భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?

ఫొటో సోర్స్, AFP Contributor
- రచయిత, సచిన్ గోగోయి
- హోదా, బీబీసీ ప్రతినిధి
లద్దాఖ్ సరిహద్దుల్లో ఘర్షణల నడుమ గత ఐదు నెలలుగా భారత్, చైనా తమ సైనిక సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకుంటున్నాయి.
క్షిపణి పరీక్షలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో గూఢచర్య వ్యవస్థలనూ పటిష్ఠం చేసుకుంటున్నాయి. మరోవైపు అమెరికా, భారత్, జపాన్ ఆస్ట్రేలియా కలిసి ‘‘క్వాడ్’’ విన్యాసాలూ చేపట్టాయి.
ఆస్ట్రేలియాను తన నావికా దళ విన్యాసాల్లో చేర్చుకోవడం ద్వారా చైనాకు గట్టి సందేశం పంపించాలని భారత్ భావించింది. ఇదివరకు ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ మాత్రమే పాల్గొనేవి.
చైనా అభ్యంతరాల నడుమ ఈ విన్యాసాలకు ఆస్ట్రేలియాను భారత్ దూరంగా పెడుతూ వచ్చింది.
మరోవైపు శీతాకాలంలో లద్దాఖ్‌లో అనుసరించే వ్యూహాలకూ భారత్ పదును పెడుతోంది. సైనికులకు చలిని తట్టుకునే వస్త్రాలు అందించడం, ఆయుధాలను సిద్ధం చేయడం లాంటి చర్యలను ఇప్పటికే మొదలుపెట్టింది.
ఈ విషయంలో చైనా కూడా అసలు ఏ మాత్రమూ తగ్గడం లేదు. సరిహద్దుల వెంబడి తమ బలగాలు, ఆయుధ సంపత్తిని పెంచుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. హిమాలయాల్లో మోహరించిన సైనికుల కోసం ఎప్పటికప్పుడు వేడి ఆహారం, వస్త్రాలు అందించేందుకు ఏర్పాట్లు కూడా చైనా చేస్తోంది.
అయితే, నవంబర్ 6న చుశూల్‌లో కోర్ కమాండర్ స్థాయిలో జరిగిన ఎనిమిది రౌండ్ల చర్చల తరువాత ఇరు పక్షాలు సైనిక ఉపసంహరణ విషయంలో ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోందని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఎల్ఏసీ వద్ద భారత్, చైనాలు తమ సైన్యాలను వెనక్కి తీసుకోవడానికి అంగీకరిస్తే, లద్దాఖ్ ప్రాంతంలో గత ఆరు నెలలకు పైగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంటుంది.
"ఘర్షణాత్మక ప్రాంతాలలో సైనిక ఉపసంహరణ దశల వారీగా ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో భారత్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది" అని భారత సైనిక వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ పేర్కొంది.
రెండు దేశాల బలగాలు మళ్లీ ఢీ అంటే ఢీ అంటూ ఎదురుపడే సంకేతాలేమీ కనిపించడంలేదు. కానీ, సుదీర్ఘకాలం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ క్షిపణి పరీక్షలు
భారత్‌లో క్షిపణుల అభివృద్ధి, పరీక్షలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం.. పరీక్షలు జరుగుతున్నట్లు అనిపించడంలేదు. సెప్టెంబరు, అక్టోబరుల్లో భారత్ 13 క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఇంత తక్కువ సమయంలో ఇన్ని పరీక్షలు నిర్వహించడం అసాధారణమని అక్టోబరు 29న ఇంగ్లిష్ పత్రిక హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.
వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనాతో ఘర్షణల నడుమ ‘‘భారత్‌లో తయారీ’’ కార్యక్రమం కింద సంప్రదాయ, అణు క్షిపణుల తయారీ వేగం పుంజుకుందని ఆ పత్రిక పేర్కొంది. సగటున ప్రతి నాలుగు రోజులకు ఒక క్షిపణిని భారత్ ప్రయోగించినట్లు వివరించింది.
మరోవైపు క్షిపణి పరీక్షలను వేగవంతం చేయాలని భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో)కు భారత ప్రభుత్వం సూచించినట్లు కూడా హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ చైనా తీరును దృష్టిలో ఉంచుకుని డీఆర్‌డీవోను భారత్ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థలను పరీక్షించినట్లు ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ టైమ్స్ నౌ పేర్కొంది. హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమన్‌స్ట్రేటర్ వెహికల్ (హెచ్‌ఎస్‌టీడీవీ), మానవరహిత స్క్రామ్‌జెట్ డెమో ఎయిర్‌క్రాఫ్ట్, హైస్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ (హీట్), లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్, పృథ్వీ-2 బాలిస్టిక్ న్యూక్లియర్ మిసైల్, బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్, న్యూక్లియర్ కేపబిలిటీ హైపర్‌సోనిక్ గాలంటరీ మిసైల్, ద సూపర్‌సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీస్ ఆఫ్ టార్పిడో(ఎస్‌ఎంఏఆర్‌టీ) వ్యవస్థ, భారత తొలి స్వదేశీ యాంటీ రేడియేషన్ మిసైల్, స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిసైల్ (ఎస్‌ఏఎన్‌టీ) తదితర క్షిపణుల పరీక్షలను భారత్ నిర్వహించింది.
