అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎందుకింత ‘గందరగోళం’?
అమెరికా ఎన్నికలు అక్కడి ఎలక్ర్టోరల్ కాలేజ్ సిస్టమ్ చాలా దేశాల వారికి ఇప్పటికీ రాకెట్ సైన్స్ లాంటిదే. అది సంక్లిష్టమైన ప్రక్రియే. దాన్ని చర్చించుకునే ముందు అంటే ఎలక్రోరల్ కాలేజీ, స్వింగ్ స్టేట్స్ ఇత్యాది అంశాలు చర్చించుకునే ముందు అసలు అమెరికా గురించి మనమెందుకు మాట్లాడుకోవాలి. ఎంతో దూరంలో ఉన్న మనకు అవసరమా అనే బేసిక్ ప్రశ్న ఎదురవుతుంది.
మనకెందుకు అవసరం?
యుఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సైనిక పరంగాకూడా. ప్రపంచ దేశాల రిజర్వ్ కరెన్సీ కూడా యుఎస్ డాలరే. అందువల్ల అమెరికా తీసుకునే నిర్ణయాలు చాలా దేశాల మీద ప్రభావం చూపిస్తాయి. వాళ్ల అంతర్జాతీయ విధానాలు కూడా. అందువల్లే అమెరికన్ విధానాల్లో వారి ఎన్నికల ప్రచారంలో దేశీయ అంశాలతో సమానంగా కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా కూడా విదేశీ విధానాలే కీలకపాత్ర పోషిస్తాయి. భారత్ లాంటి పెద్దదేశానికి అమెరికా విధానాల ప్రభావం కూడా కీలకమైనదే. అందువల్ల మనకు అమెరికా ఎన్నికల మీద ఆసక్తి ఉండడం సహజం. వ్యాపార సంబంధాలు, సైనిక సహకారం, చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో దగ్గరితనం పెరగడం వగైరా అంశాలు అనేకం ఉన్నాయి. ఇక వైట్ కాలర్ మైగ్రేషన్, ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా ఐటి వలసల వల్ల అమెరికాతో బలపడుతున్న మరో బంధం సంగతి సరేసరి.
ఫలితాలు ఎందుకింత గందరగోళం?
అమెరికా పౌరులు నేరుగా అధ్యక్షులను ఎన్నుకోరు. ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నవాళ్లే అధ్యక్షులవుతారని రూలేం లేదు. పోయిన ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్కు ట్రంప్ కంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి. అయినా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ట్రంప్ అధ్యక్షుడయ్యారు. అంతకుముందు ఆల్ గోర్‌కి బుష్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం ఐదు సార్లు అలా జరిగింది. ఎలక్టోరల్ ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వారే. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ప్రతి రాష్ర్టానికి వారి జనాభా శాతాన్ని బట్టి ఎలక్టోరల్ ఓట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. ఈ మొత్తం 538లో ఎవరైతే 270 ఓట్ల సాధిస్తే వాళ్లు గెలిచినట్టు లెక్క.
ఎట్లా లెక్కపెడతారు..?
ఆ రాష్ర్టంలో ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ రాష్ర్టంలో వారు గెలిచినట్టు లెక్క. ఆరాష్ర్టంలో ఉన్న ఎలక్టోరల్ ఓట్లన్నీ వారికే వెడతాయి రెండు రాష్ర్టాల్లో తప్ప. మిగిలిన రాష్ర్టాల్లో అన్ని ఎలక్టోరల్ ఓట్లు వారి ఖాతాలోకే. ఉదాహరణకు కాలిఫోర్నియాకు 55 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఆ రాష్ర్టంలో డెమెక్రటిక్ అభ్యర్థి బైడెన్కు మెజారిటీ ఓట్లు పడ్డాయి కాబట్టి అక్కడున్న 55 ఎలక్టోరల్ ఓట్లు ఆయన ఖాతాలోకి వెళ్లిపోతాయి. అలాగే రిపబ్లికన్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ గెలిచిన రాష్ర్టాల్లో కూడా. భారీ మెజారిటీ వచ్చినా స్వల్ప ఆధిక్యం వచ్చినా అవే ఎలక్టోరల్ ఓట్లు అదే సంఖ్య. విన్నర్ టేక్స్ ఆల్.
