యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ శైలజా చందు
- హోదా, బీబీసీ కోసం
పార్టీలో ఓ పక్కన కూర్చుంది పద్మిని. ఆమె అకౌంటెంట్ మూర్తి భార్య. ఆఫీసర్, తన భార్యతో లోపలికి రాగానే అందరూ ఎదురెళ్లి వాళ్లకు నమస్కారాలు చెప్పారు. మూర్తి, భార్యకు సైగ చేశాడు రమ్మన్నట్టు. పద్మిని లేవలేదు.
చిరునవ్వు చిరునామా పోగొట్టుకున్నదానిలా తల వంచుకుని కూర్చుంది.
'అందంగా వుంటానని గర్వం' పార్టీలో ఆడవాళ్లు గుస గుసలాడారు.
ఆఫీసర్ చాలా సరదా మనిషి.
దగ్గరకు వచ్చి ఆమెను పలకరించాడు.
'మీరు సంతోషంగా లేకపోవడం మాకేమీ బాగోలేద'న్నాడు.
ఆమెను రెండు నిముషాల్లో నవ్విస్తానని పందెం వేశాడు. కంగారు పడిందామె.
ఆయన చేసే తమాషా పనులకు, పరిహాసపు కబుర్లకు అందరూ పెద్ద పెట్టున నవ్వుతున్నారు.
పద్మిని నవ్వలేక కళ్లనీళ్లు పెట్టుకుంది.
మూర్తి ఆమె ప్రవర్తనకు చిన్నబుచ్చుకున్నాడు.
ఆఫీసర్ వద్ద క్షమాపణలడిగి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.
నవ్వడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏమిటి?
గత కొద్ది నెలలుగా నవ్వినా, దగ్గినా పద్మినికి యూరిన్ లీకైపోతోంది. బయటికి వెళ్లడం కూడా తగ్గించుకుంది.
దగ్గినా, తుమ్మినా, బిగ్గరగా నవ్వినా యూరిన్ లీకవడం, దీనిని స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ (Stress urinary incontinence) అంటారు.
కటి వలయపు కండరాల బలహీనత వల్ల ఈ సమస్య ఎదురవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
సునంద, రుక్మిణి ఎదురెదురు ఫ్లాట్స్‌లో ఉంటారు. ఇద్దరి భర్తలూ పని చేసేది ఒకే ఆఫీసులో. స్నేహితులకు దీపావళి విందు ఏర్పాటు చేద్దామనుకుంది రుక్మిణి.
ఇద్దరూ కలిసి మాల్ కెళ్లారు. మాల్ అంతా తిరిగి, విందుకవసరమైన సరకులు, పింగాణీ సామాన్లు తీసుకున్నారు. ఫుడ్ కోర్ట్ కెళ్లి ఐస్ క్రీం తిన్నారు. కూల్ డ్రింకులు తాగారు.
మాల్‌లో వాష్ రూం కెళ్దామని చూస్తే ఒకటే రద్దీగా ఉంది. ఆటోలో ఇంటికొచ్చారు. రుక్మిణి వాళ్లింటి ముందు సామాన్లన్నీ దించి నిలబడ్డారు. రుక్మిణి తమ అపార్ట్‌మెంట్ తలుపులో తాళం పెట్టి తీస్తోంది. సునందకు బాత్ రూం ఆపుకోలేనంత అర్జెంటుగా వచ్చేసింది. సునంద తన ఫ్లాట్ తలుపు తీద్దామని, బాగ్‌లో చెయ్యిపెట్టి ఎంత వెతికినా తాళం చెవి దొరకలేదు.
'రుక్మిణీ, వాష్ రూంకెళ్లాలి. అర్జంటు' అంటూనే తమ ఫ్లాట్లోకి కాకుండా రుక్మిణి వాళ్ళింట్లోకి పరుగు తీసింది. వాళ్లింటి సోఫాల మధ్య ధారగా యూరిన్ పడింది. సునంద సిగ్గుతో చితికిపోయింది. రుక్మిణితో స్నేహం కొనసాగించలేకపోయింది.
