కరోనావైరస్: కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లపై '28 రోజుల వరకూ బతుకుతుంది'

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనావైరస్.. కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లు, స్టెయిన్‌లెస్ స్టీలు వంటి వాటి ఉపరితలాలపై 28 రోజుల వరకూ బతుకుతుందని, అలా ఇతరులకు సోకే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు.

ఈ సార్స్ కోవ్-2 అనుకున్న దానికన్నా ఎక్కువ కాలమే బతకగలదని ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ సైన్స్ ఏజెన్సీ నిర్వహించిన అధ్యయనం సూచిస్తోంది.

అయితే.. ఈ ప్రయోగాన్ని చీకట్లో నిర్వహించారు. ఈ వైరస్‌ను అల్ట్రావయొలెట్ లైట్ సంహరిస్తుందని ఇప్పటికే అధ్యయనాల్లో తేలింది.

కొందరు నిపుణులు ఇప్పటికే వాస్తవ ప్రపంచంలో ఉపరితల కాలుష్యం ద్వారా ఈ వైరస్ సోకే అవకాశం మీద సందేహాలు వ్యక్తంచేశారు.

కరోనావైరస్ ప్రధానంగా.. ఇది సోకిన వారు దగ్గినపుడు, తుమ్మినపుడు, మాట్లాడినపుడు ఇతరులకు సోకుతోంది.

అయితే.. గాలిలో తేలుతున్న వైరస్ కణాల ద్వారా కూడా ఇది వ్యాపిస్తోందనటానికి ఆధారాలున్నాయి. ఈ వైరస్‌తో కలుషితమైన లోహం లేదా ప్లాస్టిక్ వంటి ఉపరితలాలను తాకటం ద్వారా కూడా ఇది వ్యాపించే అవకాశముందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్తోంది. కానీ ఇలా సోకే అవకాశం తక్కువని భావిస్తున్నారు.

టచ్‌స్క్రీన్

ఫొటో సోర్స్, Getty Images

తాజా అధ్యయనం ఏం చెప్తోంది?

ఇంతకుముందు నిర్వహించిన వివిధ అధ్యయనాల ఫలిలాల్లో తేడాలు ఉన్నప్పటికీ.. సార్స్-కోవ్-2 కరెన్సీ నోట్లు, గాజు వంటి ఉపరితలాల మీద రెండు నుంచి మూడు రోజుల పాటు బతుకుతుందని, ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి ఉపరితలాల మీద ఆరు రోజుల వరకూ బతుకుతుందని అవి చెప్తున్నాయి.

ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధన సంస్థ సైరో తాజా అధ్యయనంలో.. ఈ వైరస్ చాలా బలంగా ఉందని, మొబైల్ ఫోన్ స్క్రీన్లు, ప్లాస్టిక్, కరెన్సీ నోట్లు వంటి వాటి మీద కనిపించే గాజు తరహా ఉపరితలాల మీద.. 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో, చీకట్లో ఉంచినట్లయితే.. 28 రోజుల వరకూ బతకగలదని గుర్తించారు.

ఇదే వాతావరణ పరిస్థితుల్లో ఫ్లూ వైరస్ అయితే 17 రోజుల వరకూ బతుకుతుంది. అంటే దానికన్నా కొత్త కరోనావైరస్ చాలా బలమైనదని చెప్తున్నారు.

ఈ అధ్యయనం వివరాలను వైరాలజీ జర్నల్‌లో ప్రచురించారు. సార్స్-కోవ్-2 వైరస్ చల్లటి ఉష్ణోగ్రతల కన్నా వేడి ఉష్ణోగ్రతల్లో తక్కువ కాలం బతుకుతుందని కూడా ఈ అధ్యయనంలో గుర్తించారు. కొన్ని ఉపరితలాల మీద 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఈ వైరస్ 24 గంటల్లోనే నిర్వీర్యంగా మారిందని వెల్లడించారు.

ఎగుడుదిగుళ్లు లేని చదునైన ఉపరితలాల మీద ఈ వైరస్ ఎక్కువసేపు బతుకుతోందని.. 14 రోజుల వరకూ ఇతరులకు సోకగలదని కూడా ఈ అధ్యయనం చెప్తోంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఈ అధ్యయనంపై భిన్నాభిప్రాయాలు ఏమిటి?

అయితే.. కరోనావైరస్ 28 రోజుల వరకూ బతుకుతుందంటూ ''జనంలో అనవసర భయం'' కలిగిస్తున్నారని కార్డిఫ్ యూనివర్సిటీలో కామన్ కోల్డ్ సెంటర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాన్ ఎక్సెల్స్ ఈ అధ్యయనాన్ని విమర్శించారు.

''దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే చీమిడి పడినపుడు, వాటిని తాకిన వేళ్ల ద్వారా వైరస్‌లు ఏదైనా ఉపరితలాల మీద వ్యాపిస్తాయి. అయితే.. ఈ అధ్యయనంలో వైరస్ సోకే వాహకంగా తాజా మానవ చీమిడిని ఉపయోగించలేదు'' అని ఆయన పేర్కొన్నారు.

