ఉద్దానం: ‘జ్వరం వస్తే అందరూ కరోనా అని భయపడుతున్నారు... మేం కిడ్నీ జబ్బేమో అని భయపడతాం’

ఉద్దానం, కిడ్నీ సమస్యలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉద్దానం అనగానే ఒకప్పుడు పచ్చని కొబ్బరి తోటలు, జీడి తోటలు, పనస పంటలు, ఆహ్లాదకరమైన వాతావరణం గుర్తుకు వచ్చేవి. కానీ, మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతం పేరు మూత్ర పిండాల వ్యాధికి పర్యాయ పదంగా వినిపిస్తోంది.

ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యల గురించి బీబీసీ ప్రతి ఏటా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రత్యేక కథనాలు అందిస్తోంది. వరుసగా మూడో ఏడాది కూడా అక్కడి పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా అన్నది తెలుసుకునేందుకు బీబీసీ ఆ ప్రాంతంలో పర్యటించింది.

ప్రస్తుతం ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలలను తెలుసుకునేందుకు ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న జెనెటిక్ రీసెర్చ్, కిడ్నీ వ్యాధి బాధితుల కోసం పలాసలో నిర్మితమవుతున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్... బాధితులకు కాస్త ఊరటను ఇస్తున్నాయి. మరోవైపు కోవిడ్ కారణంగా కిడ్నీ వ్యాధి నిర్థారణ పరీక్షలకు వెళ్లే పరిస్థితి లేకపోవడం, వ్యాధిగ్రస్థులు మందులకు సైతం డబ్బుల్లేక ఇబ్బందులు పడటం కనిపించింది.

కిడ్నీ మహమ్మారి మూడు దశాబ్దాలుగా ఉద్దానం వాసులను వేధిస్తోంది. శ్రీకాకుళం జిల్లా వైద్యశాఖ బీబీసీకి అందించిన గణాంకాల ప్రకారం గత పదేళ్లలో 5 వేల మంది ఈ వ్యాధితో మరణించగా... ఈ ప్రాంతంలో ఇంకా 35 వేల మంది కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు.

2018 అక్టోబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు 6,386 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2019లో 5,070 కేసులు నమోదయ్యాయి. గత మూడేళ్ల కాలంలో ఈ వ్యాధితో పలాస మండలంలోనే 300మందికి పైగా మృతిచెందారు.

వజ్రపుకొత్తూరు మండలంలో 240, మందసలో 100, సోంపేటలో 80, కవిటిలో 200, కంచిలిలో 50, ఇచ్ఛాపురం మండలంలో 120 మంది వరకూ మృతి చెందారు. పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, మందస, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో దాదాపు 33 శాతం మంది కిడ్నీ బాధితులున్నారని పరిశోధనల్లో తేలింది.

ఉద్దానం, కిడ్నీ సమస్యలు

‘సూది మందు రెండు వేలు... వేయించుకోకపోతే నరకం’

సాధారణంగా రక్తంలో సీరం క్రియాటినిన్ 1.2 mg/dL (మిల్లీ గ్రామ్/డెసీలీటర్ - వీటిని స్థానికులు పాయింట్లు అంటారు) కంటే ఎక్కువగా ఉంటే...మూత్రపిండాలు సరిగా పని చేయడం లేదని అర్థం.

అలాంటిది ఉద్దానం ప్రాంతంలో దాదాపు 15 వేల మందికి సీరం క్రియాటినిన్ 3 నుంచి 25 mg/dL ఉంది. క్రియాటినిన్ 6 దాటితే వారికి డయాలసిస్ తప్పనిసరి.

డయాలసిస్ దశకి చేరుకునే వరకు కూడా ఈ వ్యాధి తమకి ఉందని చాలా మందికి తెలియదు. తొలి సారి పరీక్ష చేయించుకున్నప్పుడే 25 పాయింట్లు వరకూ క్రియాటినిన్ ఉన్నట్లు ఫలితాలు వచ్చినవారు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు.