యూరిన్ రాకను కొంచెంసేపు కూడా ఆపుకోలేకపోయే ఈ సమస్యనే అర్జ్ ఇన్‌కాంటినెన్స్ (urge incontinence) లేదా లాచ్‌కీ ఇన్‌కాంటినెన్స్ (latchkey' incontinence) అంటారు.

ఫొటో సోర్స్, BSIP
ఆడవారిలో యూరిన్ లీకయే పరిస్థితులేమిటి?
స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ (Stress urinary incontinence): ఒత్తిడి వల్ల యూరిన్ లీకవడం తుమ్మినా, దగ్గినా, బిగ్గరగా నవ్వినా, బరువులెత్తే వ్యాయామం చేస్తున్నపుడు యూరిన్ లీకవుతూ వుంటుంది. వారు నవ్వడానికే భయపడుతుంటారు.
అర్జ్ ఇన్‌కాంటినెన్స్ (Urge incontinence): మూత్రం నిలవ చేసే సమయంలో బ్లాడర్ కండరాలు నెమ్మదిగా వ్యాకోచించడానికి బదులు అసాధారణంగా సంకోచిస్తాయి. దానివలన త్వరగా టాయిలెట్‌కు వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితి యేర్పడుతుంది.
వెళ్లాలి అనిపించడం ఆలస్యం, ఒక్క నిముషం లేటు చేసినా దారిలోనే యూరిన్ పడిపోతుంది. కనీసం వాష్ రూం సౌకర్యాలు వెతుక్కునే వ్యవధి కూడా లేకపోవడం, ఒక వేళ అది దగ్గర్లోనే వున్నా సరే వెళ్లే దారిలోనే యూరిన్ కారిపోవడాన్ని అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అంటారు.
మిక్స్‌డ్ ఇన్‌కాంటినెన్స్ (Mixed incontinence): పై రెండు సమస్యలూ కలిసిన మిశ్రమ స్థితి.

ఫొటో సోర్స్, Getty Images
'రండి రండి. మనసెక్కడ పెట్టి వర్క్ చేస్తున్నారు' కంప్యూటర్లోకి చూస్తూ అన్నాడు బాస్.
సుభద్ర మాట్లాడలేదు. కళ్లెత్తి చూసే ధైర్యం చేయలేకపోతోంది.
బాస్ గది చాలా చల్లగా వుంది. గదిలో ఓ మూలన గుబురు ఆకుల పచ్చని చెట్టు. చక్కటి వాతావరణం. ఎయిర్ ఫ్రెషనర్ ద్వారా గంధపు పరిమళం చుట్టుముట్టింది.
ఆయనకు తన ఆకారం ఎటూ నచ్చదు. దానికి తోడు కొత్తగా ఈ సమస్య ఒకటి. లోపల తడి తగులుతున్నట్లు తెలుస్తోంది. యూరిన్ లీకవతున్నట్లుంది.
'ఏవిటండీ ఈ తప్పులు? ఏమీ మాట్లాడరే' కొన్ని పేపర్లు విసురుగా ఆమె ముందు పడేశాడు.
ఆయన వంక చూసింది. ఆయన ముక్కు చిట్లించి చూస్తున్నట్టు అనుమానం వచ్చింది. అంటే తన దగ్గర్నుండి స్మెల్ వస్తోందా?
'ఎప్పుడు చూసినా సీట్లో వుండరు. ఎక్కడికి పోతారో తెలియదు.' బాస్ కంఠంలో విసుగుదల.
నిజమే, ఈ బాధ మొదలైన దగ్గర్నుండి, చీటికి మాటికి టాయిలెట్‌కెళ్లడం, యూరిన్ పోతున్నదేమోనని లోదుస్తులు చెక్ చేసుకోవడమే సరిపోతోంది.
ఎవరికి చెప్పుకోవాలో తెలియదు.
'పనిలో కాన్సంట్రేషన్ వుండదు. చేరిన కొత్తల్లో పని బాగానే చేస్తారు. మెల్లగా మొండి దేలతారు.'
