గుండె తరుక్కుపోయే కష్టం.. కళ్ల ముందే భార్య, ముగ్గురు పిల్లల శవాలు నీళ్లలో తేలుతుంటే చూడలేక ఆత్మార్పణం

ఫొటో సోర్స్, family handout
- రచయిత, జియర్ గోల్
- హోదా, బీబీసీ పర్షియన్
గత నెల ఇంగ్లిష్ ఛానెల్‌లో ప్రయాణిస్తూ కుటుంబం సహా ప్రాణాలు కోల్పోయిన కుర్దిష్-ఇరానియన్ చిన్నారి వీడియో క్లిప్ మనసులను కలచి వేస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తోంది.
ఆ వీడియోలో తొమ్మిదేళ్ల చిన్నారి నవ్వుతూ "నా పేరు అనిత ఇరానెజాద్, మా ఊరు సర్దష్ట్" అని చెబుతుంది.
అది వాళ్ల ఊర్లో చిత్రీకరించే ఒక షార్ట్ ఫిలింకు స్క్రీన్ టెస్ట్ కోసం తీసిన వీడియో.
అందులో వాళ్ల నాన్న రసౌల్ ఇరానెజాద్ గొంతు కూడా వినొచ్చు. "నేను నటిని కావాలనుకుంటున్నాను...అని చెప్పు" అని ఆయన వెనుక నుంచి మాట అందిస్తుండడం కూడా గమనించొచ్చు.
తన కూతురు నటిగా ఎదగాలన్న ఆరాటం రసౌల్ గొంతులో కనిపిస్తుంది. కానీ పేదరికంలో మగ్గుతూ, రాజకీయంగా వెనుకబడి ఉన్న ప్రాంతంలోంచి వచ్చిన ఆ చిన్నారికి ఇది చాలా పెద్ద ఆశయం. పశ్చిమ ఇరాన్‌లో ప్రధానంగా కుర్దులు నివసించే చిన్న ఊరు సర్దష్ట్‌లో ఆ కుటుంబం నివసించేది.
ఈ స్క్రీన్ టెస్ట్ జరిగిన ఒక ఏడాది తరువాత రసౌల్, ఆయన భార్య శివ పనాహి, వారి ముగ్గురు పిల్లలు...అనిత, ఆరేళ్ల అర్మిన్, 15 నెలల పసివాడు ఆర్టిన్ ఒక ప్రమాదకరమైన దారిలో యూరోప్‌కు ప్రయాణం కట్టారు.
అయితే, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బయలుదేరిన ఆ కుటుంబం మొత్తం అక్టోబర్ 27న ఇంగ్లిష్ ఛానల్‌లో ఘోర ప్రమాదానికి గురై ప్రాణాలు పొగొట్టుకుంది.
యూకేకు కొన్ని కిలోమీటర్ల దూరంలో వాళ్లు ప్రయాణిస్తున్న చిన్న పడవ క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుని బోల్తా పడింది.
శివ, పిల్లలు లైఫ్ జాకెట్లు లేకుండా బోటు లోపల చిక్కుకుపోయారు.

ఫొటో సోర్స్, family handout
మృత్యు ప్రయాణం
35 ఏళ్ల రసౌల్ ఆగస్ట్ ప్రారంభంలో తన కుటుంబంతో సహా ఇరాన్‌నుంచీ బయలుదేరారు.
ఆ కుటుంబం ఇరాన్ విడిచిపెట్టి ఎందుకి వెళ్లాలనుకున్నదనే దాని గురించి కచ్చితమైన సమాచారం లేకపోయినా, అనేక కారణాల వలన వారు అక్కడినుంచి మరోచోటుకి వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నారనే విషయం స్పష్టమవుతోంది.
పశ్చిమ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో ఇరాక్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న సర్దష్ట్‌లో పూట గడవడమే చాలా కష్టం.
ఇంక, ఆశయ సాధన అనేది కలలో కూడా ఊహించలేని విషయం. పారిశ్రామికంగా అంతగా అభివృద్ధి చెందని ఆ ప్రాంతంలో అత్యధిక స్థాయిలో నిరుద్యోగం, పేదరికం ఉన్నాయి.
గత్యంతరం లేక చాలామంది సరిహద్దుల మీదుగా ఇరాక్‌లోని కుర్దిస్తాన్‌కు సరకులను అక్రమ రవాణా చెయ్యడానికి పాల్పడతారు. దానివల్ల వారికి వచ్చే లాభం కూడా పెద్దగా ఉండదు...ఒక్కో ట్రిప్‌కూ కేవలం రూ.700-800 మాత్రమే సంపాదిస్తారు. పైగా అది చాలా ప్రమాదకరమైన పని కూడా.
గత కొన్నేళ్లల్లో ఇరాన్ సరిహద్దుల్లోని భద్రతా దళాల చేతిలో ఇలా అక్రమ రవాణా చేస్తున్నవాళ్లు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది గాయాలపాలయ్యారు.

