తుపాన్లకు పేరెందుకు పెడతారు, మిగ్‌‌జాం పేరును ఎవరు సూచించారు?

తుపాను

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అపర్ణా రామమూర్తి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు మిగ్‌జాం తుపాను అని పేరు పెట్టారు. ఈ తుపాన్ ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ తుపాను నేడు(డిసెంబర్ 5) నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం దాటే సమయంలో తీవ్ర తుపానుగా మారనుందని, తీరం దాటాక బలహీనపడుతందని తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 90-110 మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

అయితే, మిగ్‌జాం తుపాను అని పేరెందుకు పెట్టారు? ఇలా తుపానులకు పేర్లు ఎవరు నిర్ణయిస్తారు?

నివర్ తుపాను

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుపాన్లకు పేర్లు పెట్టాలన్న నిర్ణయాన్ని 2000 సంవత్సరంలో తీసుకున్నారు

తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?

ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తెలిపిన వివరాల ప్రకారం ఈ మిగ్‌జాం తుపానుకు పేరును సూచించింది మియన్మార్. దీనికి మిచౌంగ్ తుపాను అన్న పేరును సూచించి, దీనిని మిగ్‌జాం అని పిలవాలని తెలిపింది.

బంగాళాఖాతంలో నవంబర్ 2020లో ఏర్పడిన తుపాను నివర్‌. అదే ఏడాది మే నెలలో ఆంఫన్‌ తుపాను దక్షిణాదిలో బీభత్సం సృష్టించింది.

ఇరాన్‌ సూచన మేరకు అప్పట్లో తుపాను పేరును 'నివర్‌'గా నిర్ణయించారు. 2020లో ఉత్తర హిందూ మహా సముద్ర ప్రాంతంలో తుపాన్లకు పెట్టే పేర్ల జాబితాలో నివర్‌ మూడోది. ఈ మాటను నివారణ అనే అర్థంలో వాడతారు.

దీనికి భారతదేశం సూచన మేరకు ‘గతి’ అని పేరు పెట్టారు. గతి అంటే కదలిక లేదా వేగం అని అర్థం. తాజా తుపాను పేరు మియాన్మార్ సూచించింది.

13 సభ్యదేశాలకు చెందిన సభ్యుల ప్యానెల్ తుపాను పేర్ల జాబితాను సిద్ధం చేస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 13 సభ్యదేశాలకు చెందిన సభ్యుల ప్యానెల్ తుపాను పేర్ల జాబితాను సిద్ధం చేస్తుంది

పేర్లు పెట్టడం ఎప్పటి నుంచి...

తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, ఇంకా వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా ప్రారంభించాయి.

ఈ గ్రూపులో ఇండియా, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, మయన్మార్‌, ఒమన్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలున్నాయి. ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో పుట్టే తుపాన్లకు ఈ పేర్లు పెడతారు.

2018లో ఇరాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్‌ దేశాలు కూడా ఈ గ్రూపులో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్‌ తుపాన్ల పేర్లను నిర్ణయిస్తుంది.

ప్యానెల్‌ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. ఈ దేశాల జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్‌ది కాగా, భారత్‌ పేరు రెండో పేరు. ఆ తర్వాత ఇరాన్‌, మాల్దీవులు, ఒమన్‌, పాకిస్తాన్‌, ఖతార్‌ ఇలా కొనసాగుతాయి.

నివర్‌ తర్వాత వచ్చే తుపాన్లకు మాల్దీవుల నుంచి బురేవీ, మయన్మార్‌ నుంచి టౌక్టాయి, ఒమన్‌ నుంచి యాస్‌, పాకిస్తాన్‌ నుంచి గులాబ్‌ అనే పేర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ తాజా పేర్ల జాబితాకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమోద ముద్ర వేశారు.

మిగ్‌జాం తుపాను

ఫొటో సోర్స్, Getty Images

తుపాన్లకు పేర్లు ఎందుకు?

ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు (రీజనల్‌ స్పెషలైజ్‌డ్‌ మెట్రలాజికల్‌ సెంటర్స్‌-ఆర్‌ఎస్‌ఎంసీ) ఉన్నాయి. అలాగే ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుపాను హెచ్చరికల కేంద్రాలు (ట్రాపికల్‌ సైక్లోన్‌ వార్నింగ్‌ సెంటర్స్‌ -టీసీడబ్ల్యూసీ) ఏర్పాటు చేశారు.

తుపాన్ల గురించి హెచ్చరికలు, సూచనలు జారీ చేయడం, వాటికి పేర్లు పెట్టడం ఈ కేంద్రాల విధి. ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాలలో ఇండియన్‌ మెట్రలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ ఒకటి. ఈ కేంద్రాలు 13 సభ్యదేశాలకు తుపానులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి.

తుపానులకు పేర్లుపెట్టడం వల్ల అధికారులు, సైంటిస్టులు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతోపాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.

  • తుపానును గుర్తుపెట్టుకోవడం సులభమవుతుంది.
  • తుపాను కదలికల మీద హెచ్చరికలు చేయడానికి సులువుగా ఉంటుంది.
  • ఒకేసారి రెండు, మూడు తుపానులు వచ్చినప్పుడు వాటిని గుర్తించడానికి వీలవుతుంది
  • పేర్ల వల్ల ఏ తుపాను ఎప్పుడు వచ్చిందన్నది గుర్తుపెట్టుకోవడం సులభం
  • ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి అనువుగా ఉంటుంది.
nivar cyclone chennai tamilnadu

ఫొటో సోర్స్, Getty Images

వివిధ తీరప్రాంతాలలో పుట్టే తుపాన్లకు పేర్లు పెట్టే బాధ్యతను కొన్ని ప్రాంతీయ కేంద్రాలకు అప్పజెప్పారు.ఉ దాహరణకు ఉత్తర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో పుట్టే తుపాన్లకు భారతదేశం పేర్లు పెడుతుంది.

వరల్డ్‌ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్‌, ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఏషియా పసిఫిక్‌ సంస్థలు 2000 సంవత్సరంలో మస్కట్‌లో జరిపిన సమావేశంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతాలలో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించాయి. సుదీర్ఘ చర్చ తర్వాత 2004లో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు.

అప్పటికి ఈ గ్రూపులో ఉన్న ఎనిమిది దేశాలైన బంగ్లాదేశ్‌, ఇండియా, మయన్మార్‌, ఒమన్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌ రూపొందించిన పేర్లను ఇప్పటి వరకు పెడుతూ వచ్చారు.

ఇటీవల వచ్చిన ఆంఫన్‌ తుపాను మినహా, ఇంత వరకు పెట్టిన పేర్లన్నీ 2004లో ఆమోదించినవే.

2018లో జరిగిన సభ్యదేశాల 45వ సమావేశంలో కొత్త జాబితాను తయారు చేయాలని నిర్ణయించారు. పేర్లను సూచించే దేశాల జాబితాలో ఈ గ్రూపులో కొత్తగా చేరిన ఇరాన్‌, ఖతార్‌, సౌదీఅరేబియా, యూఏఈ, యెమెన్‌లను కూడా చేర్చారు.

భారత్‌కు చెందిన వాతావరణ నిపుణుడు డాక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రను సభ్యదేశాల మధ్య సమన్వయకర్తగా ఈ సమావేశంలోనే నిర్ణయించారు.

తుపాను

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

పేర్ల నిర్ణయానికి ప్రమాణం ఏంటి?

ఆయన ఆధ్వర్యంలో తయారైన జాబితాను మయన్మార్‌లో జరిగిన 46వ ప్రపంచ వాతావరణ సంస్థ, ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏషియా అండ్‌ పసిఫిక్‌ సమావేశంలో ప్రవేశపెట్టగా, సుదీర్ఘ చర్చల అనంతరం 2020 ఏప్రిల్‌లో ఈ పేర్ల జాబితాను ఆమోదించారు.