కుటుంబ పోషణ నిమిత్తం గతంలో గుజరాత్‌లో పని చేసిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గునిపల్లికి చెందిన కృష్ణారావుది ఇదే పరిస్థితి.

"నేను గుజరాత్‌లో పని చేసేవాడిని. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒంట్లో బాగోకపోతే విశాఖపట్నం వచ్చి పరీక్షలు చేయించుకున్నాను. కిడ్నీ వ్యాధి ఉందని...క్రియాటినిన్ 24 పాయింట్లు ఉందని చెప్పారు. దాంతో విశాఖలోనే 8 నెలలు చికిత్స తీసుకున్నాను. ఆ తర్వాత పలాస ఆసుపత్రికి రాయించుకుని వచ్చేశాను. ఇప్పుడు నా జీవితమంతా తలకిందులైపోయింది. బీపీ మిషను, మందులతోనే నా జీవితం గడిచిపోతోంది. చాలా కష్టంగా ఉంది" అని తన బాధని బీబీసీతో చెప్పారు.

కిడ్నీ వ్యాధి అంటే కిడ్నీలు వాటి సామర్థ్యం కంటే తక్కువగా పని చేయడమే. ఇందులో మూడు దశలుంటాయి. మొదటి దశలో కిడ్నీలు 35 నుంచి 50 శాతం పాడవుతాయి. తర్వాత 80 శాతం, మూడో దశలో 80 శాతం కంటే ఎక్కువ కిడ్నీలు పని చేయడం మానేస్తాయి. దాంతో వీరికి డయాలసిస్ అవసరమవుతుంది.

అయితే డయాలసిస్ కూడా అందరికి, అన్ని సార్లు వైద్యులు సూచించరు. డయాలసిస్ చేయించుకుంటున్న కొందరు వ్యాధిగ్రస్థులకి ఆకస్మాత్తుగా డయాలసిస్ వద్దని చెబుతారు వైద్యులు. అలాంటి వారికి ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లే దిక్కు. వజ్రపు కొత్తూరు మండలం మెట్టూరుకి చెందిన శాంతమ్మది ఇదే పరిస్థితి.

"కొన్ని రోజులైనా బతుకుదామని ఏడుసార్లు డయాలసిస్ చేయించుకున్నా...ఎనిమిదోసారి వెళ్తే ఒంటికి నీరు పట్టేసింది... డయాలసిస్ చేస్తే చనిపోతావన్నారు. బిళ్లలు, ఇంజెక్షన్లు ఇచ్చారు. ఒక్కో ఇంజెక్షన్ రెండు వేలు... నెలకి ఏడు పొడిపించుకోవాలి. డబ్బు పెట్టలేక ఇంజెక్షన్ మానేస్తే...ఒళ్లంతా బిగుసుకుపోయి...నరకం కనిపిస్తుంది. ఈ బతుకు ఇంకా ఎన్నాళ్లో? ఏంటో? ఏం చేయాలో కూడా తెలియడం లేదు" అని బీబీసీతో ఆమె చెప్పారు.

ఉద్దానంలోని ప్రతి గడపలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానే కిడ్నీ వ్యాధి బాధితులుంటారు. వీరిలో వృద్ధుల పరిస్థితి మరీ దారుణం.

"నా పిల్లలు వేరే ఊళ్లో పనులు చేసుకుంటూ నాకు డబ్బులు పంపిస్తుంటారు. మా ఇంటావిడకి ఒంట్లో బాగోదు. పెద్దదైపోయింది. నాకు కిడ్నీజబ్బు ఉంది. చెకప్, మందుల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లేవారే లేరు. దాంతో ఆసుపత్రికి వెళ్లడం మానేశాను" అని ఎం. గడూరుకి చెందిన 70 ఏళ్ల దానయ్య బీబీసీతో చెప్పారు.

