అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ఈ ఫలితాలను ట్రంప్ అంగీకరించకపోతే ఏమవుతుంది?

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి కావలసిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల కంటే ఎక్కువ రావడంతో ట్రంప్‌పై, జో బైడెన్ విజయం ఖరారైనట్టే. ఇప్పుడేం జరుగుతుంది?

గెలిచేసారు కాబట్టి జో బైడెన్ నేరుగా వైట్ హౌస్ (1600 పెన్సిల్వేనియా అవెన్యూ)లోకి షిఫ్ట్ అయిపోలేరు. జరగాల్సిన ఫార్మాలిటీస్ ఇంకా కొన్ని ఉన్నాయి.

సాధారణంగా ఇవన్నీ సులువుగా జరిగిపోయేవే. కానీ ఈసారి ఎన్నికల్లో చట్టపరమైన సవాళ్లు కొన్ని ఎదుర్కునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

జో బైడెన్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు?

ముందుగా, ప్రతీ రాష్ట్రంలో ఓట్లన్నిటినీ ధృవీకరించాలి. ఇది సాధారణంగా ప్రతీ ఎన్నికల తరువాత జరిగే ప్రక్రియే. రాబోయే కొన్ని వారాల్లో ఇది జరుగుతుంది.

అమెరికా రాజ్యాంగం ప్రకారం, కొత్త అధ్యక్షుడి పదవీకాలం జనవరి 20వ తేదీ మధ్యాహ్నంనుంచీ ప్రారంభమవుతుంది.

యూఎస్ రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగే 'ది ఇనాగరేషన్' (ప్రారంభోత్సవం) అనే కార్యక్రమంలో కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు.

జో బైడెన్, కమలా హ్యారిస్ 2021లో జనవరి 20వ తేదీన ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు.

అయితే, ఈ షెడ్యూల్‌కు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రాజీనామా చేసినా లేదా మరణించినా లేదా ఉపాధ్యక్షుడు జనవరి 20 కి ముందే ప్రమాణ స్వీకారం చేసినా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగదు.

2017లో జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2017లో జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జో బైడెన్

పరిపాలన ఎలా మొదలవుతుంది?

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత, జనవరి 20 ప్రారంభోత్సవంలోపు 'ట్రాన్సిషన్ టీమ్' అని పిలిచే ఒక ప్రత్యేకమైన బృందాన్ని కొత్త అధ్యక్షుడు ఏర్పాటు చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త అధ్యక్షుడు అధికారంలోకి వచ్చి పాలన సాగించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లూ ఈ బృందం చేస్తుంది. బైడెన్ ఇప్పటికే దీనికి సంబంధించిన వెబ్‌సైట్ (ట్రాన్సిషన్ వెబ్‌సైట్)‌ను ఏర్పాటు చేసారు.

ఈ బృందం..క్యాబినెట్ మంత్రులను ఎంచుకోవడం, ముఖ్యమైన పాలసీ విధానాలను చర్చించడం మొదలైన కార్యక్రమాలన్నిటినీ నిర్వహించి కొత్త పరిపాలనకు రంగం సిద్ధం చేస్తుంది.

ఈ బృంద సభ్యులు ప్రభుత్వ సంస్థలన్నిటినీ సందర్శించి గడువులు, బడ్జెట్, ఏ శాఖలో సిబ్బంది ఏ విధులను నిర్వర్తిస్తారులాంటి విషయాలన్నీ తెలుసుకుంటారు.

వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టబోయే కొత్త కార్యాలయ సిబ్బందికి కావలసిన సమాచారం మొత్తం ఈ ట్రాన్సిషన్ టీమ్ సేకరిస్తుంది. ప్రారంభోత్సవం తరువాత కూడా అవసరమైతే సహాయం చెయ్యడానికి ఈ బృందం అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత కూడా ఈ బృంద సభ్యులు కొందరు తమ సేవలను కొనసాగించే అవకాశం ఉంది.

