ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా

అడవిలో రెండు ప్రాంతాలను కలుపుతున్న తాడుపై వేలాడుతున్న గిబ్బన్లు

ఫొటో సోర్స్, Kadoorie Farm and Botanic Garden

ఫొటో క్యాప్షన్, అడవిలో రెండు ప్రాంతాలను కలుపుతున్న తాడుపై వేలాడుతున్న గిబ్బన్లు
    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోతులు ఎత్తైన చెట్ల చివరకు చేరుకుని, అక్కడి నుంచి మరో చెట్టుపైకి దాటుకోవడం మనం సాధారణంగా చూస్తుంటాం.

కానీ కొండచరియల వల్ల అడవుల్లో ఒక పెద్ద ఖాళీ ఏర్పడినప్పుడు అవి ఆహారం కోసమో, తోడును వెతుక్కుంటూనో ఇటు వైపు నుంచి అటు వైపు వెళ్లడం చాలా కష్టం అవుతుంది.

అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒక గిబ్బన్ కోసం నిపుణులు ఇప్పుడు ఒక తాత్కాలిక పరిష్కారం కనుగొన్నారు. ఖాళీకి రెండు వైపులా ఉన్న చెట్లను అనుసంధానిస్తూ ఒక తాడు వంతెన ఏర్పాటుచేశారు.

ఇప్పుడు, ఆ అరుదైన గిబ్బన్లు దానికి వేలాడుతూ క్షణాల్లోనే ఇటు నుంచి అటు దాటుకుంటూ ఉండడాన్నిశాస్త్రవేత్తలు చిత్రీకరించారు.

బిగుతుగా కట్టిన తాడును కొన్ని గిబ్బన్లు చేతులతో పట్టుకుని వెళ్తుంటే, కొన్ని దానికి వేలాడుతూ వెళ్తున్నాయి. వాటిలో చాలా దైర్యం ఉన్న గిబ్బన్లు మాత్రం ఆ తాడుపై అలా నడిచి వెళ్లిపోతున్నాయి.

గిబ్బన్లు తమకు బాగా తెలిసినవాటితోనే కలిసి ఉంటాయి

ఫొటో సోర్స్, Kadoorie Farm and Botanic Garden

ఫొటో క్యాప్షన్, గిబ్బన్లు తమకు బాగా తెలిసినవాటితోనే కలిసి ఉంటాయి

హైనస్ దీవిలో అరుదైన గిబ్బన్లు

ఈ అరుదైన గిబ్బన్లు ఇప్పుడు చైనాలోని హైనన్ దీవిలోని అడవుల్లో మాత్రమే ఉన్నాయి.

ఒక చెట్టు చివర నుంచి ఇంకో చెట్టు చివరకు బలంగా దూకగలిగే ఈ అరుదైన కోతుల బృందంలో మొత్తం తొమ్మిది గిబ్బన్లు ఇప్పుడు ఈ తాడు వంతెనపై పట్టు సాధించాయి. వీటిలో వయసుకు వచ్చిన కొన్ని తోడు కోసం చాలా దూరం వెళ్తుంటాయి.

ఈ అడవులకు పూర్వవైభవం తీసుకువచ్చిన ఈ 18 మీటర్ల తాడు వంతెన ఇప్పుడు ఈ అరుదైన గిబ్బన్లకు జీవనాధారం అయ్యిందని పరిరక్షణ వేత్తలు అంటున్నారు.

ఒరంగుటాన్ సహా కొన్ని వానరాల కోసం ఇంతకు ముందు ఇలాంటి తాడు వంతెనను ఉపయోగించారు. కానీ హైనన్ గిబ్బన్లు తాడు వంతెనను ఉపయోగించడం ఇదే మొదటిసారి.

అంతరించిపోయే స్థితికి చేరుకున్న ఈ గిబ్బన్ల జాతిని హాంకాంగ్‌లోని కడూరీ ఫాం, బొటానిక్ గార్డెన్.. ఒక పరిరక్షణ కార్యక్రమం ద్వారా కాపాడుతున్నాయి.

రకరకాల పరిరక్షణ ప్రయత్నాలతోపాటూ ఈ తాడు వంతెన వీటి సంఖ్యను పెంచడానికి తమకు సహకరిస్తుందని డాక్టర్ బాస్కో చాన్ అంటున్నారు.

“2003లో మేం ఈ అభయారణ్యంలో పనులు ప్రారంభించినపుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 13 గిబ్బన్లు ఉన్న రెండు గ్రూపులే మిగిలినట్టు గుర్తించాం. ఇప్పుడు వాటి జనాభా గణనీయంగా పెరిగింది. 2011, 2015లో ఈ గిబ్బన్లు మరో రెండు కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నాయి” అని డాక్టర్ బాస్కో చాన్ బీబీసీకి చెప్పారు.

2020 ప్రారంభంలో గిబ్బన్ల ఐదో గ్రూప్ కూడా ఏర్పడుతున్నట్టు మేం ధ్రువీకరించాం. ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య ఇప్పుడు 30కి పెరిగింది. ఈ జాతి మెల్లగా పెరుగుతోందనే ఆశిద్దాం అన్నారు.

మగ గిబ్బన్

ఫొటో సోర్స్, Kadoorie Farm and Botanic Garden

పరిరక్షణ కోసం ప్రయత్నాలు

ఈ జాతి గిబ్బన్లు అంతరించిపోకుండా అడవులను పునరుద్ధరించడానికి కూడా ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు.

“మేం వీటిని వేటాడకుండా అదుపు చేయాలి. గిబ్బన్లు నివసించడానికి తగినట్లు ఉండే లోతట్టు అటవీ ప్రాంతాలను విస్తరించాలి. వాటి గ్రూపులకు ఎలాంటి ముప్పూ రాకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి” అన్నారు.

ఒకప్పుడు చైనా అంతటా కనిపించిన ఈ కోతులు, ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో ఉన్న హైనస్ దీవిలోని అడవులకే పరిమితం అయ్యాయి.

“ఇప్పుడవి, నేలకు ఎత్తుగా ఒక చెట్టు మీద నుచి ఇంకో చెట్టుకు దాటుకుంటూ అడవిలో ఖాళీ ఉన్న ప్రాంతంలో ఈ తాడు వంతెనను ఉపయోగిస్తూ వెళ్తుంటాయి. వీటిని ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే, ఆహారం వెతుక్కోడానికి, సంతానోత్పత్తికి వాటికి ఆటంకం కలుగుతుంది. వాటిని వేటాడే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది” అంటారు చాంగ్.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 గిబ్బన్ జాతులు ఉన్నాయి. అడవులు ధ్వంసం చేయడం, వేట, అక్రమ రవాణా వల్ల వీటిలో చాలా జాతులకు ముప్పు ఎదురవుతోంది.

చైనాలోని రెండు గిబ్బన్ జాతులు ఇటీవల అంతరించిపోయాయని, హైనన్ గిబ్బన్ సహా దేశంలో మిగిలిన చైనా జాతుల వానరాలన్నీ తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ గుర్తించింది.

ఈ అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)