"ఇప్పుడు ప్రపంచమంతా జ్వరమొచ్చినా, జలుబొచ్చినా కరోనా అని భయపడిపోతున్నారు. మేం ఎప్పటి నుంచో చిన్న జ్వరం వచ్చినా... కిడ్నీ జబ్బేనేమోని వణికిపోతుంటాం. అందుకే జ్వరం వస్తే ముందు కిడ్నీ పరీక్షలు చేయించుకుంటాం. గత 30 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఎందుకంటే కిడ్నీ జబ్బుకి జ్వరం, నీరసం, బీపీ వంటివే లక్షణాలు. కాస్త నీరసంగా అనిపించినా... మేమే కిడ్నీ పరీక్షలు చేయమని డాక్టర్లని అడుగుతాం. తప్పదు మాకు" అని గునిపల్లికి చెందిన లక్ష్మీనారాయణ చెప్పారు.

ఉద్దానం, కిడ్నీ సమస్యలు

జన్యుపరమైన సమస్యా అన్నది కనిపెట్టేందుకు పరిశోధనలు

రాష్ట్రంలో సుమారు 9 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 112 గ్రామాల్లో ఉన్నారు.

ఇప్పటివరకూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన పరిశోధన సంస్థలు, యూనివర్సిటీలు ఉద్దానం కిడ్నీ వ్యాధి మూలాలను కనుగొనేందుకు అనేక పరిశోధనలు చేశాయి. అయితే వ్యాధి కారణాలపై అంచనాలే తప్ప...పూర్తి స్థాయి నిర్థారణ జరగలేదు.

తాజాగా ఐసీఎంఆర్ ఆంధ్రా యూనివర్సిటి హ్యూమన్ జెనెటిక్ విభాగానికి ఉద్దానం మూత్ర పిండాల వ్యాధి కారణాలను పరిశోధించే ప్రాజెక్టుని అప్పగించింది. ఒకే కుటుంబంలోని వేర్వేరు వ్యక్తులపై ఈ పరిశోధనలు జరుపుతున్నారు. ఈ పరిశోధనలు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశోధకులు ధనుంజయ్, సద్గురి బీబీసీకి వివరించారు.

"ఒకే ఇంట్లో ఉన్నవారు ఒకే రకమైన ఆహారం తీసుకున్నా...కొందరే మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి కారణాలు అన్వేషిస్తున్నాం. వివిధ గ్రామాలకు వెళ్లి... ఒకే కుటుంబంలో ఉన్న వ్యాధి బాధితులు, వ్యాధి లేని వారి రక్త నమునాలు సేకరిస్తాం. వాటి నుంచి వారి డీఎన్ఏని వేరు చేసి...అందులోని ఆరు రకాలైన జన్యువుల్ని, వాటిలోని తేడాలను గుర్తిస్తాం. ఇలా ఒక వెయ్యి మందిపై పరిశోధనలు చేసి...జన్యువుల తేడా వలన కిడ్నీ వ్యాధి వస్తుందా అనే అంశాన్ని పరిశోధించి, నివేదిక ఇస్తాం" అని వారు చెప్పారు.

ఆకులు తింటే డయాలసిస్ అవసరం లేదా?

ఈ వ్యాధి మూలలను పట్టుకుని, అంతు తేల్చేందుకు ఒక వైపు పరిశోధనలు జరుగుతుంటే...మరో వైపు వ్యాధిగ్రస్థులు తమకి అందుబాటులో ఉన్న మొక్కల ఆకుల వల్ల వ్యాధి తగ్గుతుందని చెబుతున్నారు.

గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపించే అంబలమాడు అనే మొక్క మూత్రపిండాల వ్యాధిని తగ్గించేస్తుందంటూ నమ్ముకున్నారు. సంస్కృతంలో ఈ మొక్కని పునర్వనవ అని అంటారని...అంటే పునర్జన్మ అని అర్థమని చెబుతున్నారు.