జో బైడెన్ ఈ ట్రాన్సిషన్ టీమ్‌ను తయారుచెయ్యడానికి, దీనికి కావలసిన నిధులను సమకూర్చడానికి నెలల తరబడి శ్రమించారు. గతవారం ట్రన్సిషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

ఇప్పటినుంచీ వినిపించబోయే పదాలేంటి?

ప్రెసిడెంట్-ఎలక్ట్: ఎన్నికల్లో నెగ్గి, ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యని అభ్యర్థిని ప్రెసిడెంట్-ఎలక్ట్ అంటారు.

కేబినెట్: జో బైడెన్ త్వరలో తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నారు. కేబినెట్ సభ్యుల పేర్లను త్వరలో ప్రకటించనున్నారు.

న్ఫర్మేషన్ హియరింగ్: ఉన్నత ప్రభుత్వ పదవులకు కొత్త అధ్యక్షుడు ఎన్నుకునే సభ్యులను సెనేట్ అంగీకరించాలి. బైడెన్ ఎన్నుకున్న సభ్యులను సెనేట్ కమిటీ ఇంటర్వ్యూ చేసి, తన ఆమోదాన్ని లేదా నిరాకరణను ఓటు ద్వారా తెలియజేస్తుంది. దీన్ని కన్ఫర్మేషన్ హియరింగ్ అంటారు.

కెల్టిక్: ప్రెసిడెంట్-ఎలక్ట్‌గా బైడెన్‌కు రహస్య భద్రతా విభాగం (సీక్రెట్ సర్వీసెస్)నుంచీ ఒక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ బృందానికి సంకేతనామం కెల్టిక్. వీటికి ప్రత్యేకమైన పేర్లను అభ్యర్థులే సూచిస్తారు. బైడెన్ తన రక్షణ బృందానికి మొగుల్ అనీ, కమలా హ్యారిస్ పయొనీర్ అని ఎంచుకున్నట్లు సమాచారం.

2016లో ట్రంప్‌కు బరాక్ ఒబామా పదవీ బాధ్యతలను అప్పగించారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2016లో ట్రంప్‌కు బరాక్ ఒబామా పదవీ బాధ్యతలను అప్పగించారు

చట్టపరమైన సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందా?

దాదాపుగా ఎదుర్కోవలసి రావొచ్చు. బైడెన్ గెలిచిన అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రంప్ సూచించారు.

ట్రంప్ వర్గం ఈ అంశంలో కేసులు వెయ్యడానికి సీనియర్ లాయర్లకోసం వెతుకుతున్నట్లు సమాచారం.

కొన్ని పోస్టల్ ఓట్లను రద్దు చేయించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు మొదట రాష్ట్రాల్లోని కోర్టుల్లో మొదలైనా, సుప్రీం కోర్టు దాకా వెళ్లొచ్చు. అయితే, అవేవీ విజయవంతం అయ్యే అవకాశాలు లేవని న్యాయశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ వర్గం అభ్యర్థన మేరకు మళ్లీ ఓట్ల లెక్కింపు జరగవచ్చు కానీ ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికల ఫలితాలను ట్రంప్ అంగీకరించకపోతే ఏమవుతుంది?

నార్త్ అమెరికా విలేకరి ఆంటొనీ జర్చర్ అంచించిన సమాచారం ప్రకారం..

ఈ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తానని ట్రంప్ ఇంతకుముందే చెప్పారు. అయితే ఈ దిశలో ఆయన విజయవంతమవ్వకపోతే తన ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. కానీ, ట్రంప్ కచ్చితంగా ఓటమిని అంగీకరించాలా?

ఓడిపోయిన అభ్యర్థి, గెలిచిన అభ్యర్థికి ఫోన్ చేసి తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలుపడం అమెరికా రాజకీయాల్లో ఒక గౌరవనీయమైన సంప్రదాయం. అయితే, ఇది తప్పనిసరి కాదు.

