పోలవరం ప్రాజెక్టు: ''మునిగిపోయే మండలాలే కదా అని మమ్మల్ని పట్టించుకోవడం లేదు''

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సందిగ్ధత కనిపిస్తోంది. ప్రధానంగా భూసేకరణ, పునరావాసం ప్యాకేజీకి సంబంధించిన ఖర్చుపై కేంద్రం కొర్రీలు వేస్తుందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ నేతల్లో వినిపిస్తోంది.
ఇటీవల పరిణామాలతో నవంబర్ 2వ తేదీన జరగబోతున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ భేటీపై ఆసక్తి రేగుతోంది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం అవసరమైన నిధులను కేంద్రం కేటాయించేందుకు అంగీకరిస్తుందా లేదా అనే ఉత్కంఠ కనిపిస్తోంది.
ఈ సమయంలో పోలవరం కారణంగా ముంపునకు గురికాబోతున్న మండలాల ప్రజల పరిస్థితిపై బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోకి ..
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో భాగంగా మారిన నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్న మెజార్టీ భాగం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగం అయ్యింది. భద్రాచలం డివిజన్ కేంద్రం మినహా ఆ మండలానికి చెందిన గ్రామాలతో సహా మరో ఆరు మండలాలు ఏపీకి బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మోదీ ప్రభుత్వం 2014 మే నెలలో జరిగిన తొలి క్యాబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2014 జులై 11న పార్లమెంటు కూడా ఆమోదించింది.
అదే సంవత్సరం సెప్టెంబర్ 2న ఈ మండలాలను ఆరు కొత్త మండలాలుగా అటు తూర్పు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేశారు. 2018 సెప్టెంబర్‌లో ఆయా మండలాలను తూర్పు గోదావరి పరిధిలోని చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్ పురం ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గంలో భాగం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అడ్డంకులు లేకుండా చేసేందుకే తెలంగాణ నుంచి ముంపు ప్రాంత మండలాలను ఏపీలో విలీనం చేస్తున్నట్టు అప్పట్లో కేంద్రంతోపాటు రెండు రాష్ట్రాలూ ప్రకటించాయి.

త్వరగా ఖాళీ చేసి పోతే బాగుండునని చూస్తున్నారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన అభివృద్ధికి భిన్నంగా గడిచిన ఆరేళ్ల కాలంలో పాలన సాగుతోందని వీఆర్‌పురం మండలం పోచవరం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. గోదావరి తీరంలో ఉన్న ఈ గ్రామం కాంటూర్ 3 కింద ఉంది. పోలవరం వద్ద 41.15 అడుగుల వద్ద నీటిమట్టం నమోదు కాగానే ఆ గ్రామం ముంపు బారిన పడుతుంది. అంటే పోలవరం ప్రాజెక్ట్ కనిష్ఠ నీటి నిల్వ సామర్థ్యానికే ఈ గ్రామం నీటిమయం అవుతుంది. అయితే, ముంపు బారిన పడే గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల అభివృద్ధిని ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన అంటున్నారు.
''రాష్ట్ర విభజనకు ముందు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎటువంటి కార్యక్రమాలు లేవు. చివరకు రోడ్లు కూడా అలానే వదిలేశారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో కూడా కొత్తగా విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపరిచిన దాఖలాలు లేవు. ఉన్న వాటిలో కూడా సిబ్బంది నియామకాలు లేకపోవడంతో కునారిల్లుపోతున్నాయి. అధికారులను అడిగితే ఎలానూ మునిగిపోయే గ్రామాలే కదా అనే వాదనలు కూడా విన్నాం. పోలవరం పేరుతో గ్రామాల ముంపు సంగతి ఏమో గానీ.. ప్రస్తుతం వసతుల లేమితో సతమతం అవుతున్నాం. చివరకు ఎంత త్వరగా ఖాళీ చేసి పోతామోనని అధికారులు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది''అంటూ ఆయన బీబీసీతో వ్యాఖ్యానించారు.

వరద సాయం కూడా అందలేదు..
గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇటీవల గోదావరి వరద తాకిడి ప్రభావితం చూపినా ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందలేదని విలీన మండలాల ప్రజలు వాపోతున్నారు. తక్షణ సహాయంగా ప్రకటించిన రూ.2 వేల సహాయం కూడా నేటికీ అందలేదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం చాట్రాయిగూడెం గ్రామానికి చెందిన నాగిరెడ్డి బీబీసీతో మాట్లాడారు.
''మేమంతా కొండరెడ్డి తెగ వాళ్లం. 1986 తర్వాత ఇప్పుడు వచ్చినవే పెద్ద వరదలు. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో కొండలెక్కి తలదాచుకున్నాం. 15 రోజుల పాటు కొండలపైనే గడిపాం. అధికారులు వచ్చి బియ్యం ఇచ్చారు. కొన్ని కూరగాయలు అందించారు. గతంలో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అధికారులు వచ్చి, కొన్ని సార్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఈసారి అలాంటి ప్రయత్నమే జరగలేదు'' అంటూ ఆయన వివరించారు.

