జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?

ఫొటో సోర్స్, Drew Angerer via Getty Images
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. శ్వేతసౌథాన్ని సొంతం చేసుకోవటానికి మూడుసార్లు ప్రయత్నించి ఎట్టకేలకు విజయం సాధించారు.
ఒకసారి 1987లో, రెండోసారి 2008లో డెమొక్రటిక్ పార్టీ టికెట్ కోసం జరిగే పోటీల నుంచి తప్పుకున్న బైడెన్.. ఈసారి టికెట్ కోసం బరిలోకి దిగేటపుడే ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నారు.
పార్టీ నామినేషన్ దక్కించుకున్న ఆయన తనతో పాటు ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆమె కూడా అధ్యక్ష పదవి టికెట్ కోసం పోటీ పడ్డారు.
నిజానికి 2008 అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామా పార్టీ నామినేషన్ గెలుచుకున్నపుడు.. ఆయన తనతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయటానికి జో బైడెన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2012 ఎన్నికల్లోనూ ఒబామా, బైడెన్ ద్వయం గెలిచింది. అలా రెండు సార్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా బైడెన్ పనిచేశారు.
అమెరికా ఉపాధ్యక్షుల్లో 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అని బైడెన్‌ను కీర్తించారు. అయినప్పటికీ.. బైడెన్ నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం మీద తీవ్ర విమర్శలూ ఉన్నాయి.
అసలింతకీ జో బైడెన్ ఎవరు? అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం...
జో బైడెన్ పూర్తి పేరు జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్. ఆయన 1942 నవంబర్ 20న పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో జన్మించారు. 1968లో ఆయన లా పట్టా అందుకున్నారు.
డెలవేర్ నుంచి ఆరు సార్లు సెనేటర్‌గా పనిచేసిన బైడెన్.. మొదటిసారి 1972లో సెనేట్‌కు ఎన్నికయ్యారు.
జో బైడెన్‌ను అచ్చమైన వాషింగ్టన్ డీసీ వాసిగా చెప్పవచ్చు. 36 ఏళ్ల పాటు సెనేటర్‌గా, ఎనిమిదేళ్ల పాటు ఉపాధ్యక్షుడుగా ఉన్న ఆయన రాజకీయ జీవితం ప్రధానంగా అమెరికా రాజధానిలోనే రూపుదిద్దుకుంది.
కెరీర్ తొలి నాళ్లలో.. స్కూలు బస్సుల్లో విభిన్నజాతుల ప్రజలను సమ్మిళతం చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఉత్వర్వును వ్యతిరేకించిన దక్షిణాది వేర్పాటువాదులకు మద్దతు తెలిపారు.

