కమలా హారిస్: భారత మూలాలున్న ఈ ‘నల్ల కలువ’కు ఎన్నో అస్తిత్వాలు

కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ ఆమె. ఆ పదవి చేపట్టే తొలి నల్లజాతి, తొలి ఆసియన్ అమెరికన్ కూడా ఆమే.

ఆమె కమలా హారిస్. భారతీయ మూలాలున్న ఆఫ్రికన్, ఆసియన్ అమెరికన్ ఉమన్.

''మనం గెలిచాం. మనం గెలిచాం జో. మీరు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు!'' అంటూ ఆమె అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ఆమె ఆయన గురించి మాట్లాడారు. కానీ ఈ చారిత్రక సందర్భం మాత్రం ఆమెదే.

ఈ కాలిఫోర్నియా సెనెటర్ ఏడాది కిందట డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ పోటీలో.. జో బైడెన్ మీద ఆమె తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన ఆకాంక్షలను ఆ విమర్శలు దెబ్బతీశాయని చాలా మంది భావించారు. కానీ గత ఏడాది చివరికి వచ్చేసరికి.. ఆమె ప్రయత్నం ముగిసింది. జో బైడెన్ ఆమెను తనతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవటంతో ఆమె మళ్లీ ప్రముఖంగా మారారు.

''కమలా హారిస్ అదృష్టం తారుమారైంది'' అని గిల్ డురాన్ వ్యాఖ్యానించారు. 2013లో కమలా హారిస్‌కు సమాచార సంబంధాల డైరెక్టర్‌గా పనిచేశారాయన. కమల అధ్యక్ష ఎన్నికల నామినేషన్ కోసం పోటీ పడటాన్ని ఆయన విమర్శించారు.

''ఆమెకు సానబెట్టని నైపుణ్యం ఉందనేది అందరికీ తెలుసు. ఆమెకు ఆకాంక్షలు, సామర్థ్యాలు ఉన్నప్పటికీ.. ఇంత వేగంగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టటానికి అవసరమైన క్రమశిక్షణ, ఏకాగ్రత ఆమెకు ఉన్నాయని చాలా మంది అనుకోలేదు'' అని డురాన్ పేర్కొన్నారు.

కమలా హారిస్

ఫొటో సోర్స్, GETTY IMAGES

కమలా హారిస్.. ఎన్నో అస్తిత్వాలు

భారతదేశంలో తమిళనాడులో జన్మించిన తల్లి. జమైకాలో పుట్టిన తండ్రి. ఈ దంపతులకు కాలిఫోర్నియాలోని ఆక్లండ్‌లో జన్మించారు కమలా హారిస్.

కమలా తండ్రి డోనల్డ్ హారిస్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్. తల్లి పేరు శ్యామలా గోపాలన్ హారిస్. ఆమె క్యాన్సర్ పరిశోధకురాలు. పౌర హక్కుల కార్యకర్త కూడా.

కమలాకు ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆమెను, ఆమె చెల్లు మాయా హారిస్‌ను పెంచింది ఆమె హిందూ తల్లి ఒక్కరే. చెల్లెలు మాయాతో కమలాకు అనుబంధం ఎక్కువే. ఆ ముగ్గురినీ కలిపి తెలిసినవాళ్లు 'శ్యామల అండ్ ద గర్ల్స్' అని పిలిచేవాళ్లు.

భారతీయ వారసత్వంతో కమలా పెరిగారు. తల్లితో కలిసి భారతదేశాన్ని సందర్శించేవారు. కానీ తన తల్లి ఆక్లండ్ నల్లజాతి సంస్కృతిని పుచ్చుకున్నారని.. తనను, తన చెల్లెలు మాయా హారిస్‌ను ఆ సంస్కృతిలోనే కలిపారని కమలా హారిస్ చెప్పారు.

చిన్నప్పుడు వారి ఇంట్లో ఎప్పుడూ నల్ల జాతి అమెరికన్ గాయకుల సంగీతం వినిపిస్తూ ఉండేది.