పేర్ల ప్రతిపాదనకు సభ్యదేశాలు పాటించాల్సిన నిబంధనలు

  • ఈ పేర్లు రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి.
  • సభ్యదేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి
  • ఆ పేర్లలో క్రూరత్వం కనిపించకూడదు
  • పలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉండాలి.
  • ఈ పేరు ఇంగ్లీషులో ఎనిమిది అక్షరాలకంటే ఎక్కువ ఉండరాదు.
  • పేరు ప్రతిపాదించడంతోపాటు దాని స్పెల్లింగ్‌, ఉచ్ఛారణను ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్య దేశాలదే.
  • సభ్యదేశాలు సూచించిన పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్‌కు అధికారం ఉంటుంది.
  • ఒకసారి ప్రకటించిన పేర్ల జాబితాలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు
  • ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుపానులకు సూచించే పేర్లు ఒకసారి వాడిర తర్వాత మరోసారి వాడటానికి వీలులేదు. పేర్లు ఎప్పటికప్పుడు కొత్తగా, మరే ఇతర రీజినల్‌ సెంటర్‌ ఉపయోగించనిదిగా ఉండాలి.

2004లో సభ్యదేశాలు ఆమోదించిన పేర్ల జాబితాకు చివరిసారిగా వచ్చిన ఆంఫన్‌ తుపాను తర్వాత కాలం చెల్లింది.

అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలలో ప్రతియేటా ఐదు వరకు తుపానులు పుడుతుంటాయని, అయితే ప్రస్తుతం తయారు చేసిన జాబితా 25 సంవత్సరాలు వరకు పని చేస్తుందని సభ్యదేశాల సమన్వయకర్త మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు.

కొత్తగా రూపొందిన జాబితాలో ప్రతి దేశం 13 పేర్లను సూచించింది. అర్నబ్‌, షహీన్‌, బహార్‌, లులు, పింకూలాంటి పేర్లు ఇందులో కొన్ని. భారత్‌ గతి, తేజ్‌, మురసు, ఆగ్‌, నీర్‌, ప్రభంజన్‌, ఘుర్ని, అంబద్‌, జలధి, వేగలాంటి పేర్లను సూచించింది.

మిగ్‌జాం తుపాను

ఫొటో సోర్స్, IMD DELHI

సామాన్యులు కూడా పేర్లు సూచించవచ్చు

భారత్‌ ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో తుపాన్ల పేర్లను సూచించడానికి సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించారు. అయితే ఈ పేర్లను సూచించేవారు అందరికీ సులభంగా అర్థమయ్యే పేర్లను ఇవ్వాల్సి ఉంటుంది.

ఎలాంటి వివాదాలకు చోటివ్వని, ఎవరి మనోభావాలు గాయపడని విధంగా జాగ్రత్త వహించాలి. ఆసక్తి ఉన్నవారు ది డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెట్రాలజీ, భారత వాతావరణ శాఖ, లోధీ రోడ్‌, న్యూదిల్లీ చిరునామాకు లేఖ రాసి సూచించవచ్చు.

తుపానులకు పేర్లు పెట్టడం వల్ల సహాయకార్యక్రమాల నుంచి నష్టం అంచనాల అనేక ఉపయోగాలు ఉన్నాయి
ఫొటో క్యాప్షన్, తుపాన్లకు పేర్లు పెట్టడం వల్ల సహాయకార్యక్రమాల నుంచి నష్టం అంచనాల అనేక ఉపయోగాలు ఉన్నాయి

తుపాన్లను ప్రాంతాలవారీగా ఎలా పిలుస్తారు?

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో పుట్టే అలజడులను సైక్లోన్‌ అంటారు. ఉత్తర అట్లాంటిక్‌, మధ్య ఉత్తర పసిఫిక్‌, తూర్పు ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రాలలో పుట్టే తుపాన్లను హరికేన్‌లుగా పిలుస్తారు. వాయవ్య పసిఫిక్‌ మహాసముద్రంలో పుట్టే తుపానులను టైఫూన్లుగా వ్యవహరిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)