బిహార్ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఎవరు గెలుస్తారని చెబుతున్నాయి?

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. నవంబర్ 10 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, పోలింగ్ సరళిపై వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి?

టైమ్స్‌ నౌ- సీ ఓటర్‌ ఎగ్జిట్ పోల్స్: బిహార్‌లో అధికారం మహా కూటమిదే అని ఈ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మహా కూటమికి 120, అధికార ఎన్డీయేకు 116, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని ఇది చెప్పింది.

ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో మహాకూటమికి 124 స్థానాలు వస్తాయని, ఎన్డీయే కూటమికి 110 స్థానాలు, ఎల్జేపీకి 4, ఇతరులకు 5 స్థానాలు వస్తాయని చెప్పింది.

రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ లో మహా కూటమికి 118 నుంచి 138 స్థానాలు, ఎన్డీయేకు 91-117 స్థానాలు, ఎల్జేపీకి 5-8 స్థానాలు, ఇతరులకు 3-6 స్థానాలు వస్తాయని పేర్కొంది.

ఇక పీపుల్స్‌ పల్స్‌ కూడా మహా కూటమికే ఓటర్లు పట్టం కట్టినట్లు చెబుతోంది. ఆ కూటమికి 100-115 స్థానాలు వస్తాయని అంచనా వేసిన ఈ సంస్థ ఎన్డీయేకు 90-110 స్థానాలు రావొచ్చని చెబుతోంది. ఎల్జేపీ 3-5, ఇతరులు 8-18 స్థానాలు దక్కవచ్చని తెలిపింది.

మిగతా సర్వేలు కూడా మహా కూటమికే ఆధిక్యం వస్తుందని చెబుతున్నప్పటికీ, స్పష్టమైన మెజార్టీ ఏ కూటమికి వస్తుందన్నది ఎవరూ స్పష్టం చేయలేదు.

దీంతో బిహార్‌లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు రావచ్చని, అదే జరిగితే ఎల్జేపీ, ఇతరులు కీలకంగా మారవచ్చని మీడియా సంస్థలు చెబుతున్నాయి. బిహార్‌లో అధికారం దక్కించుకోవాలంటే మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 122 స్థానాలు గెలుచుకోవాలి.

బిహార్‌లో అధికార జేడీయూ, బీజేపీ మరోసారి విజయంపై ఆశలు పెట్టుకున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడి అధికార పక్షానికి గట్టి పోటీ ఇస్తున్నాయి.

చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో ఎల్జేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. బిహార్ ఎన్నికల ఫలితాలు ఈనెల 10న వెల్లడి కానున్నాయి.

పీఎస్ఎల్వీ-సీ49 సక్సెస్: 10 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు

పీఎస్ఎల్వీ

ఫొటో సోర్స్, ISRO

భారత 'పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్' 55వ లాంచింగ్(పీఎస్ఎల్వీ-సీ49) ద్వారా షార్ నుంచి ఈఓఎస్-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ పాడ్ నుంచి నింగిలోకి ఎగసిన పీఎస్ఎల్వీ-సీ49 ఈఓఎస్-01తోపాటూ మరో 9 విదేశీ ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి తీసుకెళ్లింది.

భారీ వర్షం కురవడంతో పీఎస్ఎల్వీ-సీ49ను ఈరోజు నిర్ధారిత సమయానికంటే 9 నిమిషాలు ఆలస్యంగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.11కు ప్రయోగించారు.

ఈ లాంచింగ్ వెహికల్ ద్వారా ఈఓఎస్-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీనితోపాటూ మిగతా తొమ్మిది ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు.

ఈవోఎస్-01 విడిపోయిన తర్వాత దాని రెండు సోలార్ ఫలకాలు ఆటోమేటిగ్గా తెరుచుకున్నాయి.

బెంగళూరులోని 'ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్' ద్వారా ఉపగ్రహాన్ని నియంత్రిస్తున్నారు. ముందు ముందు ఉపగ్రహాన్ని దాని చివరి ఆపరేషనల్ కన్ఫిగరేషన్ దగ్గరికి తీసుకొస్తారు.

"పీఎస్ఎల్వీ-సీ 49 మొత్తం 10 ఉపగ్రహాలను కచ్చితత్వంతో కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని" ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ ప్రకటించారు.

కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల్లో ఈ లాంచింగ్ విజయవంతం కావడానికి శ్రమించిన లాంచ్ వెహికల్, శాటిలైట్ బృందాలను ఆయన అభినందించారు. త్వరలో తాము చేయబోయే మిషన్ల గురించి వివరించారు.

ఈఓఎస్-01 ఒక 'ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్'(భూమిని పరిశీలించే ఉపగ్రహం) దీని సాయంతో వ్యవసాయం, అడవులు, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనున్నారు.

లాంచింగ్ వెహికల్ మోసుకెళ్లిన మిగతా 9 విదేశీ ఉపగ్రహాల్లో లిథువేనియాకు చెందిన ఒకటి, లక్సంబర్గ్ కు చెందిన 4, అమెరికాకు చెందిన 4 ఉపగ్రహాలు ఉన్నాయి.

వీటిని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) వాణిజ్య ఒప్పందం ప్రకారం లాంచ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 55 మంది మహిళా ఖైదీల విడుదలకు ఉత్తర్వులు

మేకతోటి సుచరిత

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీల్లో పలువురికి ఊరట కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 55 మందిని విడుదల చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. వాటి వివరాలను హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాకి వెల్లడించారు.

వివిధ కేసుల్లో శిక్షపడి, జైళ్లలో మగ్గుతున్న మహిళా ఖైదీలను మానవత్వంతో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. వారంతా ప్రత్యేక కేసుల్లో, పరిస్థితుల ప్రభావం వల్ల నేరాలు చేసి జైళ్లకు వెళ్లారని చెప్పారు. మహిళలు జైళ్లకు వెళ్లడం వల్ల వారి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

అందుకే ఐదేళ్ళు పైబడి జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని మానవత్వంతో విడుదల చేస్తున్నామన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 147 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళలున్నారని తెలిపారు. వారిలో 55 మంది మహిళా ఖైదీలను ప్రస్తుతం విడుదల చేయబోతున్నామని వివరించారు.

విడుదలవుతున్న వారిలో రాజమండ్రి జైలు నుంచి 21 మంది, కడప 27, విశాఖపట్నం 2, నెల్లూరు జైలు నుంచి ఐదుగురున్నట్టు మంత్రి తెలిపారు. మహిళా ఖైదీలలో సత్ప్రవర్తన కలిగేలా జైళ్లలో సంస్కరణలు తెచ్చామని, వాటి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

మహిళా ఖైదీలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, సారీ పెయింటింగ్, బేకరీ ఉత్పత్తులతయారీలో శిక్షణ ఇస్తున్నట్టు ఆమె వివరించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలను విడుదల చేస్తున్నామన్నారు.

ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ఖైదీల విడుదల ఇదే తొలిసారి అని మంత్రి పేర్కొన్నారు. వారం రోజుల్లో వారంతా విడుదల అవుతారన్నారు. ఈమేరకు జీవో నంబర్ 131 ప్రకారం ఆదేశాలు ఇచ్చామన్నారు. జనవరి 26 నాటికి మరో విడత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే ప్రతిపాదన ఉందన్నారు.

అర్ణబ్ గోస్వామికి సభా హక్కుల నోటీసు ఉదంతం: కోర్టు ధిక్కారం నోటీసు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలన్న సుప్రీంకోర్టు

అర్ణబ్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను విమర్శించినందుకు గాను రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేయటం పట్ల మహారాష్ట్ర శాసనసభ కార్యదర్శికి కోర్టు ధిక్కారం షోకాజ్ నోటీసు ఎందుకు జారీ చేయకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.

శాసనసభ సభాహక్కుల ఉల్లంఘన నోటీసును సవాల్ చేస్తూ అర్ణబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం.. సభాహక్కుల ఉల్లంఘన నోటీసు విషయంలో తదుపరి విచారణ జరిగేవరకూ అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేయరాదని కూడా చెప్పింది.

అర్ణబ్ గోస్వామి తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే హాజరై.. అర్ణబ్ ప్రస్తుతం జైలులో ఉన్నారని కోర్టుకు నివేదించారు. ''ఆయనను (అర్ణబ్ గోస్వామిని) బెదిరిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఆయన మీద వరుసగా కేసులు పెడుతున్నారు. ఈ కేసులో ఆయనకు ఊరట అవసరం'' అని కోరారు.

ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కక్షిదారుగా చేర్చాలన్న సాల్వే వినతిని సుప్రీంకోర్టు ఆమోదించింది.

అర్ణబ్ గోస్వామికి సభా హక్కుల నోటీసు జారీ చేసిన కేసులో కోర్టు సహాయకుడిగా అరవింద్ దత్తార్‌ను ధర్మాసనం నియమించింది.

హైదరాబాద్‌లో అమెజాన్ భారీ పెట్టుబడి

అమెజాన్

ఫొటో సోర్స్, Amazon, Thinkstock

తెలంగాణలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్ రీజిన్ హైదరాబాద్లో త్వరలోనే పలు డాటా సెంటర్లను నిర్వహించగలిగే భారీ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో 20,761 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనున్నారు.

2022 నాటికి ఈ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. దీనిపై కొంత కాలం నుంచి తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ అమెజాన్ సంస్థతో జరిపిన చర్చలు సఫలం అయినట్టు ఆయన కార్యాలయం ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని కేటీఆర్ ప్రకటించారు. తాను దావోస్ వెళ్లినప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధిలను కలసినట్టు ఆయన గుర్తు చేసుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

డాటా సెంటర్ ఏం చేస్తుంది?

హైదరాబాద్ పరిసరాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ 3 అవైలబులిటీ జోన్లను పెడుతుంది. ఆ జోన్లలో పెద్ద పెద్ద డాటా సెంటర్లు పెడతారు. ఈ డాటా సెంటర్లలో క్లౌడ్ సమాచారం, వెబ్ సైట్ల సమాచారం దాచి ఉంచుతారు.

మనం వెబ్ సైట్లలో చూసే సమాచారం, వివిధ సంస్థలకు సంబంధించిన సాఫ్టువేర్లు, ఇతరత్రా కంప్యూటర్ సాఫ్టువేర్లకు సంబంధించిన సమాచారం, డాటా దాచుకోవడానికీ, నిర్వహించడానికి భద్రమైన ప్రదేశం కావాలి. ప్రకృతి విపత్తుల నుంచీ, అలానే మానవ విపత్తులను తట్టుకుని డాటా పోకుండా చూడటం ఈ డాటా సెంటర్ల పని.

ప్రస్తుతం అమెజాన్ కి ఇలాంటివి ప్రపంచ వ్యాప్తంగా 26 ప్రదేశాల్లో 77 రీజిన్లు ఉన్నాయి. భారతదేశంలో ఇది రెండవది. మొదటిది 2016 జూన్లో ముంబైలో పెట్టారు. ఆస్ట్రేలియా, గ్రేటర్ చైనా, జూపాన్, కొరియా, సింగపూర్లలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరో 15 కొత్త ఎవాలబులిటీ జోన్లు పెట్టే క్రమంలో తెలంగాణలో ఇది పెడుతున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ 14 ఏళ్లుగా ప్రపంచంలోని అనేక దేశాల్లో కంప్యూటర్లు, స్టోరేజీ, డాటాబేస్, ఇతర కంప్యూటర్ సంబంధిత సేవలు అందిస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇప్పటికే అమెజాన్ అతి పెద్ద కార్యాలయం హైదరాబాద్లోనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ కాంపస్ భవనాలు హైదరాబాద్లో 2019 ఆగష్టులో ప్రారంభం అయ్యాయి. 9.5 ఎకరాల్లోని ఈ ప్రాంగణంలో 15 వేల మంది పనిచేస్తున్నారు.

''తమ పెట్టుబడిని భారతదేశంలోని తమ కష్టమర్లు ఎంతో స్వాగతిస్తున్నారని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలోని అనేక పేరొందిన కంపెనీలు అమెజాన్ వెబ్ క్లయింట్లుగా ఉన్నాయి.

''భారతీయ వ్యాపారాలు క్రమంగా క్లౌడ్ వైపు వస్తున్నాయి. దీనివల్ల్ వారి వ్యాపారం మెరుగవుతుంది. ఖర్చు తగ్గుతుంది. మేం కష్టమర్ల అవసరాలకు తగ్గట్టు వారికి దగ్గర్లోనే మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం''. అన్నారు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కష్టమర్ సపోర్ట్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ డి శాంటిస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)