కరోనావైరస్: అమెరికా అధ్యక్ష ఎన్నికలను డోనల్డ్ ట్రంప్ వాయిదా వేస్తారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆంథొని జూర్చర్
- హోదా, బీబీసీ ఉత్తర అమెరికా ప్రతినిధి
కరోనావైరస్ మహమ్మారితో అమెరికా ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. అంతేకాదు.. అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న ఈ సంవత్సరంలో దేశ ప్రజాస్వామ్య ప్రక్రియ మీద కూడా పెను ప్రభావం చూపుతోంది.
ప్రైమరీ ఎన్నికలు ఆగిపోయాయి. ప్రత్యక్ష పోలింగ్ కేంద్రాలు మూతపడ్డాయి. పరోక్ష బ్యాలెట్ ప్రక్రియల పరిస్థితి సందేహంగా మారింది. దీంతో ఎన్నికల ప్రక్రియల మీద రాజకీయ నాయకులు చట్టసభల్లో, కోర్టుల్లో తలపడుతున్నారు.
కొత్త అధ్యక్షుడిని, కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యులను, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను ఎన్నుకోవటానికి నవంబర్‌లో పోలింగ్ జరగాల్సి ఉంది. అసలు ఈ ఎన్నికలు జరుగుతాయా? జరిగితే ‘ఎన్నికల రోజు’ పరిస్థితి ఎలా ఉంటుంది? అనేది చర్చనీయాంశంగా మారింది.
దీనికి సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవి.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికలను ట్రంప్ వాయిదా వేయగలరా?
ప్రస్తుతం మొత్తం 15 రాష్ట్రాలు అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక ప్రైమరీలను జూన్ వరకూ వాయిదా వేశాయి. దీంతో అసలు నవంబర్‌లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడతాయేమోననే సందేహాలు తలెత్తుతున్నాయి.
1845 నాటి చట్టం ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రతి నాలుగేళ్లకోసారి నవంబర్ మొదటి సోమవారం తర్వాతి మంగళవారం నాడు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే.. 2020 నవంబర్ 3వ తేదీన ఈ ఎన్నికలు జరగాలి. దీనిని మార్చాలంటే.. కాంగ్రెస్‌లోని ఉభయ సభలు - ప్రతినిధుల సభ, సెనేట్ రెండింట్లో – మెజారిటీ సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతినిధుల సభలో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆధిక్యంలో ఉంటే.. సెనేట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీ ఉంది. ఈ పరిస్థితిలో ఎన్నికలను వాయిదా వేయటానికి ఉభయసభల్లో ఏకాభిప్రాయం లభించే అవకాశం కనిపించటం లేదు.
ఒకవేళ ఎన్నికల తేదీని మార్చినప్పటికీ.. ఒక అధ్యక్షుడి ప్రభుత్వం కేవలం నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగాలని అమెరికా రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అంటే.. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పదవీ కాలం 2021 జనవరి 20వ తేదీ ఉదయానికి ముగిసిపోతుంది.
ఒకవేళ ఆయన మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లైతే మరో నాలుగేళ్ల పదవీ కాలం లభిస్తుంది. ట్రంప్ ఓడిపోయినట్లయితే.. ఆయన స్థానంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షుడవుతారు. ఏదేమైనా.. సమయం దగ్గరపడుతోంది. ఎన్నికలను వాయిదా వేసినా సమయం మాత్రం ఆగదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికలు వాయిదా పడితే ఏమవుతుంది?
నిర్ధరిత ప్రమాణ స్వీకారం రోజు కన్నా ముందు ఎన్నికలు జరగకపోతే.. అధ్యక్ష వారసత్వం అమలులోకి వస్తుంది. దేశాధ్యక్షుడి తర్వాత రెండో స్థానంలో ఉండేది ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్. కానీ.. ఆయన పదవీ కాలం కూడా అదే రోజు ముగుస్తుంది. ట్రంప్ కానీ, పెన్స్ కానీ కొనసాగలేరు.
ఆ తర్వాతి స్థానంలో ప్రతినిధుల సభ స్పీకర్ ఉంటారు. ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు నాన్సీ పెలోసీ ఆ పదవిలో ఉన్నారు. కానీ.. ఆమె రెండేళ్ల పదవీ కాలం వచ్చే డిసెంబర్‌లోనే ముగిసిపోతుంది. కాబట్టి ఆమెకు అవకాశం లేదు.
