కరోనావైరస్: కోవిడ్ సోకిన మొదటి అయిదు రోజుల్లోనే వైరస్ వ్యాప్తి అవకాశం ఎక్కువ

కోవిడ్ సోకిన మొదటి అయిదు రోజుల్లోనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్మిత ముందసాద్
    • హోదా, బీబీసీ హెల్త్

కోవిడ్ వైరస్ సోకి లక్షణాలు కనిపించిన మొదటి ఐదు రోజుల్లోనే ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని , ఒక అధ్యయనం చెబుతోంది.

వైరస్ సోకిన వారిలో లక్షణాలు కనిపించినప్పటి నుంచీ తొమ్మిది రోజుల వరకు వైరస్ సజీవంగా ఉండి వైరస్ పునరావృతమయ్యే అవకాశం ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే వైరస్ సోకిన వెంటనే ఐసోలేషన్ అవ్వడం మంచిదని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ అధ్యయనం లాన్సెట్ మైక్రోబ్‌లో ప్రచురితమయింది.

ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయి

వైరస్ తీవ్రత వారిలో పునరావృతమయ్యే వైరస్ శాతం, శరీరంలో నిక్షిప్తమై ఉన్న వైరస్ అనే అంశాల మీద ఆధార పడి ఉంటుంది.

కొంత మంది రోగుల్లో వైరస్ వారిలో లక్షణాలు కనిపించక ముందు నుంచి, వైరస్ సోకిన మొదటి వారంలోనూ తీవ్రంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

కోవిడ్ 19 సోకి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగుల పై జరిగిన 79 అంతర్జాతీయ అధ్యయనాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు.

వారి గొంతు నుంచి సేకరించిన శాంపిళ్ళ ఆధారంగా వైరస్ సోకిన తొలి 9 రోజుల వరకు పునరావృతమయ్యే వైరస్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఈ శాంపిళ్ళ ఆధారంగా వైరస్ సోకిన తొలి 5 రోజుల్లో వైరల్ అయ్యే ఆర్ఎన్ఏ (వైరస్ నుంచి వచ్చే జన్యు పదార్ధ భాగాలు) తీవ్ర స్థాయికి చేరుతున్నట్లు కనుగొన్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఇదిలా ఉండగా, వైరల్ అయ్యే ఆర్ఎన్ఏ భాగాలు కూడా రోగి ముక్కు, గొంతులో సగటున 17 రోజుల వరకు చలనం లేకుండా ఉంటున్నాయని కూడా గుర్తించారు.

అయితే, ఈ చలనం లేని ఆర్ఎన్ఏ భాగాలు శరీరంలో ఉన్నప్పటికీ తొమ్మిది రోజుల తర్వాత పునరావృతమయ్యే వైరస్ ఉండకపోవడంతో ఆ తర్వాత వైరస్ వ్యాప్తి చేసే అవకాశం తక్కువ అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వైరస్ సోకిన తొలినాళ్లలోనే ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయన ఫలితాలతో పాటు కాంటాక్ట్ ట్రేసింగ్ పై జరిగిన అధ్యయనాలు కూడా చెబుతున్నాయని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మ్యూగ్ సెవిక్ బీబీసీకి చెప్పారు.

"ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపించగానే, అవి తేలికపాటివి అయినా కూడా ఐసొలేట్ అవ్వడానికి తగిన సహకారం అందించాలి. కొంత మందికి ఫలితాలు వచ్చేటప్పటికి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే దశను కూడా దాటిపోతూ ఉండవచ్చు" అని ఆయన అన్నారు.

"వ్యాధి లక్షణాలు కనిపించగానే ఐసోలేట్ అవ్వడానికి ఉన్న సమస్యలేమిటో తెలుసుకుని వారు ఆ దిశలో చర్యలు తీసుకోవడానికి తగిన సహకారం అందించాలి" అని ఆమె చెప్పారు.

లక్షణాలు కనిపించక ముందే ఇన్ఫెక్షన్

అయితే ఈ అధ్యయనం లక్షణాలు లేకుండా వైరస్ సోకిన వారిపై పరిశీలనలు జరపలేదు. అయితే, లక్షణాలు బయటపడక ముందు నుంచే వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందని అధ్యయన కర్తలు హెచ్చరించారు.

తేలికపాటి కరోనావైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే కనీసం 10 రోజుల వరకు ఐసోలేషన్లోకి వెళ్లాలని యుకెలో అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)