జీఆర్ గోపీనాథ్: ఆకాశంలోని విమానాలను నేలకు దించిన కెప్టెన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుధ జి. తిలక్
- హోదా, బీబీసీ కోసం
భారతదేశంలోని మొట్టమొదటి బడ్జెట్ విమానయాన సంస్థ వ్యవస్థాపకులు జీఆర్ గోపినాథ్ 2005 వేసవిలో ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. భారతీయులు ‘ఒక్క రూపాయి’కే విమానంలో ప్రయాణం చేసే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు.
ఆర్మీ నుంచీ పదవీ విరమణ పొందిన తరువాత వ్యాపారవేత్తగా మారిన గోపీనాథ్ 2003లో ఎయిర్ దక్కన్ పేరుతో ఒక విమానయాన సంస్థను స్థాపించి అత్యంత చౌక ధరలకే విమాన ప్రయాణాలు సాధ్యమయ్యేలా చేశారు.
ఐరోపా నుంచీ ఈజీజెట్, రైయనెయిర్ లాంటి బడ్జెట్ విమానాలను ప్రయాణికులకు అనుగుణంగా మలచి, లక్షలాది భారతీయులు అతి తక్కువ ధరలకే విమాన ప్రయాణాలు చెయ్యగలిగేలా ఎయిర్ దక్కన్ సంస్థను రూపుదిద్దారు. అప్పట్లో ఎయిర్ దక్కన్ టికెట్ ధర మిగతా ఎయిర్‌లైన్స్ టికెట్ ధరల్లో సగమే ఉండేది.
2005లో గోపీనాథ్ రెండు ధరల విధానాన్ని ప్రవేశపెట్టారు. ముందుగా టికెట్ బుక్ చేసుకునే కొద్దిమంది ప్రయాణికులకు టికెట్లను ‘ఒక్క రూపాయి’కే విక్రయించారు. మిగతావారికి సాధారణ ఎయిర్ దక్కన్ ధరలకే టికెట్లు విక్రయించారు. అవి కూడా మిగతా ఎయిర్‌లైన్స్ టికెట్ ధరలకన్నా చాలా తక్కువగానే ఉండేవి.
ఈ విధానం ప్రవేశపెట్టిన వెంటనే, ఊహించినట్లుగానే బుకింగ్ కౌంటర్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఒక్కసారైనా విమానంలో ప్రయాణం చెయ్యాలని ఆశపడేవారందరూ టికెట్ కౌంటర్ల ముందు బారులు తీరారు. అయితే, ఇలాంటి విధానాలు విమానయాన పరిశ్రమను దెబ్బతీస్తాయని విమర్శకులు గగ్గోలుపెట్టారు.

ఫొటో సోర్స్, Amazon Prime Video
"ఒక్క రూపాయి టికెట్ సంచలనం సృష్టించింది. అందరూ దాని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు" అని గోపీనాథ్ తన పుస్తకంలో రాసుకున్నారు. ఆయన తన స్వానుభవాలను పుస్తకల రూపంలో తీసుకొచ్చారు.
తన బడ్జెట్ ఎయిర్‌లైన్స్, ఆకాశంలో ఎగిరే విమాన ప్రయాణ ధరలను నేలకు దించడమే కాకుండా, కంటికి కనిపించని కులం, వర్గం గోడలను కూడా కూల్చివేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళంలో ‘సూరారై పోట్రు’ పేరుతో, తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయిన సినిమా గోపీనాథ్ విజయయాత్రకు అద్దం పట్టింది. ఈ సినిమాను సుధ కొంగర దర్శకత్వంలో ఆస్కార్ అకాడమీ అవార్డ్ గ్రహీత గునీత్ మోంగా తెరకెక్కించారు.
"ఇది ఒక అద్భుతమైన కథ. ఉన్నవారికి, లేనివారికి మధ్య అంతరాన్ని తగ్గించడానికి కెప్టన్ గోపీనాథ్ చేసిన గొప్ప ప్రయత్నం. చౌక ధరల్లో విమానయానం సాధ్యమని తెలిసినప్పుడు ఎంతోమంది భారతీయులు సంతోషపడ్డారు" అని మోంగా బీబీసీకి తెలిపారు.
"ఆర్థిక అంతరాలను, తరగతి అడ్డుగోడలను కూల్చి గోపీనాథ్ విమాన ప్రయాణాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారని" ఈ సినిమాలో గోపీనాథ్ పాత్ర పోషించిన తమిళ నటుడు సూర్య తెలిపారు.
