పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కొర్రీలు పెడుతోందా.. ప్రస్తుత సమస్యకు మూలం ఏమిటి, పరిష్కారం ఎలా

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో పోలవరం ప్రాజెక్టుకు చాలా ప్రాధాన్యం ఉందని అందరూ అంగీకరిస్తారు.
కానీ దీనిని పూర్తి చేసే విషయంలో పాలక పక్షాల ప్రకటనలే తప్ప పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని గత రెండు దశాబ్దాల అనుభవం చెబుతోంది.
ఇక, రాష్ట్ర విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పుడు, పోలవరం త్వరలోనే పూర్తవుతుందని ఆశించిన వారికి నిరాశ ఎదురవుతోంది.
ఇప్పుడు నిధుల విషయంలో కేంద్రం కొత్తగా కొర్రీలు పెట్టడం కీలక అంశంగా మారింది. దీనిపై రాజకీయ దుమారం రేగింది. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శించుకునే పరిస్థితి వచ్చింది.
కానీ ఈ సమస్యకు కారణం ఏంటి, దీనిని పరిష్కరించడం ఎలా అనే దానిపై అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎన్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2013 సెక్షన్ 90(1) ప్రకారం జాతీయ హోదా ప్రకటించారు. సెక్షన్ 90(4) ప్రకారం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటూ, పునరావాస బాధ్యతలను కేంద్రమే తీసుకోవాలని కోరారు. దానికి తగినట్లు కేంద్రం నిధులు కేటాయించాలి. అయితే, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించకుండా, వాటిని నాబార్డ్ నుంచి కేటాయిస్తోంది.
2014 నుంచి ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం రూ.950 కోట్లు మాత్రమే కేటాయించింది. వీటితోపాటూ నాబార్డ్ నుంచి వచ్చిన నిధులను కూడా పరిగణనలోకి తీసుకుంటే 2016-17 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా రూ. 2414.16 కోట్లు విడుదల చేశారు.
2017-18 లో నాలుగు విడతల్లో నాబార్డ్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.2 వేల కోట్లు నిధులు వచ్చాయి. 2018-19లో రూ.1400 కోట్లు, 2019-20లో రూ.1850 కోట్లు చొప్పున విడుదలయ్యాయి. దాంతో నాబార్డ్ నుంచి మొత్తం రూ.7664.16 కోట్ల నిధులు వచ్చాయి.
ఇక కేంద్రం నుంచి నేరుగా వచ్చిన రూ. 950 కోట్లు కలుపుకుంటే గత ఏడేళ్లలో పోలవరం కోసం వచ్చిన మొత్తం నిధులు రూ.8614.16 కోట్లు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి పోలవరం బాధ్యత
జాతీయ ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం మొత్తం వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.
కానీ, 2016 సెప్టెంబర్‌లో నాటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు.
30-9-2016న కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన F.NO.1(2)PF-1/2014(PT) ప్రకారం నీతి అయోగ్ సిఫారసు మేరకు పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి బదిలీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రమే ప్రాజెక్ట్ నిర్మిస్తుందని ప్రకటించారు. 1.1.2014 నాటికి ఇరిగేషన్ వాటా మొత్తం కేంద్రం అందిస్తుంది. నాటి రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకే తాము ఈ సిఫారసు చేసినట్టు నీతి అయోగ్ అప్పట్లో ప్రకటించింది.
అప్పటి కేంద్ర ప్రకటన ప్రకారం 2013-14 నాటి అంచనాల ప్రకారం కేంద్రం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం మాత్రమే భరిస్తుంది. పైగా కేంద్రం నేరుగా ఇవ్వాల్సిన నిధులను నాబార్డ్ ద్వారా అందించేందుకు అంగీకరించారు.
అంతేగాకుండా 2017 మార్చిలో క్యాబినెట్ తీర్మానం ప్రకారం 2014 తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరిగితే, కేంద్రానికి బాధ్యత లేదని కూడా తీర్మానించారు. పైగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కూడా 2013 ముందు నాటి లెక్కలనే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
దీంతో, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం నిర్మాణ బాధ్యత అప్పగించారు.

కాంట్రాక్టుల కోసమే పోలవరం బాధ్యత
అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలివితక్కువ ఆలోచనతో పోలవరం నిర్మాణ బాధ్యతను నెత్తికెత్తుకుందని సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీబీసీతో అన్నారు.
"కేవలం కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్ల కోసమే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టుంది. ఈ అంగీకారం చేసుకోవడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. కుడి, ఎడమ కాలువలు 80% నిర్మించడంతోపాటూ కొంత భూసేకరణకు కూడా కేటాయించారు. అయితే, అప్పటికే చేసిన రూ.5 వేల కోట్ల రూపాయలను తాము ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రతిపాదించగా, అప్పటి ప్రభుత్వం అంగీకరించింది".
"ఇంకా ప్రమాదకరమైన నిబంధన ఏమిటంటే, 2018 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, పూర్తి చేయలేని పక్షంలో ప్రాజెక్టు నిమిత్తం కేంద్రం నుంచి వస్తున్న నిధులను గ్రాంట్‌గా కాకుండా లోన్‌గా మార్చేందుకు కూడా అంగీకరించారు. ఇది రాష్ట్రానికి అత్యంత భారంగా మారే ప్రమాదం ఉన్నా ఖాతరు చేయలేదు. దానికి కనపడుతున్న కారణం ఒక్కటే.. కాంట్రాక్టులు తమకు నచ్చిన వారికి ఇచ్చుకోవచ్చనే" అన్నారు దగ్గుబాటి.

పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకూ వచ్చింది..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను 2013లో ట్రాన్స్ ట్రాయ్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత సకాలంలో పనులు చేపట్టలేదని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది.
చివరకు 2017లో పలు సబ్ కాంట్రాక్టర్లకు పనులు పూర్తి చేసే బాధ్యత అప్పగించారు.
ఇక ఏపీలో అధికార మార్పిడి తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించింది.
పోలవరం నిర్మాణం నుంచి నవయుగ లాంటి కంపెనీలను తప్పించింది. రివర్స్ టెండరింగ్ లో మేఘా కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం మేఘా ఆధ్వర్యంలో స్పిల్ వే పనులు జరుగుతున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్ 20న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం ప్రస్తుతం సెప్టెంబర్ 26 నాటికి మొత్తం పోలవరం ప్రాజెక్టు 41.05 శాతం పూర్తయ్యింది.
అందులో నిర్మాణ పనులు 71.54 శాతం పూర్తయ్యాయి. కానీ భూసేకరణ, పునరావాసం మాత్రం 19.85 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
నిర్మాణ పనుల్లో కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ఎక్కువ భాగం 2014 నాటికే పూర్తి చేశారు. ప్రస్తుతం స్పిల్ వే నిర్మాణం జరుగుతోంది. స్పిల్ చానెల్ పనులు కూడా చేస్తున్నారు.
ఇక కాఫర్ డ్యామ్ నిర్మాణం కూడా దాదాపుగా 2018 నాటికే జరిగింది. మెయిన్ డ్యామ్ పనులు మాత్రం నామమాత్రంగా జరిగాయి.
పవర్ ప్రాజెక్ట్ కోసం భూమిని సిద్ధం చేసే దశలో ఉంది. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ అమలు విషయానికి వస్తే, కేవలం ప్రాజెక్ట్ నిర్మిత ప్రాంతంలో అటు తూర్పు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 14 గ్రామాల వరకూ పూర్తి చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.

పూర్తి చేయడానికి ఎన్ని నిధులు కావాలి
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో పనులు ఆలస్యం అవుతుండడం వల్ల నిర్మాణ వ్యయం ఏటేటా పెరుగుతోంది.
ఇప్పటికే తొలుత 9వేల కోట్ల నుంచి తర్వాత రూ.16వేల కోట్లకు, అనంతరం రూ.29వేల కోట్లకు పెరిగి, తాజాగా రూ. 55 వేల కోట్లకు చేరింది.
నిర్మాణ వ్యయం అంచనాలను గతంలో ఏపీ ప్రభుత్వం పెంచుతూ వచ్చేది. అయితే పోలవరం నిర్మాణ వ్యయం అంచనాల విషయంలో పోలవరం ప్రాజెక్ట అథారిటీ (పీపీఏ) ఆమోదం ఉండాలని గతంలోనే కేంద్రం చెప్పింది.
ఇటీవల ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలను స్వల్పంగా సవరించిన ఏపీ ప్రభుత్వం దానిని రూ. 53 వేల కోట్లుగా ప్రతిపాదించింది.
2019 ఫిబ్రవరి 11న సాంకేతిక సలహా మండలి (టీఏసీ) దీనిని ఆమోదించింది. టీఏసీ నుంచి రూ.55,548 కోట్లకు ఆమోదం లభించిందని గతంలో కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది.
కానీ పీపీఏ మాత్రం దానిని రూ.47,725.74 కోట్లుగా పేర్కొంది. తాజాగా దానిని కేవలం రూ.20,398 కోట్లకు పరిమితం చేస్తామని ప్రతిపాదించింది.
కేంద్రం ఇప్పటి వరకూ కేటాయించిన మొత్తం రూ.8,614 కోట్లు కాగా, ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్న బిల్లులు రూ. 2,234.77 కోట్లుగా ఉంది.
వాటిని త్వరలోనే చెల్లిస్తామని ఇటీవల కేంద్రం చెప్పింది. ఇక 2014కి ముందు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5 వేల కోట్ల వ్యయం చెల్లించనవసరం లేదని అవగాహన కుదుర్చుకున్నారు.
ఇంకా కనీసం రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని టీఏసీ లెక్కలే చెబుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం దానికి భిన్నమైన ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తోంది.
2013 భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పునరావాసం, భూసేకరణ వ్యయం అనూహ్యంగా పెరిగినప్పటికీ పాత లెక్కలకే పరిమితం అవుతామని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం తలకు మించిన భారంగా మారే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, BBC/Naveen Kumar K
‘కేంద్రం నుంచి నిధులు రాబడతాం’
పోలవరం పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని ఏపీ ఇరిగేషన్ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. "పోలవరం విషయంలో టీడీపీ చేసిన తప్పిదాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. 15వేల కోట్లు నిధులు ఇవ్వగానే 70 శాతం పోలవరం పూర్తి చేశామని చెప్పారు. అంటే కేంద్రం వాదనకు టీడీపీ తీరు కారణంగా మారింది. కేంద్రంతో కక్కుర్తి పడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఎస్సీ, ఎస్టీలుగా నిర్వాసితులుగా ఉన్న సమయంలో వారిని పూర్తిగా విస్మరించారు. రాష్ట్రాన్ని ముంచే ప్రయత్నం చేసి నిందలు వేయడం విడ్డూరంగా ఉంది" అన్నారు.
"2013తో పోలిస్తే వ్యయం పెరుగుతుంది. అంచనాలు పెరిగాయి. దానికి అనుగుణంగా నిధులు ఇవ్వాలి. నిధులు రాబట్టడం కోసం సీఎం లేఖ రాయబోతున్నారు. ప్రధానిని, ఇతర మంత్రులను కలుస్తాం. రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం టెక్నికల్ కమిటీ ఆమోదించిన రూ.55 వేల కోట్ల నిధులు ఇవ్వాల్సిందే. దానికోసం పోరాడతాం. పోలవరం విషయంలో ప్రతీది కేంద్రానిదే బాధ్యత. రాజీపడే పనేలేదు. పార్లమెంట్ లో చెప్పిన చట్టానికి కట్టుబడి ఉండాలని" అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