''తాజా మానవ చీమిడి వైరస్‌లకు ప్రతికూలమైన వాతావరణం. అందులో పెద్ద సంఖ్యలో తెల్ల రక్తకణాలు ఉంటాయి. అవి వైరస్‌లను నాశనం చేసే ఎంజైమ్‌లను ఉత్పత్తిచేస్తాయి. వైరస్‌లను నిర్వీర్యం చేసే యాంటీబాడీస్, ఇతర రసాయనాలు కూడా ఇందులో ఉండొచ్చు'' అని ఆయన వివరించారు.

''ఉపరితలాల మీద పడే చీమిడిల్లో వైరస్‌లు కొన్ని రోజులు కాదు.. కేవలం కొన్ని గంటలు మాత్రమే బతకగలవని నా అభిప్రాయం'' అని చెప్పారు ప్రొఫెసర్ ఎక్సెల్స్.

లాన్సెట్ జూలైలో ప్రచురించిన ఒక అధ్యయనంలో.. ''నిశ్చలమైన ఉపరితలాల నుంచి వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ'' అని రుట్జర్స్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ ఎమాన్యుయెల్ గోల్డ్‌మన్ పేర్కొన్నారు. ఇటువంటి ఉపరితలాల ద్వారా వైరస్ సోకే అవకాశం గణనీయంగా ఉందని చెప్తున్న అధ్యయనాలను.. వాస్తవ పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా ఉండే పరిస్థితుల్లో నిర్వహించారని ఆయన విశ్లేషించారు.

ఉపరితలాల నుంచి కరోనావైరస్ వ్యాపించటం లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ మోనికా గాంధీ గత వారంలో చెప్పారు.

COVID-19 Symptoms | Coronavirus Symptoms | కరోనావైరస్ జాగ్రత్తలు

చేతులు, టచ్‌స్క్రీన్లను శుభ్రం చేసుకోవాలి...

పల్లబ్ ఘోష్, సైన్స్ కరెస్పాండెంట్

కోవిడ్-19 ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ మూడు గంటల కన్నా ఎక్కువ సేపు గాలిలో ఉండి ఇతరులకు సోకే అవకాశం ఉందని అధ్యయనాలు చూపాయి. అయితే.. కరెన్సీ నోట్లు, టచ్‌స్క్రీన్ల వంటి ఉపరితలాల ద్వారా ఇది సోకే అవకాశం ఎంత వరకూ ఉందనేది అంత నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు.

ఇంతకుముందు నిర్వహించిన అధ్యయనాల్లో.. సాధారణ గది ఉష్ణోగ్రతల్లో స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపరితలం మీద ఈ వైరస్ మూడు రోజుల నుంచి 14 రోజుల వరకూ బతకగలదని విభిన్న ఫలితాలు చెప్పాయి.

స్టీల్‌తో పాటు గ్లాస్, పేపర్ మీద ఈ వైరస్ ఎంత కాలం బతుకగలదు అనే అంశాన్ని తాజా అధ్యయనంలో పరిశీలించారు. ఈ ఉపరితలాలన్నిటి మీద 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో 28 రోజుల తర్వాత కూడా ఈ వైరస్‌ సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. గత అధ్యయనాలు సూచించిన దానికన్నా ఇది చాలా ఎక్కువ కాలం.

అయితే.. ఈ అధ్యయనాన్ని వైరస్‌కు అనుకూలమైన వాతావరణంలో నిర్వహించారు. అంటే చీకటి గదిలో, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ స్థిరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రయోగం చేశారు. దీనినిబట్టి బయటి ప్రపంచంలో ఈ వైరస్ అంత కాలం జీవించకపోవచ్చు.

అయినప్పటికీ.. వైరస్ సోకే ప్రమాదాన్ని తగ్గించటానికి మన చేతులను, టచ్‌స్క్రీన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సిన ఆవశ్యకతను, చేతులతో మన ముఖాన్ని తాకకుండా ఉండాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం పునరుద్ఘాటిస్తోంది.

ఈ వైరస్ చల్లటి ప్రదేశాల్లో ఎక్కువ రోజులు జీవించగలగటాన్ని బట్టి.. మాంసం శుద్ధిచేసే కేంద్రాలు, కోల్డ్ స్టేరేజి కేంద్రాల్లో వైరస్ ఎక్కువ మందికి వ్యాపించటానికి కారణమేమిటనేది తెలుస్తోందని సైరో చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ లారీ మార్షల్ పేర్కొన్నారు.

అయితే.. ఆహారం లేదా ఆహార ప్యాకేజీల ద్వారా కోవిడ్-19 సోకినట్లు ఇప్పటివరకూ నిర్ధారిత కేసులేవీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అదే సమయంలో.. అలా వైరస్ సోకకుండా ఉండటానికి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)