పాపికొండలు: పర్యటకులను ఎప్పుడు అనుమతిస్తారు? బోటు ప్రయాణం సురక్షితంగా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలేమిటి?

ఫొటో సోర్స్, SBR Rao
- రచయిత, శంకర్ వీ
- హోదా, బీబీసీ కోసం
ఏటా అక్టోబర్ వచ్చిందంటే పాపికొండలు పర్యటకులతో నిండిపోయేవి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యటకులతో పోటెత్తేవి. కానీ గత ఏడాది సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
గత ఏడాది టూరిజం సీజన్ మొత్తం బోటింగ్‌పై నిషేధం కొనసాగింది. ఆ తర్వాత కరోనావైరస్ లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు స్తంభించాయి. ఇక తాజాగా లాక్‌డౌన్ సడలింపు తర్వాత పాపికొండల్లో విహారానికి అవకాశం ఉంటుందని అనేక మంది ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా పాపికొండల పర్యాటకం మీద ఆధారపడి జీవించే వందల మంది వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్రైవేటు బోట్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం చెబుతోంది. పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసిన బోట్లను పాపికొండల విహారానికి అనుమతించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఫొటో సోర్స్, SBR Rao
విహారానికి ప్రత్యేక ప్రాధాన్యత
గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ పాపికొండల అందాలను ఆస్వాదించేందుకు అనేక మంది మొగ్గు చూపుతుంటారు. దీంతో గడిచిన రెండు దశాబ్దాలుగా పాపికొండలు పర్యటకంగా ప్రత్యేక గుర్తింపు సాధించాయి. పలువురిని ఆకట్టుకుంటున్నాయి.
ఒంపులు తిరుగుతూ సాగే గోదావరిలో ప్రయాణమే కాకుండా అక్కడి ఇసుక తెన్నెలపై సేద తీరేందుకు కూడా కొందరు ఏర్పాట్లు చేశారు. కొల్లూరు వద్ద హట్స్ ఏర్పాటు చేయడంతో అందులో నైట్ హాల్ట్‌కి అనేక మంది మొగ్గు చూపేవారు.
అటు రాజమండ్రి, పోలవరం వైపు నుంచి పేరంటాలపల్లి వరకూ వచ్చి తిరిగి వెళ్ళేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తుంటారు. అదే సమయంలో భద్రాచలం ఆలయానికి వచ్చిన వారితో పాటుగా అనేక మంది వీఆర్ పురం మండలం పోచారం నుంచి పాపికొండల వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. దీంతో ఇరువైపులా ఏపీ టూరిజం బోట్లతో పాటుగా దాదాపుగా 100 వరకూ ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించేవి. నిత్యం వందల మంది పర్యటకులు బోట్లు ఎక్కేవారు. ఇక సెలవు దినాలు, పండుగల సమయాల్లో ఆ సంఖ్య వేలు దాటిపోయేది.

ఫొటో సోర్స్, SBR Rao
వందల మంది గిరిజనులకు ఉపాధి
పాపికొండల విహారం పర్యటకులకు ఆనందంతో పాటుగా పలువురికి ఉపాధిగా మారింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా భద్రాచలం వాసులకు కూడా ఆదాయ వనరు అయ్యింది. వారు పర్యటకుల కోసం బోట్లు నడిపేవారు. అందులో సహాయకులు, ఆహారం వండి , అందించే వారు సుమారుగా 800 మంది వరకూ ఉంటారు. వారితో పాటుగా పర్యటకుల కోసం వాహనాలు నడిపి జీవనం సాగించేవారు వంద మందికి పైగా ఉంటారు.
ఇతర చిన్న చిన్న వ్యాపారాలతో మరో వంద మంది జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక పేరంటాలపల్లిలో వెదురుతో చేసిన ఉత్పత్తుల తయారీదారులు, అమ్మకందారులు కలిపి మరో వంద మంది వరకూ ఉంటారు.
రాజమండ్రి నగరంతో పాటుగా భద్రాచలం వంటి పట్టణాల్లో వివిధ లాడ్జీలు, హోటళ్లు కూడా పాపికొండల కారణంగా భారీగా వ్యాపారం చేసేవి. మొత్తంగా పాపికొండల పర్యాటకం మూలంగా ప్రత్యకంగానూ, పరోక్షంగానూ 3వేల మందికి పైగా ఉపాధి దక్కేదని భద్రాచలం వాసి షేక్ హుస్సేన్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, SBR Rao
స్వతంత్ర్యానికి పూర్వమే..
గోదావరి నదీ ప్రవాహంలో బోటు విహారం ఎంత ఆనందాన్నిస్తుందో అంతే రీతిలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలకు కారణమవుతూ ఉంటుంది. ఇప్పటికే అనేక ప్రమాదాలు గోదావరి ప్రయాణంలో జరిగిన చరిత్ర ఉంది.
1998 తర్వాత పర్యటకం పుంజుకున్నప్పటికీ స్వతంత్ర్యానికి ముందు నుంచే గోదావరిలో పడవ ప్రయాణాలు సహజంగా సాగేవి. అప్పట్లో రాజమండ్రి- భద్రాచలం మధ్య లాంచీల ద్వారానే యాత్రికులు, స్థానికులు ప్రయాణాలు చేసేవారు.