ఉదాహరణకు, 2018లో డెమొక్రటిక్ గవర్నర్ అభ్యర్థి స్టేసీ అబ్రంస్ ఓడిపోయిన తరువాత..ఓట్ల లెక్కింపులో అవకతవకలు, మోసం జరిగాయని దావా వెయ్యడమే కాకుండా, తను ఓటమిని అంగీకరిస్తున్నట్లు విజేత అయిన రిపబ్లికన్ అభ్యర్థి బ్రెయిన్ కెంప్‌కు ఎప్పుడూ చెప్పలేదు.

అయితే, ఆధునిక కాలంలో ఇలాంటిది ఇంతకుముందెన్నడూ జరగలేదు.

కానీ జార్జియాలో మాదిరిగా, ఎన్నికల ఫలితాలు చట్టపరంగా ధృవీకరించబడిన తరువాత ట్రంప్ ఏం చేసినా, చెయ్యకపోయినా కొత్త అధ్యక్షుని పరిపాలన ప్రారంభమైపోతుంది.

ట్రంప్, తన ఓటమిని అంగీకరించకపోయినా, బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోయినా సరే కొన్ని చట్టపరమైన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. బైడెన్ బృందానికి అధికారం అప్పగించడానికి కావాలసిన అన్ని సన్నాహాలు చెయ్యమని తన పరిపాలనా సిబ్బందికి ఆదేశాలు జారీ చెయ్యాల్సి ఉంటుంది. ట్రంప్ ఇప్పటికే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తరపు అధికారులు చెబుతున్నారు.

అయితే, ట్రంప్ ఎలాంటి నిబంధనలను, సంప్రదాయాలనైనా నిర్భీతిగా తోసిపుచ్చగల వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు కాబట్టి ఆయన కావాలనుకుంటే ఈ విధానాలు ఏమీ పాటించకుండా కూడా అధ్యక్ష పదవినుంచీ తప్పుకోవచ్చు.

డగ్ ఎమ్హాఫ్, కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

కమలా హ్యారిస్ బాధ్యతలేమిటి?

అమెరికా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న తొలి మహిళ కమలా హ్యారిస్ తన సిబ్బందిని నియమిస్తారు.

ఈ పదవీ బాధ్యతల గురించి మరింత అవగాహన పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. మునుపటి అధికారులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు.

వైట్ హౌస్ పశ్చిమ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం ఉంటుంది. కానీ వారి నివాసం అక్కడ ఉండదు. వైట్ హౌస్‌కు 10 నిముషాల ప్రయాణ దూరంలో నగరానికి వాయువ్య దిశలో ఉన్న యూఎస్ నావల్ అబ్జర్వేటరీ గ్రౌండ్స్‌లోని బంగ్లాలో ఉంటారు.

కమలా హ్యారిస్ సహచరుడు డగ్ ఎమ్హాఫ్ వినోద పరిశ్రమలో పనిచేసే ఒక న్యాయవాది.

వైట్ హౌస్‌లో అధ్యక్షుడి నివాసం ఎలా ఉంటుంది?

వైట్ హౌస్‌లో అధ్యక్షుడి నివాసం అన్ని సదుపాయాలతో, అలంకరణలతో నిండుగా ఉంటుంది.

కొత్త అధ్యక్షుడు తన కుటుంబంతో సహా వైట్ హౌస్‌లోకి మారే ముందు భవనానికి మరమ్మతులు చేయించాలన్నా, పాత సామాగ్రిని మార్చాలన్నా..వాటికోసం కాంగ్రెస్ కొంత నిధిని కేటాయిస్తుంది.

ప్రెసిడెంట్ నివాసంలో 132 గదులు, 35 బాత్రూంలు ఉంటాయి.

ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఫ్యాషన్ రంగంలో పనిచేసి ఉండడం వలన, ఆమె వైట్ హౌస్ నివాసంలోకి అడుగుపెట్టాక ఇంటి అలంకరణలో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)