అంతే కాకుండా, కొండలపైనుంచి కాలుజారి కిందపడి మరణించినవారు కొందరైతే, శీతాకాలంలో మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయినవాళ్లు మరికొందరు.
ఆ ప్రాంతంలో భారీగా మిలటరీ బలగాలు మోహరించి ఉంటాయి. 1979లో ఇరాన్ విప్లవం తరువాత ఇరాన్ భద్రతా దళాలకు, తమ హక్కుల కోసం పోరాడే సాయిధ కుర్దిష్ తిరుగుబాటుదారులకు మధ్య తరచు ఘర్షణలు జరుగుతూ ఉంటాయి.
వీరిని, విదేశీ శక్తుల మద్దతుతో తిరుగుబాటు చేస్తున్న వేర్పాటువాదులుగా ఇరాన్ పరిగణిస్తుంది.
ఇరాన్ జనాభాలో సుమారు 10 శాతం కుర్దులు ఉన్నారు. కానీ దేశ రాజకీయ ఖైదీల్లో సగం మంది వీరే ఉన్నారని ఐక్యరాజ్యసమితి (యూఎన్) చెబుతోంది.
గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల తరువాత ప్రధానంగా కుర్దుల నగరాల్లోనూ, ఇరాన్‌లోని ముఖ్య పట్టణాల శివార్లలోనూ ప్రభుత్వం దారుణమైన అణచివేతకు పాల్పడింది.

ఫొటో సోర్స్, family handout
రసౌల్ కుటుంబం ఈ హింసనుంచీ బయటపడాలని అనుకున్నట్లు శివ స్నేహితురాలు బీబీసీకి తెలిపారు.
‘‘వాళ్లు యూకేకి వెళిపోవాలనుకున్నారు. మిగతా యూరోపియన్ దేశాలతో పోలిస్తే యూకేలో తక్కువ సంఖ్యలో శరణార్థులను అనుమతిస్తారు.
అక్కడికి వెళితే తమకి మంచి అవకాశాలు ఉంటాయని చాలామంది కుర్దిష్ శరణార్థులు భావిస్తారు.
రసౌల్ కుటుంబం కూడా అలాగే అనుకున్నారు. అక్రమ రవాణా సహాయంతో యూకే చేరాలనుకున్నారు.
అందుకోసం తమ వద్ద ఉన్నవన్నీ అమ్మేసి, బంధువులు, స్నేహితుల దగ్గరనుంచీ కొంత డబ్బు అప్పుగా తీసుకున్నార’’ని ఆమె తెలిపారు.
వాళ్ల ప్రయాణంలో భాగంగా మొదట టర్కీలో ఆగారు. అక్కడునుంచీ స్మగ్లర్స్ వాళ్లని యూరోప్‌కు తరలిస్తారు.