‘ఆకాశం నీ హద్దు రా’ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకు కావలసిన అన్ని హంగులూ చొప్పించారు. పాటలు, డాన్సులు, మెలోడ్రామా, కులం, తరగతి వెలివేతలపై దృష్టి...ఇలా అన్నీ సమపాళ్లల్లో చేకూర్చి ఈ సినిమాను రూపొందించారు.

ఫొటో సోర్స్, Amazon prime video
ముఖ్యంగా, ఈ సినిమాలో..ప్రాంతీయంగా కనెక్టివిటీని విస్తరించడానికి దేశంలో వ్యర్థంగా పడి ఉన్న 500 విమానాశ్రయాలను, ఎయిర్‌స్ట్రిప్‌లను గోపినాథ్ ఎలా ఉపయోగించుకున్నారన్నది సమర్థవంతంగా తెరకెక్కించారు.
అంతే కాకుండా, గోపీనాథ్ కలలను సాకారం చేసుకోవడంలో ఆయన భార్య, ఆర్మీ స్నేహితుల తోడ్పాటును కూడా ఈ సినిమాలో చూపించారు. గోపీనాథ్ భార్య బేకరీ బిజినెస్ చేస్తూ ఆయనకు ఆర్థికంగా, నైతికంగా ఆద్యంతం వెన్నుదన్నుగా నిలిచారు.
"ఈ సినిమా అంతా గోపీనాథ్ దేనికోసం పోరాడారన్నదానిపై దృష్టి పెడుతుంది. ఆర్థిక, కులాల అంతరాలకు అతీతంగా అందరికీ సమాన ప్రవేశార్హత, హక్కులు ఉండాలన్నదే ఆయన ధ్యేయం. ఈ ప్రయాణంలో ఆయనకు అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ నిరాశ చెందకుండా తన లక్ష్య సాధన దిశగా కృషి చేసారు. గోపీనాథ్ కథ స్ఫూర్తిదాయకమైనది"అని సూర్య అభిప్రాయపడ్డారు.
ఈ సినిమాను అనేకమంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇది ‘కుల అంతరాలపై చేసిన బలమైన వ్యాఖ్య’ అనీ, ‘పదునైన బాణంలా గుచ్చుకుంటుందనీ’, ‘స్ఫూర్తిదాయకమైన కథ’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Amazon Prime Video
కేప్టన్ గోపీనాథ్ కర్నాటకలోని ఒక కుగ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక చిన్న బడిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, వ్యవసాయం కూడా చేసేవారు.
గోపీనాథ్ ఆర్మీలో చేరి, 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్నారు. అయితే, 28 ఏళ్ల వయసులోనే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. తరువాత స్నేహితులతో కలిసి పట్టుపరిశ్రమ, ఆతిధ్య రంగాలతో సహా వివిధ వ్యాపార రంగాలలో కాలు పెట్టారు.
"ఆ వయసులో నాకు దేనిలోనూ తృప్తి ఉండేది కాదు. ఇంకా ఏదో చెయ్యాలనే తపన ఉండేది. సంపదను అందరికీ అందుబాటులోకి తీసుకురావలనే పిచ్చితో తిరుగుతుండేవాడిని" అని గోపీనాథ్ బీబీసీకి తెలిపారు.
1997లో మొదటి ప్రైవేట్ చార్టర్ సంస్థగా ఒక హెలికాఫ్టర్ సర్వీస్‌ను గోపీనాథ్ ప్రారంభించారు. "మ్యాప్‌లో మీరే ప్రదేశాన్ని సూచిస్తే, అక్కడకు మిమ్మల్ని తీసుకెళతాం" అనే ట్యాగ్‌లైన్‌తో దీన్ని ప్రారంభించారు.
2000లో విహారయాత్రలకు యూఎస్ వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ఆయనకు తక్కువ ధరలకు విమాన ప్రయాణాలను ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP
ఫీనిక్స్‌లో స్థానిక విమానాశ్రయంలో ఒకరోజుకు 1000 విమానాలు వస్తూ పోతున్నాయని, 1,00,000 మంది ప్రయాణీకులు విమానాయానం చేస్తున్నారని గమనించారు. ఒక మారుమూల ప్రాంతలో ఉన్న విమానాశ్రయం, ఇండియాలో ఉన్న మొత్తం 40 విమానాశ్రయాల కంటే ఎక్కువ సంఖ్యలో విమానాలను నిర్వహిస్తున్నదన్న విషయం ఆయనకు నమ్మశక్యం కాలేదు.
