విశాఖపట్నం: నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్.. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ నాలుగు నెలల్లో కట్టేశారు

ఫొటో సోర్స్, twitter/jm_hari
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టాలంటే ఎకరాలకు ఎకరాల స్థలం కావాలి. కానీ, విశాఖపట్నం లాంటి మహా నగరాల్లో కాస్త జాగా దొరకడమే గగనం. అలాంటిది ఎకరాల్లో కావాలంటే ఎలా దొరుకుతుంది? అందుకే, ఓ రిజర్వాయర్‌లో నీటి మీద ప్లాంటు పెట్టేసింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్.
ఇది దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ (తేలియాడే) సౌర ప్లాంట్. పర్యావరణానికి హాని చేయదు. రిజర్వాయర్‌లోని నీటిని కూడా ఆవిరి కానివ్వదు.
దేశంలోనే అతిపెద్దది
విశాఖపట్నం నగర జనాభా సుమారు 22 లక్షలు. వీరి విద్యుత్ అవసరాలతోపాటు నగర పరిధిలో వివిధ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, వీధి దీపాలకు రోజూ 40 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇదంతా ఈపీడీసీఎల్ (ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్) నుంచి కొనుగోలు చేయాలి.
అయితే ఇది జీవీఎంసీకి ఆర్థిక భారమే అవుతోంది. ఈ భారాన్ని కొంతైనా తగ్గించుకునేందుకు సహజ ఇంధన వనరైన సౌర విద్యుత్‌ను తయారు చేసుకోవాలని నిర్ణయించారు.
సౌర విద్యుత్‌ను పొందడానికి నగర పరిధిలో ఉన్న అనేక ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల మీద సౌర విద్యుత్ ప్యానళ్లను అమర్చారు. వీటి ద్వారా సుమారు 5 మెగావాట్ల సౌర విద్యుత్ లభిస్తోంది. వీధి దీపాల స్తంభాలు, అడ్వర్టైజ్ మెంట్ పోల్స్ ద్వారా మరో 2.5 నుంచి 3 మెగావాట్ల వరకు సౌర విద్యుత్‌ను పొందుతున్నారు. దీన్ని మరింత పెంచడం కోసం జీవీఎంసీ వినూత్న ఆలోచనతో ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించాలని తలపెట్టింది.
"సాధారణంగా నేల మీద, ఇంటి మేడలమీద, స్తంభాలకు సౌర ప్యానళ్లు పెట్టి సౌర విద్యుత్‌ను పొందుతాం. రెండు మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుని నిర్మించాలంటే సుమారు 8 ఎకరాల స్థలం అవసరం. జీవీఎంసీ పరిధిలో అన్ని ఎకరాల్లో ప్రభుత్వ స్థలం దొరకడం కష్టం. అందుకే నీటి ఉపరితలాన్ని వాడుకోవాలని నిర్ణయించిన జీవీఎంసీ ...దానికి ముడసర్లోవ రిజర్వాయర్‌ని ఎంచుకుంది. నీటి మీద నిర్మించడంతో 4.4 ఎకరాల విస్తర్ణంలోనే 2 మెగావాట్ల ప్లాంట్ పూర్తయ్యింది. ఇది దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టు. 2018లో నిర్మించిన ఈ ప్లాంట్ రెండేళ్లుగా విజయవంతంగా నడుస్తూ జీవీఎంసీకి కొంత ఆర్థిక భారాన్ని తగ్గించింది. ఇది విజయవంతం కావడంతో మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ మీదా 3 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నాం. మరో నెల రోజుల్లో దీని పనులు ప్రారంభమవుతాయి. క్రమక్రమంగా గ్రీన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా ఫ్లోటింగ్ సౌర ప్లాంట్ల ద్వారా 15 మెగావాట్ల విద్యుత్‌ను పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం" అని జీవీఎంసీ కమిషనర్ సృజన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, twitter/jm_hari
నీటిపై తేలుతూ...నీటిని కాపాడుతూ...
విశాఖ నగర పరిధిలో ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. నగరవాసుల తాగు నీటి అవసరాలకు ఈ రిజర్వాయర్ నీరే ఉపయోగపడుతోంది.
ఈ రిజర్వాయర్ లో వర్షాకాలం మినహా, మిగిలిన కాలంలో నీటి నిల్వ తక్కువగానే ఉంటుంది. ఈ రిజర్వాయర్ నీటి ఉపరితలంపై సౌర ప్యానళ్లను ఏర్పాటు చేయడం ద్వారా వేసవిలో నీరు ఆవిరవ్వకుండా నియంత్రించవచ్చు. రిజర్వాయర్‌లోని దాదాపు 30 శాతం నీరు ఆవిరవ్వకుండా ఈ ప్యానళ్లు కాపాడుగలుగుతున్నాయి. ఇది భూగర్భ జలాల పెరుగుదలకు కూడా దోహదపడుతోంది.
