ప్రతీక్ కుహాద్: ఒబామా ఫేవరెట్ పాటల జాబితాలో చోటు దక్కించుకున్న ఇండీ స్టార్

ప్రతీక్ కుహాద్

ఫొటో సోర్స్, Sambit Biswas

    • రచయిత, మార్క్ సావేజ్
    • హోదా, బీబీసీ మ్యూజిక్ రిపోర్టర్

గత డిసెంబరులో దిల్లీలోని తన ఇంటిలో ప్రతీక్ కుహాద్ కూర్చొని ఉండగా.. ఫోన్ ఒక్కసారిగా వందల మెసేజ్‌లతో నిండిపోయింది.

‘‘నువ్వు అది చూశావా. ఇది చాలా పెద్ద విషయం’’ అని అందరూ అడుగుతున్నారు.

‘‘వారు ఏం మాట్లాడుతున్నారో మొదట నాకు అర్థం కాలేదు’’ అని గాయకుడైన ప్రతీక్ తెలిపారు. ‘‘కానీ కొంతసేపటి తర్వాత అర్థమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫేవరెట్ పాటల జాబితాలో నేను పాడిన ఒక పాట కోల్డ్/మెస్ ఎంపికైనట్లు తెలిసింది’’.

అమెరికన్లకు పెద్దగా పరిచయంలేని ఆ పాట ప్రఖ్యాత కళాకారులైన బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్, డబేబీ, లిజో, బియాన్సే పాటల సరసన నిలిచింది. ఒబామాకు ఇష్టమైన తొలి 35 పాటల్లో చోటు సంపాదించింది. ‘‘ఆ పాట ఆయన వరకు ఎలా చేరిందో నాకు తెలియదు. అయితే, ఒబామా వినడంతో తన కెరియర్‌కు చాలా ప్లస్ అయ్యింది’’ అని ప్రతీక్ వివరించారు.

‘‘చాలా వింతగా అనిపించింది. ఆ తర్వాత అది చాలా ప్రజాదరణ పొందింది’’ అని చెప్పారు.

2016లో ఈ పాటను విడుదల చేశారు. భారత సంగీతంపై ఉండే అభిప్రాయాలకు భిన్నంగా ఈ పాట సాగుతుంది. దీనిలో బాలీవుడ్ లేదా భాంగ్రా జాడలు ఎక్కడా కనపడవు. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎదురయ్యే ఒడిదుడుకులను ప్రతిబింబిస్తుంది.

‘‘నేను నిన్ను వదిలిపోవాలని అనుకుంటున్నాను. కానీ నా హృదయం కకావికలం అవుతోంది’’ అని ప్రతీక్ పాడుతుంటారు. ఆయన గాత్రం ఆశ, నిస్పృహల మధ్య తొణికిసలాడుతుంది. ‘‘నీ పేరుతో నా రోజు మొదలవుతుంది. నీ శ్వాసతో నా రోజు ముగుస్తుంది’’ అంటూ ఇది సాగిపోతుంది.

మొదటగా దీన్ని ఓ కచేరీలో ప్రతీక్ పాడారు. ప్రజలపై దీన్ని ప్రభావాన్ని అప్పుడే ఆయన గుర్తించారు.

‘‘ఈ పాటను వినని వారు హాజరైన ప్రదర్శనలో ఈ పాట పాడితే.. చాలా మంచి స్పందన వచ్చేది. అప్పుడే ఇది చాలా మంచి పాట అవుతుందని అనుకున్నాను’’ అని ఆయన వివరించారు.

అక్కడి నుంచి ఈ పాటను ఆయన మెరుగు పరచుకుంటూ వచ్చారు. ‘‘నేను పాడే అన్ని పాటలూ నా జీవిత బంధాలను ప్రతిబింబితాయి. ఆశలను నింపడంతో మొదలై గుండె బద్దలవ్వడంతో ముగుస్తాయి’’ అని చెప్పారు.

ప్రతీక్ కుహాద్

ఫొటో సోర్స్, Arsh Grewal

‘ఇది భారతదేశానికి మైలురాయి’

ఒబామా తనకు ఇష్టమైన పాటగా దీన్ని ప్రకటించకముందే.. భారత్‌లో ఈ పాట మంచి హిట్‌గా నిలించింది. అంచనాలకు మించి విజయం సాధించింది.

