక్షిణాఫ్రికాలో ప్రజలు ఆయన పట్ల అపార గౌరవం ప్రదర్శిస్తారని ప్రసాద్ తెలిపారు. దక్షిణాఫ్రికా వ్యవహారాల పై ఇ ఎస్ రెడ్డి నిపుణుడని అన్నారు.
"భారతదేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన గుర్తింపు లేని స్వాతంత్య్ర సమర యోధుల గురించి, దక్షిణాఫ్రికా స్వతంత్రం కోసం తమ జీవితంలోని కొన్ని అమూల్యమైన సంవత్సరాలను వెచ్చించిన వ్యక్తుల గురించి, పని చేస్తూ ప్రాణాలు అర్పిస్తున్న వారి గురించి రాయాల్సింది చాలా ఉంది" అనే వారని గోపాల్ కృష్ణ గాంధీ రాశారు.
ఆయనకు దక్షిణాఫ్రికాపై ఆసక్తి ఎలా పెరిగింది?
దక్షిణాఫ్రికాలో ఉండే భారతీయుల గురించి డాక్టర్ యూసుఫ్ దాదూ , జోహనెస్బర్గ్ గనుల్లో పని చేస్తున్న కార్మికుల గురించి రాసిన పత్రాల ద్వారా అక్కడి ప్రజలు అనుభవిస్తున్న జాతి వివక్ష గురించి తెలిసిందని ఆయన లీసా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.అదే సమయంలో ఆఫ్రికా దేశస్థుల మీద, భారతీయుల మీద నెలకొన్న జాతి వివక్ష గురించి భారతీయ వార్తా పత్రికలు కూడా రాస్తూ ఉండేవి. ఈ అంశాలన్నీ ఆయనకు దక్షిణాఫ్రికా పై ఆసక్తిని పెంచినట్లు ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా బ్రిటన్ కలిసి అట్లాంటిక్ చార్టర్లో నాలుగు రకాల స్వతంత్రాల గురించి చర్చించారు. కానీ, అవి భారతదేశానికి, దక్షిణ ఆఫ్రికాకు వర్తించవని అర్ధమయ్యింది. దక్షిణాఫ్రికాలో చాలా మంది భారతీయులు ఉండేవారు. అందులో చాలా మంది రెండవ తరగతి పౌరులలానే పరిగణన పొందుతూ ఉండేవారు. గాంధీ, నెహ్రూ కూడా దక్షిణాఫ్రికా గురించి మాట్లాడుతూ ఉండేవారు.
1920 లలో విప్లవాత్మక భావాలున్న కుమార్ ఘోషల్ భారత్ నుంచి బహిష్కరణకు గురయి అమెరికాలో తల దాచుకుంటూ ఉండేవారు.
ఆయన కౌన్సిల్ ఆన్ ఆఫ్రికన్ అఫైర్స్ బోర్డులో సభ్యులుగా ఉండేవారు. ఆయన కౌన్సిల్లో ఉండే రీడింగ్ రూమ్ గురించి పరిచయం చేయడంతో శ్రీనివాసులు రెడ్డికి ఆఫ్రికా వ్యవహారాలతో తన ప్రయాణం మొదలయింది.
కౌన్సిల్ కార్యకలాపాల ద్వారా దక్షిణ ఆఫ్రికా స్వతంత్రం కోసం రెడ్డి అమెరికాలో పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Prasad G
దక్షిణ ఆఫ్రికా స్వాతంత్రోద్యమం గురించి , అక్కడ నాయకుల గురించి, జాతి వివక్షకు వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితి చేపట్టిన ప్రచార కార్యక్రమాల గురించి, భారత్ - దక్షిణ ఆఫ్రికా సంబంధాల గురించి ఆయన విస్తృతంగా రచనలు చేశారు.