వరుసలో తర్వాతి స్థానంలో ఉండేది.. సెనేట్ ప్రొటెమ్ ప్రెసిడెంట్. ప్రస్తుతం ఆ పదవిలో రిపబ్లికన్ పార్టీ నేత చక్ గ్రాస్లీ (వయసు 86 సంవత్సరాలు) ఉన్నారు. కానీ.. సెనేట్‌లోని 100 సీట్లలో మూడో వంతు సీట్ల కాల పరిమితి అధ్యక్షుడి పదవీ కాలంతో పాటు ముగిసిపోతుంది. ఆ సీట్లు ఖాళీ అయ్యాక కూడా సెనేట్‌లో రిపబ్లికన్ల పట్టు ఉండి, గ్రాస్లీ ప్రొటెమ్ ప్రెసిడెంట్‌గా కొనసాగితే మాత్రమే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగలరు.
మొత్తం మీద.. ఈ పరిస్థితి రాజకీయ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారింది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

అసలు.. ఎన్నికలను ఈ వైరస్ ఆటంకపరుస్తుందా?
అధ్యక్ష ఎన్నికల తేదీని మొత్తంగా మార్చేసే అవకాశం పెద్దగా కనిపించటం లేదు. అలాగని.. ఈ ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు ఉండబోవనీ కాదు.
ట్రంప్ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తమ అత్యవసర అధికారాలను ఉపయోగించుకుని.. ఓటర్లు వ్యక్తిగతంగా వచ్చి ఓటు వేసే పోలింగ్ కేంద్రాలను గణనీయంగా తగ్గించవచ్చునని.. ఎన్నికల చట్టం నిపుణుడు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ ప్రొఫెసర్ రిచర్డ్ ఎల్ హసన్ చెప్పారు.
ఉదాహరణకు.. ఇటీవల ముగిసిన విస్కాన్సిస్ ప్రైమరీలో.. వైరస్ సోకే ప్రమాదముందన్న ఆందోళనలు, ఎన్నికల నిర్వహణకు వలంటీర్ల కొరత, ఎన్నికల సదుపాయాల కొరత కారణంగా.. రాష్ట్రంలోని అతి పెద్ద నగరం మిల్వాకీలోని 180 పోలింగ్ కేంద్రాల్లో 175 కేంద్రాలను మూసివేశారు.
ఒకవేళ.. రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి చర్యలు చేపట్టినట్లయితే – అంటే ప్రత్యర్థికి బలం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను మూసివేసినట్లయితే – అది ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపగలదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల ఫలితాలను రాష్ట్రాలు సవాల్ చేయవచ్చా?
మరో అసాధారణ పరిస్థితి గురించి కూడా హసన్ చెప్తున్నారు.
వైరస్ గురించిన ఆందోళనలను చూపుతూ.. సాధారణ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో ఏ అభ్యర్థి గెలుస్తారనేది నిర్ణయించే అధికారాన్ని చట్టసభలు వెనక్కు తీసుకోవచ్చు. ఒక రాష్ట్రంలో ప్రజల ఓట్లు గెలిచిన అధ్యక్ష అభ్యర్థికే సంబంధిత రాష్ట్రం మద్దతు ఇవ్వటం రాజ్యాంగపరంగా తప్పనిసరేమీ కాదు. అసలు ఆ రాష్ట్రం అధ్యక్ష ఎన్నికలు నిర్వహించటమే తప్పనిసరి లేదు.
దేశాధ్యక్షుడి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజీ ద్వారా జరుగుతుంది. అనాదిగా కొనసాగుతున్న ఈ వ్యవస్థలో.. ప్రతి రాష్ట్రం నుంచి ‘ఎలక్టర్లు’ ప్రాతినిధ్యం వహిస్తారు. వారు తమ ఓట్లు వేయటం ద్వారా దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సాధారణ పరిస్థితుల్లో (దాదాపు అన్నివేళలా) ఈ ఎలక్టర్లు తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో ప్రజల ఓట్లలో గెలిచిన అధ్యక్ష అభ్యర్థికే తమ ఓట్లు వేస్తారు.
అయితే.. కచ్చితంగా ఇలాగే జరగాలని ఏమీ లేదు. ఉదాహరణకు 1800 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల చట్టసభలు ప్రజల ఓట్లను పక్కనపెట్టి, ఎలక్టర్లు ఎవరికి ఓట్లు వేయాలో చెప్పాయి.
ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం అటువంటి ‘తీవ్రచర్య’ చేపట్టినట్లయితే వీధుల్లో ప్రజా నిరసనలకు దారితీసే అవకాశం ఉంది. అదికూడా క్వారంటైన్లు, సామాజిక దూరాల నిబంధనలు ఉన్న తరుణంలో సామూహిక నిరసనలకు అనుమతులు ఇస్తేనే.