''ఇద్దరు నల్లజాతి కూతుళ్లను పెంచుతున్నానని నా తల్లికి బాగా తెలుసు. తాను దత్తత తీసుకున్న స్వదేశం మాయాను, నన్ను నల్లజాతి ఆడపిల్లలుగానే చూస్తుందని ఆమెకు తెలుసు. అందుకే మమ్మల్ని ఆత్వవిశ్వాసం గల, సగర్వమైన నల్లజాతి మహిళలుగా పెంచాలని ఆమె నిశ్చయించుకున్నారు'' అని కమల 'ది ట్రూత్స్ వియ్ హోల్డ్' అనే తన ఆత్మకథలో రాశారు.

ఈ పుస్తకం 2018లో విడుదలైంది. 'నా పేరును కమలా అని పిలవాలి. పంక్చుయేషన్ కోసం ఉపయోగించే కామా (,) పలికినట్లు పలకాలి' అని అందులో కమలా రాశారు.

కమలా హారిస్

'కమల అంటే తామర లేదా కమలం అని అర్థం. భారత సంస్కృతిలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పైకి ఆ పూవు కొలనులో తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ, దాని వేళ్లు కొలను అడుగున బలంగా పాతుకుపోయి ఉంటాయి’ అంటూ అమెరికన్లకు తన పేరు గురించి ఆ పుస్తకంలో వివరించారామె.

కమల ద్విజాతి మూలాలు, పెంపకం వల్ల.. ఆమె చాలా అమెరికన్ అస్తిత్వాలతో కలిసిపోగలరు. ఇమిడిపోగలరు.

కమలా, మాయాలకు వారి తల్లి... వారి నేపథ్యాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవారు. ''కమలా హారిస్ భారత సంస్కృతిని ఆకళింపు చేసుకుంటూ పెరిగారు. కానీ, ఇప్పుడు ఓ ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆమె గర్వంగా జీవిస్తున్నారు'' అని గత ఏడాది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం రాసింది.

అయితే, కమలా గురించి బాగా తెలిసినవాళ్లు.. ఆమె రెండు వర్గాలకూ దగ్గరగా ఉంటారని చెప్తారు.

కమల హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అమెరికాలో నల్లజాతీయులు ఎక్కువగా చదువుకునే యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటి. తన జీవితంపై ఎక్కువగా ప్రభావితం చూపిన అనుభవాల్లో కాలేజీ జీవితమూ ఒకటని ఆమె చెబుతుంటారు.

ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీగా పనిచేసారు. తరువాత కాలిపోర్నియా అటార్నీ జనరల్ గా కొనసాగారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఏసియన్ అమెరికన్ కమలా హారిస్.

ఆమె వాక్పటిమ, సంభాషణా చాతుర్యం, వాదనా పటిమతో చాలా తక్కువ సమయంలోనే ప్రజాకర్షణ పొందిన జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు.

అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమలా ప్రముఖురాలు. ఆమె భారత్ మూలాల పట్ల కూడా ఆమె గర్వం వ్యక్తం చేస్తుంటారు.

కమలా హారిస్ 2014లో డగ్లస్ ఎమ్హోఫ్ అనే న్యాయవాదిని పెళ్లాడారు. డగ్లస్ యూదుడు.

భారతీయ, యూదు సంప్రదాయలను అనుసరిస్తూ తమ వివాహం జరిగిందని కమలా తన పుస్తకంలో రాశారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

కమలా తల్లి నేపథ్యం ఏమిటి?

కమలా హారిస్ మీద ఆమె తల్లి శ్యామల గోపాలన్ ప్రభావం చాలా ఎక్కువ. చాలా సార్లు ఆమె ఈ విషయం గురించి మాట్లాడారు. తన తల్లిని కమలా స్ఫూర్తిగా భావిస్తారు.

శ్యామలకు నలుగురు తోబుట్టువులు. దిల్లీ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. 19 ఏళ్ల వయసులోనే బెర్క్లీ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుని, చదువు కోసం 1958లో అమెరికాలో అడుగుపెట్టారు.

న్యూట్రిషన్, ఎండాక్రినాలజీలో డాక్టరేట్ చేసేందుకు వెళ్లిన శ్యామల.. క్యాన్సర్ పరిశోధకురాలిగా మారారు.