ఫొటో సోర్స్, Wally McNamee/ Getty Images
1991లో సెనేట్ జ్యుడీషియరీ కమిటీ అధ్యక్షుడిగా.. సుప్రీంకోర్టుకు నామినేట్ అయిన క్లారెన్స్ థామస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అనిటా హిల్ ఆరోపణలపై విచారణను నిర్వహించిన తీరు కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యారు.
ఈ విచారణ కమిటీలో అందరూ తెల్లజాతీయులైన పురుషులే సభ్యులుగా ఉన్నారు. అనిటా హిల్‌కు మద్దతుగా నిలిచిన పలువురు మహిళలను బైడెన్ సాక్ష్యం చెప్పడానికి పిలవలేదు.
2019 ఏప్రిలో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ కేసు గురించి మాట్లాడుతూ బైడెన్... "ఆవిడతో వ్యవహరించిన విధానానికి సిగ్గుపడుతున్నాను" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒబామా వారసత్వం...
బైడెన్ 1988లో మొదటిసారి డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. అయితే, బ్రిటిష్ లేబర్ పార్టీ నేత నీల్ కినాక్ ప్రసంగాన్ని కాపీ కొట్టారన్న విమర్శలతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.
రెండోసారి 2008లో కూడా ఆయన డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం పోటీ పడ్డారు. తర్వాత వెనక్కుతగ్గారు. ఒబామాతో పాటు ఉపాధ్యక్షుడిగా పోటీచేశారు. 2012లోనూ ఒబామా, బైడెన్‌లు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, Joe Raedle / Getty Images
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల కాలం ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్.. తమ హయాంలో అమలు చేసిన అఫర్డబుల్ కేర్ యాక్ట్ వంటి పథకాల్లో చాలా భాగం తన కృషి ఫలితమేనని చెప్పుకోవటానికి వీలైంది.
ఒబామా 'సోదరా' అని పిలిచేంత సాన్నిహిత్యం వల్ల ఆఫ్రికన్ - అమెరికన్ ఓటర్లలో ఆయనకు మద్దతు కొనసాగటానికి కారణమై ఉండొచ్చు.
'మిడిల్ క్లాస్ జో'గా పేరుపడ్డ బైడెన్.. శ్రామికులైన శ్వేతజాతీయుల ఓట్లను కూడా సాధించగలిగారు. స్వలింగ సంపర్క వివాహాలు తనకేమీ ఇబ్బంది కాదని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఆ విధానానికి ఒబామా పూర్తి మద్దతునిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యక్తిగత జీవితంలో విషాదం...
బైడెన్ రాజకీయ జీవితంపై వ్యక్తిగత విషాద ఘటనలు కూడా ఎంతో ప్రభావం చూపాయి.
జో బైడెన్ 1972లో మొదటిసారి సెనేటర్‌గా ఎన్నికైన కొద్ది రోజులకే ఒక కారు ప్రమాదంలో ఆయన మొదటి భార్య, కూతురు మరణించారు.
ఆ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ తన ఇద్దరు కొడుకులు బ్యూ, హంటర్‌లను చూసుకుంటూ ఆస్పత్రిలో ఉన్న ఆయన అక్కడి నుంచే సెనేటర్‌గా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే.. 2015లో బైడెన్ కొడుకు 46 ఏళ్ల బ్యూ బ్రెయిన్ కేన్సర్‌తో మరణించారు. అందుకే, ఆయన తన విధాన లక్ష్యాల్లో ఆరోగ్యం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
జీవితంలో ఎన్నో విషాదాలను ఎదుర్కొన్న ఆయనకు ఒక కుటుంబపరమైన వ్యక్తిగా గౌరవం దక్కింది. అమెరికన్లు ఆయన్ను 'మిడిల్ క్లాస్ జో'గా పిలుచుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
బైడెన్ సెనెటర్ పదవి చేపట్టిన తరువాత మొదటి 14 సంవత్సరాల కాలంలో తన వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశారు.
భార్య, కూతురి మరణం తరువాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితం అందించాలనే తాపత్రయంతో తన సొంతిల్లు ఉన్న డెలవేర్ నుంచీ వాషింగ్టన్‌కు రోజూ వచ్చి వెళ్తుండేవారు. తదనంతరం, స్కూల్ టీచర్ అయిన జిల్ జాకబ్స్‌ను వివాహమాడారు. వారి కుమార్తె ఆష్లే బైడెన్ ఒక ఫ్యాషన్ డిజైనర్, యాక్టివిస్ట్ కూడా.

ఫొటో సోర్స్, Getty Images
బైడెన్ పాలన ఎలా ఉంటుంది?
2021 జనవరిలో వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టబతున్న 77 ఏళ్ల జో బైడెన్ ఇప్పుడు అమెరికాకు 46వ అధ్యక్షునిగా అసలు సిసలు సవాళ్లు ఎదుర్కోబోతున్నారు.
ఇప్పటివరకూ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వారిలో అతి పెద్ద వయస్కుడు ఈయనే. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వైట్ హౌస్ పీఠం కోసం బైడెన్ ఎంతో సంఘర్షణకు గురయ్యారు. కానీ ఆయనకు అత్యంత కఠినమైన సవాళ్లు ముందు ముందు ఇంకా మిగిలే ఉన్నాయి.
దేశాధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ ఇప్పుడు అమెరికా రూపురేఖల్ని మార్చే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ.. ఆయన పాలన ఎలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే, సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో అత్యంత వివాదాస్పద అంశాల్లో కొన్నింటి పట్ల తన వైఖరి ఏంటో ఆయన వెల్లడించలేదు.
ఒబామా పాలనా కాలానికి కొనసాగింపు ఇస్తానని మాత్రమే ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక జో బైడెన్ ఎదుర్కోనున్న సవాలు ఒక్కటే. ఏకాభిప్రాయం, ఒప్పందాల పట్ల మొగ్గు చూపించడానికి, తనకు ఓట్లు వేసిన ప్రజల ఆకాంక్షలకూ మధ్య సమతుల్యాన్ని సాధించడం.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