ఫొటో సోర్స్, Reuters
న్యాయపరమైన సవాళ్లు ఉంటాయా?
విస్కాన్సిన్ ప్రైమరీలో ఇటీవలి అనుభవం.. రాబోయే ఎన్నికలకు ఎదురుకాగల ఆటంకాలకు ఒక ముందస్తు హెచ్చరికగా పనిచేయగలదు. వ్యక్తిగతంగా ఓటు వేయటానికి జనం బారులు తీరటం, వలంటీర్లు, నేషనల్ గార్డ్ సైనికులు రక్షణ దుస్తులు ధరించి విధుల్లో పాల్గొనాల్సి రావటం మాత్రమే దీనికి కారణం కాదు.
ప్రైమరీ రోజుకు ముందు.. రాష్ట్ర గవర్నర్, డెమొక్రటిక్ పార్టీ నేత టోనీ ఎవర్స్, చట్టసభలో మెజారిటీ ఉన్న రిపబ్లికన్లు తీవ్ర న్యాయపోరాటాల్లో తలపడ్డారు. ఎన్నికలను జూన్ వరకూ వాయిదా వేసే అధికారం కానీ, పరోక్ష బ్యాలెట్ తుది గడువును పొడిగించే అధికారం కానీ గవర్నర్‌కు ఉందా అనే అంశం మీద ఒక కేసును చివరికి సుప్రీంకోర్టు పరిష్కరించింది.
ఒహియో గవర్నర్, రిపబ్లికన్ పార్టీ నేత మైక్ డివైన్ కూడా.. తన రాష్ట్రంలో ప్రైమరీని వాయిదా వేయటం కోసం ఇదే తరహా కోర్టు కేసులు ఎదుర్కొన్నారు.
నవంబర్‌లో పరోక్ష బ్యాలెట్ ఓటును కోరటానికి.. కరోనావైరస్ సోకుతుందనే భయం చెల్లుబాటయ్యే కారణమని స్పష్టంచేస్తూ టెక్సాస్‌లో ఒక ఫెడరల్ జడ్జి బుధవారం (ఏప్రిల్ 15న) ఉత్తర్వులు జారీ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదాన్ని తగ్గించగల మార్పులు ఏమిటి?
ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయటం తమకు సౌకర్యంగా ఉండదని 66 శాతం మంది అమెరికన్లు చెప్పారని ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో స్పష్టమైంది.
ఇటువంటి ఆందోళనలు రాష్ట్రాల మీద ఒత్తిడులు పెంచాయి. పోలింగ్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఓటు వేయటం వల్ల వైరస్ సోకే ప్రమాదాన్ని తగ్గించటానికి.. ఓటర్లందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
అన్ని రాష్ట్రాలూ ఏదో ఒక తరహాలో దూరం నుంచి ఓటు వేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే.. అందుకు అర్హతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి.
‘‘మనది చాలా వికేంద్రీకృతమైన వ్యవస్థ. రాష్ట్రాల్లో ఈ పనులకు సంబంధించి చాలా తేడాలు ఉన్నాయి’’ అని హసన్ పేర్కొన్నారు.
వాషింగ్టన్, ఓరెగాన్, కొలరాడో సహా పశ్చిమ అమెరికాలోని ఐదు రాష్ట్రాలు.. తమ ఎన్నికలను పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ తరహాలో నిర్వహిస్తాయి. కాలిఫోర్నియా వంటి ఇతర రాష్ట్రాలు అవసరమైన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని రాష్ట్రాలు పోస్టల్ ఓటింగ్‌ను ఎందుకు ఇష్టపడవు?
17 రాష్ట్రాల్లో ఓటర్లు తాము వ్యక్తిగతంగా ఎందుకు ఓటు వేయలేమో తగిన కారణం చెప్పి పోస్టల్ బ్యాలెట్ కోరాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన నిబంధనలను సడలించాలని డిమాండ్లు వస్తున్నాయి. కొందరు నాయకులు వాటిని ప్రతిఘటిస్తున్నారు కూడా.
పరోక్ష బ్యాలెట్ అందుబాటును విస్తరించటం ఒక ‘రాజకీయ అంశం’ అని, పోస్టల్ బ్యాలెట్ కోరటానికి వైరస్ సోకుతుందనే భయం ఒక కారణంగా చెల్లుబాటు కాదని మిస్సోరి గవర్నర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు మైక్ పార్సన్ ఏప్రిల్ 14న వ్యాఖ్యానించారు.