రెండు రాష్ర్టాలు అప్ప మిగిలిన 48 రాష్ర్టాల్లో అదే పద్ధతి. నాలుగు సీట్లున్న మెయిన్ , ఐదు సీట్లున్న నెబ్రాస్కా మాత్రం రెండు వైపులా ఓట్ల శాతాన్ని బట్టి సీట్లను కేటాయిస్తాయి. ఈ రెండు స్వల్ప మినహాయింపులను పక్కనబెడితే ఎక్కువ సీట్లున్న రాష్ర్టాలు ఎవరి ఖాతాలోకి వెడితే వారే కింగ్.
అట్లా ఆయా రాష్ర్టాల్లో లెక్కింపులు పూర్తయ్యే కొద్దీ ఫలితాలు వెల్లడవుతూ ఉంటాయి. ఎలక్టోరల్ కాలేజీ లెక్క క్లియర్ అవుతూ ఉంటుంది. అందుకే రాష్ర్టాల మీద అంత చర్చ. అది ఫెడరల్ సిస్టమ్, మనలాగా ఇవియెంల సిస్టమ్ కాదు. పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ. కాబట్టి ఆలస్యమవుతుంది. కొన్ని రాష్ర్టాలు మిగులుతాయి. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్. పోటీ హోరాహోరీగా ఉన్నపుడు లెక్క తొందరగా తేలదు.
స్వింగ్ స్టేట్స్
అమెరికాల ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. మొత్తం కాన్‌సన్‌ట్రేషన్ అంతా అక్కడే ఎక్కువ ఉంటుంది. ప్రచారం కూడా అక్కడే ఎక్కువ. బాటిల్ స్టేట్స్ అని కూడా పిలుస్తారు. ఏంటి వాటిప్రత్యేకత. అమెరికాలో ఉన్న మొత్తం 50 రాష్ర్టాల్లో సాధారణంగా ఎపుడూ ఏదో ఒక పార్టీకే పట్టం కట్టే రాష్ర్టాలుంటాయి. లాయల్ గా అదే పార్టీకి ఓటేసే రాష్ర్టాలన్నమాట.
ఉదాహరణకు కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి రాష్ర్టాలు సంప్రదాయంగా డెమెక్రటిక్ రాష్ర్టాలు. అక్కడ ఎక్కువలో ఎక్కువ డెమొక్రటిక్ వారినే గెలిపించారు. రెండు పార్టీల వ్యవస్థ కాబట్టి, లాయల్ ఓటర్ల సంఖ్య అధికం కాబట్టి మార్పు స్వల్పం. అదే రిపబ్లికన్లు తీసుకుంటే అలబామా, కెంటకీ లాంటివి వారికి కంచుకోటలు. గత ఎన్నికల చరిత్ర ఆధారంగా వాటిని అట్లా గుర్తిస్తారు.
ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకుంటే రెండు వేల సంవత్సరం నుంచి 2016 వరకూ 38 రాష్ర్టాలు ఒక్క పార్టీకే ఓటు వేశాయి. మిగిలిన 12 రాష్ర్టాల్లో ఆధిక్యం స్వల్పంగా ఉండి తరచుగా మారుతూఉంటాయి. అలాంటి వాటిని స్వింగ్ స్టేట్స్ లేదా బాటిల్ స్టేట్స్ అని పిలుస్తారు. ప్రచారంలో కూడా అక్కడ తీవ్రత ఘర్షణ ఎక్కువ గాఉంటుంది. అయితే ఈ ఎన్నికలలో చివరకు జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, ఆరిజోనా బాగా టెన్షన్ పెట్టాయి.
పోస్టల్ బ్యాలెట్లు
భారత్‌లో అందరికీ పోస్టల్ బ్యాలెట్స్ అనుమతి ఉండదు. డ్యూటీలో ఉన్న కొద్దిమందికి, ఆర్మీకి అట్లా కొన్ని మినహాయింపులతో కొద్ది మందికే అనుమతి. అమెరికాలో అట్లా కాదు. ఎక్కువ రాష్ర్టాల్లో ఎవ్వరైనా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. పోలింగ్ కూడా రాష్ర్టాల నిర్ణయాలతో వెనుకా ముందూ సాగుతుంది. పోలింగ్ తేదీ కంటే కొన్ని వారాల ముందు నుంచే పోస్టల్ బ్యాలెట్కు అనుమతిస్తారు. కొన్ని రాష్ర్టాలు అయితే పోస్టల్ బ్యాలెటే వేయండి అని ఒత్తిడికూడా పెడతాయి. ప్రచారం చేస్తాయి.