ఆయన రాసిన అనేక పత్రాలను యేల్ యూనివర్సిటీ, న్యూ దిల్లీలో నెహ్రు మెమోరియల్ మ్యూజియం , దక్షిణ ఆఫ్రికాలో మరి కొన్ని విశ్వ విద్యాలయాలకు ఇచ్చారు.
దక్షిణాఫ్రికా స్వతంత్ర పోరాటాన్ని అర్ధం చేసుకునేందుకు ఇవి చాలా విలువైన పత్రాలుగా పనికి వస్తాయి. ఆయన అనేక పుస్తకాలు కూడా రాశారు. అందులో ‘మహాత్మస్ లెటర్స్ టు అమెరికన్స్’, ‘ది మహాత్మా అండ్ ది పోయె టస్’ కూడా ఆయన రచనలే.
అంతేకాకుండా, చాలా మంది పరిశోధన, అధ్యయన కర్తలకు ఆయనకు తెలిసిన సమాచారం ఆంతా ఇచ్చి సహాయం చేస్తూ ఉండేవారని కూడా ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి స్ఫూర్తిని, సహకారాన్ని అందించినది శ్రీనివాసులురెడ్డేనని ప్రసాద్ చెప్పారు.
నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదల కావడానికి కూడా రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం 2012 లో ఆయన సేవలకు గాను రెడ్డి కి కంపానియన్స్ ఆఫ్ ఓ ఆర్ టాంబో ఇన్ సిల్వర్ అవార్డును ప్రధానం చేసింది.
జాతి వివక్ష ఉద్యమానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా డర్బన్ వెస్ట్ విల్లి యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.
ఆయన చేసిన జాతి వివక్ష ఉద్యమానికి గాను 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ‘పద్మ శ్రీ’ ఇచ్చి సత్కరించింది.
నెల్లూరుతో అనుబంధం
చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయినా ప్రతీ రెండేళ్ళకొకసారి ఇండియా వచ్చి బంధువులందరితో గడిపి వెళ్లేవారని ఆయన బాబాయి కూతురు సులోచన బీబీసీ కి చెప్పారు. ఆయన అమెరికా వెళ్లే నాటికి తనకు రెండు సంవత్సరాలు అని చెప్పారు.
ఇక్కడకు వచ్చినప్పుడు అందరితో ప్రేమగా ఉండేవారని, ఆయన టర్కీ దేశానికి చెందిన మహిళ నీలోఫర్ ను వివాహం చేసుకున్నారని ఆమె కూడా ఆయనతో పాటు వచ్చి వెళుతూ ఉండేవారని చెప్పారు. నీలోఫర్ టర్కీ కవి నాజిమ్ హిక్మత్ రచనలను అనువదించారు.
వారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కోడి గుడ్ల కూర, బిరియాని ఇష్టంగా వండించుకుని తినేవారని చెప్పారు.
అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇండియా రావడం తగ్గిపోయిందని ప్రసాద్ చెప్పారు.
న్యూ యార్క్ నగరంలో ఇఎస్ రెడ్డిని కలిసినప్పుడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని గాంధీ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన తెచ్చారని చెప్పారు.
ఆయన వెంటనే నెల్లూరులో కొంత మంది గాంధేయవాదులతో చర్చించి ఆ ఆశ్రమాన్ని పునరుద్ధరించినట్లు ప్రసాద్ చెప్పారు.
ప్రస్తుతం ఈ ఆశ్రమ నిర్వహణను ఇండియన్ రెడ్ క్రాస్ చూస్తోంది. ఇప్పటికీ అనేక సాంఘిక సేవా కార్యక్రమాలను చేస్తున్న ఈ ఆశ్రమ పునరుద్ధరణకు రెడ్డి గారే కారణమని ప్రసాద్ వివరించారు.
ఆయన మహాత్మాగాంధీని కలిసేందుకు స్వర్గానికి వెళ్లారని ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- శ్రీరాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అసోం ప్రొఫెసర్‌పై కేసు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