బ్రిటిష్ వారి హయంలోనే పెద్ద పెద్ద లాంచీల ద్వారా సరుకుల రవాణా కూడా సాగించారు. అయితే పర్యటకం పుంజుకున్న తర్వాత బోట్ల రూపం మారింది. అందరినీ ఆకర్షించే ఉద్దేశంతో భారీ సైజులో వాటిని తీర్చిదిద్దారు. ఎక్కువ మంది ప్రయాణీకులను బోటులో ఎక్కించుకునే ప్రయత్నాలు చేశారు. చివరకు లాభాపేక్ష కారణంగా పరిమితికి మించి కూడా బోటులో పర్యటకులను తరలించడం పెద్ద ప్రమాదాలకు మూలమయ్యింది.

ఫొటో సోర్స్, SBR Rao
వెంటాడుతున్న గత ఏడాది ప్రమాదం
చివరకు వరద నీటిలో కూడా బోటు ప్రయాణాలు సాగించడంతో గత ఏడాది సెప్టెంబర్ 15 నాడు ఏకంగా 51 మంది పర్యటకుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. మరో 25 మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు.
రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో నదీ ప్రవాహం ఉన్నప్పటికీ పర్యటక బోటుని అనుమతించిన అధికారులు, పర్యవేక్షణ మరచిన పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల తీరు పట్ల విమర్శలు వచ్చాయి.
చివరకు ప్రభుత్వం విచారణ చేసి బోటులో తగిన రక్షణ సామాగ్రి లేదని, నిర్వాహకుల వైఫల్యం ఉందని నిర్ధారించారు. రాయల్ వశిష్ట బోటు ప్రమాదానికి కారకులుగా ముగ్గురు యజమానులను అప్పట్లో అరెస్ట్ చేయగా, కొందరు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. అయితే నాటి ప్రమాదం నేటికీ వెంటాడుతోంది.
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన నర్సాపురానికి చెందిన కే సుబ్రహ్మణ్యం బీబీసీతో మాట్లాడారు.
‘‘పాపికొండల పర్యటకం నాకు కొత్త కాదు. గోదావరి ఒడ్డున ఉండే నేను చాలా బోట్లు మీద పనిచేశాను. ఆరోజు కూడా ప్రమాదానికి సరంగు తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే కారణమని నమ్ముతాను. ఈ ప్రమాదం కారణంగా ఏడాది దాటినా బోట్లకు అనుమతివ్వకపోవడంతో వందల మంది నిరాశతో ఉన్నాం. మాకు మరో పని తెలియదు. బోటు ఎక్కి, పర్యటకులను సంతృప్తి పరిచేలా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం పనిలేక సతమతం అవుతున్నాం. గోదావరి నీటిలో ప్రయాణించే బోట్లను నియంత్రించేందుకు శిక్షణ ఇచ్చిన వారితో బోట్లు తిరగడానికి అనుమతిస్తే బాగుంటుంది’’అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, SBR Rao
బోటు యజమానులకు తీరని నష్టం..
ఒక్కరు చేసిన తప్పిదంతో అందరూ ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చిందని బోటు యజమానులు అంటున్నారు. సహజంగా పర్యటక బోటు సిద్ధం చేయడానికి సుమారుగా రూ. 50లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. సుమారుగా కోటి రూపాయల వ్యయంతో బోట్లు సిద్ధం చేసిన వారున్నారు.
కొన్ని బోట్లకు ప్రభుత్వమే రుణాలు మంజూరు చేసిన దాఖలాలున్నాయి. అందులో బోటు దిగువ భాగంగా ఏసీ సదుపాయంతో సిట్టింగ్ ఏర్పాట్లు, డెక్ పైన వినోదం కోసం చిన్న స్టేజీ ఇతర ఏర్పాట్లు ఉంటాయి. బోటులోనే వంట చేయడానికి కిచెన్ కూడా ఉంటుంది. సకల సదుపాయాలతో సిద్ధం చేసిన బోట్లన్నీ ఏడాది కాలంగా నిలిచిపోవడంతో తీవ్ర నష్టాలు పాలయినట్టు పోచారం వాసి రంగారెడ్డి బీబీసీతో అన్నారు.
‘‘మా ప్రాంతంలో గిరిజన పీటీజీ తెగకు చెందిన కొండరెడ్డి కుటుంబాల వాళ్లందరికీ పాపికొండల టూరిజమే పెద్ద ఆధారం. మాకు గతంలో జిల్లా కలెక్టర్ జోక్యంతో బోటుకి రుణాలు కూడా ఇచ్చారు. ఇటీవల రూ. 70లక్షలతో పెద్ద బోటు సిద్ధం చేశాము. కానీ అనూహ్యంగా మొత్తం బోటింగ్ నిలిచిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఓవైపు ఉపాధి పోయింది. రెండో వైపు పెట్టుబడి మీద పెరుగుతున్న వడ్డీల భారం వెంటాడుతోంది. ప్రభుత్వం ఆలోచన చేయాలి. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న వారిని బోటింగ్‌కి అనుమతించాలి. బోట్లు నిలిచిపోవడం వల్ల వాటి నిర్వహణకే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి’’అని ఆయన కోరుతున్నారు.

