జగన్‌పై కోర్టు ధిక్కరణ కేసు: ఒకప్పుడు జగన్ తరఫున వాదించాను.. ఇప్పుడాయన కేసు విచారించలేను: న్యాయమూర్తి

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను తాను విచారణ చేపట్టలేనని ఆ కేసు విచారణకు వచ్చిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ తెలిపారు.

ఒకప్పుడు న్యాయవాదిగా ఓ కేసులో జగన్మోహన్ రెడ్డి తరఫున తాను వాదించానని.. కాబట్టి, ఇప్పుడీ కేసును తాను విచారించడం సముచితం కాదని ఆయన తప్పుకొన్నారు.

సుప్రీంకోర్టులో సీజేఐ తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసి, దాన్ని మీడియాకు బయటపెట్టిన నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది.

సీజేఐ ఎస్ఏ బాబ్డేతో సంప్రదించిన తరువాత ఈ కేసును తగిన బెంచ్‌కు లిస్ట్ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించారు.

పిటిషన్‌లో ఏముంది

సుప్రీంకోర్టు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ యాదవ్, సునీల్ కుమార్ సింగ్‌లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

జగన్మోహన్ రెడ్డిపై మనీలాండరింగ్, అవినీతి కేసులు సహా వివిధ కేసులు విచారణలో ఉన్నాయని వారు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై జగన్మోహన్ రెడ్డి బహిరంగ ఆరోపణలు చేశారని.. ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని వారు తమ వ్యాజ్యంలో కోర్టును కోరారు.

ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థకు ఉన్న ఇమేజ్ పోగొట్టే ఉద్దేశంతో ఆయన తప్పుడు ఆరోపణలు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

వివాదం ఎక్కడ మొదలైంది?

ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ ఎన్.వి. రమణ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం మీడియా ముఖంగా ఆరోపణలు చేసింది. ఆయన వ్యవహార శైలిని సుప్రీంకోర్టుకు కూడా తీసుకెళ్లామని ఏపీ ప్రభుత్వం తరఫున మీడియా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం వెల్లడించారు.

"ఏపీ హైకోర్టు వ్యవహారాలలో జస్టిస్‌ ఎన్‌.వి. రమణ జోక్యం చేసుకుంటున్నారు. అదే విషయాన్ని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకుని వెళ్లాం. అలాగే ఇటీవల హైకోర్టులో జరిగిన పరిణామాలు ఆయన ముందు ఉంచాం. అమరావతి భూ కుంభకోణంగా చెబుతోన్న కేసులో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ విషయమూ, కేబినెట్ సబ్ కమిటీ, సిట్ దర్యాప్తులపై ఇచ్చిన స్టే ఆదేశాల గురించి కూడా సీజేఐ దృష్టికి తీసుకుని వెళ్లాం'' అని అక్టోబర్‌ 6న సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు అజేయకల్లం వెల్లడించారు.

లేఖతోపాటు జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆరోపణలతో కొన్ని పత్రాలను కూడా జత చేశామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆ లేఖతో ఉన్న ఒక అనుబంధ పత్రంలో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులపైనా ఆరోపణలున్నాయి. ఆ వివరాలు, లేఖలు, పత్రాలను అధికారికంగా మీడియాకు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

జస్టిస్ ఎన్‌వీ రమణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జస్టిస్ ఎన్‌వీ రమణ

లేఖలో ఇంకా ఏముంది?

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ బాబ్డేకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన 8 పేజీల లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. అందులో రాజ్యాంగం పరిధులు, న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సంబంధమూ, అమరావతి భూములపై సబ్ కమిటీ ఏర్పాటూ, జస్టిస్ ఎన్‌వీ రమణ గురించీ రాశారు. దాదాపు నాలుగు పేజీల్లో జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రస్తావన ఉంది. ఈ లేఖతో పాటూ 7 ఫైళ్లను జత చేశారు.

''చంద్రబాబు, జస్టిస్ రమణల మధ్య దగ్గరితనం అందరికీ తెలిసిందే. నేను ఎంతో బాధ్యతాయుతంగా ఈ మాట చెబుతున్నాను. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చలమేశ్వర్ ఈ విషయాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బాబు, జస్టిస్ రమణలు ఇచ్చిన అభిప్రాయాలను మీముందు ఉంచుతున్నాను.'' అని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు జగన్.

''తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు హైకోర్టు జడ్జీల డ్యూటీ రొటేషన్‌ను(జడ్జీల రోస్టర్) జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారు. హైకోర్టు సిట్టింగులను ప్రభావితం చేస్తున్నారు. ఇది స్పష్టంగా కొందరు జడ్జీలు, జస్టిస్ రమణ, తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధాన్ని తెలుపుతోంది'' అని లేఖలో జగన్ ఆరోపించారు.

అంతేకాదు, మీడియా కవర్ చేయవద్దని హైకోర్టు చెప్పిన ఎఫ్ఐఆర్ వివరాలను కూడా ఆ లేఖలో ఆయన ప్రస్తావించారు. ''ఈ అంశాలు పరిశీలించి, న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండడానికి మీరు తగిన చర్యలు తీసుకోవాలి'' అని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరారు జగన్.

అయితే, ఈ లేఖ ద్వారా ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడిందని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు చెందిన న్యాయవాదులు వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)