అర్నబ్ గోస్వామిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన మీదున్న కేసులేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆశిష్ దీక్షిత్
- హోదా, బీబీసీ మరాఠీ ఎడిటర్
జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని కొన్ని రోజుల కింద అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. అర్నబ్ అరెస్ట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అర్నబ్ అనుకూల, వ్యతిరేక వర్గాల నుంచి కామెంట్లు హోరెత్తాయి.
అర్నబ్ సహా ఇతర నిందితుల తరఫున దాఖలైన ఇంటరిమ్ బెయిల్ పిటిషన్‌పై అదేశాలను బాంబే హైకోర్టు శనివారం నాడు రిజర్వ్ చేసింది. సాధారణ బెయిల్ కోసం నిందితులు దిగువ కోర్టుకు వెళ్లవచ్చని, పిటిషన్ దాఖలైన నాలుగు రోజుల్లోగా కోర్టు దానిపై స్పందిస్తందని హైకోర్టు ప్రకటించింది.
అసలు ఈ వ్యవహారంలో మొదటి నుంచీ ఏం జరిగిందో చూద్దాం.
అర్నబ్ అరెస్ట్‌కు దారితీసిన కేసు ఏంటి?
కాంకార్డ్ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ముంబయిలోని రిపబ్లిక్ టీవీ చానల్ స్టూడియోలు, ఆఫీస్‌ను డిజైన్ చేసే కాంట్రాక్టు అప్పగించారు. అయితే, 2018 మేలో ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అన్వయ్ నాయక్, తన తల్లితో పాటు ముంబయి సమీపంలోని తమ స్వస్థలం అలీబాగ్‌లో శవాలుగా కనిపించారు. రాయ్‌గఢ్ జిల్లా కేంద్రమే ఈ అలీబాగ్.
అన్వయ్ నాయక్ ఇంట్లో కనిపించిన ఓ లేఖ ఆధారంగా పోలీసులు, ఆత్మహత్య కేసు నమోదు చేశారు. అయితే, అప్పట్లో ఆ లేఖ నిరూపణ కాలేదు. అర్నబ్ గోస్వామి కంపెనీతో పాటు ఫిరోజ్ షేక్, నీతీష్ శార్దా అనే ఇద్దరు వ్యక్తులు అన్వయ్‌కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లే అన్వయ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య అక్షత బీబీసీకి చెప్పారు.
అన్వయ్ నాయక్‌కు ఇవ్వాల్సిన దానిలో 90 శాతం చెల్లించేశామని అర్నబ్ కంపెనీ ఏఆర్‌జీ ఔట్లయర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చెప్పింది. పని పూర్తి కాకపోవడం వల్ల 10 శాతం చెల్లించలేదని చెప్పింది. అయితే, డబ్బు చెల్లించారా, లేదా అనేది పోలీసులు తేల్చాల్సిన విషయం. కానీ అర్నబ్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు లేవంటూ 2019 ఏప్రిల్లో పోలీసులు స్థానిక కోర్టులో చెప్పడంతో ఈ కేసును కొట్టివేశారు.

ఫొటో సోర్స్, ANVAY NAIK
మారిన రాజకీయ వాతావరణం
2018-19ల్లో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. శివసేనతో కలిసి ఫడ్నవీస్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ, అధికారాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమితో శివసేన చేతులు కలిపి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారడంతో అన్వయ్ నాయక్ భార్య అక్షత మరోసారి హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను కలిశారు.
గతంలో అధికారంలో ఉన్న బీజేపీతో అర్నబ్‌కు సత్సంబంధాలున్నాయని, అందువల్లే తనకు న్యాయం జరగలేదని హోం మంత్రితో అక్షత చెప్పారు. దీంతో, ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని ఆయన వెంటనే ఆదేశించారు. ఆయన సీఐడీ విచారణ జరిపిస్తామని ప్రకటించినప్పటికీ, రాయ్‌గఢ్ పోలీసులు దీనిపై విచారణ మొదలుపెట్టారు.
ఆ విచారణలో భాగంగా 2020 నవంబర్ 4న రాయ్‌గఢ్ పోలీసులు ముంబయి వచ్చి అర్నబ్‌ను అరెస్ట్ చేశారు. అన్వయ్ నాయక్ ఆత్మహత్యకు ఆయనే కారణమనే ఆరోపణలతో అర్నబ్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
అర్నబ్‌ను అరెస్ట్ చేసే సమయంలో పెద్ద డ్రామా నడిచింది. పోలీసులు అర్నబ్‌ను నెట్టడం, తొయ్యడం వంటివి ఆ వీడియోలో కనిపించాయి. అయితే, అర్నబ్ తనకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవచ్చని, కానీ ఇప్పుడు తమకు సహకరించి, తమతో రావాలని పోలీసులు చెప్పడం కూడా ఆ వీడియోలో కనిపించింది. పోలీసులు తనపై భౌతిక దాడిచేశారని అర్నబ్ చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది.
కేసు విచారణను తిరిగి ప్రారంభించే ముందు తమ అనుమతి తీసుకోలేదని కింది కోర్టు పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టుకు కేవలం తెలియచేశామనడం సరికాదని చెప్పింది. దీన్ని సెషన్స్ కోర్టులో పోలీసులు సవాల్ చేశారు. దీనిపై నవంబర్ 7న విచారణ జరగనుంది.

