చక్కెర: భారతదేశ ప్రజలు చక్కెర ఎక్కువగా తినాల’ని సుగర్ మిల్స్ సంఘం కోరుతోంది.. ఎందుకంటే...

చెరకు తోట

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో చక్కెర అపరిమితంగా సరఫరా కావడంతో దాని ఉత్పత్తి దారుల సంస్థ చక్కెర ఎక్కువగా తినాలని దేశ ప్రజలను ప్రోత్సహిస్తోంది.

చక్కెర వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనే అపోహలను పటాపంచలు చేయాలనుకుంటున్నట్లు 'ది ఇండియన్ సుగర్ మిల్స్ అసోసియేషన్’ (ఐఎస్ఎంఎ) చెప్పింది.

సగటున ఒక భారతీయుడు ఏడాదికి 19 కిలోల చక్కెర తింటున్నాడు. ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ. అయినా, దేశంలో చక్కెర అత్యధికంగా వినియోగిస్తున్నారు.

ఈ సంవత్సరం భారతదేశంలో చక్కెర ఉత్పత్తి 13 శాతం పెరిగి 3.1 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలో మిగులును క్లియర్ చేయాలనే లక్ష్యంతో ఎగుమతుల రాయితీలు నిలిపివేసే ఆలోచనలో ఉంది.

ఐఎస్ఎంఏ కొత్త వెబ్‌సైట్‌లో "ఈట్, డ్రింక్ అండ్ బీ హెల్తీ: ఎ లిటిల్ సుగర్ నాట్ ఆల్ దట్ బ్యాడ్" (తినండి, తాగండి ఆరోగ్యంగా ఉండండి - కాస్త చక్కెర తింటే ఏం కాదు) అనే శీర్షికతో చిన్న కథనాలు కూడా కనిపిస్తున్నాయి.

ఆన్‌లైన్ ప్రచారం కూడా ప్రారంభించిన ఈ సంస్థ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతోపాటూ వర్క్ షాపులు కూడా నిర్వహిస్తోంది.

చక్కెర

ఫొటో సోర్స్, Getty Images

వీటిలో ప్రముఖ చెఫ్‌లు, ఆరోగ్య నిపుణులతో ఆరోగ్యంగా జీవించడంపై చర్చలు పెడుతోంది. ఈ ప్రచారంలో తీపి వంటకాలు తయారు చేసే రెసిపీలు చూపిస్తున్నారు.

'ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్ల'ను లక్ష్యంగా చేసుకున్న సంస్థ, బరువు తగ్గడానికి అవి ఎలాంటి సాయం చేయవని, పైగా వాటి వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెబుతోంది.

ఈ వెబ్‌సైట్ ప్రారంభించిన భారత ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే చక్కెర చెడు చేస్తుందని అతిగా చెబుతున్నారని స్థానిక మీడియాతో అన్నారు.

"శాస్త్రీయ ఆధారాలు లేకుండా చక్కెర గురించి, చక్కెర వినియోగం గురించి చాలా అపోహలు ఉన్నాయి" అని ఆయన చెప్పారు.

ఆరోగ్యకరమైన పద్ధతేనా

చక్కెర గురించి భారత్‌లో జరుగుతున్న ప్రచారం మిగతా దేశాల కంటే పూర్తి భిన్నంగా ఉంది. ఇతర దేశాల్లో చక్కెర వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు.

ఒబెసిటీ, డయాబెటిస్ లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కెరతో సంబంధం ఉంది.

ముఖ్యంగా, ఆహార పదార్థాల్లో, పానీయాల్లో తయారీదారులు కలిపే చక్కెర (Free Sugar) గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ, ఈ చక్కెరను తేనె, పళ్ల రసాల్లో కూడా వినియోగిస్తున్నారు.

చక్కెర

ఫొటో సోర్స్, Getty Images

ట్రేడ్ స్వీట్‌నర్

భారతదేశంలో 5 కోట్ల మంది రైతులు చెరకు సాగు చేస్తున్నారు. చక్కెర మిల్లుల్లో, చెరకు రవాణాలో ఎన్నో లక్షల మంది పనిచేస్తున్నారు

ఇందులో జోక్య చేసుకున్న ప్రభుత్వం భారత్‌లో ఉత్పత్తి అయ్యే చక్కెరను విదేశాలకు విక్రయించేలా సహకరించడానికి రాయితీలు అందిస్తోంది. దీనిని చక్కెర ఉత్పత్తి చేసే మిగతా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.

అదనపు చక్కెరను వదిలించుకోడానికి ప్రభుత్వం ముందున్న మరో దారి, అదనపు చక్కెర ఉత్పత్తిని ఎథనాల్‌గా మార్చి, దానిని ఇంధనంగా ఉపయోగించడం.

ఈ ఏడాది ఎథనాల్ ఉత్పత్తి 109 కోట్ల లీటర్ల నుంచి 300 కోట్ల లీటర్లకు పెరుగుతుందని భారత చక్కెర మిల్లుల సంఘాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)