అందుకోసం వేచి చూస్తున్న సమయంలో రసౌల్ కుర్దిష్ భాషలో పాట పాడుతుండగా తీసిన వీడియోను ఆయన స్నేహితుడు బీబీసీతో పంచుకున్నారు.
"నా హృదయం బాధతో మూలుగుతోంది...కానీ ఏం చెయ్యగలను, నా కుర్దిస్తాన్ వదిలి వెళిపోవాల్సి వస్తోంది..." అని రసౌల్ పాడుతుండగా ఆయన కుమారుడు అర్మిన్ సంతోషంతో నవ్వుతుండడం, పసివాడు ఆర్టిన్ పాక్కుంటూ తండ్రి దగ్గరకు వచ్చి ఒళ్లో కుర్చోవడం ఈ వీడియోలో గమనించొచ్చు.
అంతకుమునుపు టర్కీనే ఇరానియన్ శరణార్థులకు గమ్యస్థానంగా ఉండేది. కానీ గత ఏడేళల్లో రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో టర్కీలోనే ఉండడం సాధ్యం కాకుండా పోయింది.
టర్కీ భద్రతా దళాలు కుర్దిష్ శరణార్థులపై పోలీస్ స్టేషన్లలో హింసకు పాల్పడడం లేదా ఇరాన్‌కు తిరిగి పంపించేయడం చేస్తున్నారని సమాచారం. ఇస్తాంబుల్‌లో ఇరాన్ అసమ్మతివాదుల రాజకీయ హత్యలు, అపహరణలు జరిగాయని రిపోర్టులు వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో రసౌల్, శివ టర్కీలో ఆగిపోకుండా ముందుకు ప్రయాణించాలని నిర్ణయించుకొని ఉంటారు.
సెప్టెంబర్‌లో ఒక స్మగ్లర్‌ను కలిసి అతనికి 24,000 యూరోలు (సుమారు 21 లక్షల రూపాయలు) ఇచ్చి టర్కీనుంచీ ఇటలీకి పడవలో, అక్కడినుంచీ ఉత్తర ఫ్రాన్స్‌కు లారీలో తీసుకెళ్లేట్లు ఒప్పందం చేసుకున్నారు.
ఫ్రాన్స్‌లోని డంకిర్క్‌లో ఆద్రా చారిటీకి వలంటీర్‌గా పనిచేస్తున్న షార్లెట్ డెకంటర్ శివను కలిశానని చెప్పారు. గ్రాండ్-సింత్‌లోని శరణార్థుల శిబిరాల వద్ద ఆహార పొట్లాలు పంచేందుకు వెళ్లినప్పుడు శివని కలిశానని ఆమె చెప్పారు.
"మంచి మనిషి, చాలా సౌమ్యురాలు. చురుకుగా, ఉత్సాహంగా మాట్లాడారు. నాకొచ్చిన కొన్ని కుర్దిష్ పదాలు చెప్పాను. ఆవిడ ఆశ్చర్యపోతూ ఆనందంగా నవ్వారు" అని డెకంటర్ తెలిపారు.
అయితే, ఫ్రాన్స్‌లో ప్రయణం మధ్యలో ఎక్కడో వారు ఆపదలో చిక్కుకున్నారు. వారి దగ్గరున్న మొత్తం సొమ్మును ఎవరో దోచుకున్నారు.

‘ప్రమాదమని తెలుసు.. కానీ, ఏం చేయను? డబ్బుల్లేవ్’
24 అక్టోబర్‌న శివ, కాలేలో ఉన్న తన స్నేహితురాలికి పంపించిన మెసేజ్‌లో...'బోటు ప్రయాణం ప్రమాదకరమని తెలుసు కానీ లారీలో వెళ్లడానికి డబ్బుల్లేవని, బోటు ప్రయాణం తప్ప మరో మార్గం లేదని' రాశారు.
"ఇది ప్రమాదకరమేకానీ మరో మార్గం లేదు. నా మనసంతా బాధతో నిండిపోయింది. ఇంక ఇరాన్ వదిలేశాను కాబట్టి గతాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను" అని ఆ మెసేజ్‌లో శివ రాసారు.
రసౌల్ కుటుంబంతో పాటు ఫ్రాన్స్‌కు ప్రయాణం చేసిన ఒక మిత్రుడు ఇచ్చిన సమాచారం ప్రకారం...అక్టోబర్ 26వ తేదీన డంకిర్క్‌లో స్మగ్లర్, వారిని మర్నాడు ప్రయాణం కమ్మని చెప్పాడు.
మర్నాడు తెల్లవారుతూనే లూన్ ప్లాజ్ అనే బీచ్‌నుంచీ వాళ్లు బయలుదేరారు.
ఆరోజు వాతావరణం చాలా కఠినంగా ఉంది. గాలి గంటకు 30 కి.మీ వేగంతో బలంగా వీస్తోంది. అలలు 1.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. అవేర్ అనే స్నేహితుడు ఆ పరిస్థితుల్లో వారితో పాటూ పడవలో ప్రయాణించడం సురక్షితం కాదని, అక్కడే ఉండిపోయారు.
"ఆరోజు నాకు చాలా భయమేసింది. నేను రాను అని చెప్పేశాను. వెళ్లొద్దు, ఉండిపొమ్మని రసౌల్‌కు కూడా ఎంతో చెప్పి చూశాను. కానీ తనకి గత్యంతరం లేదని వెళ్లక తప్పదని చెప్పారు" అని అవేర్ తెలిపారు.
రసౌల్ స్మగ్లర్లకి దాదాపు రూ. 5 లక్షలు చెల్లించారని ఇరాన్‌లోని వారి బంధువులు తెలిపారు.
47 ఏళ్ల ఇబ్రహీం మొహమ్మద్ కూడా ఆరోజు వారితో పాటూ ఆ పడవలో ప్రయాణించారు. ఇబ్రహీం సర్దష్ట్‌లో ఒక డాక్యుమెంటకీ ఫిలింమేకర్. ఇబ్రహీం తన 27 ఏళ్ల సోదరుడు, 17 ఏళ్ల కొడుకుతో పాటూ ఆ పడవ ఎక్కారు. అది చాలా చిన్న పడవ అని, 4-4.5 మీటర్లు పొడవుందని, ఎనిమిది మంది కూర్చోడానికే వీలుందని కానీ ఆరోజు 23 మంది అందులో కిక్కిరిసి కూర్చున్నారని ఇబ్రహీం తెలిపారు.
"ఈ మొత్తం ప్రయాణంలో మేమెన్ని బాధలు పడ్డామంటే ఆరోజు నిజంగా మాకెవ్వరికీ ఆలోచించే పరిస్థితి లేదు. మొదట ఈ బోటులో ఎక్కకూడదనే అనిపించింది. తరువాత ఎలాగోలా ఈ కష్టాలనుంచీ బయటపడితే చాలు అనుకుంటూ పడవ ఎక్కేశాం" అని ఇబ్రహీం చెప్పారు.