యూఎస్‌లో రోజుకు 40,000 విమానాలను నడుపుతున్నారని, ఇండియాలో కేవలం 420 విమానాలు మాత్రమే నడుపుతున్నారని గోపీనాథ్ గ్రహించారు. ఆయన వెంటనే ఒక చిన్న లెక్క వేశారు. ఇండియాలో రైళ్లు, బస్సులో ప్రయాణం చేసే మూడు కోట్ల జనాభాలో ఒక 5 శాతం మంది విమానాల్లో ప్రయాణించినా, అమాంతంగా విమాన ప్రయాణీకుల సంఖ్య ఏడాదికి 53 కోట్లు పెరుగుతుందని లెక్క వేశారు.
"ఏడాదికి 53 కోట్ల జనాభా విమానాల్లో ప్రయాణించడం అనేది అతిశయోక్తిగా అనిపిస్తే...కనీసం 20 కోట్ల మధ్య తరగతి ప్రజలు ఏడాదికి రెండున్నరసార్లు విమానాల్లో ప్రయాణిస్తారనే లెక్క సమంజసమే కదా! రాబోయే 30 ఏళ్లల్లో ఈ అభివృద్ధిని ఆశించడం న్యాయమైన విషయమే" అని గోపీనాథ్ వివరించారు.
"సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణించగలగాలి అనే ఆలోచనతో యూఎస్ నుంచీ వెనక్కు తిరిగొచ్చాను" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
2003 ఆగస్ట్‌లో ఎయిర్ దక్కన్ సంస్థను స్థాపించి ఆరు విమానాలను ప్రారంభించారు. 48 సీట్లతో ఉన్న ఈ విమానాలు ట్విన్-ఇంజిన్ ఫిక్స్‌డ్-వింగ్ టర్బోప్రోప్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు. హుబ్లీ, బెంగళూర్ల మధ్య రోజుకు ఒక విమానం ప్రయాణించేలా ఏర్పాటు చేశారు.
2007 నాటికల్లా ఎయిర్ దక్కన్, రోజుకు 67 విమానాశ్రయాల నుంచీ 380 విమానాలను నడిపే సంస్థగా ఎదిగింది. వీటిల్లో చాలావరకూ చిన్న చిన్న పట్టణాల మధ్య నడిచేవే! విమానాల సంఖ్య 6 నుంచీ 45కు పెరిగింది. రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 2,000 నుంచీ 25,000కు పెరిగింది. 30 లక్షల మంది ఒక్క రూపాయి టికెట్‌తో ప్రయాణించారు.
కానీ, రాను రాను నష్టాలు కూడుతుండడంతో ఎయిర్ దక్కన్‌కు ఖర్చులు భరించడం కష్టమయ్యింది. 2007లో గోపీనాథ్ తన సంస్థను కింగ్‌ఫిషర్ వ్యవస్థాపకుడు విజయ మాల్యాకు అమ్మేశారు. విజయ మాల్యా ఎయిర్ దక్కన్ పేరు మార్చి ‘కింగ్‌ఫిషర్ రెడ్’గా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
అప్పటికి మరి కొన్ని లో-కాస్ట్ విమానాలు మార్కెట్లోకొచ్చాయి. 2018 నాటికి సుమారు 14 కోట్ల మంది భారతీయులు దేశీయంగా బడ్జెట్ విమానాల్లో ప్రయాణించారని గణాంకాలు చెబుతున్నాయి.
కానీ ఎయిర్ దక్కన్ విమానాలు ఆకాశంలో ఎగరడం ఆగిపోయింది. 2011లో మాల్యా కింగ్‌ఫిషర్ రెడ్‌ను కూడా మూసివేశారు. తరువాత ఆయన మొత్తం వ్యాపారం దివాళా తీసింది.
"విజయ్ మాల్యా ఆ ఎయిర్‌లైన్స్ మీద తగినంత సమయం వెచ్చించలేదు" అని 2012లో గోపీనాథ్ బీబీసీతో మాట్లాడినప్పుడు తెలిపారు.
"ఇది విచారకరం. కానీ ఎయిర్ దక్కన్ స్ఫూర్తి ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ విప్లవం (బడ్జెట్ ఎయిర్‌లైన్స్) కొనసాగుతుంది" అని కేప్టన్ గోపీనాథ్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన ఎలా ఉండబోతోంది... ఎన్ని కొత్త జిల్లాలు రాబోతున్నాయి?
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