అభివృద్ధిని విస్మరించలేదు..
చింతూరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ప్రాజెక్ట్ అధికారి ఆకుల రమణ బీబీసీకి తెలిపారు. మౌలిక వసతుల కల్పనను విస్మరించారనే వాదనను ఆయన కొట్టివేశారు.
''నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ సారించాం. ఇప్పటికే పునరావాసం అందుకున్న వారికి కూడా అదనంగా ప్రతిఫలం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎటపాక రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలవరం ప్రాజెక్ట్ 3వ కాంటూర్ కింద 21 గ్రామాలకు చెందిన 2,344 కుటుంబాలను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. వీఆర్ పురం మండలంలో 20, కూనవరం మండలంలో 1 గ్రామం మొదట ముపు బారిన పడతాయి దానికి తగ్గట్టుగా వచ్చే వరదల సీజన్ నాటికి నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఆరు పునరావాస కాలనీలు సిద్ధమవుతున్నాయి. గిరిజనుల భూమికి భూమి కోసం 1200 ఎకరాల భూమి కూడా సేకరించాము. 1,162 కుటుంబాలను తూర్పు గోదావరి నుంచి పశ్చిమ గోదావరి పరిధిలో నిర్మిస్తున్న పునరావాస కాలనీలకు తరలిస్తాం. అదే సమయంలో అభివృద్ధికి సంబంధించి నాడు నేడు పథకంలో విద్యాలయాలను అభివృద్ధి చేస్తున్నాం. ముంపు గ్రామాల పరిధిలో కూడా గ్రామ సచివాలయాలు నిర్మిస్తున్నాం. అభివృద్ధి విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం''అని ఆయన బీబీసీకి వివరించారు.
ఈసారి అంచనాలకు మించి వరదలు రావడం వల్ల సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడిందన్నారు. స్వల్ప వ్యవధిలో రెండుసార్లు వరద ఉద్ధృతంగా రావడం కూడా సమస్యకు కారణమయ్యిందని పీవో అంగీకరించారు.

ప్రాజెక్ట్ నిర్మించి, పునరావాసం విస్మరిస్తారా?
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయ్యాయి. కుడి, ఎడమ కాలువలతో పాటుగా స్పిల్ వే, స్పిల్ ఛానెల్ నిర్మాణాలు కొలిక్కి వస్తున్నాయి. ఇక కీలకమైన మెయిన్ డ్యామ్ నిర్మాణం కోసం రెండు కాఫర్ డ్యాములు కూడా నిర్మించారు. దాంతో నిర్మాణ పనులు మొత్తం 71.54 శాతం పూర్తయినట్టు కేంద్రం ప్రకటించింది.
అదే సమయంలో భూసేకరణ, పునరావాసం మాత్రం 20 శాతం లోపు మాత్రమే జరిగిందని కేంద్రమే అంగీకరించింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మీద పెడుతున్న శ్రద్ధ పునరావాసం, నిర్వాసితుల సమస్య విషయంలో చూపడం లేదనే వాదన బలపడుతోంది. అదే సమయంలో పోలవరం ముంపు ప్రాంతంలో అధికారుల మధ్య సమన్వయం కూడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భద్రాచలానికి చెందిన జర్నలిస్ట్ చెన్నం ప్రవీణ్ బీబీసీతో మాట్లాడారు. ''పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కాఫర్ డ్యామ్ వల్ల వరద ముప్పు సమస్య పెరిగింది. గతంలో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన తర్వాత ముంపు బారిన పడే గ్రామాలు కూడా ఈసారి 45 అడుగులకు చేరేసరికి జలమయమయ్యాయి. శబరి కూడా ఉద్ధృతంగా ప్రవహించడంతో వరద తాకిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ ప్రభుత్వ సహాయం నామమాత్రం. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే నిర్మాణం కూడా పూర్తయితే వరద తాకిడి మరింత పెరుగుతుంది. కానీ దాని ప్రభావం ఎంత ఉంటుందనే విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారుల లెక్కలకు పొంతన ఉండడం లేదు. తలో మాట చెబుతున్నారు. ఇది మరింత తల్లడిల్లిపోయేలా చేస్తోంది. ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. ప్రభుత్వం తొలుత 21 గ్రామాలకే ప్యాకేజీ అని చెబుతోంది. మిగిలిన వాళ్లను గోదావరి నీటిలో ముంచడమేనా అనే సందేహాలు వస్తున్నాయి. పైగా చుట్టూ నీటిలో నిండిన గ్రామాలకు మాత్రమే పునరావాసం చెల్లించేందుకు సిద్ధమని చెబుతుండడం ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఇటీవల వరదలను పరిగణలోకి తీసుకుని పునరావాసం విషయంలో ప్రభుత్వాలు అశ్రద్ధ వీడాలి''అని ఆయన వ్యాఖ్యానించారు.