యాసిన్ ఆనే 16 ఏళ్ల యువకుడు కూడా ఆరోజు ఆ పడవ ఎక్కాడు. తను, మరొక ఇద్దరు తప్ప పడవలో ఇంకెవ్వరూ లైఫ్ జాకెట్లు వేసుకోలేదని చెప్పాడు.
పడవలో ఉన్న 22 మంది కూడా సర్దష్ట్‌నుంచీ వచ్చిన కుర్దులే. పడవ నడిపే మనిషి ఉత్తర ఇరాన్‌నుంచీ వచ్చిన శరణార్థుడని తెలిసింది.
గతంలో యూకేకు ప్రయాణించిన వలసదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం...సాధారణంగా ఎవరి దగ్గర తక్కువ డబ్బులుంటాయో వాళ్లను పడవ నడపమని స్మగ్లర్స్ చెబుతారు.
శివ, పిల్లలు అక్కడ ఉన్న చిన్న క్యాబిన్‌లోపలికి వెళ్లారు. చుట్టూ గాజు అద్దాలున్న క్యాబిన్‌లో వెచ్చగా, సురక్షితంగా ఉంటుందని వారు భావించి ఉంటారు. కానీ అదే వాళ్ల పాలిట శాపమయ్యింది.
ఒక ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం తరువాత పడవలోకి బాగా నీళ్లొచ్చేసాయని ఇబ్రహీం తెలిపారు.
"నీళ్లు బయటకు తోడడానికి ప్రయత్నించాం. కానీ మావల్ల కాలేదు. వెనక్కి తిరిగి కాలేకు వెళిపోదామని అనుకున్నాం. అదీ సాధ్యపడలేదని" ఇబ్రహీం చెప్పారు.
ప్రయాణికులందరూ భయంతో అటూ ఇటూ పరుగులు తియ్యడం మొదలుపెట్టారని, అకస్మాత్తుగా బోటు తిరగబడిందని ఇబ్రహీం సోదరుడు మొహమ్మద్ తెలిపారు.
తరువాత ఏం జరిగిందనేది ఎవరికీ స్పష్టంగా తెలీలేదు.
శివ, పిల్లలు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారని అందరూ చెప్తున్నారు. వారిని కాపాడడానికి రసౌల్ నీటి అడుగుకు ఈదుకుంటూ వెళ్లారని, మళ్లీ పైకొచ్చి సహాయం కోసం అర్థించారని ఇబ్రహీం చెప్పారు.