ఫొటో సోర్స్, SBR Rao
‘పర్యటకుల నుంచి ఒత్తిడి ఉంది...’
పాపికొండల టూరిజం పట్ల చాలా మందిలో ఆసక్తి ఉందని వీ ప్రసాద్ అనే బోటు నిర్వాహకుడు చెబుతున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ..‘‘ ఇప్పటికీ చాలామంది పర్యటకులు ఫోన్లు చేస్తున్నారు. ఎప్పుడు ప్రారంభిస్తారని అడుగుతున్నారు. మళ్లీ పాపికొండల్లో పర్యాటించాలనే ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పటికే బోట్ల భద్రతను పరిశీలించింది. కొందరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. బిహార్‌లోని పట్నా కూడా తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. అయితే సముద్రంలో తిరిగే బోట్లకు, గోదావరిలో తిరగాల్సిన బోట్లకు ఉన్న పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా అన్ని జాగ్రత్తలు మేము పాటిస్తున్నారు. అనుమతులు రాగానే తిప్పుతాము. ఇప్పటికే సీజన్ అయిపోతోంది. వచ్చే నెలలో ముక్కోటి ఏకాదిశి, క్రిస్మస్, న్యూ ఇయర్ , ఆ తర్వాత సంక్రాంతి సమయంలో సహజంగా పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గత అనుభవాలతో మరిన్ని జాగ్రత్తలతో పాపికొండలు యాత్రకు సిద్ధమవుతున్నాం’’అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, SBR Rao
బోట్లలో మార్పులు సూచించాం..
గతంలో ప్రమాదాలతోపాటు పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం జరగడంతో అలాంటి ముప్పు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం బోట్ల రక్షణ, మార్పులపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ బాధ్యతను కాకినాడ పోర్ట్ అధికారులకు అప్పగించారు. పాపికొండల యాత్రలకు సిద్ధమవుతున్న బోట్ల భద్రతపై కాకినాడ పోర్ట్ అధికారి వీరరాఘవ రావుతో బీబీసీతో మాట్లాడింది.
‘‘ఏపీ టూరిజం బోట్లలో పలు మార్పులు చేశారు. ప్రైవేటు బోట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు పరీక్షించాము. కొందరు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈసారి కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఏపీ టూరిజం, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగమంతా కలిసి సంయుక్తంగా ఈ కంట్రోల్ రూమ్‌ల నుంచి పర్యవేక్షణ జరుగుతుంది. పరిమితికి మించి యాత్రికులను అనుమతించడం, అనుమతులు లేకుండా బోట్లు నడపడం వంటివి ఎప్పటికప్పుడు నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే బోట్లు మళ్లీ గోదావరిలో ప్రయాణించేందుకు అంతా సిద్ధం చేస్తున్నాం’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, SBR Rao
ప్రస్తుతానికి కృష్ణా నదిలోనే..
ఏపీలో టూరిజం అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్నామని పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వచ్చే వారం నుంచి కృష్ణా నదిలో బోట్లకు అనుమతిస్తున్నట్టు వెల్లడించారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కృష్ణా నదిలో భవానీ ద్వీపం దర్శించేందుకు పర్యటకులకు అవకాశం కల్పిస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ గేట్లు మూయగానే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి బోట్లు తిప్పుతాం. పాపికొండలకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ త్వరలోనే అవకాశం ఉంటుంది. ఈసారి రక్షణ విషయంలో రాజీ పడకుండా పలు జాగ్రత్తలు పాటిస్తున్నాం. పర్యటకులకు అవగాహన పెంచుతున్నాం. కరోనావైరస్ వ్యాప్తి నడుమ భౌతికదూరం, ఇతర చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా బోటింగ్ విషయంలో పూర్తిస్థాయిలో తనిఖీల తర్వాత పర్యాటకలకు అందుబాటులోకి తీసుకొస్తాం’’అని ఆయన వెల్లడించారు.
పాపికొండల మధ్యలో బోటు ప్రయాణం, గోదావరి తీరంలో ఇసుక తెన్నెలపై ఏర్పాటు చేసిన హట్స్‌లో సేద తీరడం వంటి భిన్నమైన అనుభూతి కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు. గత అనుభవాలు, ప్రస్తుతం ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులతో తగిన జాగ్రత్తలతో ఈసారి పర్యాటకానికి అనుమతిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నెలాఖరులోగా తిరిగి బోట్లు రాకపోకలకు అనుమతులు వచ్చే అవకాశం ఉందని బోటు నిర్వహాకులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. టై అయితే ఏం జరుగుతుంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- విశాఖ తీరానికి కొట్టుకువచ్చిన ఈ ఓడ తిరిగి సముద్రంలోకి వెళ్తుందా? ఇక్కడే రెస్టారెంట్‌గా మారుతుందా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- సౌదీ ‘కఫాలా’ వ్యవస్థకు మార్పులు... వలస కార్మికులకు నిజంగా మేలేనా?
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