ఓట్ల కౌంటింగ్ పూర్తి కావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఇప్పటివరకూ ప్రకటితమైన ఫలితాలు అక్కడ వచ్చిన ఓట్ల ఆధారంగా అనధికారంగా తేల్చుకున్నవి. మీడియా సంస్థలు ప్రకటించినవి మాత్రమే. సాధారణంగా మరీ హోరాహోరీ లేకపోతే తొందరగానే తేలుతుంది. మరీ హోరాహోరీ ఉండి రీకౌంటింగ్ లు ఎక్కువైతే రోజుల తరబడి ముడిపడుతుంది.
నేరుగా ఎన్నుకోవచ్చు కదా!
అమెరికా రాజ్యాంగం 1787లో తయారైంది. మనలాగా 70 యేళ్ల క్రితం కాదు. అప్పట్లో ఇపుడున్నంత రవాణా సౌకర్యాలు లేవు. పైగా అమెరికా విశాలమైన దేశం. నదులు, ఎడారులు, అడవులుచ కొండలు లోయలు అన్నీ. నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోవడం కష్టమైన పనిగా భావించారు. చిన్న రాష్ర్టాలకు ఇద సౌకర్యంగా అనిపించింది. పైగా అప్పటికి బానిస వ్యవస్థ ఉండింది. బానిస వ్యవస్థ ఉండిన దక్షిణాది రాష్ర్టాలు దీనివైపే మొగ్గ చూపించాయి. ఇట్లా అనేకానేక కారణాలున్నాయి. అలాగే ప్రతి లీవు సంవత్సరం నవంబర్ మొదటి మంగళవారం ఎన్నిక జరుగుతుంది. వానలొచ్చినా వరదలొచ్చినా భూకంపలొచ్చినా అందంతే అన్నట్టు ఎప్పట్నుంచో సాగుతోంది.
మనకేంటి?
ప్రధానమైన విదేశీ విధానంలో పెద్ద మార్పేమీ ఉండకపోవచ్చు. కొంత కాలంగా రిపబ్లికన్ అధికారంలో ఉన్నా డెమోక్రాట్లు అధికారంలో ఉన్నా దగ్గరితనం అయితే పెరుగుతోంది. చైనాకు వ్యతిరేకంగా భారత్కు దగ్గరగా వ్యవహరించడం అనే పాలసీ ఒకటి కనిపిస్తోంది. కాకపోతే కశ్మీర్, సిఏఏ, పౌరహక్కులు వంటి విషయాల్లో డెమెక్రాట్లు ఇంకాస్త పట్టుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆల్రెడీ వారి ప్రకటనలు వాళ్ల డైరక్షన్ను తెలియజేస్తున్నాయి. వ్యాపార సంబంధాల విషయానికి వస్తే ట్రంప్ కంటే బైడెన్ బెటర్ అని అంతర్జాతీయ నిపుణులు తెలియజేస్తున్నారు. వీసాల విషయంలోనూ అంతే. ట్రంప్ కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. బైడెన్ కాస్త సరళంగా ఉండే అవకాశముందని చెపుతున్నారు. కాకపోతే బైడెన్ వస్తే ట్రంప్ మాదిరి రోజువారీ వివాదాల ప్రకనటలు హడావుడి ఇంతగా ఉండకపోవచ్చు. వారి వ్యవహారశైలిలో ఆ తేడా స్పష్టం.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- జో బైడెన్, డోనల్డ్ ట్రంప్: ఏడు దశాబ్దాల వీరి జీవిత ప్రయాణాలు ఎలా సాగాయంటే...
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజేత ఎవరో కోర్టులు నిర్ణయించగలవా?
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- ‘భారతదేశ ప్రజలు చక్కెర ఎక్కువగా తినాల’ని సుగర్ మిల్స్ సంఘం కోరుతోంది.. ఎందుకంటే...
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఆరిజోనాలో ముందంజలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిరాల్ తిపిర్నేని ఎవరు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)