''ఆమెను అమెరికాకు పంపించడం మా అమ్మమ్మ, తాతయ్యలకు ఎంత కష్టమైన విషయమో నాకు తెలుసు. కమర్షియల్ జెట్ ప్రయాణాలు అప్పుడప్పుడే మొదలయ్యాయి. వాళ్లతో కాంటాక్ట్లో ఉండటం కూడా అప్పట్లో కష్టమే. కాలిఫోర్నియా వెళ్తానని మా అమ్మ అడిగినప్పుడు, వాళ్లు అడ్డు చెప్పలేదు'' అని కమలా తెలిపారు.

''చదువు పూర్తైపోగానే, ఇండియాకి తిరిగివచ్చి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని మా అమ్మ తన తల్లిదండ్రులకు మాట ఇచ్చింది. కానీ, విధి మరోలా ఉంది'' అని పేర్కొన్నారు.

కమలా హారిస్

భారత్‌లో శ్యామల కుటుంబంలోనూ రాజకీయ వాతావరణం ఉండేది. కమలా అమ్మమ్మ పెద్దగా చదువుకోలేదు. కానీ, గృహ హింస, కుటుంబ నియంత్రణ గురించి ఇతరులకు ఆమె అవగాహన కల్పించేవారు.

కమలా తాతయ్య భారత ప్రభుత్వంలో సీనియర్ దౌత్యవేత్త. ఆయన జాంబియాలో పనిచేశారు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చాక, శరణార్థులకు పునరావాసం కల్పించేందుకు ఆయన కృషి చేశారు.

కమలా తన పుస్తకంలో తన భారత పర్యటనల గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు.

తన మేనమామతో, చిన్నమ్మలతో తనకు సాన్నిహిత్యం ఉండేదని.. ఫోన్ కాల్స్, లేఖలు, అప్పుడప్పుడు పర్యటనలతో వారితో టచ్‌లో ఉండేదాన్నని కమలా రాశారు.

కమలా తల్లి శ్యామల 2009లో చనిపోయారు. అప్పటికి ఆమె వయసు 70 ఏళ్లు.

జో బిడెన్, కమలా హ్యారిస్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బైడెన్, కమలా హారిస్

బైడెన్ కమలానే ఎందుకు ఎంచుకున్నారు?

కమలా హారిస్‌ని ఎక్కువగా నల్లజాతి అమెరికన్ రాజకీయ నేతగానే అక్కడివారు చూస్తుంటారు. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమం జోరందుకున్న నేపథ్యంలో ఈ గుర్తింపుకు ప్రాధాన్యత కూడా పెరిగింది.

మరోవైపు భారతీయ అమెరికన్లు కూడా కమలాను తమలో ఒకరిగా చూసుకుంటున్నారు. ఆమె అభ్యర్థిత్వంతో అమెరికాలో ఉంటున్న భారతీయ, దక్షిణాసియా వర్గాలకు మరింత గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నారు.

అమెరికా వ్యాప్తంగా నల్లజాతి నిరసనలు జరిగేటప్పుడు పోలీసులు నిగ్రహంతో ఉండాలని ఆమె అభ్యర్థించారు.

కమలా హారిస్ తనతో కలిసి పోటీ చేయడం గర్వకారణమని బైడెన్ ట్వీట్ చేశారు. ''ఎలాంటి బెరుకూ లేకుండా పోరాడే యోధురాలు ఆమె. దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకురాల్లో ఆమె కూడా ఒకరు'' అని ప్రశంసించారు.

"నాతో పాటు పనిచెయ్యడానికి తెలివైన, దృఢమైన, నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కావాలి. కమలా అందుకు తగినవారు" అని జో బైడెన్ ప్రచార ఈమెయిల్లో పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, కమలా హారిస్: అమెరికా రాజకీయ కొలనులో భారత సంతతి కమలం

కమలా హారిస్‌కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలన్నీ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఆమె నాయకత్వ లక్షణాలను ఇదివరకే నిరూపించుకున్నారు. ఒక వ్యాఖ్యాత అన్నట్టుగా మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించగలిగే సత్తా ఉన్న వ్యక్తి.