తనలో తను అనుకున్నట్లు బిగ్గరగానే అన్నాడు.
ఉద్యోగం చేయడం కష్టమనిపిస్తోందామెకు. రాజీనామా చేద్దామా అని ఆలోచించింది.
యూరినరీ ఇన్‌కాంటినెన్స్ (Urinary incontinence): మూత్రం పోవడం అనేది తమ అదుపులో లేకుండా లీకవడం.
ఈ సమస్య తలెత్తినపుడు, మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. పనిలో సామర్థ్యం తగ్గుతుంది.
సుమారుగా 25 - 50% మంది స్త్రీలు భాగస్వామి దగ్గరకు వెళ్లడానికి సంకోచిస్తారు. తన వద్ద యూరిన్ వాసన వస్తుందేమోనన్న భయంతో దూరంగా మసలుతుంటారు.
ఈ సమస్య వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. డిప్రెషన్‌కు లోనవుతారు.

ఫొటో సోర్స్, Mint
దాదాపు 50 శాతం పైగా మహిళలు జీవితంలో ఒక్కసారైనా ఈ సమస్యనెదుర్కుంటారు. బయటికి చెప్పుకోలేక లోలోపలే బాధ పడుతుంటారు. ఇది వయసుతో వచ్చే మార్పేనని, దీనికి పెద్దగా చికిత్సలుండవనీ, ఇక ఇలా ఇబ్బంది పడుతూ జీవించాల్సిందేనని తమకు తామే నిర్ణయాలు తీసుకుంటారు.
కానీ అది నిజం కాదు. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుండి ఆడవారికి సహాయం అందించడానికి ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో వున్నాయి.
కొన్నిసార్లు పెద్ద ప్రమాదకరమైన కారణాలేమీ వుండవు.
తేలిక పాటి చికిత్సలతోనే సమస్య సరి అవుతుంది.
సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, తమ వ్యక్తిగత జీవితం పైనా, వృత్తి పైనా, సమస్య తాలూకు ప్రభావాన్ని అంచనా వేయడానికి మూడు రోజుల పాటు బ్లాడర్ డైరీ వ్రాయాలి.
బ్లాడర్ డైరీ అనేది వారి లక్షణాల వివరాలన్నిటినీ పొందుపరచగల నమూనా పత్రం.
ఎంత నీరు తాగుతున్నారు, ఎన్నిసార్లు టాయిలెట్‌కు వెళ్లవలసి వస్తోంది, హఠాత్తుగా వెళ్లాల్సిన అవసరం ఏమైనా వుందా, యూరిన్ ఎన్నిసార్లు లీకవుతోంది. లీకవడానికి ప్రేరేపించిన కారణాలేమిటి, రక్షణగా పాడ్ వాడకం, అవి ఎన్నిసార్లు మార్చుకోవలసి వుంది తదితర వివరాలన్నిటినీ రాయడానికి వీలుగా రూపొందించబడింది.
మోతాదు మించి ద్రవపదార్థాలు తీసుకోవడం, షుగర్ వ్యాధి వుండడం, యూరిన్‌లో ఇన్ఫెక్షన్ కూడా యూరిన్ లీకవడానికి కారణమవుతాయి.
బ్లాడర్ డైరీతో బాటు, శరీరాన్ని పరీక్ష చేయడం ద్వారా మరికొన్ని వివరాలు తెలుస్తాయి.
ఆ తర్వాత యూరోడైనమిక్ టెస్టింగ్ (Urodynamic testing - Filling and Voiding cystometry) అనే పరీక్ష ద్వారా, మూత్రకోశం లోని పీడన శక్తిని, ఉదరంలోని పీడన శక్తిని అంచనా వేసి, దేని వలన యూరిన్ లీకవుతోందో తెలుసుకుంటారు.

ఫొటో సోర్స్, THINKSTOCK/MHEIM3011
ఈ సమస్య వున్న స్త్రీలు తమ జీవన విధానంలో చేయవలసిన మార్పులు.