"ఈ మొక్క మా ఊర్లో కిడ్నీ జబ్బు ఉన్నవాళ్లెందరో వాడుతున్నారు. ఈ మొక్క కూడా ఎక్కడపడితే అక్కడే దొరుకుతుంది. దీని ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని తాగితే నెల రోజుల్లోనే గుణం కనపడుతుంది. ఇది వాడిన వాళ్లో చాలా మందికి పాయింట్లు తగ్గి, డయాలసిస్ అవసరం లేకుండా పోయింది" అని గునిపల్లికి చెందిన చొక్కా రాజారావు బీబీసీతో చెప్పారు.

అయితే ఇదంతా వారి నమ్మకానికి సంబంధించిన విషయమని, ఆ మొక్క మూత్ర పిండాల వ్యాధిని తగ్గిస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని జిల్లా ఉప వైద్యశాఖాధికారి డాక్టర్ లీల బీబీసీతో చెప్పారు.

ఉద్దానం, కిడ్నీ సమస్యలు

‘తాగు నీరు కొనుక్కోవాల్సిందే’

ఉద్దానంలోని దాదాపు 805 నివాస ప్రాంతాల్లో ఐదున్నర లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. తాగునీటికి బోరు నీరే ఆధారం. కానీ ఆ నీటిలోని కొన్ని రకాలైన రసాయనాలు కిడ్నీ వ్యాధులకు కారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి.

అయినా తప్పని పరిస్థితుల్లో అదే నీరు తాగుతున్నారు. గత మూడేళ్ల నుంచి ప్రభుత్వం బాధిత గ్రామాల్లో మినరల్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తూ వస్తోంది. క్యాన్ రెండు రూపాయలు చొప్పున మినరల్ వాటర్‌ని ప్రజలు కొనుక్కుంటున్నారు.

"ఇరవై లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ రెండు రూపాయలు. ఏటీఎం కార్డుల్లాగే వాటర్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డు పట్టుకుని ట్యాంకు దగ్గరకు వెళ్లి స్వైప్ చేసి నీళ్లు తెచ్చుకుంటాం. చిన్న కుటుంబానికైతే నెలకి వంద రూపాయల వరకూ, పెద్ద కుటుంబానికైతే మూడు వందల వరకు ఈ మినరల్ వాటర్ కోసం ఖర్చు చేయాలి. ఈ ట్యాంకులు కాస్త దూరంగా ఉండటంతో బండి మీద వచ్చి తీసుకుని వెళ్తుంటాం. ఇది అదనపు ఖర్చు" అని ఎం. గడూరు గ్రామ మినరల్ వాటర్ ట్యాంకు వద్ద నీళ్లు పట్టడానికి వచ్చిన రమేష్ బీబీసీతో చెప్పారు.

ఉద్దానం, కిడ్నీ సమస్యలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 2017 సెప్టెంబర్‌లో ఉద్దానంలో పర్యటించి బాధితులను కలిశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక రోజు దీక్ష కూడా చేశారు.

జగన్ పాదయాత్ర సందర్భంగా తాను అధికారంలోకి వస్తే, ఆరు నెలల వ్యవధిలో ఉద్ధానం కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని, పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తానని, బాధితులకు పదివేల రూపాయల పెన్షన్ ఇస్తానని హామీలు ఇచ్చారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి పది వేల రూపాయల పెన్షన్ బాధితులకు అందుతోంది. కానీ, 50 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాలతో 200 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభమై ఏడాదైనా...ఇంకా పునాది పనులు మాత్రమే పూర్తయ్యాయి.

ఉద్దానం, కిడ్నీ సమస్యలు

‘700 కోట్లతో తాగునీరు’

ఆసుపత్రి నిర్మాణం కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమైందని, త్వరలోనే దీనిని పూర్తి చేస్తామని పలాస ఎమ్మేల్యే, రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు బీబీసీతో అన్నారు.

