బైడెన్-హ్యారిస్ విజయం వెనుక ఉన్న ఆ నల్ల జాతి మహిళలు ఎవరు

స్టేసీ అబ్రామ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టేసీ అబ్రామ్స్
    • రచయిత, చెల్సియా బెయిలీ
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టే తొలి మహిళగా జనవరిలో కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే, జో బైడెన్, హ్యారిస్ ద్వయం విజయం వెనక మరో నల్ల జాతి మహిళ కూడా ఉన్నారు.

హ్యారిస్ తన విజయోత్సవ ప్రసంగంలో తన ప్రచారానికి మద్దతుగా నిలిచిన ఆమెను గుర్తు చేశారు.

ఆమె తన ప్రసంగంలో మైనారిటీ మహిళలు, ముఖ్యంగా నల్ల జాతికి చెందిన మహిళలు చాలా సార్లు నిర్లక్ష్య ధోరణికి గురవుతూ ఉంటారని, అయితే, వారే ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటి వారని అన్నారు.

జార్జియాలో తమ ఇంట్లో కూర్చుని ఈ ప్రసంగాన్ని వింటున్న హంట్ కుటుంబానికి కన్నీరు ఆగలేదు.

"జార్జియా అంతటా ఇప్పుడు నీలం రంగు అలముకుంది. ఈ రాష్ట్ర ప్రజలకు, నివాసితులకు ముఖ్యంగా ఇక్కడ నివసించే నల్ల జాతి ప్రజలకు ఇది జీవితంలో మార్పులు చోటు చేసుకునే సమయం"అని 27 ఏళ్ల క్రిస్టిన్ హంట్ అన్నారు.

"ప్రజలంతా ఓట్లు నమోదు చేసుకుని, తమ హక్కును వినియోగించుకోవడం కోసం క్షేత్ర స్థాయిలో స్టేసీ అబ్రామ్స్ లాంటి చాలా మంది నల్ల జాతి మహిళలు చాలా కృషి చేశారు" అని ఆమె అన్నారు.

జో బైడెన్ శ్వేత సౌధానికి ఎన్నికయ్యేందుకు ఆఫ్రికన్ అమెరికన్ల మద్దతు చాలా ఉంది. సౌత్ కరోలినా ప్రాథమిక ఎన్నికల్లో నల్ల జాతి ఓటర్లు బైడెన్ విజయానికి కారణమయ్యారు.

పెన్సిల్వేనియాలో విజయం సాధించడంతో బైడెన్‌కు అధ్యక్ష పీఠం దక్కింది. ఈ విజయంలో ఫిలడెల్ఫియా, పిట్స్ బర్గ్ ప్రాంతాల్లో నల్ల జాతి ఓటర్లు పోషించిన పాత్ర చాలా ఉంది.

ప్రతి 10 మంది నల్లజాతి ఓటర్లలో 9 మంది ఓటర్లు డెమొక్రట్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలియచేశాయి.

స్టేసీ అబ్రామ్స్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఈ ప్రాంతాల్లో బైడెన్ విజయానికి సహకరించిన వ్యక్తుల ప్రస్తావన వస్తే మాత్రం నల్ల జాతి మహిళల పాత్రే ప్రముఖంగా వినిపిస్తుంది.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఫ్లోరిడాలోని జాక్సన్‌వి‌ల్‌లో నల్లజాతి ఓటర్లు ఓట్లు వేసేందుకు ప్రచారం నిర్వహించిన క్రషాండర్ స్కాట్‌కి బెదిరింపులు కూడా రావడంతో ఆమె అదనపు భద్రత తీసుకోవలసిన అవసరం వచ్చిందని ఆమె చెప్పారు.

ఫిలడెల్ఫియాలో ఓటింగ్ హక్కుల ఉద్యమకర్త బ్రిట్నీ స్మాల్స్ కూడా వోటర్లకు ఓటు హక్కు గురించి అవగాహన, సాధికారతను పెంచడానికి అవగాహన కల్పించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఓటు వేయడం ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసు.