స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ వ్యవస్థను నవంబరు 4న భారత్ పరీక్షించింది. ఇది 45 నుంచి 60 కి.మీ. దూరంలోని లక్షాలపై గురిపెట్టగలదు. ముఖ్యంగా చైనా సైన్యం, ఆయుధ సంపత్తే లక్ష్యంగా ఈ క్షిపణిని తయారుచేసినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఐదు దేశాలతో..
‘‘5 ఐ’’ నిఘా కూటమిలో భారత్ చేరుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లను ‘‘5 ఐ’’ దేశాలుగా పేర్కొంటారు.
‘‘అమెరికా నేతృత్వంలో చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటైన నిఘా కూటమిలో భారత్ కూడా చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి’’అని భద్రతా వ్యవహారాల నిపుణుడు, ఈటీవీ ఇండియా నెట్‌వర్క్‌కు చెందిన సంజీవ్ కుమార్ బారువా పేర్కొన్నారు.
వాట్సాప్, టెలిగ్రాం తదితర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు సంబంధించి సమాచారాన్ని పంచుకోవడంపై అక్టోబరు 11న 5ఐ దేశాలతో కలిసి జపాన్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేసింది. సండే గార్డియన్ పత్రికలో దీనిపై ఒక వార్త కూడా ప్రచురితమైంది. ‘‘భారత్‌తో సమాచారం పంచుకునేందుకు కూటమి అంగీకరించింది. భారత్ కూడా ఇప్పుడు దీనిలో భాగమే’’అని వార్తలో పేర్కొన్నారు.
మరోవైపు ప్రముఖ ఆస్ట్రేలియా పత్రిక ‘‘ద ఆస్ట్రేలియన్’’ కూడా ఒక వార్త ప్రచురించింది. అక్టోబరులో జరిగిన 5 ఐ మీటింగ్‌లో భారత్, జపాన్ కూడా పాలుపంచుకున్నట్లు తెలిపింది. ఈ కూటమిలోకి భారత్‌ను తీసుకువచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని వివరించింది.

ఫొటో సోర్స్, NICOLAS DATICHE
పెరిగిన క్వాడ్ కార్యకలాపాలు
చైనాతో ఘర్షణల నడుమ అక్టోబరు 5న టోక్యోలో జరిగిన ద క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్)లో భారత్ పాలుపంచుకుంది. మరోవైపు అక్టోబరు 19న మలబార్ నావికా దళ విన్యాసాల్లో ఆస్ట్రేలియా కూడా పాలుపంచుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది.
చైనా దూకుడును దృష్టిలో ఉంచుకునే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని చాలా మంది భద్రతా నిపుణులు భావిస్తున్నారు.
భారత్ చర్యలను చైనాకు గట్టి జవాబుగా సైనిక నిపుణుడు అజయ్ శుక్లా వ్యాఖ్యానించారు. ‘‘చైనాకు బుద్ధి చెప్పేందుకే.. మలబార్ విన్యాసాల్లో ఆస్ట్రేలియాకు భారత్ చోటు కల్పించింది’’అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
13ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా దీనిలో పాలుపంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు టోక్యోలో జరిగిన క్వాడ్ సమావేశం అనంతరం అమెరికా స్థాయిలో భారత్ స్పందించకపోవడంపై వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలాణీ విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘చైనాను అమెరికా నేరుగా విమర్శించింది. చైనా దూకుడుకు బాధితులుగా మారినప్పటికీ భారత్ సరిగా స్పందించలేదు’’అని ఆయన ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, AFP
చైనా వ్యూహాలు
భారీ స్థాయిలో చైనా ఆయుధ సంపత్తిని కొనుగోలు చేస్తున్నట్లు ఎలాంటి వార్తలూ కనిపించడం లేదు. అయితే ఇటీవల కాలంలో సరిహద్దుల్లో చైనా ప్రభుత్వం తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యల గురించి మాత్రం వార్తలు వస్తున్నాయి.
సరిహద్దుల్లోని శీతల ప్రాంతాల్లో ప్రజల జీవన విధానాలు మెరుగు పరిచేందుకు హైటెక్ విధానాలను చైనా సైన్యం అనుసరిస్తోందని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి హువా చన్యింగ్ వ్యాఖ్యానించారు. భారత్-చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో ప్రాంతాలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆటోమేటిక్ ఎనర్జీ జెనరేటింగ్ క్యాబిన్స్, న్యూ స్లీపింగ్ బ్యాగ్స్, ఆహారాన్ని ఎప్పటికప్పుడు అందించే డ్రోన్లు తదితర సాంకేతికతలను సిద్ధంచేసినట్లు చన్యింగ్ వివరించారు.
భారత సరిహద్దుల వెంబడి నిఘా సమాచారాన్ని చైనా సమీకరిస్తోందని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. సాయుధ వాహనాలు, ప్రత్యేక బలగాలను సరిహద్దుల్లో మోహరించినట్లు తెలిపింది.
గత మే నెలలో లద్దాఖ్ సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య విధ్వంసకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో 20 మంది భారత సైనికులు మరణించారు. ఎంత మంది చైనా సైనికులు మరణించారో ఎలాంటి సమాచారమూ అందుబాటులోలేదు. పలు దఫాలుగా రెండు వైపుల నుంచీ చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా పరిస్థితులు కుదుటపడలేదు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