"ఇంటెలిజెన్స్, జ్యుడీషియరీ విభాగాల్లో ఆమె ఒక దృఢమైన, సమర్థవంతమైన సెనేటర్‌గా గుర్తింపు పొందారు" అని బైడెన్ ప్రచార ఈమెయిల్లో తెలిపారు. "నేరస్థులను శిక్షించడంలోనూ, వివాహ వ్యవస్థలో సమానత్వం తీసుకురావడంలోనూ ఆమె గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి సందర్భంగా తలెత్తిన జాతి అసమానతల పట్ల ఆమె చాలా కఠినంగా వ్యవహరించారు" అని ఈమెయిల్లో రాశారు.

కమల అభ్యర్థిత్వం భారతీయ అమెరికన్ వర్గానికి చాలా గొప్ప విషయమని డెమొక్రటిక్ పార్టీ కార్యకర్త శేఖర్ నరసింహన్ అన్నారు.

''ఆమె మహిళ. రెండు జాతుల నేపథ్యం ఉంది. చాలా వర్గాలు ఆమెతో కనెక్ట్ అవుతాయి. ఆమె చాలా తెలివైనవారు కూడా'' అని ఆయన వ్యాఖ్యానించారు.

తానొక నల్లజాతి మహిళనని గర్వంగా చెప్పుకునే వాతావరణంలో పెరిగానని ఆమె అంటారు. అలాగే భారత వారసత్వంతో, అమ్మమ్మ, తాతలతో కూడా బలమైన బంధాలున్నాయని కూడా చెబుతారు.

''వాళ్లు చెప్పిన కథలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. వాళ్ల మాటల్లో వ్యక్తమయ్యే ఆత్మీయత, ప్రజాస్వామ్యం ప్రాధాన్యత గురించి వాళ్ల మాటలు.. బీసెంట్ నగర్ బీచ్‌లో మా తాతగారితో నడుస్తూ విన్న మాటలు.. నేనీ స్థితికి చేరుకోగలిగానంటే వీటన్నింటి ప్రభావం నాపైన ఉంది'' అంటారామె.

తల్లితో కమలా హారిస్, మాయా హారిస్

ఫొటో సోర్స్, KAMALA HARRIS

ఫొటో క్యాప్షన్, తల్లి శ్యామలా గోపాలన్ హారిస్‌తో కమలా హారిస్, మాయా హారిస్

కెనడాలో ఐదేళ్లు...

కమలా ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించినపుడు.. భారత సంతతి కమెడియన్ మిండీ కలింగ్‌తో కలిసి ఓ కుకింగ్ వీడియోలో ఆమె కనిపించారు. భారతీయ వంటకాన్ని వండుతూ, తమ దక్షిణ భారత నేపథ్యం గురించి ఇందులో వీళ్లిద్దరూ ముచ్చటించారు.

కమల తన యూట్యూబ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. కమలా భారత నేపథ్యం గురించి ఇంకా చాలా మందికి తెలియదని, భారత సంతతి వాళ్లు ఆ విషయం గురించి తెలుసుకుని సంతోషపడుతున్నారని ఆ సమయంలో మిండీ ఆమెతో అన్నారు.

'చిన్నప్పుడు దక్షిణాది వంటకాలు తిన్నారా?' అని ఆమెను ప్రశ్నించారు.

''అన్నం, పెరుగు, ఆలుగడ్డ కూర, పప్పు, ఇడ్లీ..'' అంటూ చిన్నప్పుడు తాను ఇంట్లో తిన్న వంటల జాబితాను వివరించారు కమలా.

నేను భారత్‌లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్తుండేదాన్ని. మా అమ్మమ్మ శాకాహారి. ఆమె ఎటైనా వెళ్లినప్పుడు, గుడ్లతో ఫ్రెంచ్ టోస్ట్ చేసుకుందామని మా తాతయ్య అడుగుతుండేవారు'' అని కమలా చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.

తమ ఇంట్లో బిర్యానీ కూడా చేసుకునేవాళ్లమని కమలా తన పుస్తకంలో రాశారు.