ఫొటో సోర్స్, SATISH BATE/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
బీజేపీకి అనుకూలమనే విమర్శలు
సాంకేతికంగా చూస్తే, అర్నబ్ పాత్రికేయ వృత్తికి ఏ మాత్రం సంబంధం లేని ఓ క్రిమినల్ కేసు ఇది. కానీ, దీన్ని వేరుగా చూడలేం, ఎందుకంటే ఇది జరుగుతున్న సమయంలో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందువల్ల వాటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.రాజీవ్ చంద్రశేఖర్‌తో కలసి అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. తర్వాత కాలంలో రాజీవ్ బీజేపీలో చేరారు. అప్పటి నుంచి అర్నబ్ బీజేపీ పక్షం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కావొచ్చు- ఇది హత్య అని అర్నబ్ చెబుతారు- పాల్గర్‌లో సాధువులను కొట్టిచంపడం కావచ్చు, ఇలా ఆయన లేవనెత్తే అంశాలను చూస్తే, అర్నబ్ నిరంతరం మహారాష్ట్రలోని శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంపై తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇటీవల కాలంలో బీజేపీపై ఆయన విమర్శలు చేసిన దాఖలాలు కనిపించవు.
అన్వయ్ నాయక్ కేసు మూసేసినప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. అర్నబ్ అప్పట్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. అన్వయ్ నాయక్ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైనప్పుడు శివసేన-కాంగ్రెస్—ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఉంది. వీరిపై అర్నబ్ తీవ్రమైన విమర్శలు చేస్తూనే ఉంటారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సలియాన్ మరణాలతో లింకు పెట్టి ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకున్నారని అర్నబ్‌పై అధికార శివసేన నేతలు అసంతృప్తితో ఉన్నారు.

ఫొటో సోర్స్, Ani
మరోవైపు మహారాష్ట్రలో తనపై అనేక కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని అర్నబ్ అంటున్నారు.జర్నలిజంలో భాగంగా ప్రశ్నిస్తున్నందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో అర్నబ్‌కు వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని శివసేన ఎమ్మెల్యే ప్రవేశపెట్టారు. దీన్ని అర్నబ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసును తాము విచారించేవరకూ ఈ కేసు విషయంలో అర్నబ్‌ను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించారు.
అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో అర్నబ్ ఇప్పటికే అలీబాగ్‌లో జ్యుడీషియల్ కస్టడీలో కొన్ని రోజులు గడిపారు. కోవిడ్-19 క్వారంటీన్ సెంటర్‌గా ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన్ను ఉంచారు. జైళ్లలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిందితులుగా ఉన్న చాలా మందిని క్వారంటీన్ సెంటర్లలోనే ఉంచుతున్నారు. అన్వయ్ నాయక్ కేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ అర్నబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై బొంబాయి హైకోర్టులో విచారణ జరగనుంది.

ఫొటో సోర్స్, Getty Images
అర్నబ్ అరెస్ట్ విషయంలో భారత్‌లోని జర్నలిస్ట్ వర్గాలు, ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దవాళ్లను సైతం ధైర్యంగా ప్రశ్నిస్తూ సత్యం కోసం పోరాటం చేసే జర్నలిస్టుగా అర్నబ్‌ను కొందరు అభివర్ణిస్తుండగా... ఆయన చేసేది జర్నిలిజమే కాదని, బీజేపీ వ్యతిరేకులను ఎంచుకుని వారిని మాత్రమే ఆయన ప్రశ్నిస్తారని, బీజేపీ రాజకీయ అజెండాను ఆయన అమలుచేస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి అర్నబ్‌కు మద్దతు ఉందనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయగానే కేంద్ర హోం మంత్రి, ఎంతో మంది బీజేపీ నాయకులతోపాటు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అర్నబ్‌కు మద్దతుగా ట్వీట్లు చేశారు.
చూస్తుంటే.. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేటట్లు లేదు.
ఇవి కూడా చదవండి:
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- విశాఖ తీరానికి కొట్టుకువచ్చిన ఈ ఓడ తిరిగి సముద్రంలోకి వెళ్తుందా? ఇక్కడే రెస్టారెంట్‌గా మారుతుందా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- సౌదీ ‘కఫాలా’ వ్యవస్థకు మార్పులు... వలస కార్మికులకు నిజంగా మేలేనా?
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