1. బరువు తగ్గడం: బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 కన్నా ఎక్కువ వున్న వారు అధిక బరువు తగ్గడం వల్ల యూరిన్ లీకవడం నుండి ఉపశమనం వస్తుంది.
2. కొందరు స్త్రీలకు మరీ ఎక్కువగా ద్రవపదార్థాలు, ఎక్కువగా నీళ్లు తీసుకునే అలవాటు వుంటుంది. అటువంటి స్త్రీలలో కొన్ని మార్పులు అవసరం.
కాఫీలు, ఆల్కహాల్, కూల్ డ్రింకులు తగ్గించడం వల్ల కూడా యూరిన్ లీకవకుండా కంట్రోల్ చెయ్యవచ్చు.
3. కటి వలయపు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Pelvic floor exercises) చేయడం వల్ల యూరిన్ లీకవడం తగ్గించవచ్చు. ఈ వ్యాయామాలు ఎలా చెయ్యాలో వైద్య నిపుణుల వద్ద నేర్చుకోవాల్సి వుంటుంది.
4. బ్లాడర్ ట్రెయినింగ్: యూరిన్‌కు వెళ్లాలి అనుకోగానే వెళ్లిపోవడం వల్ల మూత్రకోశం క్రమశిక్షణ కోల్పోతుంది. అటువంటి పరిస్థితిలో స్త్రీలు ఎక్కడికి వెళ్లినా ముందుగా టాయిలెట్ ఎక్కడ వుందో చూసుకుంటూ వుంటారు. స్వేచ్ఛగా బయటికి వెళ్లలేరు. నిర్ణీత సమయాల్లో మాత్రమే యూరినల్స్‌కు వెళ్లే విధంగా బ్లాడర్‌ను తర్ఫీదు చేయాలి. ఈ చికిత్స మూత్రకోశానికి క్రమశిక్షణ నేర్పడం వంటిది.

ఫొటో సోర్స్, GIGGLE KNICKERS
మూత్రం పై నియంత్రణ లేకపోవడమనే ఇబ్బందికి ఆధునిక చికిత్సలో భాగంగా ఎన్నో రకాల మందులు అందుబాటులో వున్నాయి. వైద్య నిపుణుల సలహాతో వాడవలసి వుంటుంది.
మందులతో సమస్య పరిష్కారమవనపుడు శస్త్ర చికిత్సల ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు.
తుమ్మినపుడు, దగ్గినపుడు యూరిన్ లీకయే సమస్య ఉన్నపుడు మూత్ర కోశ ద్వారానికి ఒక స్లింగ్ కానీ, కృత్రిమ స్ఫింక్టర్ (sphincter) పరికరాన్ని అమర్చడం ద్వారా కానీ నియంత్రణ సాధించవచ్చు.
మూత్రకోశ ద్వారం దగ్గర బల్కింగ్ ఏజెంట్స్ (bulking agents)ని ఇంజెక్ట్ చేయడం ద్వారా, ఆ ప్రదేశంలోని కండరాలకు సపోర్ట్ లభిస్తుంది. తద్వారా యూరిన్ లీక్ కాకుండా నియంత్రణ సాధ్యమవుతుంది.
ఈ సమస్య వున్న మహిళలు నిరంతరమైన భయంలో బ్రతుకుతుంటారు. తమ దగ్గర యూరిన్ వాసన ఎవరైనా పసిగడతారేమోనన్న ఆందోళన వల్ల సమాజానికి దూరమైపోతారు.
యూరిన్ లీకవడం అనేది వారు చేసిన నేరం కాదని, అదొక ఆరోగ్య సమస్య అనీ మహిళలు తెలుసుకోవాలి. తేలికపాటి వైద్య విధానాల ద్వారా సమస్యను దూరం చేసుకుని సంతోషంగా జీవించవచ్చు.
సమాజంలోని వ్యక్తులు, వారి వారి కుటుంబ సభ్యులు అర్థం చేసుకుని, వారికి సహాయపడాలి.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన ఎలా ఉండబోతోంది... ఎన్ని కొత్త జిల్లాలు రాబోతున్నాయి?
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