‘దిల్లీలో మాత్రం నోరు మెదపరు’
ఇటు బీబీసీతో మాట్లాడిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పోలవరం ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రి దిల్లీలో నోరు మెదపడం లేదన్నారు.
"పోలవరం అంటే ఏపీ ప్రజల జీవనాడి. పోలవరాన్ని 70% పైగా పూర్తిచేశాం. 2019 ఫిబ్రవరిలోనే అంచనాలు సవరించాము. సాంకేతిక సలహా మండలి ఆమోదం కూడా వచ్చింది. కానీ నేడు ప్రభుత్వ అసమర్థత వల్ల పోలవరానికి అన్యాయం జరుగుతుంది. 17 నెలలుగా ఎంపీలంతా ఏం చేశారు? పోలవరం సమస్యపై దిల్లీలో ఎందుకు మాట్లాడడం లేదు. జగన్ నోరు విప్పడం లేదెందుకు..వీళ్ల చేతగానితనమే ఇది. నాడు అంచనా పెంపుపై చేసిన విమర్శలే నేడు రాష్ట్రానికి శాపంగా మారాయి. రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టును, రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెట్టార"ని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, facebook
‘ఇరు పార్టీల తీరు మారాలి’
పోలవరం విషయంలో మరోసారి ప్రత్యేక హోదా సందర్భంగా జరిగిన తంతు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు పి. అచ్యుత్ దేశాయ్ బీబీసీతో అన్నారు.
'పోలవరం నిర్మాణం వేగంగా పూర్తి చేయడం కోసమే రాష్ట్రం దాని బాధ్యతను తీసుకుందనే వాదన సరికాదు. అలా బాధ్యత తీసుకున్న సమయంలో నిర్దిష్టమైన ఒప్పందం జరిగినా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. గతంలో జరిగిన దానిని సరిదిద్దేందుకు కూడా ఈ ప్రభుత్వం వైపు నుంచి తగిన ప్రయత్నాలు జరగడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సాగడం మంచిది కాదు. రాష్ట్రానికి సంబంధించిన అంశంలో ఉమ్మడి ప్రయత్నం జరగాలి. ముఖ్యమంత్రి దానికి బాధ్యత వహించాల"ని చెప్పారు.
"నెపం రాష్ట్రం మీద నెట్టేసి పోలవరాన్ని సందిగ్ధంగా మార్చేయాలని కేంద్రం చూస్తోంది. ఈ ధోరణి సరికాదు. కేంద్రమే జాతీయ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉన్నందున దానికి తగ్గట్టు నిధులు కేటాయించాలి. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో సమన్వయం కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పేరుతో నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి నిధులు కేటాయించకుండా ప్రాజెక్ట్ పూర్తి ఎలా సాధ్యమో కేంద్రమే చెప్పాల"న్నారు ఆయన.
ఈ పరిణామాల నేపథ్యంలో నవంబర్ 2న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర భేటీ కీలకంగా మారింది.
అదే సమయంలో అవసరం అనుకుంటే ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను తిరిగి కేంద్రానికి అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది.
ఇవి కూడా చదవండి:
- నాన్‌లోకల్ లీడర్ల’ అడ్డాగా విశాఖ... నగరంలో 30 ఏళ్లుగా వారి హవా సాగుతుండటానికి కారణాలేంటి?
- తిరుమల తిరుపతి దేవస్థానం కీలక పదవుల్లో దళితులకు అవకాశం ఇవ్వరా?
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