‘‘భారత్‌లో మంచి సంగీత కాళాకారుడిగా విజయం సాధించాలంటే హిందీలో పాటలు పాడాలని అంటుంటారు. అదే ఇంగ్లిష్‌లో పాటలు పాడితే దిల్లీ, ముంబయితోపాటు కొన్ని నగరాల్లోని ప్రజలకు మాత్రమే చేరువ అవుతారని అంటారు కానీ కోల్డ్/మెస్ ఆ వాదనను తప్పని నిరూపించిది’’అని ప్రతీక్ వివరించారు.

గత ఏడాది చివరినాటికి దిల్లీలో 9,000 మంది అతిథులుగా వచ్చే అవుట్‌డోర్ కన్సెర్ట్‌లో పాటలుపాడే స్థాయికి ప్రతీక్ వెళ్లారు.

‘‘నిజంగా అదొక మైలురాయి. ఎందుకంటే భారత్‌లో ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొని కన్సెర్ట్‌లకు వచ్చే విధానం ఇంకా మొదలుకాలేదు’’.

2011లో తన మొదటి పాట ‘‘సమ్‌థింగ్ రాంగ్’’ మొదలైనప్పటి నుంచీ ప్రతీక్ పేరు ప్రఖ్యాతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

ప్రతీక్ కుహాద్

ఫొటో సోర్స్, Sambit Biswas

ప్రతీక్ పుట్టింది, పెరిగింది జైపుర్‌లోనే. ఆరేళ్ల వయసున్నప్పుడే తొలిసారి తను గిటార్‌ను పట్టుకున్నారు. ‘‘ఐదు క్లాస్‌ల తర్వాత నేను వదిలిపెట్టేశాను. ఎందుకంటే అది చాలా కష్టం అనిపించింది’’ అని నవ్వుతూ ఆయన చెప్పారు. హైస్కూల్‌లోనూ గిటార్‌ మళ్లీ ఆయన పట్టుకున్నారు. అయితే అప్పుడు కూడా కాలం కలిసిరాలేదు.

అయితే, సంగీతాన్ని మాత్రం ప్రతీక్ ఆస్వాదిస్తూ ఉండేవారు. 1990ల చివరి వరకు తను పెరిగిన చోట ఇంటర్నెట్ అంతగా అందుబాటులోకి లేదు. దీంతో తన అక్క స్నేహితుల నుంచే కొన్ని సంగీత పాఠాలను నేర్చుకున్నారు.

‘‘తను బెంగళూరులో ఉండేది. అది కొంచెం పెద్ద నగరం. మా అక్క కొన్ని క్యాసెట్లు పంపుతుండేది’’ అని ఆయన వివరించారు.

‘‘అలానే, సావేజ్ గార్డెన్, ద బ్యూటిఫుల్ సౌత్‌లతోపాటు ప్రఖ్యాత కళాకారుల పాటలైన బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్, బాయ్స్ జోన్ లాంటి పాటలు వినే అవకాశం దక్కింది’’.

2008లో న్యూయార్క్ యూనివర్సిటీలోని కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో ప్రతీక్ చేరారు. మ్యాథ్స్, ఎకానమిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. ఫైనాన్స్ సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేయాలని భావించారు.

అయితే, అమెరికాలో ఉండటంతో ఎలియట్ స్మిత్, లారా మార్లింగ్, నిక్ డ్రేక్ లాంటి ప్రఖ్యాత కాళాకారుల సంగీతాన్ని వినే అవకాశం ఆయనకు దక్కింది. అదే సమయంలో గిటార్‌ను వాయించడం, సొంతంగా పాటలు రాయడమూ పెరిగింది.

అనుకోని బాటలో

‘‘సంగీతాన్ని ఎప్పుడూ ఒక కెరీర్‌గా భావించలేదు. అంత సీరియస్‌గానూ పట్టించుకోలేదు. ఒక కన్సల్టెంట్ సంస్థలో ఉద్యోగం చేరాను. అయితే కొన్ని నెలలకే ఈ ఉద్యోగం నాకు సరిపడదని అనిపించింది’’ అని ఆయన వివరించారు.