డెమొక్రాట్లు అందరూ జార్జియాలో స్టేసీ అబ్రామ్స్ చేసిన కృషిని ముక్త కంఠంతో ప్రశంసిస్తున్నారు. "ఏదైనా పని జరగాలంటే దానికి ప్రతీకగా అబ్రామ్స్ పేరును వాడారు"అని పార్టీకి ఎన్నికల పర్యవేక్షకులుగా పని చేసిన లిండా గ్రాంట్ చెప్పారు.

స్టేసీ అబ్రామ్స్.. 2018లో జార్జియా గవర్నరు పదవికి పోటీ చేసిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ కూడా. ఆమె ప్రత్యర్థి బ్రయిన్ కెంప్‌కు జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పని చేసిన అనుభవముంది.

బ్రయన్ పదవిలో ఉన్న కాలంలో పొరపాటుగా కొన్ని, చెలామణిలో లేవని కొన్ని.. ఇలా 10 లక్షల ఓట్లను రద్దు చేశారు. ఓటింగ్ రికార్డులను సక్రమంగా నిర్వహించడానికి చేస్తున్న పనులని చెబుతూ ఆయన కార్యాలయం సమర్ధించుకున్న చర్యలను.. స్టేసీ వెలుగులోకి తీసుకొచ్చారు.

ఆమెపై బ్రయన్ 50,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆయన విజయం అనంతరం.. ఆమె తన ప్రసంగంలో తన ఓటమికి కారణమయిన ఈ ఓట్లను పునరుద్ధరిస్తానని ప్రతిజ్ఞ చేశారు.

2020 అమెరికా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

రెండేళ్ల తరవాత 2020 ఎన్నికలకు ముందు, అబ్రామ్స్ కొన్ని సంస్థలతో కలిసి ఒక్క జార్జియాలోనే కనీసం 80,000 మంది ఓటర్లను నమోదు చేయించారు. ఈ రాష్ట్రంలో ఓట్లను తిరిగి లెక్కించనున్నప్పటికీ, అబ్రామ్స్ తన వాలంటీర్లతో కలిసి డెమొక్రాట్లకు సహాయం చేసిన తీరును మాత్రం అందరూ ప్రశంసించారు.

డెమొక్రాట్లు ఇక్కడ విజయం సాధించడం గత రెండు దశాబ్దాల్లో ఇదే మొదటి సారి.

ఈ ఓటర్లు వహించే పాత్ర జనవరిలో కూడా చాలా కీలకం కావచ్చు. అమెరికా సెనెట్‌లో ఏ పార్టీ ఆధిక్యంలోకి వస్తుందో ఈ జార్జియాలోని స్థానాలు నిర్ణయించే అవకాశం ఉంది. జార్జియాలో డెమొక్రాట్లు బైడెన్ ‌ విజయాన్ని ఇస్తే, ఆయన అబ్రామ్స్ చేసిన కృషికి రుణపడి ఉంటారు.

"ఆమె ఓడిపోయిన తరువాత.. నేను ఓడిపోయాను అని ఆమె బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఆమె ఆ ఓటమిని విజయంగా మార్చారు. అబ్రామ్స్ చేసిన కృషి నల్ల జాతి ఓటర్లు తమ శక్తి ఏమిటో తెలుసుకునేందుకు సహాయపడింది" అని క్రిస్టిన్ బంధువు తెరెసా విల్సన్ అన్నారు.

"ఆమె ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టి ఓటర్లందరినీ నమోదు చేయించడం ద్వారా జార్జియాలోను, దేశ వ్యాప్తంగానూ తేడా కనిపిస్తోంది" అని ఆమె అన్నారు.

"ప్రతి సారి దేశంలో ఎన్నికల సమయంలో మమ్మల్ని తేలికగా తీసుకుంటారని అనుకునేదాన్ని. మా ఓటు ఎంత ముఖ్యమో ఇప్పుడు ఈ దేశం, ప్రపంచం కూడా చూస్తోందని అనుకుంటున్నాను" అని ఆమె అన్నారు. .

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)