నార్త్ కరొలినా, జార్జియా వంటి ఇతర రాష్ట్రాల్లో రిపబ్లికన్లు కూడా ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ (పార్లమెంటు) జోక్యం చేసుకుని జాతీయ ఎన్నికల్లో రాష్ట్రాలు ఒక కనీస స్థాయిలో పరోక్ష బ్యాలెట్ లేదా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించటం తప్పనిసరి చేయవచ్చు. కానీ, ఉభయసభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య చీలికలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో ఇలాంటి ఆదేశాలిచ్చే అవకాశం పెద్దగా కనిపించటం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికలకు రక్షణ ఏర్పాట్లపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందా?
లేదు. ఆధునిక రాజకీయాల్లో తీవ్రమైన చీలికల నేపథ్యంలో, మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ఎన్నికలను నిర్వహించాలా? ఎలా నిర్వహించాలి? అనే అంశం అంతకంతకూ వివాదాస్పద అంశంగా మారటంలో ఆశ్చర్యమేమీ లేదు.
పోస్టల్ ఓటింగ్‌ను విస్తరించటాన్ని డోనల్డ్ ట్రంప్ స్వయంగా వ్యతిరేకించారు. అది మోసానికి మరింత ఎక్కువగా ఆస్కారం కల్పిస్తుందన్నారు. బ్యాలెట్ ఆంక్షలను సడలించటం వల్ల ఓట్లు వేసే ఓటర్ల సంఖ్య పెరిగితే.. అది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు చేటు చేస్తుందని కూడా ఆయన సూచించారు.
‘‘వాళ్లకి అనేక స్థాయుల్లో ఓటింగ్ ఉంది. అందుకు అంగీకరించామంటే ఈ దేశంలో ఒక రిపబ్లికన్ ఎన్నడూ ఎన్నికవరు’’ అని ఆయన ఇటీవల ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
కానీ పోస్టల్ ఓటింగ్ వల్ల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఎక్కువ హాని జరుగుతుందనేందుకు ఆధారాలు మిశ్రమంగా ఉన్నాయి. ఎందుకంటే డెమొక్రాట్ల కన్నా రిపబ్లికన్లే ఎక్కువ సంఖ్యలో, తరచుగా పరోక్ష బ్యాలెట్లు ఉపయోగిస్తారు.
అమెరికా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా?
అమెరికా జీవితాన్ని ప్రతి కోణంలోనూ కరోనావైరస్ ప్రభావితం చేస్తోంది. జనజీవనాన్ని ఎంతోకొంత సాధారణ స్థితికి తీసుకురావాలని ట్రంప్, ఇతర రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. చాలా రాష్ట్రాలు ప్రైమరీలను జూన్‌కు వాయిదా వేశాయి. ఆ సమయానికి కానీ, పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే సదస్సులు జరిగే ఆగస్టు నాటికి కానీ, అధ్యక్ష అభ్యర్థుల మధ్య బహిరంగ చర్చలు జరిగే అక్టోబరు నాటికి కానీ, ఎన్నికలు జరిగే నవంబర్ నాటికి కానీ.. పరిస్థితులన్నీ బాగుపడతాయనే భరోసా లేదు.
సాధారణంగా ఎన్నికలకు ముందు నెలల్లో జాతీయ రాజకీయ ప్రయోజనాలు, కార్యక్రమాలు పెరుగుతూ వస్తుంటాయి. ఇప్పుటికైతే అవన్నీ సందేహాస్పదంగానే ఉన్నాయి. కొందరికైతే అమెరికా ప్రజాస్వామ్య పునాదుల పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది.
‘‘వైరస్ విజృంభించటానికి ముందే 2020 ఎన్నికల ఫలితాల మీద నేను ఆందోళనగా ఉన్నాను. ఎందుకంటే మనం విపరీతమైన తప్పుడు సమాచారంలో మునిగిపోయి, విపరీతంగా విభజితమై ఉన్నాం’’ అంటారు హసన్.
ఆయన ఇటీవల ‘ఎలక్షన్ మెల్ట్‌డౌన్: డర్టీ ట్రిక్స్, డిస్ట్రస్ట్, అండ్ ద త్రెట్ టు అమెరికన్ డెమొక్రసీ’ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు.
‘‘ఈ ఆందోళనలను వైరస్ మరింతగా పెంచుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా? అందుకు ఆధారాలు ఉన్నాయా?
- జూన్ అల్మీడా: మొదటి కరోనావైరస్ను కనిపెట్టిన మహిళ
- కరోనావైరస్: ‘గరిష్ట స్థాయిని దాటేశాం, అమెరికా త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుంది’ - డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