ఇప్పటివరకు కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఉపాధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఎన్నికల్లో బరిలోకి దిగారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా మహిళలు గెలవలేదు.

''మన విముక్తి కోసం పనిచేసే సమయం భవిష్యత్తులో ఎప్పుడో లేదు. ఈ సవాలు ఇప్పటిదే.. ఎప్పుడైనా సరే ఇప్పుడే సమయం'' అంటూ 2014 ఫెర్గూసన్ జాతివివక్ష నిరసనలను ఉటంకిస్తూ హోవార్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు 2017లో ఇచ్చిన సందేశం

కమలా కొంత కాలం కెనడాలోనూ నివసించారు. శ్యామలా గోపాలన్ హారిస్ మెక్‌గిల్ యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరినపుడు.. కమలా, ఆమె చెల్లెలు మాయా కూడా కెనడా వెళ్లారు. మాంట్రియాల్‌లో ఐదేళ్లు స్కూలుకు వెళ్లారు.

కమలా హారిస్ తను 'ఒక అమెరికన్'ని అని అభివర్ణిస్తుంటారు. తన అస్తిత్వం ఎప్పుడూ సౌకర్యవంతంగానే ఉంటుందని చెప్తారు.

రాజకీయవేత్తలు తమ రంగు లేదా నేపథ్యం కారణంగా ఏదో ఒక గిరిలో ఇమడిపోవాల్సిన అసవరం లేదని ఆమె 2019లో వాషింగ్టన్ పోస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

''నేను నేనే. అది నాకు బాగానే ఉంది. మీరు అర్థం చేసుకోవాల్సి రావచ్చేమో. నాకేమీ ఇబ్బంది లేదు'' అని ఆమె పేర్కొన్నారు.

భర్త డాగ్‌తో కమలా హారిస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భర్తతో కమలా హారిస్

కమలా.. మామలా.. చరిత్ర సృష్టికర్త

కమల డాగ్‌ను పెళ్లి చేసుకున్నపుడు.. ఆయన ఇద్దరు పిల్లలకు మారు తల్లి అయ్యారు.

''నేను డాగ్ పెళ్లిచేసుకున్నపుడు.. కోల్, ఎల్లా, నేను ఒక అంగీకారినిక వచ్చాం. 'సవతి తల్లి' అనే పదం మాకు నచ్చదని'' అని ఆమె గత ఏడాది ఎల్లి మేగజీన్‌లో రాసిన ఒక వ్యాసంలో తెలిపారు.

వారు ఒక కొత్త పేరును తయారుచేసుకున్నారు. ''మామలా''.

ఆ పేరు పతాక శీర్షికల్లోకి చేరింది. ఆధునిక అమెరికన్ 'సంకీర్ణ' కుటుంబాలకు చిహ్నంగా మీడియాలో చర్చనీయాంశమైంది.

ఉపాధ్యక్ష పదవికి ఎన్నికవటం వల్ల కమలా ఈ నిక్‌నేమ్‌ను కోల్పోయే అవకాశం లేదు. అయితే.. ఆమెను మరో తరహా కుటుంబానికి వారసురాలిగా గుర్తించాలని, తరతరాల నల్లజాతి మహిళా కార్యకర్తల వారసురాలిగా చూడాలని చాలా మంది వాదిస్తారు.

''ఆమె గెలుపు చరిత్రాత్మకం. కానీ అది ఆమె ఒక్కరిదే కాదు. ఈనాడు ఇది సాధ్యమయ్యేలా చేయటానికి బాటలు పరచిన ఎంతో మంది నల్లజాతి మహిళలకు ఇందులో భాగస్వామ్యం ఉంది'' అని పెర్డ్యూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ నదియా బ్రౌన్ బీబీసీతో పేర్కొన్నారు.

కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

లెఫ్ట్ - రైట్ మధ్య...

కమలా ప్రాసిక్యూటర్‌గా పనిచేయటం ఆమెను రాజకీయవేత్తను చేసింది. ఆ కెరీర్ ఆమెకు రాజకీయ ప్రయోజనాలూ, ప్రమాదాలు కూడా తీసుకొచ్చింది.