పునరావాస కాలనీల పరిస్థితి ఎంతవరకూ వచ్చింది
తొలి విడత నిర్వాసితులను వచ్చే ఉగాది నాటికి గ్రామాల నుంచి తరలించాలని ప్రభుత్వం స్పంకల్పించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ రెండోవైపు పునరావాస కాలనీల నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతోంది. ఎటపాక మండలం కన్నాయిగూడెం వద్ద పునరావాస కాలనీ నిర్మాణం పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. నేటికీ పునాదుల దశలోనే కొన్ని నిర్మాణాలున్నాయి. పైగా నిర్మాణదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని కాంట్రాక్టర్ల ప్రతినిధి ఒకరు బీబీసీతో అన్నారు.
తమ ఊరు ఖాళీ చేయాలని చెబుతున్న అధికారులు పునరావాసం ఎందుకు పట్టించుకోవడం లేదని పోచవరం గ్రామానికి చెందిన శారద అనే మహిళ ప్రశ్నిస్తున్నారు. ''రెండేళ్లుగా వస్తున్న వరదల తాకిడిని గతంలో ఎప్పుడూ చూడలేదు. వరదలు రావడం, తగ్గిపోవడం తెలుసు గానీ, పోలవరం దగ్గర కట్టడాల కారణంగా వరద నీరు కిందకి వెళ్లడం లేదు. ఎక్కువ రోజుల పాటు మా ఇళ్లన్నీ నీళ్లలో నానుతున్నాయి. దాంతో ఒకనాడు పోలవరం వద్దని చెప్పిన మా వాళ్లే ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చేస్తే కాలనీలకు వెళ్లిపోవాలని అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ప్యాకేజీ సక్రమంగా ఇవ్వాలి. పునరావాస కాలనీల నిర్మాణం మీద దృష్టి పెట్టాలి''అని ఆమె కోరుతున్నారు.

నిర్వాసితులకు ఏమిచ్చారు..
పునరావాసం, భూసేకరణ విషయాలలో ప్రభుత్వం 2005 ఏప్రిల్ 8న జీవోఎంస్ 68 ని విడుదల చేసింది. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా పునరావాసం అమలు విషయంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సి ఉంది. నిర్వాసితుల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలతో కూడిన కమిటీ దానిని పర్యవేక్షించాలి. పైగా పోలవరం ముంపు మండలాలు పూర్తిగా షెడ్యూల్ ఏరియాలో ఉండడంతో పీసా చట్టం ప్రకారం వ్యవహరించాల్సి ఉంది.
భూసేకరణ చట్టం ప్రకారం.. ఎకరానికి రూ.10లక్షలుగా పరిహారం అందిస్తున్నారు. తొలి విడతలో భూములిచ్చిన వారికి అదనంగా రూ. 5లక్షల చొప్పున ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో విపక్ష నేత హోదాలో ప్రకటించారు. అయితే, అమలు విషయంలో ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు. అంతేగాకుండా ఎస్టీ రైతులకు భూమికి భూమి ఇవ్వాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా భూసేకరణ చేయాల్సి ఉంది. షెడ్యూల్ ఏరియా పరిధిలోనే భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికారులు చెబుతున్నారు.

గిరిజనేతర రైతులకు కూడా పునరావాస కాలనీలో 25 రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆయా కాలనీలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందనే విషయంలో సందిగ్ధత కనిపిస్తోంది. దీంతో పాటుగా ఇళ్లు, పంటలు, చెట్లు సహా అన్నింటికీ విలువ కట్టి ప్యాకేజీ అందించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన వారిని కుటుంబాలుగా పరిగణించి ప్యాకేజీ వర్తింప జేయాలి. కానీ ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చిన నాటికి ఉన్న 18 ఏళ్ల పైబడిన వారికే ప్యాకేజీ అమలు విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటామని చెబుతోంది.
ఓవైపు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదనే వాదన విలీన మండలాల వాసుల్లో వినిపిస్తుండగా, పునరావాసం విషయంలో చింతూరు ఐటీడీఏ పరిధిలో తొలుత కేవలం 21 గ్రామాలకే పరిమితం చేస్తున్నారు. ఒక కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో కూడా 28 గ్రామాలకు కాంటూరు 3 పరిధిలో పునరావాసం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన గ్రామాల ప్రజల పరిస్థితిపై అస్పష్టత కనిపిస్తోంది.
మొత్తంగా ఎప్పటికీ ప్యాకేజీ అమలు చేస్తారు, ఎందరికి అది దక్కుతుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అదే సమయంలో పునరావాసం, భూసేకరణకు అవసరమైన నిధుల కేటాయింపులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆమోదం లభిస్తేనే ఇది ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. లేదంటే ఏపీ ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారడం ఖాయం.

ప్రజలకు అండగా ఉంటాం.
భూసేకరణ, పునరావాసం కోసం అవసరమైన నిధులన్నీ కేంద్రం నుంచి తీసుకొచ్చి, బాధితులకు అండగా నిలుస్తామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ''వీలైనంత త్వరగా పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. ఇటీవల ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తోంది. పీపీఏ భేటీలో స్పష్టత వస్తుంది. నిధులు సాధిస్తాం. పునరావాసం విషయంలో ఏజన్సీ ప్రాంత వాసులు ఎవరికీ అన్యాయం జరగనివ్వం. అటు విలీన మండలాల విషయంలో కూడా శ్రద్ధ పెడుతున్నాం. దశల వారీగా పునరావాసం అందిస్తాం''అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