"ఉద్దానానికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీర మండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైను ద్వారా ఉద్దానంలోని బాధిత గ్రామాలకు నీటిని తరలించే ప్రాజెక్టును ప్రభుత్వం మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించింది. 700 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఉద్దానం ప్రాంతంలో ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. కిడ్నీ బాధితులందరికి 10 వేల రూపాయల పెన్షన్లు అందుతున్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి అందడం లేదు. వాటిని కూడా సరిదిద్ది పెన్షన్లు అందిస్తాం. ఉద్దానం కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు కూడా చాలా జరుగుతున్నాయి. త్వరలోనే ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంది" అని చెప్పారు.

‘ఆదుకున్నది మేమే’

వైసీపీ ప్రభుత్వం పది వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం మినహా, ఉద్దానం కిడ్నీ బాధితులకు చేసిందేమీ లేదని టీడీపీ ఆరోపిస్తోంది.

తమ హయాంలో ఉద్దానం బాధితులను అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేశామని ఇచ్ఛాపురం ఎమ్మేల్యే బెందాళం అశోక్ బీబీసీతో అన్నారు.

"డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, గ్రామాలకు మినరల్ వాటర్ సరఫరా, బాధితులకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం, రోగులకు ఉచితంగా మందులు అందించడం వంటి అనేక కార్యక్రమాలు చేశాం. వీటన్నింటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే, ప్రస్తుత ప్రభుత్వం పది వేల రూపాయల పెన్షన్ తప్పితే ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం చేసిందేమీ లేదు" అని అన్నారు.

ఉద్దానం, కిడ్నీ సమస్యలు

‘పరీక్షలకు వచ్చేవారి సంఖ్య తగ్గింది... కేసులు తగ్గలేదు’

మరోవైపు ఉద్దానంలో కేసుల సంఖ్య తగ్గుతోందన్న వాదనలో నిజం లేదంటున్నారు వైద్యులు. కోవిడ్ కారణంగా పరీక్షలకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని చెబుతున్నారు.

"ఉద్దానం ప్రాంతంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లలో రోజూ 582 మందికి డయాలసిస్ జరుగుతోంది. 2019లో 5,070 కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా ఇప్పుడు పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య తగ్గడంతో సరాసరి నెలకి 35 కేసులు నమోదవుతున్నాయి. అదే సాధారణ పరిస్థితుల్లో అయితే 60 నుంచి 70 మంది కొత్తగా వ్యాధి బారిన పడతుంటారు. పరీక్షలు చేయించుకునే వారిలో 5 శాతం మందికి ఈ వ్యాధి ఉంటుంది" అని జిల్లా ఉప వైద్యాశాఖధికారిణి డాక్టర్ లీలా బీబీసీతో చెప్పారు.

‘స్క్రీనింగ్ సెంటర్లు పెంచాలి’

ఆంధ్రప్రదేశ్‌లోని కిడ్నీ వ్యాధి బాధితుల్లో 70 శాతం మంది ఉద్దానం ప్రాంతానికి చెందిన వారే. గతంలో పోల్చితే ఇప్పుడు కిడ్నీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగిన మాట వాస్తవం.

ఉద్దానం కిడ్నీ వ్యాధి విషయమై ఒక పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పి మరిన్ని పరిశోధనలు చేయాలన్నారు సోంపేటకు చెందిన డాక్టర్ వై.కృష్ణమూర్తి. వై.కృష్ణమూర్తి చేసిన పరిశోధనలతోనే ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతంగా గుర్తింపు పొందింది.

"ప్రస్తుతం ఉన్న డయాలసిస్ సెంటర్లతో పాటు వ్యాధిని ముందుగా గుర్తించే స్క్రీనింగ్ కేంద్రాలను కూడా పెంచాలి. వాటితో చాలా ఉపయోగం ఉంటుంది. పరిశోధనలు కూడా నిరంతం జరగాలి. వ్యక్తిగత పరిశోధనలు కాకుండా వివిధ సంస్థలు కలిసి ఒకే గొడుగు కింద సామూహికంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది" అని డాక్టర్ కృష్ణమూర్తి బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)