అలామెడా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్‌లో పనిచేయటం మొదలు పెట్టిన కమలా 2003లో శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ అయ్యారు. ఆ తర్వాత కాలిఫోర్నియా తొలి మహిళా, నల్లజాతి అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు.

డెమొక్రటిక్ పార్టీలో ఎదుగుతున్న తారగా పేరుతెచ్చుకున్నారు. 2017లో కాలిఫోర్నియా జూనియర్ సెనెటర్‌గా ఎన్నికయ్యారు.

అయితే.. కాలిఫోర్నియాలో వామపక్షం వైపు మొగ్గే డెమొక్రాట్లను మెప్పించటానికి - దేశాధ్యక్ష పదవి ఎవరు చేపట్టాలనేది వామపక్షం నిర్ణయించని దేశంలో రాజకీయవేత్తగా కొనసాగటానికి మధ్య గల రేఖ మీద నడక చాలా కష్టం.

నాటి సుప్రీంకోర్టు నామినీ బ్రెట్ కవన్నాను ప్రశ్నించటం ద్వారా ప్రగతిశీలవాదుల అభిమానం పొందారు కమలా. కానీ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఆమె వాక్పటిమ ఒక్కటే సరిపోలేదు.

సొంత పార్టీలో ప్రగతిశీలవాదులు - మితవాదుల మధ్య సంయమనం పాటించే ప్రయత్నంలో ఆమె ఎవరినీ మెప్పించలేకపోయారు. గే వివాహాలు, మరణ దండనల వంటి అంశాల్లో వామపక్షం వైపు మొగ్గు ఉన్నప్పటికీ.. తగినంత ప్రగతిశీలతతో లేరంటూ కమలా మీద ప్రగతిశీలవాదులు పదే పదే విమర్శలతో దాడిచేశారు.

కమలా హారిస్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్

పోలీసు సంస్కరణలు, మాదకద్రవ్యాల సంస్కరణలు, తప్పుడు శిక్షల వంటి విషయాల్లో ప్రగతిశీల వాదుల పోరాటాలను కమలా హారిస్ తప్పించుకున్నారని యూనివర్సిటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో లా ప్రొఫెసర్ లారా బాజెలాన్ ఒక వ్యాసంలో నాడు విమర్శించారు.

అధ్యక్ష ఎన్నికల నామినేషన్ కోసం చేపట్టిన ప్రచారంలో ''కమలా ఈజ్ ఎ కాప్'' అనే మాట.. ఆమె ఉదారవాద డెమొక్రటిక్ మద్దతు మరింతగా లభించకుండా అడ్డుకుంది.

అయితే.. జాతీయ స్థాయిలో మితవాద ఓటర్లు, స్వతంత్ర ఓటర్లను గెలవటానికి.. అటార్నీ జనరల్‌గా పనిచేసిన అదే రికార్డు ఉపయోగపడింది.

ఇప్పుడు అమెరికాలో పోలీసు క్రూరత్వం, జాతివివక్షకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండటంతో కమలా ముందు వరుసలోకి వచ్చి.. ప్రగతిశీలవాదుల గళాన్ని మరింత బలంగా వినిపిస్తున్నారు.

అమెరికాలో పోలీసులు అనుసరించే విధానాలు మారాలని ఆమె చర్చల్లో పిలుపునిస్తున్నారు. కెంటకీలో 26 ఏళ్ల ఆఫ్రికన్ - అమెరికన్ మహిళ బ్రియానా టేలర్ మరణానికి కారణమైన పోలీసులను అరెస్ట్ చేయాలని ట్విటర్‌లో పిలుపునిచ్చారు. వ్యవస్థీకృత జాతివివక్షను రూపుమాపాల్సిన అవసరం గురించి ఆమె తరచుగా మాట్లాడుతున్నారు.

కమలా తన అస్తిత్వం వల్ల అణగారిన వారికి తను ప్రతినిధిని అవుతానని అనేకసార్లు చెప్పారు.

ఇప్పుడు ఆ పనిని శ్వేతసౌధం లోపలి నుంచి చేసే అవకాశం ఆమెకు ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)