‘‘ఏదీ సరిగ్గా అనిపించేది కాదు. నా మీద నాకే అనుమానాలు వచ్చేవి. ఆ అనిశ్చితినే పాట రూపంలో రాశాను. అదే ‘దేర్ ఈస్ సమ్‌థింగ్ రాంగ్ విత్ ద వే ఐ థింక్’ రూపంలో పాటగా రాశాను. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత విడుదలైన తొలి పాట ఇదే’’.

‘‘సమ్‌థింగ్ రాంగ్’’ పాటతో ఆయనకు మంచి పేరు వచ్చింది. అయితే అవకాశాలు మాత్రం రాలేదు.

‘‘ఇప్పుడు ఆ పాట విటుంటుంటే చాలా సాధారణంగా అనిపిస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

2013లో విడుదలైన రాత్ రాజీని తొలి సీరియస్ పాటగా ఆయన పేర్కొన్నారు. హిందీలో పాడిన ఈ పాట పక్కింటి కుర్రాడు పాడిన పాటలా అనిపిస్తుంది.

సంగీత దిగ్గజం జెఫ్ భాస్కర్ సలహాలతో ఆయన ముందుకు వెళ్లారు. కెన్యే వెస్ట్, టేలర్ స్విఫ్ట్, రిహానా, మడోనాలతో కలిసి పనిచేన జెఫ్.. ప్రతీక్ పాటలు విని మరింత శ్రావ్యంగా పాడాలని సూచించారు.

‘‘అప్పుడే ఆలోచించడం మొదలుపెట్టాను. నేను అప్పటివరకు మెలోడీలపై పెద్దగా దృష్టి పెట్టలేదు’’.

‘‘నేను ఎప్పుడూ పదాల గురించి ఆలోచించేవాణ్ని. కొన్నింటిని తీసేయడం, కొన్ని చేర్చడం లాంటివి చేసేవాణ్ని. మెలోడీల గురించి పెద్దగా పట్టించుకోలేదు’’.

ప్రతీక్ కుహాద్

ఫొటో సోర్స్, Getty Images

ఆయన ప్రభావం నా కోల్డ్/మెస్‌లోనూ కనిపిస్తుంది. 2018లో విడుదలైన ఈ పాట భారత్‌లో ప్రతీక్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. జిమ్ సర్బ్, జోయా హుస్సేన్ లాంటి నటులతో జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను వివరించే ఈ పాటకు మంచి స్పందన వచ్చింది.

‘‘బాలీవుడ్ పాటల్లో చాలా వరకు ఒక డ్రామా ఉంటుంది. మంచి రంగులు, పెద్దపెద్ద సెట్లు కనిపిస్తాయి. కానీ కోల్డ్/మెస్ పూర్తిగా భిన్నమైనది. దీనిలో పాత్రలు నిజజీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ముంబయిని చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఆ పాట విడుదలైన తర్వాత.. నా సంగీత ప్రదర్శనలకు మంచి స్పందన వస్తోంది’’

భారత్‌లో చాలా మందికి సుపరిచితమైనప్పటికీ.. విదేశాలకు చేరువ కావట్లేదనే అసంతృప్తి ప్రతీక్‌ను మొదట్నుంచీ వెంటాడేది.

‘‘కోల్డ్/మెస్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని అనిపించేది. ముఖ్యంగా అంతర్జాతీయంగా..’’అని ఆయన వివరించారు. అందుకే అమెరికాకు చెందిన ఎలక్‌ట్రా రికార్డ్స్‌తో పాటను అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

‘‘తదుపరి ఆల్బంపై కూడా ప్రస్తుతం దృష్టిపెట్టాను. దీనికి సంబంధించి పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాది పూర్తి స్థాయి ఆల్బం కోసం 20 నుంచి 30 పాటలను పరిశీలిస్తున్నా’’అని ఆయన చెప్పారు.

మరోవైపు కసూర్ పేరుతో మరో హిట్‌ను ఆయన ఒడిసిపట్టారు. కేవలం 24 గంటల్లోనే దీనికి ఎనిమిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఇది లాక్‌డౌన్ వీడియోలా అనిపిస్తుంది. అయితే దీన్ని ఒక సంవత్సరం ముందే పక్కా ప్రణాళికతో సిద్ధం చేశామని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)