దేశంలోనే అతి పెద్దదైన ఈ ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను కేవలం నాలుగు నెలల్లోనే నిర్మించామని ప్రాజెక్టు ఎలక్ట్రికల్ ఇంజనీర్ మహేష్ బీబీసీతో చెప్పారు.
"పర్యావరణహితంగా రూపొందించిన ఈ ప్రాజెక్టుతో ఎన్నో ఉపయోగాలున్నాయి. నీటి ఉపరితలంపై నిర్మించడం వలన ఆ మేర భూమిని వేరే అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాంట్ రోజూ రెండు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. జీవీఎంసీకి కావాలసిన 40 మెగావాట్ల విద్యుత్ అవసరాల్లో ఇది కొంత మేర తీరుస్తుంది. నీటిపై రెండు మీటర్ల పొడవు, ఒక మీటర్ వెడల్పు కలిగిన 6,250 ప్యానళ్లు అమర్చాం. వీటిని ఫ్లోట్స్ అంటారు. ఇవి 25 ఏళ్ల పాటు పని చేస్తాయి. ఈ ప్లోటింగ్ ప్లాంట్ వల్ల పర్యావరణ సమస్య ఉండదు. హై డెన్సీటీ పాలిఇథీలీన్ (హెచ్‌పీడీ)తో తయారు చేసిన ప్లేట్లను వినియోగించడం వలన నీటిలోని జలజీవాలకు కూడా ఎటువంటి హానీ జరగదు" అని వివరించారు.

ఫొటో సోర్స్, facebook/GVMC.OFFICIAL
పెట్టుబడి వెనక్కివస్తుంది
రూ.11.36 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును కేవలం నాలుగు నెలల కాలంలో పూర్తి చేయడం విశేషం. నీటిపైనే సోలార్ ప్యానళ్లు తేలియాడుతూ కనిపిస్తాయి.
నీటిమట్టానికి అనుగుణంగా ప్యానళ్లు కిందికి, పైకి కదులుతాయి. సోలార్ ప్యానళ్లు తడిచినా, తుప్పుపట్టకుండా జర్మన్ సాంకేతికతతో తయారైన అత్యాధునిక ప్యానళ్లు ఉపయోగించారు.
"జీవీఎంసీకి రోజూ అవసరమయ్యే 40 మెగావాట్ల విద్యుత్ కోసం ఈపీడీసీఎల్‌కు డబ్బులు చెల్లించాలి. ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఈపీడీసీఎల్ కే అమ్ముతారు. ఆ మేర జీవీఎంసీకి చెల్లింపులు తగ్గుతాయి. అలాగే ఈ ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు ఏడాదికి రెండు కోట్ల రూపాయల చొప్పున ఆరేళ్లలో బిల్లుల రూపంలో జీవీఎంసీకి ఆదా అవుతుంది. ఈ ఫ్లోటింగ్ సౌర ప్రాజెక్టు 25 ఏళ్ల వరకు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులూ లేకుండా పని చేస్తుంది. ఆ సమయానికి ఈ ప్లాంట్ పై జీవీఎంసీ లాభాలను ఆర్జిస్తుంది" అని ఎలక్ట్రికల్ ఇంజనీర్ మహేష్ బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, facebook/GVMC.OFFICIAL
పర్యాటక కేంద్రాలుగానూ...
భారత దేశంలో ఉన్న మొత్తం రిజర్వాయర్లలో మొత్తంగా 18 వేల చదరపు కిలో మీటర్ల వైశాల్యం ఉన్న జల ఉపరితలం ఉంది. దీని ద్వారా 280 గిగావాట్ల (GW) సౌర విద్యుత్‌ను పొందవచ్చని వరల్డ్ సస్టెనబుల్ డెవలప్2మెంట్ సమ్మిట్‌లో ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్ స్టిట్యూట్ (TERI) నివేదిక తెలిపింది. ఈ నివేదిక అనుగుణంగానే జీవీఎంసీ అధికారులు జీవీఎంసీ పరిధిలో ఉన్న రిజర్వాయర్లపై ప్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తూ, వాటిని పర్యాటక కేంద్రాలుగా కూడా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
"ఫ్లోటింగ్ సౌర ప్రాజెక్టులను పర్యాటక కేంద్రాలుగా కూడా మార్చవచ్చు. జీవీఎంసీ సంప్రదాయ ఇంధన వనరులను పెంపొందించుకునేందుకు సౌర విద్యుత్‌ను నమ్ముకుంది. ఇప్పటీకే ముడసర్లోవ రిజర్వాయర్‌లో నిర్మించిన 2 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్ విజయవంతం కావడంతో ఇప్పుడు దీన్ని పర్యాటక ప్రాంతంగా కూడా మార్చేందుకు ఆలోచన చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులు పిల్లలను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సైన్స్ పట్ల అవగాహన పెంచుతాయి. అలాగే చూడటానికి కూడా అందంగా కనిపిస్తాయి. అందుకే వీటిని పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. జీవీఎంసీ దీనిపై కూడా దృష్టి పెట్టింది" అని జీవీఎంసీ కమిషనర్ జి. సృజన బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