"క్యాబిన్ గాజు తలుపులు బద్దలుగొట్టడానికి ప్రయత్నించానని, కార్పెట్ కట్టర్‌తో ఎంత కొట్టినా అవీ పగల్లేదని, లోపల పసివాడు ఆర్టిన్ నీళ్లలో తేలుతుండడం చూసానని" పెష్రా అనే యూనివర్సిటీ విద్యార్థి తెలిపారు.
"రసౌల్ ఆర్టిన్‌ను బయటకు లాక్కురాగలిగారని, మిగతావారిని రక్షించడం కోసం మళ్లీ లోపలికి వెళ్లారని" శివ సోదరుడు రసో, బీబీసికి తెలిపారు.
అనిత నీళ్లల్లో కొట్టుకుపోతుండగా చూసానని, తనను రక్షించడానికి ప్రయత్నించానని ఇబ్రహీం కుమారుడు తెలిపారు.
"ఆ పాపను పట్టుకోగలిగాను. తను బతికే ఉందని అనుకున్నాను. ఒక చేత్తో పడవను పట్టుకుని, రెండో చేత్తో పాపను పట్టుకున్నాను. తను బతికుందో లేదోనని కదిపి చూశాను. కానీ తనలో ఏ చలనం లేదు. ఆ పాపను రక్షించలేకపోయాను. నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను" అని ఆ 17 ఏళ్ల కుర్రాడు విలపించాడు.

భార్యాపిల్లలను కోల్పోయిన రసౌల్ ఆత్మార్పణం
రసౌల్ గట్టిగా ఏడుస్తూ, భార్యాపిల్లల పేర్లను పిలుస్తూ పడవలోంచి బయటకి వచ్చారు. తరువాత చేతులొదిలేసి తనకు తాను ప్రాణాలు అర్పించుకున్నారు. అలలు ఆయన్ని నెట్టుకుపోయాయని ఇబ్రహీం సోదరుడు మొహమ్మద్ తెలిపారు.
పక్కనే వెళుతున్న మరో పడవ..స్థానిక సమయం 9.30 గంటలకి అధికారులను హెచ్చరిస్తూ అలారం మొగించిందనీ, నీళ్లల్లో పడినవారిని రక్షించేందుకు ప్రయత్నించిందనీ ఫ్రెంచ్ అధికారులు తెలిపారు.
కొందరికి నీళ్లల్లోనే గుండెపోటు వచ్చిందని అధికారులు తెలిపారు.
రసౌల్, శివ, అనిత, అర్మిన్ మరణించారని, మిగతా 15 మందిని ఆస్పత్రికి తరలించారని, పసివాడు ఆర్టిన్ జాడ తెలియలేదని, తను కూడా మరణించే ఉంటాడని భావిస్తున్నట్లు ఈ ప్రమాదంనుంచీ బయటపడ్డవారు బీబీసీకి తెలిపారు.
ఆర్టిన్ నీళ్లల్లో కొట్టుకుపోవడం చూశానని యాసిన్ తెలిపారు.
ఆ పడవకు కేప్టెన్‌గా ఉన్న ఇరానియన్ వ్యక్తిని ఫ్రాన్స్ కోర్టులో హాజరుపరిచారు. నేరానికి తగిన శిక్షను విధించేందుకు రంగం సిద్ధం చేశారు.
యూరోప్‌లో ఉన్న శివ తోబుట్టువులు మృతదేహాలను గుర్తు పట్టడానికి డంకిర్క్ చేరుకున్నారు. మృతదేహాలను స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంగ్లిష్ ఛానల్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న వలసదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
2018లో 297 మంది చిన్న చిన్న పడవల్లో యూకే చేరుకున్నారు. 2019లో 1,840 మంది చేరుకున్నారు. ఈ ఏడాది 8,000 మంది ఈ ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేసినట్లు బీబీసీ శోధనలో తేలింది.
2019నుంచీ ఈ ప్రయాణాల్లో కనీసం 10 అంది ప్రాణాలు కోల్పోయారు. వలస వెళ్లే శరణార్థుల్లో అధిక శాతం ఇరాన్‌కు చెందినవాళ్లే.
శరణార్థులు బ్రిటన్ చేరే ముందే ఆశ్రయం కోసం దరఖస్తు పెట్టుకోవాలని శరణార్థుల స్వచ్ఛంద సేవా సంస్థలు, ఫ్రెంచ్ రాజకీయవేత్తలు వాదిస్తున్నారు.
ఈ ప్రమాదంలో బతికి బయటపడినవారికి ఇదంతా ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంటుందని ఇబ్రహీం అన్నారు.
ఇంత జరిగాక కూడా, ఇంగ్లిష్ ఛానల్ దాటడానికి మళ్లీ ప్రయత్నిస్తానని యాసిన్ తెలిపారు.
"అందరికీ చాలా విచారంగా ఉంది. నాకు భయంగా కూడా ఉంది. కానీ నేను ఒక సురక్షితమైన ప్రదేశంలో జీవించాలనుకుంటున్నాను. నేను మళ్లీ ప్రయత్నిస్తాను" అని యాసిన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








